నటసామ్రాట్‌ పుట్టినరోజు

 

Akkineni Nageswara Rao,  Akkineni Nageswara Rao 90 birthday, ANR Birthday, Akkineni Nageswara Rao Birthday, ANR, Akkineni Nageswara Rao, Akkineni Nageswara Rao age

 

 

తెలుగు సినీ రంగంలో పరిచయాలే అక్కర్లేని ఒకే ఒక పేరు...అక్కినేని నాగేశ్వరరావు. 90 వసంతాల ఈ దసరాబుల్లోడు..తన 75 ఏళ్ల నటప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ నిత్య వసంతుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నటసామ్రాట్‌ సినీ గమనాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

 

1940లో ధర్మపత్ని చిత్రంతో తెరంగేట్రం చేశారు..ఏ‍యన్‌ఆర్. ఆయన 1944లో విడుదలైన `శ్రీ సీతారామజననం` చిత్రంతో కథానాయకుడిగా మారారు. దాదాపు 260 చిత్రాలలో మనల్ని అలరించిన ఆయన ఇంకా నటిస్తూనే ఉండటం మన అదృష్టమనే చెప్పాలి. ఇటీవల ఆయన బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం చిత్రంలో వాల్మీకి పాత్ర పోషించగా, అక్కినేని మూడు తరాలు కలిసి చేస్తున్న మనం సినిమాలో నటిస్తున్నారు.



ఏయన్ఆర్ సినిమాలు ...వసంతానికి కేరాఫ్ అడ్రస్సుల్లా అనిపిస్తాయి. ఆయన డైలాగ్స్, ఎక్స్‌ ప్రెషన్స్, స్టెప్స్ ...అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన ప్రతీ చిత్రం మనసును మంత్రిస్తుంది. ఒక దేవదాసు...ఒక ప్రేమాభిషేకం ..ఇలా చెప్పుకుంటూ పోతే అక్కినేని నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి....ఉంటాయి.


ఎవరినైనా ప్రేమించాలంటే ..ఏయన్‌ఆర్ సినిమాలు చూడాలి...ప్రేమలో విజేత కావాలనుకుంటే ...అక్కినేని చిత్రాలే చూడాలి. ..ప్రేమలో ఓడాలన్నా...అక్కినేని సినిమాలే వాచ్ చేయాలి. ...ఎందుకంటే తెలుగు సినిమా ప్రేమ గురువు మన ఏయన్‌ఆర్.


వెండితెరకు బంగారు మెరుగులు దిద్దిన మహానటుడు ఏయన్‌ఆర్. ఆయన నడిచే ఒక నటవిశ్వరూపం. ప్రతీ పాత్ర పోషణలో ఆయన తీసుకునే జాగ్రత్తలు ..ఇన్నాళ్ల నట ప్రస్థానంలో ఆయన ప్రతీ నిమిషం పాటించే క్రమ శిక్షణ ..వృత్తిపరమైన ప్రేమ...ఆయన్ను మహోన్నత సినీ శిఖరంలా నిలబెట్టాయి. పద్మవిభూషణ్‌తో ఆయన అవార్డుల పరంపర ఆగదు...అది నిరంతర ప్రవాహంలా అలా సాగుతూ ఇంకా ఎన్నో విశిష్ఠ పురస్కారాలను అక్కినేనికి అందిస్తుంది.

 

అక్కినేని సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో గెలుపు ఓటములు చూశారు. ఓడిన ప్రతీసారీ కొత్త పాఠం నేర్చుకుని...గెలిచిన ప్రతీసారి తనను తాను కొత్తగా మలుచుకుని ..నిత్యవిద్యార్ధిలా జీవితంలో ప్రతీ క్షణాన్ని జీవిస్తూనే ఉంటారు. నటుడిగా...నిర్మాతగా ఆయన ప్రదర్శించే నియమ నిబద్ధతలు సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.



ఒక నటుడిగా ఎదిగి..ఒక మనిషిగా ఒదిగి...ఎదిగే కొద్ది ఒదగమనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా అనిపిస్తారు...అక్కినేని. రొమాంటిక్ కింగ్...ట్రాజెడీ కింగ్ ..నట సమ్రాట్‌ ..ఇలా ఎన్నో బిరుదులు ఆయన్ని వరించాయి. 1980లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న అక్కినేని...దానికి ముందే పద్మశ్రీ...ఆ తర్వాత పద్మభూషణ్ ..అటు తర్వాత దాదా ఫాల్కే... పద్మవిభూషణ్ ..ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతీ అవార్డును అందుకున్నారు...మన అక్కినేని,


90 ఏళ్ల వయసులో కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తున్న అక్కినేని మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగువన్‌ తరుపున మరోసారి ఆ నటసామ్రాట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.