ఆర్టీసీని మూసేస్తారా!
posted on Jun 17, 2016 @ 2:30PM
రాష్ట్ర విభజన జరిగిపోయింది. అన్నదమ్ములు వాటాలను పంచుకున్నట్లుగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలు తమతమ వనరులను పంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అప్పటి దాకా ఒక్కటిగా ఉన్న శాఖలన్నీ కూడా ఆంధ్రా, తెలంగాణ కింద విడిపోయాయి. అలా విడిపోయిన శాఖలలో ఆర్టీసీ ఒకటి. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులది కూడా ఓ ముఖ్యపాత్రే! మిగతా ఉద్యమకారులతో ఏమాత్రం తీసిపోకుండా వారు ఉద్యమంలో పాల్గొన్నారు. అనుకున్నదీ సాధించారు. కానీ ఉద్యమం ముగిసిన తరువాత తెలంగాణలోని వివిధ యూనియన్లు తమలో తాము కుమ్ములాడుకోవడం మొదలుపెట్టేశాయి. వీటికి తోడు కొందరు యూనియన్ నేతల మీద అవినీతి ఆరోపణలు రాజుకోవడంతో, కార్మికుల నైతిక స్థైర్యం దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు తమ సంస్థను కాపాడుకోవల్సిన బాధ్యత కూడా కార్మికుల మీద పడింది.
నిన్న ఆర్టీసీ అధికారులతో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా కూడా ఇంకా ఆర్టీసీ నష్టాలలోనే నడుస్తోందనీ, ఇలా నష్టాలలో కూరుకుపోతూ ఉంటే సంస్థను మూసేయడమే మేలనీ అన్నారు. కేసీఆర్ కాస్త కఠినంగా మాట్లాడినప్పటికీ, ఆర్టీసీ తరచూ నష్టాలలోనే నడుస్తూ వస్తోందన నిజం ప్రజలకు కొత్తేమీ కాదు. అయితే ఒకోసారి ఆర్టీసీ బాధ్యతారాహిత్యమే అలాంటి నష్టాలకు కారణం కావడం ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు సంక్రాంతి వంటి పండుగ సందర్భాలనే తీసుకుందాం. ఇలాంటి సమయంలో ఆర్టీసీకి ఎనలేని ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. హైదరాబాదు నుంచి విజయవాడకు ఓ సిటీ బస్సుని నడిపినా ఎక్కేంతగా రద్దీ ఉంటుంది. కానీ ఆ సమయంలోనే ఆర్టీసీ సర్వర్లు మొరాయిస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్నచిన్న సాంకేతిక కారణాల వల్ల ఆర్టీసీ అక్షరాలా కొన్ని కోట్లను నష్టపోతోందని తేలింది. కానీ ఏడాది తరువాత ఏడాది ఇదే సందర్భం పునరావృతం అవుతూ ఉంటుంది. దీనికి కారణం కొందరు ఆర్టీసీ అధికారులు ప్రైవేటు రవాణా సంస్థలతో కుమ్మక్కు కావడం అన్న ఆరోపణలూ వినిపిస్తూ ఉంటాయి.
ఇక సమయపాలన లేకపోవడం, అవసరానికి తగినట్లుగా బస్సులను నడపకపోవడం వంటి సమస్యలు ఎలాగూ ఉన్నాయి. హైదరాబాదు వంటి నగరాలలో నిత్యం వేలాది మంది జనం బస్సుల కోసం ఎదురు చూస్తూ నిల్చోవడం ఓ విషాదకర దృశ్యం. అదే సమయంలో కొన్ని రూట్లలో వెళ్లే బస్సులు ఖాళీగా వెళ్లడం కడుపు మండించే అంశం. ఏ దిశలో రద్దీ ఎక్కువగా ఉంది? ఏ సమయంలో ఎక్కువ బస్సులు అవసరం అవుతూ ఉంటాయి? తక్కువ సామర్థ్యం ఉన్న బస్సులను ఎంత మేరకు ఉపయోగించగలం? వంటి సవాలక్ష సమస్యలను ఆలోచించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉండవచ్చు. ఒక పక్క ఆర్టీసీ భాగస్వామ్యంతో తిప్పుతున్న ప్రైవేటు బస్సులు లాభాలని అర్జిస్తూ ఉంటే, మరో పక్క మిగతా సంస్థ నష్టాలలో కూరుకుపోవడాన్ని ముఖ్యమంత్రి సైతం ఎత్తిచూపారు.
ఆర్టీసీ లాభాల బాటను పట్టేందుకు ఆయన చాలా సలహాలే అందించారు. టికెట్లే కాకుండా కొరియర్, సరుకు రవాణా వంటి ఇతరత్రా సేవల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలనీ; పది పదిహేను మంది ప్రయాణించగల వాహనాలను నడపాలనీ; బస్టాండులలో మౌలిక వసతులను పెంచాలనీ; బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాలను వినియోగించుకోవాలనీ.... సూచించారు. మరి ముఖ్యమంత్రి మాటలను ఆర్టీసీ ఎంతవరకూ ఆచరిస్తుందో వేచిచూడాలి. నిజానికి ఆర్టీసీ లాభాపేక్షంగా నడుస్తుందనీ, సురక్షితంగా గమ్యానికి చేరుస్తుందనీ ఇప్పటికీ ప్రయాణికులలో ఓ సద్భావన ఉంది. ఆ సద్భావనకు తోడుగా మెరుగైన సేవలు లభించినరోజున, సామాన్య ప్రయాణికులు నిస్సంకోచంగా ఆర్టీసీకి అండగా నిలబడతాడు. అప్పుడు ఆర్టీసీని మూసేయడం అన్న మాట కలలో కూడా వినిపించదు!