అప్పుల కోసం లిక్కర్ సేల్స్ హైక్! జగన్ సర్కార్ పై జనాల ఫైర్ 

అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేదం.. ఇది ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ శపథం. మాట తప్పం.. మడమ తిప్పం ఇది వైసీపీ జగనిన్నాదం. కాని పవర్ లోకి వచ్చినప్పటి నుంచి మాట తప్పుతూనే ఉన్నారు.. మడమ తిప్పుతూనే ఉన్నారు జగన్ రెడ్డి. మొదట మద్యం దుకాణాలను తగ్గించి గొప్పలు చెప్పుకుంది జగన్ సర్కార్. దశల వారీగా మిగితా షాపులు తగ్గిస్తామని ప్రకటించింది. కాని లిక్కర్ సేల్స్ లో చూస్తే మాత్రం గతంలో కంటే ఆదాయం పెరిగింది. లిక్కర్ ద్వారా వచ్చే అదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. అంతేకాదు లిక్కర్ సేల్స్ పెంచుతామని చూపిస్తూ ప్రైవేట్ బ్యాంకర్ల ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటోంది. ఏపీ సర్కార్ నిర్ణయాలతో మడమ తిప్పావా జగన్ అంటూ జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి.    ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అష్టకష్టాలు పడాల్సి  వస్తోంది. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే సీన్ లేదు. ఇప్పటికే పరిమితికి మించి అందిన కాడికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకుంది జగన్ సర్కార్. అయినా నిధుల కటకటే ఉండటంతో ప్రైవేట్ సంస్థల దగ్గర అప్పులు చేయడానికి సిద్దమవుతోంది. అయితే ఇచ్చిన రుణం ఎలా తీరుస్తారన్న దానిపై సరైన ఆదాయ మార్గాలను సర్కార్ చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం లిక్కర్ ను ఎంచుకుంది జగన్ సర్కార్. లిక్కర్ సేల్స్ పెంచి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తామని ప్రైవేట్ బ్యాంకర్లకు చెబుతోంది. ఇలా లిక్కర్ సేల్స్ ను ఆదాయ వనరుగా చూపుతూ.. లిక్కర్ సేల్స్ ను మరింతగా పెంచుతామని చెబుతూ  దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.   అప్పుల కోసం లిక్కర్ సేల్స్  పెంచుతామని హామీ ఇస్తున్న జగన్ సర్కార్ నిర్ణయంపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు దశల వారీగా ఎక్స్లైజ్ ఆదాయం పెంచుకోవాలని చూడటం ఏంటనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో  మద్యపాన నిషేదం అమలు హామీ అటకెక్కినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. అదాయం కోసం ఇబ్బడి ముబ్బడిగా లిక్కర్ సేల్స్ పెంచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఇక మద్యపాన నిషేదం ఎక్కడ అమలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మాట తప్పేది లేదని చెప్పుకునే జగన్ మరోసారి మాట తప్పి మడమ తిప్పారనే సెటైర్లు పేలుతున్నాయి.    నిజానికి ఏపీలో దశలవారీగా మద్య నిషేధం తెస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచింది. మద్యాన్ని ఖరీదైన సరుకుగా మార్చితే, కొనుగోలు చేసేందుకు భయపడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.కానీ మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఏపీలో కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చి ఏడాది పూర్తైంది. లాక్‌డౌన్ కారణంగా నెలన్నర పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అయినా లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం విషయంలో పెద్దగా మార్పు లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో మద్యపాన నిషేదంపై జగన్ సర్కార్ చెబుతున్నదంటూ బోగసేనని తేలుతోంది.

బీజేపీతో సయోధ్యా.. సమరమా! ఆసక్తిగా మారిన కేసీఆర్ ఢిల్లీ టూర్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారింది.  దేశ రాజధానిలో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపనకే కేసీఆర్ వెళుతున్నారని చెబుతున్నా.. ఆయన షెడ్యూల్ పై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు కేసీఆర్. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర  మోడీని కేసీఆర్ కలవబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ సీఎంవో నుంచి పీఎం అపాయింట్ మెంట్ కోరినట్లు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని గులాబీ బాస్ ఎందుకు కలవబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర సమస్యలపైనే ప్రధానితో కేసీఆర్ మాట్లాడుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇస్తున్నా.. అంతర్గతంగా మరో కీలక అంశం ఉందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీతో సయోధ్య కోసమే టీఆర్ఎస్ అధినేత హస్తినకు వెళుతున్నారనే వాదన వినిపిస్తోంది.      2014లో అధికారం చేపట్టనప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు కేసీఆర్. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కీలక బిల్లులకు పార్లమెంట్  లో టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేశారు. ప్రధాని మోడీని పొగుడుతూ పలుసార్లు కేసీఆర్ ప్రకటనలు కూడా చేశారు. అయితే కొన్ని రోజులుగా కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. కేంద్రంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రతిష్టాత్మంగా చెప్పుకుంటున్న కొత్త వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. కేసీఆర్ తీరుతో కేంద్రం కూడా కౌంటర్ ప్లాన్ అమలు చేస్తోందని చెబుతున్నారు.  తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. టీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కొందరు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా కాషాయ కండువా కప్పేసుకున్నారు. త్వరలో మరికొంత మంది నేతలు కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.   తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. దుబ్బాక ఓటమితో ఎదురైన షాక్ నుంచి కోలుకోకముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు పార్టీకి మరో ఝలక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు కేసీఆర్ సర్కార్ త్వరలో కూలిపోవడం ఖాయమని ప్రకటనలు ఇస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ అవినీతిని బయటికి తీస్తామని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలో  కేంద్రం చర్యలు మొదలు పెట్టిందని  చెబుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ గత  ఆరేండ్లలో జరిగిన అవినీతిపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంతో పాటు టీఆర్ఎస్ నేతల వ్యాపారాలపైనా కేంద్రం ఫోకస్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆస్తుల పెరుగుదలకు సంబంధించి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఐటీ నోటీసులు వచ్చాయంటున్నారు.    కేంద్ర నిఘా సంస్థల దూకుడు, ఐటీ నోటీసులతో కారు పార్టీ నేతలు కలవర పడుతున్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ అవినీతిని ప్రస్తావించారు. దీంతో తెలంగాణలో ఏదో జరగబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతగా మారింది. బీజేపీతో సయోధ్య చేసుకోవడానికే కేసీఆర్ ప్రధాని మోడీని కలవనున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తాము కేంద్రానికి సపోర్టుగానే ఉంటామని, రాష్ట్రంలో తమను డిస్ట్రబ్ చేయవద్దని ప్రధానిని కేసీఆర్ కోరవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం అయినందున బీజేపీకి వచ్చే నష్టమేమి లేదని కాషాయ పెద్దలకు కేసీఆర్ వివరించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.    ఇక్కడ మరో అంశం కూడా ఉంది. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గతంలో మంత్రులే హస్తినకు వెళ్లి కేంద్రమంత్రులను కలిసేవారు. అవసరమైతే కేటీఆర్,  హరీష్ లు వెళ్లేవారు. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాకా.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను కేటీఆరే పర్యవేక్షిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత కేసీఆర్ ఎక్కువగా బయటికే రావడం లేదు. ఇప్పుడు ఢిల్లీలో కరోనా సేకండ్ వేవ్ ఉంది. కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. అయినా కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారంటే ఆయన అజెండాలో  చాలా సీరియస్ అంశాలే ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.  బీజేపీని మచ్చిక చేసుకోవడమే కేసీఆర్ పర్యటనలో ప్రధాన అంశంగా ఉండవచ్చని కూడా చెబుతున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ పర్యటన తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తిగా మారింది.

కారు, కాంగ్రెస్ పార్టీలు కలిసి పయనిస్తాయా? తెలంగాణ రాజకీయాల దారెటు ? 

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్  పనిచేయబోనుందా? బీజేపీ దూకుడుతో ఈ రెండు పార్టీలు వ్యూహం మార్చాయా? అంటే తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. భవిష్యత్ లో కాంగ్రెస్  టీఆర్ఎస్ కలిసి పని చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని తెలుస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  ఈ రెండు పార్టీలు ఉద్యమం చేస్తుండటంతో.. ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. టీఆర్ఎస్ తో కలిసి పని చేయాల్సి  రావచ్చనే సంకేతం తెలంగాణ పీసీసీ నేతలకు హైకమాండ్ కూడా ఇచ్చిందంటున్నారు.  అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా... తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టే కూటమిలో కాంగ్రెస్ చేరబోతుందా లేక కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు వెనుక నుండి కాంగ్రెస్ సపోర్ట్ చేయనుందా అన్నదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.    2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడుతోంది.  కాంగ్రెస్ ‘ముక్త్ భారత్‌’ నినాదంతో కమలనాథులు ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాలను కాషాయమయం చేశారు.  కీలక రాష్ట్రాల్లోని నేతలకు కాషాయ కండువాలు కప్పి, కాంగ్రెస్‌ను అంతర్గతంగా దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్ బలహీనపడటం.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ కనపడక పోవడం వల్లే జాతీయ స్థాయిలో బీజేపీకి ఎదురు లేకుండా పోతుందనే చర్చ జరుగుతోంది. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మూడో కూటమి అంశం తెరపైకి వస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానని చెబుతున్నారు. చెప్పినట్లుగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త కూటమికి ప్లాన్ చేస్తే..  బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆ కూటమితో కాంగ్రెస్  కలిసి నడవాల్సిన అవసరం రావొచ్చని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.    గత మూడేళ్లుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్.  2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఢిల్లీ వెళ్లి దేశానికి దిశా నిర్దేశం చేస్తానన్నారు. కానీ ఎన్డీయే భారీ మెజార్టీతో గెలవడంతో తన ప్రయత్నాలను వాయిదా వేసుకున్నారు కేసీఆర్. కొంతకాలం బీజేపీతో సఖ్యతగానే మెలిగారు.  రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాల అనంతరం గులాబీ బాస్  వైఖరిలో మార్పొచ్చింది. కేంద్ర సర్కార్ పై ఆయన ఘాటు విమర్శలు చేస్తున్నారు. దేశానికి బీజేపీతో నష్టమని చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌కు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలంతా ఆందోళనలో పొల్గొన్నారు. మంత్రులంతా రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కాంగ్రెస్‌ సైతం ధర్నాల్లో పాల్గొంది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, కారు పార్టీ నేతలు కలిసే ఆందోళనలు చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజీ కుదిరిందన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి.    జాతీయ రాజకీయాల్లోకి  వెళ్లేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న లెప్ట్‌ పార్టీలు సైతం  కేసీఆర్‌ కూటమికి సపోర్ట్ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అవసరమైతే వామపక్ష నేతల ఇళ్లకు  వెళ్లి మాట్లాడుతానని కేసీఆర్‌ చెబుతుండటం ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ తో కలవాల్సిన పరిస్థితులు ఉంటాయనే  చర్చలు సాగుతున్నాయి. అయితే బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో జట్టుకట్టడమా? లేకుంటే బయట నుంచి సపోర్టు చేయడమా? అన్నది మాత్రం హస్తం పార్టీలో స్పష్టత లేదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నందున.. మరికొన్ని రోజుల తర్వాతే కేసీఆర్ కార్యాచరణపై క్లారిటీ వస్తుందంటున్నారు.  అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని ఆ తర్వాత మాట మార్చారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్  కేసీఆర్ ను నమ్మి మద్దతిస్తుందా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ కనుక టీఆర్ఎస్ తో కలిసి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.

గులాబీకి గుచ్చుకున్న ముళ్లు!

ఓటమి బాధ్యత కేటీఆర్‌దే   అతి విశ్వాసమే కొంపముంచిందా?   సిట్టింగులకు ఇచ్చి తప్పు చేసిందా?   పద్మారావు ఇలాకాలోనే కారు క్లీన్‌స్వీప్   చక్రం తిప్పిన ‘డిప్యూటీ’ కొడుకులు   తలసాని నియోజకవర్గంలో తప్పిన గురి   ముషీరాబాద్, ఎల్బీనగర్‌లో పోయిన పరువు   అంచనాలు తల్లకిందులయ్యాయి. కారు జోరు మందగించింది. బీజేపీ దానికి అడుగడుగునా స్పీడు బ్రేకులుగా మారింది. సెంచరీ కొడతామన్న తెరాస నేతల బీరాలు బొక్కాబోర్లా పడ్డాయి. కాకపోతే.. ఏకైక పెద్ద పార్టీ అన్న గౌరవం ఒక్కటే దక్కించుకుంది. కేవలం నాలుగంటే నాలుగే సీట్లున్న బీజేపీ.. ఈసారి టీఆర్‌ఎస్‌కు ఏడు స్థానాలకు దగ్గరగా వచ్చిఆగింది. ఇది అధికార పార్టీకి శరాఘాతం కాదు. వజ్రాఘాతం! తెరాస అతి విశ్వాసానికి ఓ గుణపాఠం. కాంగ్రెస్‌ను పీకపిసికి, టీడీపీని తరిమివేసిన రాజకీయ వ్యూహం వికటించిన ఫలితంగా, బీజేపీ బాహుబలిగా అవతరించింది. ఇది తెరాస నాయకత్వ స్వయంకృతం.  కాంగ్రెస్‌ను బలహీనం చేయాలన్న కేసీఆర్ ఎత్తు.. చివరాఖరకు బీజేపీ రూపంలో... భవిష్యత్తులో తెరాసనే మింగేసే స్థాయికి చేరింది.   అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో, తెరాస సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ నైతికంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి మీసం మెలేసిన టీఆర్‌ఎస్... ఈసారి బీజేపీ ఇచ్చిన పోటీ కి ఉక్కిరిబిక్కిరయి.. ఊపిరాడక... కేవలం 55 సీట్లకే చతికిలపడాల్సిన దుస్థితి. అంటే  44 స్ధానాలు కోల్పోయిన విషాదం. దీనికి కారణం కచ్చితంగా స్వయంకృతమేనన్నది తెరాస శ్రేణుల వాదన. దాదాపు 46 మంది సిట్టింగ్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలున్నా, స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లొంగి తిరిగి వారికే సీట్లిచ్చినందుకు ‘ఫలితం’ అనుభవించాల్సి వచ్చింది.   దాదాపు డివిజన్‌కు మూడు కోట్లు ఖర్చు పెట్టి, సర్వశక్తులూ ఒడ్డినా తెరాస.. తనకున్న 44 స్థానాలు నిలబెట్టుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో సర్వం తానయి నిలిచిన మంత్రి కేటీఆర్, ఈ ఫలితాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత విజయానికి ఆయన బాధ్యత ఎంతో.. నేటి ఈ ‘నైతిక పరాజయాని’కీ ఆయనదీ అంతే బాధ్యత. అయితే, ఏకైక అతిపెద్ద పార్టీగా తెరాస అవతరించినా, 38 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతోపాటు, మజ్లిస్‌కు వచ్చిన 44 కార్పొరేటర్లు, మరో పదిమంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలసి, తెరాస అభ్యర్ధి మేయర్ కావచ్చు. కానీ నైతికంగా మాత్రం ఆ పార్టీది పరాజయమే. నిజానికి 64 మంది కార్పొరేటర్లు ఉంటేనే తెరాసకు మేయర్ వస్తుంది. ఇప్పుడు ఆ మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ చేరువ కాలేదు. అయితే మజ్లిస్‌తో చేయి కలిపి, మేయర్-డిప్యూటీ మేయర్లను ఆ పార్టీ చేజిక్కించుకోవచ్చు. కానీ.. రాజధాని నగరంలో ఒక ప్రతిపక్షం, తనకు సమీపంలో రావడం,  అధికార పార్టీకి  కచ్చితంగా ప్రమాదఘంటికనే.   గ్రేటర్  ఎన్నికల్లో తెరాస కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఖాతానే తెరవకపోవడం అత్యంత విషాదం. సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఎల్బీనగర్, ముఠా గోపాల్ ఎమ్మెల్యేగా ఉన్న ముషీరాబాద్‌లో తెరాస అసలు ఖాతానే తెరవకపోవడం అత్యంత విషాదం. ఇక్కడ కమలం వికసించింది. ఇక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌లో తెరాస క్లీన్‌స్వీప్ చేస్తుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎందుకంటే ఆయనకు,  నిత్యం జనంలో అందుబాటులో ఉండే నేతగా పేరుంది. వ్యక్తిగతంగా చాలామందికి సాయం చేసే నాయకుడిగానూ పేరుంది. అయినా ఆ నియోజకవర్గంలో , మూడు డివిజన్లు కమలం ఖాతాలో కలవడం ఆందోళన కలిగించే అంశమే. అభ్యర్ధుల ఎంపికలో జరిగిన పొరపాట్లే దానికి కారణమంటున్నారు.   అయితే బేగంపేటలో ఓడిపోయే అభ్యర్ధిని గెలిపించడం  కొంతలో కొంత ఊరట. నిత్యం అందరికీ అందుబాటులో ఉండే తలసాని, తన నియోజకవర్గంలో ఎందుకు క్లీన్‌స్వీప్ చేయలేకపోయారన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే, సనత్‌నగర్ నియోజవర్గంలోనే   తెరాస అభ్యర్ధులు ఎక్కువ ఖర్చు పెట్టారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఎన్నికల్లో దూసుకువెళ్లినా, తలసాని నియోజకవర్గంలో 3 సీట్లు బీజేపీకి రావడమే ఆశ్చర్యం. ఇక మొత్తం తెరాస అభ్యర్ధులే క్లీన్‌స్వీప్ చేసిన ఘనత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్‌కే దక్కుతుంది. ఈ ఎన్నికల్లో పార్టీపరంగా ఆయనే హీరోగా నిలిచారు. నగరమంతా బీజేపీ హవా సాగినా, సికింద్రాబాద్‌లో మాత్రం ఒక్క  సీటు కూడా సాధించ లేకపోయింది. ఈ విషయంలో పద్మారావు అందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. ఆయన తన కుమారులను అన్ని డివిజన్లలో మోహరింపచేశారు. వారికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆర్ధిక వనరుల వ్యవహారాన్ని పద్మారావు స్వయంగా చూశారు.   నిజానికి సికింద్రాబాద్‌లో తార్నాక, బౌద్ధనగర్, సీతాఫల్‌మండిలో తెరాస తొలి నుంచీ కొంత బలహీనంగా ఉంది. ముఖ్యంగా తార్నాకలో బీజేపీ విజయం ఖాయమని, టీఆర్‌ఎస్ వర్గాలే అంచనా వేశాయి. అయితే అక్కడ పద్మారావు తనయులే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా మారిన బౌద్ధనగర్ డివిజన్‌లో,  తెరాస విజయం వెనుక పద్మారావు తనయుడి కృషి ఎక్కువగా ఉంది. అతనే అక్కడ తెరాస అభ్యర్ధికి రక్షకుడిగా మారారు. ఆరకంగా ఇప్పుడు  నగరంలో క్లీన్‌స్వీప్ చేసిన నేతగా పద్మారావు రికార్డు సృష్టించారు.   అయితే... గతంలో 99 సీట్లు సాధించిన తెరాస గురి ఈసారి దారుణంగా తప్పడం, బీజేపీ ఊహించని విధంగా తెరాసకు చేరువకావడమే ఆందోళన కలిగించే అంశం. అదికార పార్టీ 44 సిట్టింగు సీట్లను కోల్పోవడం, ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రచారంలో తెరాస అతి విశ్వాసం, సమన్వయలోపం, అభ్యర్ధుల ఎంపికలో లెక్కలేనితనం, ప్రచారంలో బీజేపీ బలం- వ్యూహంపై చిన్నచూపు, కేటీఆర్ మినహా మరో ఇతర నేతలకు భాగస్వామ్యం లేకపోవడం వంటి అంశాలే తెరాస కొంపముంచాయన్నది నిష్ఠుర సత్యం. చివరాఖరకు సీఎం కేసీఆర్ సభ పెట్టినా, కారు జోరందుకోలేకపోయింది.   ఇటీవలి వరద సమయంలో కేసీఆర్ ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడంలో తెరాస విఫలమయింది. ప్రభుత్వం తమను అనాధల్లా వదిలేసిందన్న ఆగ్రహాన్ని,  బీజేపీ సద్వినియోగం చేసుకుంది. వరద వచ్చిన ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ ఓడిపోవడం బట్టి.. అక్కడి ప్రజల్లో ఆ పార్టీపై ఎంత అసంతృప్తి ఉందో స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత పదివేల సాయం కొనసాగిస్తామని చెప్పినా, ప్రజలు నమ్మలేదంటే తెరాసపై నమ్మకం సన్నగిల్లుతున్నట్లే లెక్క.   ఇక చాలామంది సిట్టింగ్ కార్పొరేటర్లకే మళ్లీ సీట్లివ్వడం కూడా కారు కొంపముంచింది. ఇది తెరాస నాయకత్వ అంచనా లోపానికి పెనుమచ్చ. ఇళ్ల నిర్మాణాలు, స్థానిక పంచాయితీలలో వారు విచ్చలవిడితనంగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నా, మళ్లీ వారికే సీట్లివ్వడమే తెరాస పతనానికి ప్రధాన కారణమంటున్నారు. ఏదేమైనా..మళ్లీ నగరంలో పార్టీని పునర్నిర్మించుకోవాలన్న హెచ్చరిక సంకేతాలు, మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదన్న సందేశాన్ని గ్రేటర్ ఎన్నికలు మిగిల్చాయి. -మార్తి సుబ్రహ్మణ్యం

కూకట్ పల్లిలో వికసించని కమలం! సోము వీర్రాజేనా కారణం? 

జీహెచ్ఎంసీలో అనూహ్యా విజయాలు సాధించిన కమలం పార్టీ అక్కడ ఎందుకు వాడిపోయింది? ఏపీ బీజేపీ నేతల ప్రచారమే తెలంగాణ బీజేపీ కొంప ముంచిందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇదే చర్చ  ప్రధానంగా జరుగుతోంది. ఏపీ ఓటర్లు ఎక్కువగా ఉంటే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్రచారమే తమకు నష్టం కల్గించిందని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారట. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తెలంగాణ కమలం నేతలంతా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెబుతున్నారు. సోము వీర్రాజు ప్రచారంతో 10 నుంచి 15 సీట్లు కోల్పోయామని వారంతా నిర్ణయానికి వచ్చారట.    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రచారం చేశారు. కూకట్ పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, హఫీజ్ పేట ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ర్యాలీ తీశారు. గ్రేటర్ ఫలితాల్లో ఇక్కడ బీజేపీ ఒక్క డివిజన్ కూడా గెలవలేదు. నిజానికి కూకట్ పల్లి జోన్ లో ఈసారి బీజేపీ మంచి విజయాలు సాధిస్తుందని అంతా భావించారు. ఎన్నికల ప్రచారంలోనూ అదే ట్రెండ్ కనిపించింది. సెటిలర్లలో కూడా మెజార్టీ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని డిసైడయ్యారట. అయితే బీజేపీ ప్రచారానికి సోము వీర్రాజు రావడంతో వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ లో గతంలో కంటే అద్భుత విజయాలు సాధించిన బీజేపీ.. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ల లో మాత్రం ఘోరంగా చతికిలపడింది.    కూకట్ పల్లి జోన్ లో 22 డివిజన్లు ఉండగా బీజేపీ ఒక్క డివిజన్ మాత్రమే గెలిచింది. శేరిలింగం పల్లి జోన్ లో 13కు ఇక్కడ కూడా ఒక్కటే గెలిచింది. సోము వీర్రాజు ప్రచారం చేయకపోతే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్, హబ్సిగూడ, వనస్తలిపురంలో బీజేపీ హవా చూపింది. ఎల్బీనగర్ జోన్ లో 11 డివిజన్లు ఉండగా.. అన్ని గెలిచి కమలం స్వీప్ చేసింది. ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉండే హబ్సిగూడ, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. కూకట్ పల్లిలో మాత్రం కమలం పూర్తిగా వాడిపోయింది. వీర్రాజు ప్రచారానికి రాకుంటే కూకట్ పల్లి ఏరియాలోనూ బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.    సోము వీర్రాజుపై సీమాంధ్ర ఓటర్ల కోపానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. అమరావతిపై పూటకో స్టాండ్ మార్చడం.. రోజుకో ప్రకటనతో గందరగోళం చేయడంపై సెటిలర్లు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడకుండా టీడీపీపైనా, చంద్రబాబు పైనా విమర్శలు చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. సోము వీర్రాజు లాంటి నేతలతో పార్టీకి నష్టమనే అభిప్రాయం ఆ పార్టీలో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. ఏపీలో పార్టీని పాతాళానికి తొక్కుతున్న సోము వీర్రాజు.. హైదరాబాద్ వెళ్లి అక్కడ పార్టీకి నష్టం కల్గించారనే చర్చ బీజేపీ నేతల్లోనే జరుగుతోంది. ఇలాంటి నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ కేంద్ర నాయకత్వమే ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా కొందరు చెబుతున్నారట.  

శివారులో బీజేపీ జోష్! గులాబీలో పెరిగిన టెన్షన్? 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తుది లెక్కలు వచ్చాయి. పోలింగ్ శాతం తగ్గిందని మొదట భావించినా.. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫైనల్ లెక్కలతో గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగినట్లు తేలింది. ఓటింగ్  శాతం తగ్గితే అధికార పార్టీకి ప్లస్ అవుతుందని అంచనా వేశారు. అయితే ఫైనల్ లెక్కల్లో గతంలో కంటే ఓటింగ్ శాతం పెరగడంతో బీజేపీలో సంతోషం వ్యక్తమవుతోందని తెలుస్తోంది. పోలింగ్ సరళిని అంచనా వేసిన కమలం నేతలు 70 నుంచి 75 డివిజన్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట. పోలింగ్ సరళి అధికార పార్టీలో గుబులు రేపుతుందని చెబుతున్నారు. అందుకే పోలింగ్ పై టీఆర్ఎస్ నేతలెవరు మాట్లాడటం లేదని భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ బీజేపీ చీఫ్ సంజయ్ తో పాటు ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాని అధికార పార్టీ లీడర్లు మాత్రం బయటికి రాలేదు.   జీహెచ్ఎంసీపై మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా భారీగా సైలెంట్ ఓటింగ్ జరిగిందనే అంచనాకు గులాబీ నేతలు వచ్చారంటున్నారు. ముఖ్యంగా యూత్ ఓట్లన్ని వన్ సైడ్ గా కమలానికి పడినట్లు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా బీజేపీ నేతల హంగామానే కనిపించిందని.. వివిధ సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. ఈ లెక్కన గ్రేటర్ శివారు ప్రాంతాల్లో బీజేపీకి పోలింగ్  వన్ సైడ్ గా జరిగిందని టీఆర్ఎస్ పెద్దలు అంచనా వేస్తున్నారట. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా..అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేయవచ్చంటున్నారు. ఇక్కడ అంతా సిట్టింగులకే టికెట్లు ఇచ్చింది గులాబీ పార్టీ. వారిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. సిట్టింగులపై వ్యతిరేకతకు బీజేపీ జోష్ కూడా తోడవడంతో ఎల్బీనగర్ లో కారు పూర్తిగా ఫల్టీ కొట్టిందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు కూడా ఎల్బీనగర్ పై ఆశలు వదులుకున్నారని చెబుతున్నారు.    ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లోనూ బీజేపీ హవా కనిపించిందని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని భావించినా.. పోలింగ్ సమయానికి వాళ్లు హ్యాండ్సప్ అన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ వీక్ కావడం బీజేపీకి మరింత కలిసి వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ కు ఓట్లు మరింత తగ్గితే ఇక్కడ కూడా బీజేపీకి వన్ సైడ్ ఫలితాలు రావచ్చంటున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లోనూ బీజేపీకి ఓటర్ల నుంచి మద్దతు లభించిందని తెలుస్తోంది. కూకట్ పల్లి నియోజకవర్గంలో కొన్ని డివిజన్లు, శేరిలింగం పల్లిలో కొన్ని డివిజన్లు మాత్రమే కచ్చితంగా గెలుస్తామని, మిగిలిన డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉందని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారట. గ్రేటర్ డివిజన్లకు సంబంధించి.. శివారు ప్రాంతంలోనే దాదాపు 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడంతా బీజేపీ గాలి వీచిందన్న ప్రచారం ఇప్పుడు అధికార పార్టీ నేతలను కలవరపెడుతుందని తెలుస్తోంది. నియోజకవర్గాలు, డివిజన్ల  నుంచి పార్టీ నేతలు ఇస్తున్న వివరాలు కూడా టీఆర్ఎస్ నేతల ఆందోళనను పెంచుతున్నాయట.    నిజానికి హైదరాబాద్ కోర్ సిటిలో బీజేపీకి మొదటి నుంచి పట్టుంది. అక్కడ బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుస్తుందని, శివారులో కారుకు ఎక్కువ రావచ్చని మొదట అంచనా వేశారు. కాని పోలింగులో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో కమలం వికసించినట్లు కనిపించగా.. కోర్ సిటీలో మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వాతావరణం కనిపించింది. కోర్ సిటిలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం... వారంతా కారుకు అనుకూలంగా ఓటేయడం అధికార పార్టీకి ప్లస్ కావచ్చంటున్నారు. ప్రచారంలో నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా కోర్ సిటిలో ప్రభావం చూపాయంటున్నారు. గొడవలు జరుగుతాయనే భయంతో కొంత మంది ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని లెక్కలు వేస్తున్నారు. అందుకే ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలవచ్చంటున్నారు. సికింద్రాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల్లో గట్టి పోటీ జరిగిందంటున్నారు.   పాతబస్తిలో మాత్రం మళ్లీ ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటుందని భావిస్తున్నారు.గతంలో పతంగి పార్టీ 44 డివిజన్లు గెలిచింది. ఇప్పుడు కూడా 40కి అటు ఇటూగా ఎంఐఎం గెలవచ్చంటున్నారు. పోలింగ్ చివరి గంటల్లో ఎంఐఎంకు అనుకూలంగా పోలింగ్ జరిగిదంటున్నారు. నిజానికి ఎంఐఎంకు గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఓల్డ్ సిటిలో కనిపించింది. అయితే పోలింగ్ రోజున మాత్రం అది పెద్దగా ప్రభావం చూపలేదంటున్నారు. ఇతర పార్టీలు పాతబస్తిలో పెద్దగా ప్రచారం చేయకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు. ప్రచారంలో జరిగిన పరిణామాలతో ముస్లింలలో మళ్లీ యూనిటి కనిపించగా.. కొన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ కు రాలేదంటున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో మార్వాడి, గుజరాతీలు కూడా ఎక్కువగా పోలింగులో పాల్గొనలేదని చెబుతున్నారు. ఇవి కూడా పతంగి పార్టీకి కలిసి రావచ్చని చెబుతున్నారు. ఓల్డ్ సిటీలో బీజేపీ, టీఆర్ఎస్ కు రెండు,మూడు సీట్లకు మించి రాకపోవచ్చంటున్నారు.   మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ సరళి గులాబీ పార్టీ నేతల్లో గుబులు పెంచుతుందని చెబుతున్నారు. శివారు ప్రాంతంలో తమకు భారీగా నష్టం జరిగిందని, కోర్ సిటిపైనే ఆశలు పెట్టుకున్నామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారట. పోలింగ్ చివరి గంటల్లో జరిగిన ఓటింగ్ పైనా కొంత ఆశలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అందించిన  వరద సాయం అందుకున్న ఓటర్లలో ఎంత మంది తమవైపు నిలిచారోనన్న దాన్ని బట్టే తమ విజయ అవకాశాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారంటున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్ లో మూడు నుంచి నాలుగు వేల మందికి వరద సాయంగా 10 వేలు ఇచ్చామని టీఆర్ఎస్ చెబుతోంది. అయితే అందులో ఎంత మొత్తం వరద బాధితులకు వెళ్లింది.. ఎంత వరకు గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. గ్రేటర్ ఫలితాల్లో అది తేలిపోనుందని చెబుతున్నారు.

‘గ్రేటర్ గులాబీ’తోటలో ‘కమలం’ వికసిస్తుందా?

కాంగ్రెస్-టీడీపీ ఓట్లు బదిలీ అయితేనే ఫలితం   యువతలో వచ్చిన మార్పుతో కనిపిస్తున్న జోష్   ప్రచార జోరు ఫలితాలు రాబడితేనే భవిష్యత్తు   టీఆర్‌ఎస్‌కు ఇవి ప్రతిష్టాత్మకం   అధికారంలో ఉండటమే క లిసొస్తున్న అంశం   కిషన్‌రెడ్డి పట్టు-ప్రతిభకు అగ్నిపరీక్ష   అసమ్మతే కొంపముంచుతుందా?   ఎన్నికలకు అంతా రె‘ఢీ’   అధికార టీఆర్‌ఎస్- ప్రతిపక్ష బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో జీరో నుంచి ఉవ్వెత్తున పైకి లేచి, అధికారపార్టీ హడలెత్తిస్తున్న కమలం.. గ్రేటర్ లోని ‘గులాబీతోట’లో వికసిస్తుందా? అనే స్ధాయికి వెళ్లడం నిజంగా విశేషమే. అందుకు కమలదళపతి బండి సంజయ్ మంత్రాంగం-దూకుడే కారణమన్నది నిర్వివాదం. అయితే, ప్రచారంలో క నిపించిన జోరు, హడావిడి ఫలితాల్లో చూపించకపోతే, బీజేపీ కేవలం హైప్ పార్టీగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.   ఇప్పటి పరిస్థితి ప్రకారం.. నగరంలో కమల కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా యువతలో తొలిసారి గతంలో ఎన్నడూ కనిపించనంత మార్పు, ఈ ఎన్నికల్లోనే కనిపించడం ప్రస్తావనార్హం. గత రెండు రోజుల వరకూ 20 సీట్ల వరకూ రావచ్చని అంచనా వేసిన ఆ పార్టీ వర్గాలు, ఇప్పుడు యువతలో దూకుడు పెరిగిన నేపథ్యంలో కనీసం 30-40 స్థానాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనా వ్యక్తమవుతోంది. నిజానికి యువతలో కూడా బీజేపీ పట్ల అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఈసారికి బీజేపీకి ఓటేయాలని తలిదండ్రులను సైతం, ఒత్తిళ్లు చేసే పరిస్థితి కనిపించడం ఇదే తొలిసారి.   దానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీ నిర్వీర్యమయిపోవడం, ఆ పార్టీ సానుభూతిపరులు-ఓటర్లు కూడా అందుకు ప్రత్యామ్నాయంగా, బీజేపీనే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వీటికి మించి అమిత్‌షా, నద్దా, స్మృతి ఇరానీ, యోగి వంటి అగ్రనేతలు ప్రచారంలోకి దిగడం, టీఆర్‌ఎస్ మాదిరిగానే నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించడం, సంఘ్ పరివారం చాపకిందనీరులా క్షేత్రస్థాయికి వెళ్లడం వంటి అంశాలు కమలం పార్టీకి కలసివచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, అగ్రనేతల రాకతోనే ఓట్లు వస్తాయనుకోవడం పోరపాటే అయినప్పటికీ.. జనంలో బీజేపీ క్రేజ్ పెరుగుతోందని భావించేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే ఆ ‘మౌత్‌టాక్’ విస్తరిస్తోంది కూడా. కాంగ్రెస్ కూడా సీరియస్‌గా రేసులో లేకపోవడం కూడా.. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అన్న భావన కలిగేందుకు అవకాశం ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధుల ఎంపిక లోపాలు లేకపోతే, ఈ ఊపు మరింత ఉధృతంగా ఉండేది.   బండి సంజయ్ దూకుడు-ప్రణాళిక పుణ్యాన..  జీరో నుంచి పైకి లేచిన కమల కెరటం, అవన్నీ ఫలించి ‘గులాబీ’ తోటలో వికసించకపోతే.. బీజేపీ హడావిడి తప్ప, ఫలితం లేని పార్టీ.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారానే,  తన ఉనికి కాపాడుకుంటుందన్న భావన మరింత బలపడి, అది విస్తృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో బీజేపీ నేతలపై ‘పని తక్కువ-పబ్లిసిటీ ఎక్కువ’ అన్న ముద్ర ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన హైప్‌నకు తగిన ఫలితాలు రాబట్టకపోతే, ఇక బీజేపీ ప్రాధాన్యం పోయినట్టు భావించకతప్పదు. ఏదేమైనా.. ఇప్పటి నాలుగు స్థానాల నుంచి డజన్ల స్థాయికి ఎదిగినా, అది ఆ పార్టీ భవిష్యత్తు విజయానికి ‘గ్రేటర్’ ముఖద్వారం అయినట్లే లెక్క.   అటు తెరాస హవాలో కూడా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రె డ్డికి ఈ ఎన్నికల ఫలితాలు అగ్నిపరీక్షనే. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలో, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేరు. కార్పొరేటర్లదీ అదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక అంతా ఆయన సూచన ప్రకార మే జరిగింది కాబట్టి, జయాపజయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది. మెజారిటీ డివిజన్లు సాధించకపోతే.. గత ఎన్నికల్లో ఆయన గెలుపు ‘గాలి’వాటంగానే భావించే ప్రమాదం లేకపోలేదు. అభ్యర్ధుల ఎంపికలో ఆయన పొరపాటు చేశారన్న అసంతృప్తి, అగ్రనేతల ఒత్తిళ్లకు లొంగిపోయారన్న ఆగ్రహం తొలి నుంచీ పార్టీలో పనిచేస్తున్న నేతల్లో లేకపోలేదు. దానితో కీలకమైన నియోజకవర్గాలు, డివిజన్లలో వారు సహాయ నిరాకరణ చేయడం, ఆందోళన కలిగించే అంశమే. ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు సాధిస్తేనే, ఆయన పునాదులు బలపడతాయి.   ఇక అధికార టీఆర్‌ఎస్‌కు.. గ్రేటర్ ఎన్నికలు జీవన్మరణం కాకపోయినా, అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే వచ్చే నష్టమేమీ లేదు. బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు తప్ప, నగరంలో అంతా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే. మెరుగైన ఫలితాలు రాకపోతే, వారి పని అయిపోయిందని.. ప్రజల్లో వారిపై వ్యతిరేకత మొదలయిందన్న ప్రచారానికి తెరలేస్తుంది. అభ్యర్ధుల ఎంపిక లోపాలు, కొంతమంది ఎమ్మెల్యేల నాన్ సీరియస్ వ్యవహారం, సిట్టింగ్ కార్పొరే టర్లపై అవినీతి ఆరోపణలు... వీటికి మించి, ఇటీవలి వరద సాయంలో పదివేలు అందరికీ ఇవ్వలేదన్న ఆగ్రహం వంటి అంశాలు,  తెరాసకు మైనస్ పాయింట్లుగా పరిణమించాయి.   అయితే, అధికారంలో ఉండటమే ఆ పార్టీకి బలం కూడా! ఎందుకంటే టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున, పనులు త్వరగా అవుతాయని, ప్రతిపక్షం మేయర్ అయితే పనులు జరగవన్న భావన, సాధారణ ప్రజల్లో ఏర్పడితే... అది టీఆర్‌ఎస్‌కే లాభం. ఈసారి సెటిలర్లు తెరాస వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ, యువత మాత్రం బీజేపీ వైపు చూస్తుండటం కొంత ఆందోళన కలిగించే అంశమే.   ఎన్నికలంతా కేటీఆర్ కథానాయకుడిగానే జరిగినందున, సహజంగా జయాపజయాలకు ఆయనదే  బాధ్యత. అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సనత్‌నగర్, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న తీగుళ్ల పద్మారావుకు సైతం, ఈ ఎన్నికల ఫలితాలు సవాలే. వారి నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక వారి ఇష్టప్రకారమే జరిగింది కాబట్టి, వారిని గెలిపించుకునే బాధ్యత కూడా సహజంగా వారిపైనే ఉంటుంది. రెండు నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ప్రతిపక్షాలు లేవు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కాలుపెడితే, అవి వారి రాజకీయ మనుగడ-ఉనికికే ప్రమాదం.   అటు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికీ ఈ ఫలితాలు సవాలే. నగరంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు. అలాంటిది ఆయన తన పార్లమెంటుపరిథిలోని వార్డులో,్ల మెజారిటీ స్థానాలు గెలిపించుకోకపోతే.. సొంత ఇలాకాలో గెలవలేని నేతగా విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయనొక్కరి గళమే గట్టిగా వినిపించింది.  -మార్తి సుబ్రహ్మణ్యం

జగన్ కోసమే జనసేనతో గ్యాప్! బీజేపీ గ్రేటర్ వ్యూహం ఇదేనా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు గందరగోళంగా సాగింది. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో జరిగిన పరిణామాలు చూస్తే జనసేనకు బీజేపీ బైబై చెప్పినట్లే కనిపిస్తోంది. అమిత్ షా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడం, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అరవడం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రచార రథం దిగి మరీ వచ్చి జన సైనికులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు మద్దతు తెలిపిన పార్టీ కార్యకర్తలను బీజేపీ ఎందుకు వెళ్లగొట్టిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.    గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బీజేపీ దూరం పెట్టడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ కోసమే బీజేపీ జనసేనను దూరం పెట్టిందనే చర్చ జరుగుతోంది.  గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు కీలకం. దాదాపు 40 డివిజన్లలో వారే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయటం లేదు. టీడీపీ పోటీలో ఉన్నా.. కొన్ని  డివిజన్లలోనే గట్టి పోటీ ఇస్తోంది.  జనసేన ఓట్లతో పోల్చుకొంటే వైసీపీ , టీడీపీ ఓట్లు చాలా అధికం . ప్రతి డివిజన్లో జనసేన ఓట్లు పదులు వందల్లో ఉంటే వైసీపీ , టీడీపీ ఓట్లు వేలల్లో ఉంటాయి . అవే ఫలితాలని తారుమారు చేస్తాయి. వైసీపీ  పోటీ చేయటం లేదు కాబట్టి వాళ్ళంతా  టీఆర్ఎస్,  బీజేపీకి సమానంగా  ఓట్లు వేస్తారని చెబుతున్నారు. అదే  పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేస్తే వైసీపీ ఓట్లు బీజేపీకి పడే అవకాశమే లేదు.  పవన్ కల్యాణ్ ను  తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ ఓటర్లు పూర్తిగా టీఆర్ఎస్ సైడ్ కు షిప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ వర్గ ఓట్ల కోసం జనసేనను తెలంగాణ బీజేపీ దూరం పెట్టిందనే చర్చ జరుగుతోంది.    టీడీపీ పోటీలో ఉంది కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ల అభ్యర్థులకే ఓట్లు వేస్తారు. వైసీపీలో పోటీలో లేదు కాబట్టి.. ఆ వర్గం ఓట్ల కోసమే బీజేపీ పవన్ కల్యాణ్ ను గ్రేటర్ ఎన్నికల్లో దూరం పెట్టిందని చెబుతున్నారు. సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్  కంటే బీజేపీకే ఎక్కువ పడేటట్లు చేసే ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని సమాచారం. అందుకే  దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద కామెంట్లు చేయగానే బీజేపీ పెద్దలు వెంటనే రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. రఘునందన్ రావుకు అక్షింతలు వేసి వెంటనే మాటలు వెనక్కితీసుకోవాలని సూచించినట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశాలతోనే మాట్లాడిన కొన్ని గంటల్లోనే రఘునందన్ రావు రిగ్రెట్ చెప్పినట్లు చెబుతున్నారు.    జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన మధ్య మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. సొంతంగానే పోటీ చేస్తామని ముందు  ప్రకటించిన పవన్ కల్యాణ్.. తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరపడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అయితే గ్రేటర్ లో ఆయన  ప్రచారం చేయలేదు. ఇటీవలే  ఢిల్లీ వెళ్లిన జనసేన చీఫ్ .. రెండు రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్ తో పవన్ కల్యాణ్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే జీహెచ్ఎంసీలో ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాని పవన్ కల్యాణ్ ప్రచారానికి దిగలేదు. జనసేనతో తమకు పొత్తు లేదని, వారే పోటి నుంచి తప్పుకున్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన ప్రకటన దుమారం రేపింది. అర్వింద్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన జనసేన వెంటనే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయినా బీజేపీ ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు.    గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తమతో తెలంగాణ బీజేపీ వ్యవహరించిన తీరుపై జనసేనలో ఆగ్రహం వ్యక్తమవుతుందని తెలుస్తోంది. అమిత్ షా  రోడ్ షాలో పాల్గొనేందుకు వచ్చిన తమను అడ్డుకోవడంపై వారు మండిపడుతున్నారు. వైసీపీ ఓట్ల కోసం తమ నేత పవన్ కల్యాణ్ నూ దూరం పెట్టారన్న ప్రచారంతో జనసేన కార్యకర్తలు మరింత రగిలిపోతున్నారు. వైసీపీ ఓట్లు కావాలనుకున్నప్పుడు తమ మద్దతు ఎందుకు కోరారని నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ మద్దతు కోసం వచ్చిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు వైసీపీ ఓట్ల విషయం అప్పుడు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. తెలంగాణ బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందనే ఆగ్రహం జనసేన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తాము పోటీ చేసేందుకు సిద్ధమైన సమయంలో చర్చలు జరిపి మద్దతు కోరారని, నామినేషన్ల పర్వం ముగిశాకా తమను పట్టించుకోవడం మానేశారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.                    మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్దమైనా పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిన బీజేపీ.. తిరుపతిలో మాత్రం మరోలా వ్యవహరించే  అవకాశం ఉందని చెబుతున్నారు . పవన్ కల్యాణ్ ను గ్లామర్ ను తిరుపతిలో తమకు అనుకూలంగా మలుచుకునే  అవకాశం ఉందంటున్నారు. తిరుపతిలో పవన్ సామాజిక వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. పవన్ ప్రచారం చేస్తే ఆ ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉంది. సాధారణంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో  పవన్ సామాజికవర్గం ఎక్కువగా టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది . పవన్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తే ఆ మేరకు టీడీపీకి గండిపడే అవకాశమే ఎక్కువగా ఉంది. అందుకే తిరుపతిలో పవన్ తో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. మొత్తంగా జనసేన, బీజేపీ తీరు.. గ్రేటర్ లో జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్ ను తమ అవసరానికి అనుగుణంగా బీజేపీ వాడుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కేసీఆర్ ను అందుకే పక్కన పెట్టారా? ప్రధాని పర్యటనపై రాజకీయ మంటలు!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనపై రాజకీయ దుమారం రేగుతోంది. భారత్ బయాటెక్ లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తున్న ప్రధాని పర్యటనలో కేవలం అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం లేదు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్ కు వస్తున్న ప్రధానికి అహ్వానం చెప్పటానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానిస్తోందని మండిపడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అయ్యేలా ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలం నేతలు. ప్రధాని మోడీ కేవలం కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు మాత్రమే వస్తున్నారని, అందుకే కేవలం అధికారులను మాత్రమే ఆహ్వానించారని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా ఎవరూ ప్రధానిని కలిసేందుకు వెళ్లడం లేదంటున్నారు. కేసీఆర్ కావాలనే రాద్దాంతం చేస్తున్నారని, గవర్నర్ కు కూడా ఆహ్వానం లేదన్నది టీఆర్ఎస్ నేతలు గుర్తించుకోవాలని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తున్న ప్రధాని మోడీ పర్యటనపైనా రాజకీయం చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నాకు బీజేపీ నేతలు. తెలంగాణకు అవమానంటూ గులాబీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు కమలనాధులు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన, సీఎం కేసీఆర్ కు ఆహ్వానం లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్ రాబోతుందని గతంలో పలు సార్లు కేసీఆర్ చెప్పారు. భారత్ బయోటిక్ చేస్తున్న పరిశోధనలను తనకు ప్రయోజనం కలిగేలా మలుచుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ అంశంతో రాష్ట్రానికి సంబంధం లేకున్నా.. తన పాత్ర ఉందనేలా కేసీఆర్ ప్రచారం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తనతో పాటు కేసీఆర్ ను అక్కడికి తీసుకెళితే... తానే కరోనా వ్యాక్సిన్ తయారీకి సూచనలు చేశానని కేసీఆర్ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని బీజేపీ నేతల అనుమానం. భారత్ బయోటిక్ గురించి గతంలోనే చెప్పానని, తమ సహకారం వల్లే టీకా వచ్చిందని కేసీఆర్ చెప్పుకున్నా అశ్చర్యం లేదంటున్నారు కమలనాధులు. అందుకే ప్రధాని మోడీ తన పర్యటనలో సీఎం కేసీఆర్ ను పక్కన పెట్టారని బీజేపీ నేతలు చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరుగుతోంది. వ్యక్తిగత, విద్వేష, రెచ్చగొట్టే మాటలు చేసుకుంటున్నారు లీడర్లు. ఈ సమయంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటే గ్రేటర్ ప్రజలకు మరో సంకేతం వెళుతుందనే ఆందోళన కూడా బీజేపీలో ఉందంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో దోస్తీ .. గల్లీల్లో ఫైటింగ్ చేస్తూ డ్రామాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ సమయంలో మోడీ, కేసీఆర్ కలిస్తే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యే అవకాశం ఉందనే భయం కూడా ఉందంటున్నారు. అందుకే ఏ సమస్య లేకుండా ప్రధాని పర్యటనకు కేసీఆర్ ను దూరం పెట్టారని చెబుతున్నారు. మరోవైపు ప్రధాని హైదరాబాద్ పర్యటనపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని పర్యటనలో లోకల్ ఎంపీకి ఆహ్వానం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ‘గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు ఈ రోజు భారత్ బయోటెక్ కు రానున్నారు. హకీంపేట ఏఎఫ్ఎస్‌లో ఆయన ల్యాండ్ అవుతారు. అవి రెండు మల్కాజిగిరి నియోజక వర్గం కిందకు వస్తాయి. ఇక్కడ మోడీ పర్యటన నేపథ్యంలో స్థానిక పార్లమెంటు సభ్యుడిని పిలవకపోవడం సరికాదు’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలోని జాతీయ మీడియా సంస్థలన్నింటి హ్యాష్‌ట్యాగ్‌లను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జత చేశారు. భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ పురోగతిని పరిశీలించడమే ప్రధాని నరేంద్రమోడీ టూర్ షెడ్యూల్. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి, హకీంపేట ఎయిర్‌పోర్టు ఆఫీస్ కమాండెంట్ కు మాత్రమే ఆహ్వానం వచ్చింది. ప్రధానికి హాకింపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలకాలని భావించిన సీఎం కేసీఆర్.. దీనికి సంబంధించి పీఎంవోకు సమాచారం ఇచ్చారట. అయితే ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్.. సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఫోన్ లో తెలిపారని చెబుతున్నారు. దీనిపైనే టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీ మేనిఫెస్టో భలే.. భలే!

సర్కారును ‘గ్రేటర్ ’ కార్పొరేషన్ ఆదేశిస్తుందా?   స్కూళ్లు లేకున్నా ట్యాబులు ఎలా ఇస్తారు?   కమలం మేనిఫెస్టో కమిటీ వైచిత్రి   మేనిఫెస్టో అంటే ఒక రాజకీయ పార్టీ విశ్వసనీయతకు నిలువుటద్దం. అది ఆయా పార్టీల భవిష్యత్తు పనితీరుకు,  ఓ ముందస్తు అంచనాగా నిలిచే హామీల కొలబద్ద. మరి అలాంటి విశ్వసనీయత కల్పించే మేనిఫెస్టో రూపకల్పన సమయంలో,  ఆ పార్టీ నాయకత్వాలు ఎంత శ్రద్ధ చూపించాలి? ఎంతమంది అనుభవజ్ఞులను అందులో నియమించుకోవాలి? వారిచ్చిన సలహాలను గుదిగుచ్చి కదా మేనిఫెస్టో తయారుచేయాల్సింది? మరి ప్రధాని,  కేంద్రమంత్రులు, జాతీయ నాయకులను పిలిపించి బీజేపీ చేస్తున్న ప్రచార పర్వంలో... అవగాహనలేని, అసంబద్ధమయిన మేనిఫెస్టోను విడుదల చేస్తే,  పార్టీ పరువు ఏమవుతుంది? అది చూసిన వారికి అది ఉత్తుత్తి హామీలపత్రంగా అనిపించదూ? ఆ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం ఎగిరిపోదూ?  ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో అచ్చం అలాగే కనిపిస్తోంది.   బీజేపీ మాజీ సీఎం ఫడ్నవీస్ చేతుల మీదుగా ఆవిష్కృతమయిన... ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో,  నగరంపై ఏమాత్రం అవగాహనలేని నేతలు రూపొందించిన హామీలుగా మారింది. అందులో ప్రకటించిన హామీలలో 90 శాతం,  రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనివే కావడం ప్రస్తావనార్హం. తనకు సంబంధం లేని అంశాలపై , బీజేపీ ఎలా హామీలిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిథిలోని సమస్యలు-దాని పరిష్కారాలు, అందుకు లోబడి హామీలు ఇచ్చిఉంటే బాగుండేది. ఆ మేరకు కొన్ని ఇచ్చారు కూడా. అంతవరకూ బాగానే ఉంది.  కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాలను కూడా,  తాము చేస్తామని ప్రకటించడమే అభాసుపాలు కావడానికి కారణమయింది. ఆ హామీలు పరిశీలిస్తే.. మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహించిన వారికి, అసలు నగరం గురించి ఏమాత్రం అవగాహన లేదన్నది సులభంగా అర్ధమయిపోతుంది.   పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ, అందరికీ కరోనా వ్యాక్సిన్, పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు 4 కోట్లకు తగ్గగుండా నిధులు, వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా, మహిళలకు కిలోమీటర్‌కు ఓ టాయిలెట్, అతిపెద్ద తెలుగు గ్రంధాలయం ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.  అనుమతులు అవసరం లేకుండా 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణం, జంక్షన్‌కో వంతెన, మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు, జీహెచ్‌ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు, కార్మికులకు పన్నుల మాఫీ, మూసీఫ్రంట్ డెవలప్‌మెంట్ ఏర్పాటు, గ్రీవెన్‌సెల్, డంపింగ్ యార్డులు, గుంతలు కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతుల వంటి హామీలిచ్చింది.   అవన్నీ గ్రేటర్ పరిథిలోనివే కాబట్టి, ఆమేరకు వాటిని ప్రకటించడం మంచిదే. వాటిని ప్రజలు నమ్మే అవకాశం ఉంది.  నగరంలో పెద్ద తెలుగు గ్రంధాలయ నిర్మాణంపై  ఇచ్చిన హామీ బాగుంది. అయితే..  కానీ, గత పదేళ్ల నుంచి కార్పొరేషన్.. ప్రజల నుంచి వసూలు చేస్తున్న, 8 శాతం లైబ్రరీ సెస్సు దాదాపు వెయ్యి కోట్ల బకాయిలను.. గ్రంధాలయ సంస్ధకు చెల్లించకపోవడం ప్రస్తావనార్హం. అంటే చివరకు లైబ్రరీలు కూడా, గ్రంధాలయ సంస్థ ఏర్పాటుచేయాల్సిందేనన్న మాట!   మేనిఫెస్టోలో కొన్ని హామీలు బాగున్నా... అసలు  కార్పొరేషన్‌ను ఏమాత్రం  సంబంధ ం లేని అంశాలను ప్రస్తావించడమే, బీజేపీ విశ్వసనీయతకు మచ్చగా మారింది. ఇతర జిల్లాల మాదిరిగా నగరంలో కార్పొరేషన్ నిర్వహణలో స్కూళ్లు లేవు. అయినా విద్యార్ధులకు ఉచితంగా  ట్యాబులు ఇస్తామని ప్రకటించడమే విమర్శలకు దారితీస్తోంది. నగరంలోని కార్పొరేట్ స్కూళ్ల నియంత్రణ అధికారం కూడా కార్పొరేషన్‌కు లేదు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు,  ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు హామీ కూడా ఆ దారిలోనిదే. అయినా ఆ హామీ కూడా ఇవ్వడమే వింత. 5 ఏళ్లలో 15 మహిళా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తామన్న హామీ కూడా నవ్వు తెప్పిస్తోంది. అది హోంశాఖకు సంబంధించిన అంశం. మరి గ్రేటర్ ఎలా ఏర్పాటుచేస్తుందన్నది ప్రశ్న.   నాలాలు, డ్రైనేజీలు మెట్రోవాటర్ వర్క్స్‌కు సంబంధించినద యితే, కార్పొరేషన్ ఆ బోర్డును ఎలా శాసిస్తుంది? 24 గంటల నీటి సరఫరా, ఇంటింటికీ నల్లా కనెక్షన్ కూడా మెట్రో వాటర్ బోర్డు పరిథిలోనివే.  ఈ అంశాల్లో  కార్పొరేషన్-మెట్రోవాటర్‌బోర్డు మధ్య పనుల కోసం,   కేవలం సమన్వయం మాత్రమే ఉంటుంది. కానీ వాటి ఆధునీకరణ కోసం.. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేస్తామన్న హామీ, నవ్వులపాలు చేసేదేనంటున్నారు.   విద్యుత్ చౌర్యం పూర్తిగా ఇంధనశాఖ పరిథిలోనిదే.  అయినా దానిని కూడా గ్రేటర్ హామీలో చేర్చడమే ఆశ్చర్యం. కులవృత్తులకు, పేదలకు వంద యూనిట్ల మేరకు  ఉచిత విద్యుత్ కూడా రాష్ట్ర ప్రభుత్వ అంశమే.ఇవన్నీ డిస్కంలు అంగీకరించాల్సినవే. వాటిని ఏ రాష్ట్రంలోనూ స్థానిక సంస్థలు తమ అధికార ంతో ఇవ్వలేవు. మరి ప్రభుత్వంలో లేని బీజేపీ వాటిని ఎలా ఇస్తుందో వివరిస్తే, మేనిఫెస్టోపై విశ్వసనీయత మరింత పెరిగేది.   ఇక వరద సాయం కింద ఒక్కొక్కరికీ,  25 వేల రూపాయల హామీ కూడా విమర్శల పాలవుతోంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు ఇచ్చిన ఇంటికి పదివేల సాయం కూడా, సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు చేసిందే. అంత బడ్జెట్ గ్రేటర్ కార్పొరేషన్‌కు ఎక్కడి నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కూడా, రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి సంబంధించినదే.  మేయర్‌గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయలేరు. దానిని తీర్మానించి ప్రభుత్వానికి పంపాల్సిందే. అయినా అది ఇటీవలే అసెంబ్లీలో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే.   మరి బీజేపీకి అసెంబ్లీలో ఉన్న బలం రెండే అయినప్పుడు, ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా రద్దు చేస్తారన్న ప్రశ్న విద్యావంతులలో వ్యక్తమవుతుంది. సహజంగా కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ వంటి స్కీములు ప్రవేశపెట్టినా, దానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావలసిందే. అదొక్కటే కాదు.. విధానాలను సంబంధించి కార్పొరేషన్లు సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేవు. కార్పొరేషన్లు తీర్మానం చేసి పంపిన వాటిని ప్రభుత్వాలు ఆమోదించాల్సిన అవసరం లేదు.   మరి రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోని అంశాలన్నీ బీజేపీ.. తన హామీగా మేనిఫెస్టోలో ఎలా పెట్టిందో ఎవరికీ అర్ధం కావడం లేదు. తాము అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా ప్రకటిస్తామని ఫడ్నవీస్ ఇచ్చిన హామీ, అసలు గ్రేటర్ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేనిది. ఒకవేళ బీజేపీ నేతల కష్టం-వ్యూహం ఫలించి, రేపు గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ సాధిస్తే...  తెలంగాణ రాష్ట్రంలో,  సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా ఏవిధంగా ప్రకటిస్తారన్నది ప్రశ్న.   ఈవిధంగా బీజేపీ మేనిఫెస్టో కూర్పులో.. నగరంలో సీనియర్ నేతల సలహా, సూచనలు తీసుకున్నట్లు లేదన్న విషయం,  ప్రకటించిన హామీలు చూస్తే స్పష్టమవుతుంది. జిల్లాల్లో పనిచేసే నాయకులకు.. సహజంగా కార్పొరేషన్  పరిథి-అధికారాలకు సంబంధించి, పెద్దగా అవగాహన ఉండదు. ఎందుకంటే జిల్లాల్లో మున్సిపల్-ప్రభుత్వ శాఖలు కలసే ఉంటాయి. ఎక్కువగా ప్రభుత్వానికే అధికారాలుంటాయి. కాకపోతే అవి మున్సిపాలిటీల్లో కూడా అమలవుతుంటాయి. బహుశా.. అలాంటి అవగాహన ఉన్న జిల్లా స్థాయి నేతలే ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు కనిపిస్తోంది.   అయితే..గతంలో కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన చంద్రవదన్, డిప్యూటీ మేయర్‌గా పనిచేసి, 30 ఏళ్ల నుంచి బీజేపీలో కీలకనేతగా ఉన్న సుభాష్‌చందర్జీ కమిటీలో ఉన్నప్పటికీ.. ఇలాంటి హామీలు ప్రకటించడమే ఆశ్చర్యం. ఈ కమిటీకి మాజీ ఎంపీ వివేక్ చెర్మన్‌గా ఉన్నారు. ఆ ప్రకారంగా.. అసలు సుభాష్‌జీ-చంద్రవదన్‌లను, మేనిఫెస్టో కమిటీలో భాగస్వాములను చేయకపోయినా ఉండాలి. లేక వారి సూచనలు,  బుట్టదాఖలు చేసయినా ఉండాలని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.   పోనీ.. జీహెచ్‌ఎంసీ-స్థానిక సంస్థలు- రెవిన్యూ చట్టాలపై అవగాహన ఉన్న జి.ఆర్.కరుణాకర్, వెంకటరమణి వంటి సీనియర్లనయినా సంప్రదించినట్లు కనిపించలేదు. అసలు మేనిఫెస్టో విడుదల సందర్భంగా.. ఆ కమిటీలో ఉన్న సుభాష్‌చందర్జీ, చంద్రవదన్ కనిపించకపోవడమే ఆశ్చర్యం. అంటే మేనిఫెస్టో కమిటీ సభ్యులకే సమాచారం లేకుండా.. మేనిఫెస్టో విడుదల చేశారన్నమాట! బీజేపీ భలే భలే!! -మార్తి సుబ్రహ్మణ్యం

మొన్న అసద్.. నిన్న అక్భర్‌కు సెగ! ఎంఐఎం చేతులెత్తెసినట్టేనా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జిమ్మిక్కు జరగనుందా? పతంగి పార్టీకి ఊహించని ఫలితాలు రాబోతున్నాయా?  ఓల్డ్ సిటీ బాద్ షాలకు షాక్ తగలనుందా?. అంటే అవుననే సమాధానమే వస్తోంది.  గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. పాతబస్తిలో తమకు తిరుగులేదని భావించే ఎంఐఎం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది.  ఓల్ట్ సిటీలో ఇప్పటివరకు పతంగి పార్టీదే హవా. గత నాలుగు పర్యాయాలుగా వారికి 45 నుంచి 50 డివిజన్లు వస్తున్నాయి. పాతబస్తీలో పతంగి పార్టీకి పోటీ ఇచ్చే స్థాయిలోనూ ఏ పార్టీ నిలవడం లేదు. అయితే  ప్రస్తుతం పాతబస్తీలో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. బాద్ షా అనుకుంటున్నవారికే దిమ్మతిరిగే షాకులు తగులుతున్నాయి.  గతంలో ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడాలంటేనే పాతబస్తీలో భయపడేవారు. ఒవైసీల గురించి అయితే అసలు చెప్పనవరసం లేదు. ఒవైసీ బ్రదర్స్ ముందు నిలబడటానికి కూడా ఎవరూ సాహసించేవారు  కాదు. కాని ఇప్పుడు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా పాతబస్తిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ పార్టీ లీడర్లను ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయి. అంతేకాదు ఏకంగా ఒవైసీ బ్రదర్స్ నే  నిలదీస్తున్నారు ఓల్ట్ సిటీ ఓటర్లు. సమస్యలు పరిష్కరించాలని ధైర్యంగా అడుగుతున్నారు. వరదల సమయంలో ఎంఐఎంకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ ఎంఐఎం నేతలు జనాగ్రహాన్ని చవి చూస్తున్నారు.  ముషిరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సభలో మాట్లాడేందుకు అక్భర్ మైక్ దగ్గరకు రాగానే ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు వరద సాయం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కామ్ గా ఉండాలని మూడు, నాలుగు సార్లు అక్బరుద్దీన్ కోరినా  ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అసహనానికి గురైన అక్భరుద్దీన్  ప్రసంగించడం ఆపేశారు. తనకు చాలా పని ఉందని, వెళ్లిపోతున్నానని.. డిసెంబర్ 1న జరిగే పోలింగ్ లో ఎంఐఎం అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని చెప్పి వేదిక దిగి నిమిషాల్లో  అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్భర్ సభ నుంచి మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో స్థానిక ఎంఐఎం కార్యకర్తలు షాకయ్యారు.  జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఓవైసీని స్థానిక ముస్లిం మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై వారు అసద్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు వరద సాయం పదివేలు అందలేదని... ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ఆ మహిళలు ప్రశ్నించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. గతంలో కూడా ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే, అక్కడ  ప్రచారం చేయకుండానే అసదుద్దీన్‌ ఓవైసీ వెనుదిరిగారు.  పాతబస్తిలోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రోడ్డు వేయడం లేదని, తాగునీరు సరిగా రావడం లేదని ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడుతున్నారు. పాతబస్తీలో వచ్చిన మార్పులతో ప్రస్తుతం ఎంఐఎం నేతలకు వణుకు పుడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇతర పార్టీల వారు ప్రచారానికి వస్తే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. అక్బర్ బాగ్ డివిజన్ సపోటాబాగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఓల్డ్ సిటీలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఓల్డ్ సిటీలో జరుగుతున్న పరిమాణాలతో పతంగి పార్టీకి కష్టాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది. పరిస్థితిని గమనించడం వల్లే అసద్, అక్భర్ లు పాదయాత్రలు చేస్తున్నారని చెబుతున్నారు.

‘కారు’కు ‘కమ్మ’ని కబురు!

గ్రేటర్‌లో కమ్మ ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే?   ‘అమరావతి’పై ‘కమలం’ కప్పగంతులే కారణమట   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం, మరోసారి టీఆర్‌ఎస్ ‘కారు’ వైపే  చూస్తోందా? నగరంలోని కమ్మ వర్గ పెద్దలు, వివిధ పార్టీల్లో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలు చెబుతున్న విశ్లేషణ ప్రకారం.. పలు నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గం, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కూడా కమ్మ వర్గానికి నాలుగు సీట్లు ఇచ్చినా.. ఆ కులం ఓటర్లు మాత్రం కారు ఎక్కేందుకే ఆసక్తి ప్రదర్శిస్తుండటం విశేషం.   కమ్మ వర్గం స్వాభావికంగా టీడీపీకి, సంప్రదాయ ఓటు బ్యాంకుగా దశాబ్దాల నుంచి కొనసాగుతోందన్నది బహిరంగమే. దాని పలితంగానే ఉమ్మడి రాష్ట్రంలో, నగరంలోని శేరిలింగంపల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగలిగింది. అక్కడ సెటిలర్ల సంఖ్య ఎక్కువయినప్పటికీ, వారిలో కమ్మ వారి హవానే ఎక్కువ కావడం దానికి మరో ప్రధాన కారణం.   రాష్ట్ర  విభజన తర్వాత కూడా... నగరంలో టీడీపీ చెప్పుకోదగ్గ ఫలితాలే సాధించింది. అయితే, చంద్రబాబునాయుడు తెలంగాణపై దృష్టిసారించకపోవడంతో,  ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. పోనీ ఆ తర్వాత కూడా బాబు మేల్కొనకపోవడంతో, ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడారు. ఇప్పుడు మొత్తం 150 డివిజన్లలో 90 డివిజన్లకే పోటీ చేస్తుందంటే, ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ, ఎన్టీఆర్ హయాం నుంచి పనిచేస్తున్న నేతలు మాత్రమే టీడీపీలో కొనసాగుతుండగా, వారిలో కమ్మవారే ఎక్కువ. ఇతర పార్టీల్లో అవకాశం లేక, ఉన్నా అక్కడి వాతావరణంలో సర్దుకోలేక, విధిలేక టీడీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి. నిజానికి ఈ ఎన్నికల్లో అంతమంది అభ్యర్ధులను వెతికి నామినేషన్లు వేయించడం.. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా నాయకత్వ ప్రతిభ, పొలిట్‌బ్యూరో సభ్యుడయిన అరవిందకుమార్‌గౌడ్ పర్యవేక్షణ ఫలితమని చెప్పకతప్పదు.   అయితే, టీడీపీకి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న కమ్మవారికి.. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లు మాత్రమే ఇచ్చారంటే, టీడీపీని కమ్మ వారు ఎంత వేగంగా వీడిపోతున్నారో స్పష్టమవుతోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో విజయాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నప్పటికీ, కమ్మ వర్గ నేతలు.. టీడీపీ వైపు కాకుండా టీఆర్‌ఎస్-బీజేపీ వైపు చూడటం ఆశ్చర్యం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగెస్ 2, టీడీపీ 6 సీట్లు కమ్మ వర్గానికి ఇవ్వడం విశేషం. అంటే కమ్మ వర్గం మాసికంగా టీడీపీని అభిమానిస్తున్నప్పటికీ, రాజకీయంగా ఇతర పార్టీల వైపు చూస్తుందని స్పష్టమవుతోంది. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానికంగా తమ నియోజకవర్గాల్లో కమ్మ వారితో తొలి నుంచీ కలసి ఉండటం ప్రస్తావనార్హం.   సహజంగా కమ్మవర్గం మిగిలిన కులాలకంటే ఒక తరం ముందు ఆలోచిస్తుంది. ఎవరితోనూ గొడవ పడకుండా, తమ వ్యాపారాలేవో తాము చేసుకునే తత్వం దాని సొంతం. ఏ ప్రభుత్వంలో ఉన్నా కావలసినవి ఇచ్చి, పనులు చేయించుకోవడం వారి ప్రత్యేకత. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చుట్టూ చేరిన కమ్మ వ్యాపారులు, వైఎస్ సీఎం అయిన వెంటనే ఆయన చుట్టూ చేరిపోయారు. ఆ తర్వాత వచ్చిన సీఎంల చుట్టూ కూడా వారే కనిపించేవారు. జగన్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారిలో కూడా కమ్మ వ్యాపారులే ఎక్కువ. అంటే వ్యాపారం వారి రక్తంలో ఒక భాగమన్నది తెలిసిందే.   ఎక్కడ.. ఏది లాభం అనుకుంటే,  అటే అడుగులేసే తెలివైన కులంగా పేరుంది. లాభనష్టాల బేరీజు.. ఇతరులను వాడుకోవడంలో,  కమ్మ వర్గ నైపుణ్యం ముందు ఎవరూ సరిరారన్నది బహిరంగ రహస్యం. ప్రతిదీ వ్యాపారకోణంలో ఆలోచించే కమ్మ వర్గానికి, ఇతర సామాజికవర్గం నుంచి సహకారం-మద్దతు లభించడం కష్టం. ఇతరులతో కలిసి నడిచే అలవాటు తొలి నుంచీ ఆ వర్గానికి లేదు. ఈ వ్యాపారతత్వం కృష్ణా జిల్లాలో.. బ్రాహ్మణ-వైశ్యులతో సహా, కుల-మతాలకు అతీతంగా అలవాటుకావటం మరో విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన ప్రతి కులం-మతంలో, వ్యాపారధోరణి స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది వేరే విషయం.   సహజంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, డబ్బు సంపాదన మెళకువల్లో నిష్ణాతులైన కమ్మ వర్గం.. ఆ ధ్యాసలో పడి, ఇతర సామాజికవర్గాల సహకారం తమకు అవసరం లేదని భావిస్తుంటుంది. కమ్మ సామాజికవర్గం దేనినయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది కానీ,  డబ్బును పోగొట్టుకునేందుకు మాత్రం  సిద్ధంగా ఉండదన్న సామెత వినిపిస్తుంటుంది. అందుకే.. రెడ్డి, వెలమ వర్గాలతో పోలిస్తే, కమ్మ వర్గానికి ఉండే ఇతర వర్గాల దన్ను బహు తక్కువ. ఇన్ని లక్షణాలున్న కమ్మవర్గం.. ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా, కష్టపడి వ్యాపారాల్లోనే సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తుందన్నది కూడా అంతే నిజం.   ఇప్పుడు హైదరాబాద్‌లో దశాబ్దాల నుంచి స్థిరపడిన కమ్మ వర్గం, ఇదే ధోరణిలో టీఆర్‌ఎస్‌కు మద్దతుదారుగా మారటం గమనార్హం. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ ఈ వర్గం టీఆర్‌ఎస్‌కే జై కొట్టింది. చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్లినందున, తమ రక్షణ కోసమే వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగించింది. చంద్రబాబు హైదరాబాద్‌లో పార్టీని వదిలేయడంతో, కమ్మ వర్గం తమకు టీఆర్‌ఎస్ ఒక్కటే  సురక్షితమైన పార్టీగా ఎంచుకున్నారు. దాని ఫలితమే సెటిలర్లు ఉండే నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపు. ఇప్పుడు ఆ వర్గం నేతలు బీజేపీలో చేరినా, కమ్మ ఓటర్లు మాత్రం కారు ఎక్కేందుకే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.   ఇక ఇతర పార్టీల్లో స్థానిక అంశాల కారణంగా చోటు లభించక కొందరు.. ఆయా పార్టీల్లో ఇమడలేని మరికొందరు కమ్మ వర్గ నేతలు మాత్రమే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కమ్మ వర్గ ప్రాధాన్యతను గుర్తించిన టీఆర్‌ఎస్, ఆ వర్గ నేతలకు సీట్లిచ్చింది. కూకట్‌పల్లి అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కొమ్మినేని వికాస్ ఇంటికి స్వయంగా కేటీఆర్ వెళ్లి, కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి, వికాస్ సహకారం కోరారు. ఆ తర్వాత శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌తోపాటు, ఖమ్మం జిల్లాలో కూడా కమ్మ వర్గ నేతలకే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీట్లిచ్చింది. పువ్వాడకు క్యాబినెట్‌లో చోటు కూడా ఇచ్చింది.  తాజా గ్రేటర్ ఎన్నికల్లో కూడా కమ్మ వర్గం చూపు, టీఆర్‌ఎస్ వైపే కనిపిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో.. కమ్మ వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయి, నగరంలోని కమ్మ ప్రముఖులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారట.   ఇదిలాఉండగా... నగరంలో కమ్మ వర్గంతోపాటు, సెటిలర్ల అభిప్రాయాలపై తాము వివిధ నియోజకవర్గాల్లోని, ఆయా వర్గాల వారితో ముచ్చటించడం జరిగింది.  ఆ ప్రకారంగా... నిజానికి సెటిలర్లలో ఎక్కువ శాతం ఈసారి బీజేపీకి ఓటు వేయాలన్న ధోరణిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఏపీలో,  అమరావతి అంశానికి బీజేపీ మద్దతు ఇవ్వని కారణంగా.. ఆ పార్టీకి బదులు, గతంలో మాదిరిగానే ఈసారి కూడా టీఆర్‌ఎస్ మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నట్లు, వారి మాటల్లో స్పష్పమయింది. ఈ విషయంలో వారి వాదన-వైఖరి విచిత్రంగా అనిపించింది. అమరావతికి అడ్డంకులు సృష్టిస్తున్న ఏపీ సీఎం జగన్... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతగానే ఉన్నారు. అయితే, జగన్‌తో దోస్తానా చేస్తున్న కేసీఆర్‌పై కరుణ.. కేసీఆర్ మద్దతునిస్తున్న జగన్‌పై కోపం ప్రదర్శించడమే విచిత్రం. -మార్తి సుబ్రహ్మణ్యం

సంజయ్ నై.. కిషన్ సై! బీజేపీలో ఏం జరుగుతోంది? 

తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందా? జనసేనతో పొత్తు కొందరికి ఇష్టం లేదా? పవన్ తో చర్చలకు ఆయన ఎందుకు వెళ్లలేదు? గ్రేటర్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుండగా బీజేపీలో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల కార్యాచరణ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పొత్తు విషయంలో పార్టీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయడంపై బండి సంజయ్ ఓ అభిప్రాయంతో ఉండగా కిషన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించారనే చర్చ బీజేపీలో జరుగుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య సఖ్యత లేదని. నగర సీనియర్ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. జనసేనతో పొత్తు విషయంలో బండి సంజయ్ కు ఇష్టం లేకున్నా కిషన్ రెడ్డి చొరవ తీసుకుని పవన్ కల్యాణ్ తో మాట్లాడరనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే శుక్రవారం రోజంతా హైదరాబాద్ లోనే  ఉన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ మాజీ నేత సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. మరికొందరు నేతలతోనూ సంజయ్ మంత్రాంగం జరిపారని చెబుతున్నారు. హైదరాబాద్ లోనే ఉన్నా పవన్ కల్యాణ్ తో చర్చలకు సంజయ్ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తు ఇష్టం లేదు కాబట్టే.. పవన్ దగ్గరకు బండి వెళ్లలేదని చెబుతున్నారు. అంధ్రా పార్టీగా ముద్రపడిన జనసేనతో పొత్తు పెట్టుకుంటే గ్రేటర్ లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అందుకే బండి సంజయ్ జనసేన విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన పొత్తుపై మొదటి నుంచి తీవ్ర గందరగోళం నడిచింది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ..అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు  చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ లో పోటీ చేయడానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపిన జనసేన.. పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది. సొంతంగానే పోటీ చేస్తామని బయటికి చెబుతూనే... బీజేపీతో పొత్తుకు జనసేన నేతలు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని డివిజన్లు ఇవ్వాల్సి వస్తుందని. దాంతో పార్టీలో అసంతృప్తి వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భావించారట. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని ఆయన ప్రకటించారు. అంతేకాదు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కూడా స్పష్టం చేశారు. సంజయ్ ప్రకటన తర్వాత కూడా గురువారం జనసేన నుంచి మరో ప్రకటన వచ్చింది. గ్రేటర్ ఎన్నికలపై  పవన్ తో మాట్లాడేందుకు బండి సంజయ్ వస్తున్నారని ప్రకటించింది. జనసేన లేఖపై మరోసారి స్పందించిన బండి సంజయ్.. జనసేనతో పొత్తు సమస్యే లేదని తేల్చి చెప్పారు.  బండి సంజయ్ పొత్తు లేదని రెండోసారి స్పష్టం చేయడంతో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని భావించారు. అయితే శుక్రవారం మళ్లీ పొలిటికల్ సీన్ మారిపోయింది. జనసేన పొత్తు మేటర్ లోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంటరయ్యారు. పార్టీ మరో ముఖ్య నేత లక్ష్మణ్ తో కలిసి వెళ్లి ఆయన పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేలా పవన్ ను ఒప్పించారు. కిషన్ రెడ్డి తో సమావేశం తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు జనసేన చీఫ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిల తీరుతో బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొన్నదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికలోనూ సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య గొడవలు జరిగాయంటున్నారు. బంజారాహిల్స్, కూకట్ పల్లి ప్రాంత నేతలు కొందరు కిషన్ రెడ్డిపై బహరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జీహెచ్ఎంసీలోనూ పాగా వేస్తామనే ధీమా కమలనాధుల్లో పెరిగిందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. నగర కాంగ్రెస్ లోని కొందరు ముఖ్య నేతలు, టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా కమలం గూటికి చేరారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి  పోటీ  చేసేందుకు నేతలు పోటీ పడ్డారు. ఒక్కో డివిజన్ నుంచి 10 నుంచి 10 మంది టికెట్ కోసం పోటీ పడ్డారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ లో దాఖలైన నామినేషన్లలోనూ అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ పేరుతో వేసినవే ఎక్కువగా ఉన్నాయి. ఇంత వరకు  బాగానే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల తీరే గందరగోళంగా మారిందని తెలుస్తోంది. ముఖ్య నేతల తీరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగవచ్చనే ఆందోళన కమలం కేడర్ లో కనిపిస్తోంది.

ఆయన నోట మళ్లీ ఢిల్లీ మాట! లైట్ తీసుకుంటున్న పార్టీలు

​దేశంలో గుణాత్మక మార్పు రావాలి.. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే.. ఆ పార్టీల వల్లే దేశం ఆగమైంది.. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తా.. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ గత రెండేండ్లుగా చెబుతున్న మాటలు. ఎన్నికల సమయాల్లోనూ, తనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడే, బీజేపీ, కాంగ్రెస్ లపై ఈ తరహా కామెంట్లు చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. బీజేపీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోందని తెలిపారు. చాలా మంది ప్రాంతీయ నేతలతో మాట్లాడానని చెప్పారు కేసీఆర్.    జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చేసిన తాజా ప్రకటనపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండేండ్ల నుంచి చెబుతున్న మాటలే మళ్లీ చెప్పారనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జాతీయ పార్టీలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దేశానికి అరిష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఢిల్లీ వెళ్తునున్నానని కూడా చెప్పారు గులాబీ బాస్. భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడారు. చెన్నె వెళ్లి స్టాలిన్ తో సమావేశమయ్యారు. కోల్ కతా వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీతోనూ మంత్రాగం చేశారు. లక్నో వెళ్లి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిశారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారనే అభిప్రాయం వచ్చింది.    తర్వాత ఏమైందో ఏమోకాని తుస్సుమనిపించారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ మాట కూడా మర్చిపోయారు. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఢిల్లీ వెళ్లింది లేదు.. ఫెడరల్ ఫ్రంట్ వచ్చింది లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో ఢిల్లీకి వెళ్లినా చేసేది ఏమి లేదని భావించిన కేసీఆర్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోతే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి హడావుడి చేయాలని చూశారని, మోడీ ప్రభంజనం వీచడంతో కేసీఆర్ ఆశలు ఆవిరయ్యాయనే ప్రచారం జరిగింది. కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ఏర్పాట్లకు సంబందించి మరో ప్రచారం కూడా జరిగింది. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ అధినేత,అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ , కోల్ కతాల్లో మమతా బెనర్జీలు నిరసనకు దిగితే అక్కడికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు. చంద్రబాబు దూకుడుతో లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జరిగింది. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో వస్తున్న క్రేజీని జీర్ణించుకోలేకే.. ఆయనకు పోటీగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెరపైకి తెచ్చారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.    గత ఆగస్టులో మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తెచ్చారు కేసీఆర్. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ లోనే విపక్ష పార్టీలతో సమావేశం పెట్టబోతున్నానని, అన్ని ప్రాంతీయ పార్టీ నేతలను ఆహ్వానిస్తానని చెప్పారు. అప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీకి  వెళ్తారేమోనని జనాలు భావించారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే చర్చ కూడా జోరుగా జరిగింది. కాని అప్పుడు కూడా కేసీఆర్ మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ లో సమావేశం జరగలేదు.. ఏ పార్టీ నేత వచ్చి కేసీఆర్ ను కలవలేదు. టీఆర్ఎస్ అధినేత కూడా ఏ లీడర్ తోనూ మాట్లాడలేదు. కనీసం ఫోన్ లో కూడా కేసీఆర్ ఏ ప్రాంతీయ పార్టీ నేతతోనూ మాట్లాడినట్లు కనిపించ లేదు. జీఎస్టీ బకాయిలను కేంద్రం విడుదల చేయడం లేదంటూ లేఖలు రాసి సెప్టెంబర్ లో మరోసారి హడావుడి చేశారు కేసీఆర్. కేంద్రం తీరుకు నిరసనగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థికమంత్రులతో సమావేశం పెడతామని కూడా ప్రకటించారు. కాని అది కూడా జరగలేదు.    తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల సన్నద్దత సమావేశంలో జాతీయ రాజకీయాలపై మాట్లాడారు కేటీఆర్. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్‌ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని, బడేభాయ్‌ వెంట చోటే భాయ్‌ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యాయన్నారు. ఆ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని, అందుకు  హైదరాబాద్‌ నుంచే యుద్ధం ప్రకటిస్తామన్నారు. దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు  ప్రయత్నాలు చేస్తున్నామని  చెప్పారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు. డిసెంబరు రెండోవారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తామన్నారు కేసీఆర్.    కేసీఆర్ తాజా ప్రకటనకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ తమకు గట్టి పోటీ ఇస్తుండటంతో కారణమనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడంతో.. ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గెలిచేందుకు ఇలా ఎత్తులు వేస్తున్నారని, గ్రేటర్ ఎన్నికలు ముగియగానే జాతీయ రాజకీయాలపై మళ్లీ కేసీఆర్ మాట్లాడరని చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎప్పుడో ఆ పని చేసేవారంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తానంటున్న కేసీఆర్.. ఆ బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చిన సమయంలో ఆ పని ఎందుకు చేయలేదనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మెజార్టీ బిల్లులకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కేంద్రం ఏం చేయడం లేదని విమర్సిండంలో అర్ధం లేదంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేస్తున్న ప్రటనకను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

మరణాలకు మతమేమిటి.. వీర్రాజా?

విశాఖ పీఠం, టీటీడీ కేసుపై పెదవి విప్పరేం?   చావులో విషాదం చూస్తాం. గుండెలోతుల్లో దాగున్న బడబాగ్ని చూస్తాం. ఆ కుటుంబాలు పడే వేదన- ఆవేదన-ఆర్తి చూస్తాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. ఎంత కఠిన పాషాణ  హృదయులకయినా, మానవత్వం అనేది ఉంటుంది. అందుకే మనసున్న మనుషులెవరూ చావును విషాదంగానే భావిస్తారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం దీనికి భిన్నం. మరణంలోనూ మతాన్ని దర్శించే మహా రాజకీయ దార్శనికుడాయన. అందుకు నంద్యాలలో జరిగిన ఓ ముస్లిం కుటుంబ సామూహిక ఆత్మహత్య నిదర్శనం.   ప్రాణాలు ఎవరికి చేదు? ఎవరు మాత్రం కోరి మృత్యు ఒడిలోకి వెళతారు? ఆత్మహత్య చేసుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. దానికి ఎవరూ సిద్ధపడరు. చిన్న రోగం వస్తేనే హైరానా పడతారు. కరోనా వస్తే, తమ ప్రాణాలు కాపాడుకునేందుకు, పరాయి రాష్ర్టాలకు పరుగులు తీసిన మంత్రులు, ఎమ్మెల్యేలను చూస్తూనే ఉన్నాం. అదీ ప్రాణభయమంటే. కానీ ప్రాణాలు కూడా పోగొట్టుకునేందుకు ఓ చిన్న కుటుంబం సిద్ధపడిందంటే.. వారి గుండెకయిన గాయం, అతి పెద్దదయి ఉండాలి. తిన్న ఎదురుదెబ్బలతో,  మనిషి ఆత్మస్థైర్యాన్ని చంపేదంత పెద్దదయినా ఉండాలి. వ్యక్తులు, లేదా వ్యవస్థ చేతులో ఎదురయిన అవమానభారం తాలూకు,  విషాదజ్ఞాపకాలయినా అందుకు కారణమయి ఉండాలి. దీనికి కులాలు-మతాలతో సంబంధం లేదు. మరణానికి  కులం-మత ంతో పనిలేదు. మృత్యువు అందరికీ సమానమే. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నంద్యాలలో ముస్లిం కుటుంబ సామూహిక ఆత్మహత్యానంతర పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ మరువు-ప్రతిష్ఠను పెంచాయా? తుంచాయా అన్నది ఓసారి చూద్దాం.   నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబం.. పోలీసుల వేధింపులకు నిరసనగా రైలుకింద పడి సామోహిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆ కుటుంబం ఓ సెల్ఫీ తీసింది. తమ ఆత్మహత్యలకు కారణం ఫలానా పోలీసులే కారణమని చెప్పి, ఆత్మహత్య చేసుకుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫలితంగా సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై సర్కారు కేసు పెట్టి అరెస్టు చే సి, జైలుకు పంపింది. అయితే, సరైన సెక్షన్లు నమోదుచేయకపోవడంతో,  స్థానిక కోర్టు పోలీసులకు బెయిల్ ఇచ్చింది. దానిపై ఎస్పీ స్పందించి, పోలీసులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ, పైకోర్టుకు వెళతామని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్ కూడా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని, పోలీసుల బెయిల్ రద్దు చేయించాలని ఆదేశించారు. కేసులోని తీవ్రత-విషాదం దృష్ట్యా జగన్ సర్కారు, డీజీపీ వాయువేగంతో స్పందించడాన్ని సమాజం హర్షించింది. ఇంతవరకూ అందరికీ తెలిసిన కథే ఇది.   తాజాగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఈ వ్యవహారాన్ని మతంతో ముడిపెట్టడమే అమానవీయం. ఆత్మహత్య చేసుకున్న కుటుంబమేమీ, ఆ వ్యవహారాన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు.  తమ ప్రాణాలు పణంగా పెట్టి, సెల్ఫీ తర్వాత నిజంగానే మృతువును ఆహ్వానించింది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని బాధితులు చెప్పిన దానినే సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ఆ మేరకే పోలీసులను అరెస్టు చేసింది. దాన్ని వీర్రాజు తప్పుపట్టడమే ఆశ్చర్యం. ‘‘ ముస్లింలు కోరగనే డ్యూటీలో ఉన్న పోలీసులను జగన్ అరెస్టు చేయిస్తున్నారు. పోలీసులకు టీడీపీ బెయిల్ ఇప్పించి,  చంద్రబాబు ముస్లింలను సమీకరించి ఉద్యమాలు చేయిస్తున్నారు. హిందువులెవరూ ఓటర్లు కాదు. ఆ రెండు పార్టీలకు ముస్లిం ఓట్లు చాలా? మనమెవ్వరం మనుషులం కాదా? రాష్ట్రంలో హిందువులు, ఇతర కులాలు వద్దు. ఎంత దారుణం’’ ఇదీ వీర్రాజు గారి ప్రసంగంలో దొర్లిన  ఆణిముత్యాలు. పైగా అంతర్వేది ఘటనపై మేం స్పందిస్తే,  మాది మతత్వ పార్టీ అన్న వాళ్లు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటని కూడా  ప్రశ్నించారు.   అంటే సోము కవిహృదయమమేమిటంటే.. టీడీపీనే నిందితులయిన పోలీసులకు బెయిలిప్పించింది. అంటే ఆ కేసు విచారించిన కోర్టు ఎలాంటి విచారణ చేపట్టకుండా, టీడీపీ అడిగిన వెంటనే బెయిలిచ్చేసిందని అనుకోవాలా? ఇక ముస్లింలు కోరగనే జగన్ పోలీసులను అరెస్టు చేశారట. అంటే ఒక సీఎంకు అంతకుమించిన పనులేవీ లేవన్న మాట! సరే.. అంతర్వేది, టీటీడీ ఘటనలపై తామేదే పోరాటాలు చేశారని సోమన్న  చెప్పుకోవడమే వింత. నిజానికి, అంతర్వేది ఘటనలో తొలుత  స్పందించింది స్థానికులు, అగ్నికుల క్షత్రియులు మాత్రమే. ఆ తర్వాత టీడీపీ, హిందూ మహాసభ, కాంగ్రెస్ నేతలు వెళ్లారు. అప్పటికీ బీజేపీ నేతలు భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు.  సినిమాలో ఫైటింగ్ సీనంతా అయ్యాక, చివరాఖరలో పోలీసులు వచ్చినట్లు,  బీజేపీ నేతలు చివరలో కనిపించారు. అంత ర్వేది కేసు సీబీఐకి అప్పచెప్పిన తర్వాత, దాని పురోగతి ఏమిటన్నది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రశ్నించిన పాపాన పోలేదు.   ఇక టీటీడీ వ్యవహారాలపైనా,  బీజేపీ స్వరం ఇప్పటికీ బలహీనమే. ఇప్పుడు పోయిందంటున్న శ్రీవారి  పింక్ డైమండ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఆర్నెల్లలో దాని గురించి వీర్రాజు ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. విజయసాయిరెడ్డి-రమణ దీక్షితులుపై, టీటీడీ పరువునష్టం కేసు ఎందుకు ఉపసంహరించుకుందని గర్జించిన  దాఖలాలు లేవు. పింక్ డైమండును తేల్చాలని పట్టుపట్టిన సందర్భాలు లేవు.  ఇక విశాఖ పీఠాథిపతి అతిపై హిందూసమాజమే తిరగబడుతోంది. ఆయన మఠం అతిచేష్ఠలపై హిందువులే నవ్వుకుంటున్నారు. దానిపై మీడియాలో చర్చ జరుగుతుంటే, హిందూ సామ్రాజ్యాధిపతిగా భావిస్తున్న వీర్రాజు.. ఆ ఆధ్యాత్మిక తప్పిదాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు? అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుంది లేదన్నట్లు... ఎంత హిందూకార్డు వాడాలని ప్రయత్నించినా,‘ విషయం’ లేకపోతే..   ఏ కార్డయినా చిరునామా లేని పోస్టు కార్డులాంటిదేనంటున్నారు. ఇంతకూ... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశ వ్ అడిగినట్లు... ఈ వ్యాఖ్యలు సోము వీర్రాజు వ్యక్తిగతమా? పార్టీ పరమైనదా అన్నదే చెప్పాలి.   అన్నట్లు... మతం- మత రాజకీయాల గురించి మాట్లాడుతున్న వీరన్న వ్యాఖ్యలపై,  ఇప్పుడు ‘కులవాదులు’  కొత్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  నంద్యాలలో అరెస్టయిన సీఐ తమ సామాజికవర్గానికి చెందిన వారే కాబట్టి, ఆయనను రక్షించేందుకు మతం ముసుగులో..  వీర్రాజు ‘కుల రాజకీయాలు’ చేస్తున్నారన్నది కులవాదుల అనుమానం. నిజం నారాయణుడికెరుక? -మార్తి సుబ్రహ్మణ్యం

భూపేంద్ర యాదవ్, గరికపాటి వచ్చేస్తున్నారు! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో..

దుబ్బాక ఉప ఎన్నిక రాజేసిన కాక చల్లారకముందే తెలంగాణలో మరో ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ముందస్తుగా జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అన్ని పార్టీల్లోనూ సెగలు రేపుతోంది. దుబ్బాక విజయంతో జోష్ మీదున్న బీజేపీ గ్రేటర్ పై దూకుడు పెంచింది. బల్దియాపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ సమరానికి సెమీ ఫైనల్ గా భావిస్తోంది బీజేపీ. అందుకే అన్ని శక్తులను గ్రేటర్ లో మోహరిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జ్ గా  పార్టీకి జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న నేతను నియమించింది బీజేపీ. హైదరాబాదు లో అణువణువు తెలిసిన ఎంపీ గరికపాటి మోహన్ రావును రంగంలోకి దించింది.  రాష్ట్ర స్ఠాయిలోనూ సీనియర్లతో  ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికను బీజేపీ హైకమాండ్ నేరుగా పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు.దీన్ని బట్టే గ్రేటర్ ఎన్నికలపై కమలదళం ఎంత సీరియస్ గా ఉందో తెలిసిపోతోంది.     పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భూపేంద్రయాదవ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జీగా నియమించింది బీజేపీ. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలను అశ్చర్యపరుస్తోంది. భూపేంద్రయాదవ్ ను బీజేపీలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకుంటారు. బీజేపీలో ప్రసుతం ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా తర్వాత స్థానంలో ఉన్నారని చెబుతారు. బీజేపీ ఎన్నికల వ్యూహాలు రచించండలో దిట్ట భూపేంద్ర యాదవ్. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జ్ గా భూపేంద్రనే వ్యవహరించారు. బీహార్ లో తేజస్వి యాదవ్ సీఎం కావడం ఖాయమని మెజార్డీ ఎగ్డిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా బీజేపీ కూటమే గెలిచిందంటే అందుకు భూపేంద్ర యాదవ్ వ్యూహాలే కారణమంటున్నారు. ఆయన ఎత్తుల వల్లే జేడీయూ ఆశించిన ఫలితాలు సాధించకపోయినా.. 65 శాతం సక్సెస్ రేటుతో బీజేపీ గెలవడం వల్లే బీహార్ లో ఎన్డీఏ కూటమికి మళ్లీ అధికారం దక్కిందని చెబుతున్నారు.     2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీ హవా చూపడంలో  భూపేంద్ర యాదవే కీలకంగా వ్యవహరించారని కమలం నేతలు చెబుతున్నారు. అంతేకాదు కీలక రాష్ట్ర్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలన్ని బీజేపీ అధినాయకత్వం భూపేంద్ర యాదవ్ కే అప్పగిస్తారని తెలుస్తోంది. బీజేపీలో ఏ సమస్యలు వచ్చినా పరిష్కార బాధ్యతలు భూపేంద్రకే ఇస్తారని కూడా చెబుతున్నారు. తనకు అప్పగించిన టాస్క్ లో ఎక్కువ సార్లు భూపేంద్ర సక్సెస్ అయ్యారని టాక్ ఉంది. జాతీయ స్థాయిలో తమ పార్టీ కీలక వ్యూహకర్తగా ఉన్న వ్యక్తిని ఒక నగరం స్థానిక ఎన్నికకు ఇంచార్జ్ గా నియమించిందంటేనే గ్రేటర్ హైదరాబాద్ పై బీజేపీ ఎంత ఫోకస్ చేసిందో ఊహించవచ్చు.   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఎంపీ గరికపాటి మెహన్ రావు కీలకంగా మారారు. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ గరికపాటి మోహన్ రావుకు సిటీలో చాలా పరిచయాలున్నాయి. రాజకీయంగానూ ఆయనకు బలమైన అనుచరవర్గం ఉంది. ఎలాగైనా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు బీజేపీ. అందుకే గ్రేటర్ లో గట్టి పట్టున్న టీడీపీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో గరికపాటి మోహన్ రావు  రాయబారం నడుపుతున్నారని తెలుస్తోంది. బలమైన లీడర్లు లేకున్నా గ్రేటర్ లో టీడీపీకి భారీగా ఓటు బ్యాంక్ ఉంది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పలు సర్వేలు నిర్వహించిన సర్వేల్లోనూ టీడీపీకి 15 శాతం ఓటు బ్యాంక్ ఉందని తేలింది. అందుకే టీడీపీ పొత్తు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు అంగీకరిస్తే గ్రేటర్ పోల్ సీన్ పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే జనసేనతో పొత్తున్న బీజేపీకి టీడీపీ తోడైతే గ్రేటర్ వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఈజీగానే గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని రాజకీయ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.    గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నా.. ఆయనపై పార్టీ హైకమాండ్ కు నమ్మకంగా లేదంటున్నారు. అందుకే కిషన్ రెడ్డిని కాదని భూపేంద్రయాదవ్ ను ఇంచార్జీగా నియమించారని, గరికపాటికి కీలక బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కాబట్టి.. ప్రజల్లో అనుమానాలు రాకుండా ఉండేందుకే ఆయనను ఎన్నికల కమిటి కన్వీనర్ గా నియమించారని బీజేపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపులోనూ కిషన్ రెడ్డికి ఏమాత్రం పాత్ర లేదంటున్నారు. కిషన్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే తెలంగాణలో బీజేపీ ఎదగలేదనే ఆరోపణలు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. అందుకే కిషన్ రెడ్డిని నామ్ కే వాస్తాగా కన్వీనర్ గా పెట్టి.. భూపేంద్ర, గరికపాటికి కి గ్రేటర్ ఎన్నిక బాధ్యతలను హైకమాండ్  ఇచ్చిందని చెబుతున్నారు.    23 మందితో ఏర్పాటు చేసిన గ్రేటర్ ఎన్నికల కమిటీలో పార్టీ సీనియర్లతో పాటు మంచి వ్యూహకర్తలుగా పేరున్న, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను  నియమించింది బీజేపీ. ఎంపీ గరికపాటి మోహన్ రావుతో మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు గ్రేటర్ బీజేపీ కమిటిలో ఉన్నారు. అంతేకాదు అన్ని సామాజిక వర్గాల నేతలకు అందులో చోటు కల్పించారు. ఈ కమిటి ద్వారా అన్ని రకాలుగా గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే  గ్రేటర్ లోని ఇతర పార్టీల నేతలకుు వల  వేస్తోంది. ఇప్పటికే బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఎల్బీ నగర్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల నర్సింహరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారని చెబుతున్నారు. మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ ఇటీవలే బీజేపీలో చేరగా.. మరికొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కారు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా తమకు సపోర్ట్ చేయబోతున్నారని కమలం నేతలు చెబుతున్నారు.    దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా మారిపోయింది బీజేపీ, ఇప్పుడు భూపేంద్రయాదవ్ , గరికపాటి మోహన్ రావు వంటి ఉద్దండులను ఇంచార్జులుగా నియమించి గ్రేటర్ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి సవాల్ విసురుతోంది.  దీంతో ఎన్నికల వ్యూహాల్లో దిట్టమైన ఆ ఇద్దరు బాహుబలులలను టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుదన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ బాహుబలి వ్యూహాల ముందు కారు పార్టీ చిత్తవుతుందా లేద తట్టుకుని  నిలబడుతుందా చూడాలి మరీ...

జన్మదిన ‘జగన్గురువు’కు జయహో!

దండోరాతో ధన్యమవుతున్న దేవదాయశాఖ   అంకుల్ రేపు నా హ్యాపీబర్త్‌డే.. చిన్నారి ‘బ్యాడ్మింటన్ ప్రభాకర్’ మురిసిపోతూ ఇచ్చిన హింట్ అది.  ఓహో.. అంటే రేపు తనకు బర్త్‌డే గ్రీటింగ్‌తో పాటు, గిఫ్టు కూడా తీసుకురావాలన్న మాట. జగన్నాధరెడ్డి అంకుల్ మట్టిబుర్రకు, చాలాసేపటి తర్వాత గానీ చిన్నారి విశ్వనాధ్ ‘కవిహృదయం’ అర్ధం కాలేదు. సహజంగా చిన్నపిల్లలు తమ హ్యాపీబర్త్‌డేకి రమ్మని, ఎవరినీ పిలవరు. ఫలానా రోజున తమ హ్యాపీబర్త్‌డే అని మాత్రమే చెబుతారు. అంటే ఆరోజున మనమే ఆ చిరంజీవులకు.. చాక్లెట్లో, బిస్కెట్లో గిఫ్టుగా ఇవ్వాలన్నమాట. ఇది సహజంగా అందరికీ తెలిసిన ఛైల్డ్ సైకాలజీ.   కానీ ఇప్పుడు ‘ఓల్డేజీ సైకాలజీ’ కూడా ఒకటి పుట్టుకొచ్చింది. ఫలానా రోజు పెద్దాయన పుట్టినరోజు కాబట్టి, మీరంతా వచ్చి ఆయనను ఆశీర్వదించి వెళ్లాలనే న్యూట్రెండన్నమాట! అది కూడా ఆ పెద్దాయన మఠం వేసుకున్న, పీఠం నుంచే అందిన వినతిలాంటి ఆదేశం. అంటే బలవంతపు బ్రాహ్మణార్ధమన్న మాట. మరి ‘చిన్నారి బ్యాడ్మింటన్ ప్రభాకర్’ హ్యాపీబర్త్‌డేకు, ‘పెద్దయిన’ పీఠాథిపతికి ఏం తేడా ఉంది చెప్పండి? షేమ్ టు షేమ్ కదా? కావాలంటే మన జగన్గురువు, జగద్రక్షకుడు, సృష్టి-స్థితి-లయకారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడయిన విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వరూపానంద మహాస్వామి జన్మదిన ముచ్చటను మీరే చూడండి.   విశాఖ పీఠాథిపతి స్వరూపానందుల వారికి.. దేవుడు కొలువుదీరిన దేవాలయాలు, అందులోని ప్రధానార్చకుల జీవితాలను ధన్యం చేయాలన్న ముచ్చట ఎప్పటినుంచో ఉంది. కానీ అందుకు సమయం-సందర్భం కలసిరావడం లేదు. అంతలోనే పీఠం మేనేజరు గారికి దివ్యమైన ఆలోచన వచ్చింది. స్వామి వారి జన్మదినం ఎలాగూ ఈనెల 18న వస్తోంది కాబట్టి.. రాష్ట్రంలోని పెద్ద ఆలయాల ప్రధాన షర్చకులను ఆయన సముఖానికి పిలిపించుకుని, వారితో ఆశీర్వాదం ఇప్పించుకుంటే.. పుణ్యం-పురుషార్ధం రెండూ కలసి వస్తాయని తలచారు. ఆ రకంగా అర్చకుల జీవితాలు, వారు సేవ చేసే దేవదేవతల జీవితాలు కూడా జాయింటుగా ధన్యమవుతాయని భావించారు.   వెంటనే తమ సంకల్పాన్ని,  దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రూపంలో వెల్లడించారు. దాన్ని అందుకున్న సదరు కమిషనరు.. ఆ లేఖ స్వయంగా పరమాత్ముడే, కంప్యూటరు అక్షరాలతో రాసినట్లు ఫీలయ్యారు. తన మీద స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈరూపంలో ప్రసరిస్తాయనుకోలేదని, ఆనందభాష్పాలతో ఆయన కళ్లు జలధార కార్చాయి. వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి.. లోకరక్షకుడయిన విశాఖ స్వామి వారి జన్మదినం... ఈనెల 18న ఉంది కాబట్టి, మీరంతా మీ ప్రధానార్చకులను విశాఖ చినముషిడివాడలో, మనిషిరూపంలో కొలువైన స్వరూపానందుల వారి వద్దకు పంపి, వారికి ఆశీర్వాచనాలు ఇవ్వాలని 23 దేవాలయాలకు హుకుం జారీ చేశారు. మంచిదే.  జగన్గురు, జగద్గురువైన శ్రీమాన్ స్వరూపానందుల వారి జన్మదినమంటే అది లోకకల్యాణం కోసమే క దా? మరి ఆయన ఈ గడ్డపై పుట్టిందే, లోకకల్యాణార్ధం కోసమాయె!   అది ఓకే. కానీ జీవితం బుద్బుదప్రాయమని ప్రవచించే.. సర్వసంగ పరిత్యాగులు- సన్యాసులకు జన్మదిన వేడుకలేమిటి? సన్యాసి అంటే స్వయంగా నారాయణ స్వరూపుడు. సన్యాసులు ఆశీర్వదించాలే తప్ప, ఆశీస్సులు తీసుకోవడమేమిటి? నారాయణ స్వరూపులు ఎదురయితే.. అంతటి  యమధర్మరాజు కూడా పక్కకు తొలగి, దారి ఇస్తారు కదా? అయినా విశాఖ స్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులే తరలివచ్చి,  ఆశీర్వదించడమేమిటి విచిత్రం కాకపోతే?! అసలు ప్రధానార్చకులు, ఆలయంలోని మూలవిరాట్టును వదలి, బయటకు రాకూడదు. మరి  విశాఖ వేలుపు వద్దకు వెళ్లడమంటే.. స్వయంగా ఆ దేవదేవతలే విశాఖ స్వామి వద్దకు వెళ్లినట్టు కాదా? ప్రధాన అర్చకుండంటే ఆయన కూడా, మూలవిరాట్టుతో సమానం కదా? మరి ఈ ఆధ్మాత్మిక అపచారం- అరాచకాన్ని స్వయంగా, దేవదాయ శాఖనే ప్రోత్సహించి, ధర్మానికి పాతర వేస్తే ఎలా? అయినా.. సర్వసంగ పరిత్యాగులయిన సన్యాసికి ఈ సన్నాసి పనులేమిటి?   ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి, మతిలేని మాటలు మాట్లాడితే.. కళ్లు దీపావళి బాంబుల్లా పేలిపోతాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల స్వామికి.. చంద్రుడికో నూలుపోగులా జన్మదిన వేడుకలు జరిపితే తప్పేమిటి? మామూలుగా అయితే పీఠాథిపతుల జన్మదినం రోజున ఆయన నక్షత్రం ప్రకారం.. పీఠపాలిత దేవాలయాల్లో మాత్రమే అర్చనలు చేయడం ఒక ఆచారం. కానీ అదంతా పబ్లిసిటీ పిచ్చలేని సాధారణ స్వాముల విషయంలో! కానీ, మన విశాఖ స్వరూపులను..  అలా ఇతర పీఠాథిపతులతో పోల్చి అవమానిస్తే ఎలా? కంచి-శృంగేరి అంటే పురాతన పీఠాలు. విశాఖ పీఠమంటే స్వయంప్రకటితం. ముద్దులకు కేరాఫ్ అడ్రెసు. మరి స్వయంకృషితో ఒక స్వయంప్రకటిత పీఠాథిపతి, ఈ స్ధాయికి చేరినందుకు గర్వించాలే తప్ప..  ఈ చచ్చు పుచ్చు ఇచ్చకాలతో,  ఆయన ఇమేజీని డ్యామేజీ చేయడం తప్పు కదూ?   సరే.. దేవదాయ శాఖ ఉన్నతాధికారంటే, ఏదో ఓవరాక్షన్‌తో.. సర్కారుకూ తెలియకుండానే, ‘సన్యాసికి జన్మదినం’ పేరిట.. ఇలాంటి అడ్డగోలు ఉత్తర్వులిచ్చి, శాస్త్రాలను  అవమానించారనుకుందాం. ఇప్పటికే దీనిపై సోషల్‌మీడియాలో ‘స్వరూపానందరెడ్డి’ అంటూ ఎకసెక్కాలు మొదలయ్యాయి. అది వేరే విషయం.  మరి ధర్మశాస్త్రాలు పుక్కినపట్టిన,  పీఠపాలకుల బుద్ధి-బుర్ర ఏమయింది? అలా నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. నిర్భయంగా.. సన్యాసయిన మా  స్వామివారికి జన్మదిన వేడుకలు జరపమని, ఏ మొహంతో అభ్యర్ధించారు?   అసలు సన్యాసికి జన్మదినం ఏమిటని నలుగురూ నాలుగురకాలుగా మాట్లాడితే, మొహం ఏ రిషీకేషులో పెట్టుకుంటారు? అయినా.. ఈ వయసులో ఆ పబ్లిసిటీ పిచ్చేమిటి.. కలికాలం కాకపోతే? అలా పుట్టినరోజు చేసుకునే సన్యాసులను, సన్నాసులని ఎవరైనా తిట్టిపోస్తే ఆ నామర్దా ఎవరికి? అందరినీ వచ్చి ఆశీర్వదించమనే  ఆ బలవంతపు బ్రాహ్మణార్ధమేమిటి? పీఠాథిపతులకు ఇంతకంటే పరువుతక్కువ ఇంకేమైనా ఉందా?... ఇవే కదా.. మెడపై తల ఉన్న వారు సంధించే ప్రశ్నలు?!   ఏం చేస్తాం.. ‘అతి’యే మన గతి అనుకోవాలి. లేకపోతే వృద్ధాప్యంలో వేసే పిల్లచేష్టలయినా అనుకోవాలి! ఏదేమైనా సృష్టి స్థితి లయకారుడైన విశాఖ స్వాములకు.. కోటానుకోట్ల భక్తులు, లక్షలాది జగనన్న అభిమానుల పక్షాన, ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. వీఐపీ, బకరా భక్తుల మాదిరిగా..  ఫ్లెక్సీలు, పేపర్ యాడ్లు ఇచ్చుకోలేని నిరుపేద భక్తులను.. విశాఖ పీఠం క్షమించాలి! -మార్తి సుబ్రహ్మణ్యం

తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిరగదేం నాయకా?

బయట రాష్ట్రాల్లో చక్రాలు తిప్పుతున్న తెలుగు బీజేపీ నేతలు   ఎవరయినా ఇంట గెలిచి రచ్చ ఓడతారు. కానీ మన తెలుగు రాష్ట్రాల కమలనాధులు మాత్రం.. ఇంట ఓడి, రచ్చ గెలుస్తున్నారు. అవును. తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద బాధ్యతల్లో పనిచేసిన-చేస్తున్న బీజేపీ అగ్రనేతల చక్రం.. సొంత తెలుగు రాష్ర్టాల్లో మాత్రం తిరగకపోవడమే ఆ పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరుస్తోంది. బయట రాష్ర్టాల్లో తమ నేతలు చక్రం తిప్పినందువల్లే, అక్కడ కమలం వికసించిందంటూ సదరు నేతల వీరాభిమానులు, సోషల్‌మీడియాలో పోస్టింగులు పెడుతుంటారు. మరికొందరు నేతల పేరుతో ఏకంగా అభిమానసంఘాలే ఉన్నాయి. కానీ, ఏపీ-తెలంగాణ రాష్ర్టాల్లో పార్టీని కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేకపోతున్నారో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.   ఉమ్మడి-విభజిత రాష్ర్టాలు ఏర్పడి ఇన్నాళ్లయినా... బీజేపీ, రెండు రాష్ర్టాల్లో ఇప్పటిదాకా కనీసం ప్రతిపక్ష స్థానానికీ ఎదగలేకపోయింది. ఆలోగా, ఒకే ఒక్క స్థానాలున్న రాష్ర్టాల్లో సైతం అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష స్థాయికి చేరింది. లోక్‌సభలో రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ, ఇప్పుడు దేశంలో రెండోసారి మళ్లీ అధికారంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీగా అవతరించింది. చివరకు కల అనుకున్న కశ్మీర్‌లో కూడా, అధికారంలో భాగస్వామిగా మారింది. మరికొన్ని రాష్ర్టాల్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోంది.   దేశంలో ఇన్ని అద్భుతాలు సృష్టించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, కనీసం ప్రతిపక్ష స్థాయికి సైతం చేరుకోలేకపోవడానికి, కారణమేమిటన్న చర్చకు పార్టీ వర్గాల్లో తెరలేచింది. వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా, పార్టీ మాత్రం ఆ స్థాయి-ఆయన స్థాయికి చేరకపోవడమే ఆశ్చర్యం. అయితే తెలుగు రాష్ర్టాలకు చెందిన రాంమాధవ్, పేరాల చంద్రశేఖర్, మురళీధర్‌రావు, సత్య వంటి నేతలు.. ఇతర రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా ఉన్నప్పుడు, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దానిపై రాంమాధవ్, మురళీధర్‌రావు, సత్య అభిమానులు సోషల్‌మీడియాలో చాలా హడావిడి చేశారు. ఆయా నేతలు ఆ రాష్ర్టాల్లో చక్రం తిప్పినందుకే, పార్టీ విజయం సాధించిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చేలా చూశారు.   రాంమాధవ్ కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాలు, మురళీధర్‌రావు కర్నాటక, పేరాల చంద్రశేఖర్ అస్సోం, తాజాగా సత్య బిహార్ ఎన్నికల్లో చక్రం తిప్పారంటూ, వారి అభిమానులు సోషల్‌మీడియాలో హంగామా చేసిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. రెండురోజుల క్రితమే.. బిహార్‌లో పార్టీ బహిరంగ సభల నిర్వహణ బాధ్యత చూసిన, జాతీయ కార్యదర్శి సత్యను అభినందిస్తూ, ఆయన అభిమానులు పోస్టు పెట్టారు. మరి పరాయి రాష్ట్రాల్లో ఇన్ని అద్భుతాలు సృష్టించి.. పార్టీని విజయతీరాలకు చేర్చిన ఈ నాయకులు, సొంత తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి, ఎందుకు వెలుగు తెప్పించలేకపోతున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.   ఏపీలో టీడీపీతో కలసి పోటీ చేస్తే అరజడజను ఎమ్మెల్యే సీట్లు కూడా సాధించలేకపోయింది. ఒక్క ఎంపీతోనే సర్దుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పైగా నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది. చివరాఖరకు ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం పాయింట్ ఎనిమిది!   కశ్మీర్‌తోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో చక్రం తిప్పిన రాంమాధవ్ సొంత రాష్ట్రంలో, పార్టీకి ఈ దుస్థితి పట్టడాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మరి ఆయన చక్రం ఏపీలో ఎందుకు తిరగలేదన్నది వారి ప్రశ్న. రాంమాధవ్ సొంత తూర్పు గోదావరిలో గానీ, జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్య సొంత కడప జిల్లాలో గానీ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.   ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి వరకూ ఎదిగి.. కర్నాటకలో అద్భుతాలు సృష్టించి, తమిళనాడులో పార్టీపరంగా కొన్ని వివాదాల్లో ఇరుకున్న మురళీధర్‌రావు.. తన సొంత తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి, కనీసం రెండోసీటు కూడా ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మురళీధర్‌రావు తన సొంత కరీంనగర్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు సాధించలేకపోయారని, చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేకపోయారని నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 5 సీట్లు సాధించిన పార్టీ, తర్వాత ఎన్నికల్లో ఒక్క అదనపు స్థానం సాధించలేకపోగా, ఒక్కటి మాత్రమే వచ్చిందంటే.. మరి ఆయన చక్రం తెలంగాణలో ఎందుకు తిరగలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.   దుబ్బాకలో గెలిచిన రఘునందన్‌రావు స్వయంకృషితోనే, పార్టీకి ఒక సీటు అదనంగా వచ్చింది తప్ప, ఎవరి చక్రాలు అక్కడ తిరగలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ విజయం వెనుక అభ్యర్థితోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ శ్రమ, వివేక్ వెంకటస్వామి వంటి నేతల సహకారం మాత్రమే ఉందంటున్నారు. తొలి ఎమ్మెల్యే రాజాసింగ్, తాజాగా రఘునందన్ విజయం వారి వ్యక్తిగతమేనని స్పష్టం చేస్తున్నారు.   దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండి, అధికార టీఆర్‌ఎస్ కోట్ల రూపాయలు వెదజల్లుతోందన్న ఆందోళన, ప్రచార సమయంలో బీజేపీ నేతల్లో వ్యక్తమయింది. కానీ అభ్యర్ధి రఘునందన్‌రావుకు, జాతీయ పార్టీ నుంచి సకాలంలో ఆర్ధిక సహకారం అందించేలా చూడటంలో.. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారంతా విఫలమయ్యారని నేతలు స్పష్టం చేస్తున్నారు. అక్కడి నుంచి ‘రెండు అంకెలకు’ మించి ఆర్ధిక సాయం రాలేదంటే, పదవుల్లో ఉన్న వారిపై జాతీయ నాయకత్వానికి.. ఎంత నమ్మకం- వారికి జాతీయ నాయకత్వ వద్ద పలుకుబడి, ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.   అస్సోంలో చక్రం తిప్పిన మరో నేత పేరాల చంద్రశేఖర్, స్వయంగా ఎల్‌బినగర్‌లో పోటీ చేసి ఓడిపోవడమే ఆశ్చర్యమంటున్నారు. ఒక రాష్ట్రంలోనే చక్రం తిప్పిన ఓ అగ్రనేత.. చివరాఖరకు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి తానే ఓడిపోయారంటే, దాని సంకేతం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే వీరికి స్థానబలం లేకపోవడం ఒక కారణమయి ఉండాలి. లేదా స్థానికంగా ప్రజల నాడి తెలుసుకోవడంలోనయినా, విఫలమయి ఉండాలని విశ్లేషిస్తున్నారు.   ఇక ఎన్నికల్లో వైఫల్యాలను.. కేవలం రాష్ట్ర అధ్యక్షులనే బాధ్యులను చేస్తున్న నాయకత్వం, పార్టీకి దిశానిర్దేశం చేసే.. సంఘటనా కార్యదర్శులను మాత్రం కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వైఫల్యానికి అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్, ఏపీలో వైఫల్యానికి కన్నా లక్ష్మీనారాయణను బాధ్యులను చేసి, వారిని తొలగించారు. అందులో లక్ష్మణ్‌ను, ఓబీసీ జాతీయ సెల్ అధ్యక్షుడిగా నియమించగా, కన్నాకు అది కూడా ఇవ్వలేదు. అది వేరే విషయం.   కానీ తెలంగాణ సంఘటనా కార్యదర్శిగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్-రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్, రెండున్నరేళ్ల నుంచి ఏపీ సంఘటనా కార్యదర్శిగా కొనసాగుతున్న మధుకర్-రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోథర్‌ను మాత్రం, అలాగే కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, ఆరేళ్ల నుంచి బాధ్యునిగా వ్యవహరిస్తున్నా, పార్టీ కించిత్తు పురోగతి సాధించలేదంటున్నారు.   అటు జాతీయ స్థాయిలో కూడా వైఫల్యాలకు, సంఘటనా కార్యదర్శులు నైతిక బాధ్యత వహించకపోవడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ-తెలంగాణకు మూడు దశాబ్దాల నుంచి ఇన్చార్జిగా ఉన్న, జాతీయ సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి, సాధించిన పురోగతి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక రెండేళ్ల నుంచి ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌జీ కూడా, అదే హోదాలో కొనసాగుతున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.   మరి ఇటీవలి ఎన్నికల పరాజయంలో వారి పాత్ర లేదా? వారి అనుమతితోనే టికెట్లు, నిర్ణయాలు జరిగినప్పుడు, మరి వారెందుకు బాధ్యత వహించరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించడంలో సీరియస్‌గా దృష్టి సారించి, ఎక్కువ సమయం కార్యకర్తల మధ్య గడిపి ఉంటే .. తెలుగు రాష్ర్టాల్లో పార్టీ పరిస్థితి, ఇంత విషాదంగా ఉండేది కాదన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లో.. అనుబంధసంస్ధలతో సమావేశం నిర్వహించారు. కానీ వారి నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోకుండా, నేతలు చెప్పింది వినకుండానే కేవలం అరగంటలో ఆ సమావేశాన్ని ముగించిన వైనాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అంటే దీన్నిబట్టి... రాష్ట్రానికి బాధ్యులుగా వచ్చేవారికి, స్థానిక అంశాలపై ఎంత శ్రద్ధ ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. -మార్తి సుబ్రహ్మణ్యం

వీర జవాన్లకు సాయంలోనూ కులం! ఏపీ సర్కార్ మరో దారుణం

ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడా లేనంటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలనలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి.  వీర జవాన్ల కుటుంబాలకు చేసే సాయంలోనూ వివక్ష చూపుతున్నారు పాలకులు. కులం ఆధారంగా అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అమరులైన జవాన్లలో కొందరి కుటుంబాలకు సాయం చేస్తూ.. మరికొందరిని పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలు తావిస్తోంది. జగన్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమర జవాన్లను కూడా అవమానించడమేంటనీ ఫైరవుతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితులు ఏపీలో రావడం దారుణమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                 మూడు రోజుల క్రితం కాశ్మీర్‌ లో  జరిగిన ఉగ్ర దాడులో చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అమరుడయ్యారు. బుధవారం అమర జవాన్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో  పూర్తయ్యాయి. దేశం కోసం వీర మరణం పొందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది జగన్ సర్కార్. అయితే అక్టోబర్ 12న సరిహద్దులో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన జవాన్ బొంగు బాబూరావు వీరమరణం పొందాడు. అస్సాం రైఫిల్స్‌లో సైనికుడిగా ఉన్న  బాబూరావు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అంతకు నెల క్రితం శ్రీకాకుళం నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలిన  ఘటనలో మృతి చెందారు. సిక్కోలుకు చెందిన ఈ ఇద్దరూ జవాన్లు విధినిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయినా.. జగన్ సర్కార్ మాత్రం వారి కుటుంబాలను పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ప్రకటించలేదు.   అమర జవాన్ల విషయంలో  జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు  50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు వీర జవాన్ల కుటుంబాలను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమర జవాన్ల విషయంలోనూ కులం చూసి పరిహారం ఇస్తున్నట్లుగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీర జవాన్లకు సాయంలోనూ కులం చూస్తారా  అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. "ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల సాయం ఇచ్చారు. అభినందిస్తున్నాను. దీనికి కొద్ది రోజుల ముందు ఈ నెల 4న అస్సాం రైఫిల్స్‌ దళంలో హవల్దార్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా వజ్ర కొత్తూరుకు చెందిన బొంగు బాబూరావు వీర మరణం పొందారు. సైన్యంలో పనిచేస్తున్న వారి ప్రాణత్యాగం ఎవరిదైనా ఒకటే. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ఎటువంటి సాయం ఇచ్చారో అదే సాయాన్ని కులం, మతం, ప్రాంతం చూడకుండా ఇతర అమర వీరుల కుటుంబాలకు కూడా ఇవ్వాలి. బాబూరావు కుటుంబానికి కూడా ఈ సాయం వర్తింపచేయాలి" అని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు అచ్చెం నాయుడు.  దేశం కోసం ప్రాణాలు అర్పించిన సిక్కోలుకు చెందిన వీర జవాన్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. వీర జవాను ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమన్నారు రామ్మోహన్‌ నాయుడు. రెండు నెలల వ్యవధిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆయన గుర్తుచేశారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలిన ఘటనలో మృతి చెందగా, అస్సాం రైఫిల్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో బొంగు బాబూరావు మృతి చెందారన్నారు. వీరిద్దరు మృతి చెందిన తర్వాత వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రకటించలేదని గుర్తు చేశారు. వీర జవాన్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీర జవాన్లపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు.  అమర జవాన్ల విషయంలో జగన్ సర్కార్ తీరు తీవ్ర విమర్శలు తావిస్తోంది. దేశంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను ప్రభుత్వం అవమానించినట్లుగా ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. అయినా కొందరికి పరిహారం ప్రకటించి.. మరికొందరికి ప్రకటించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు జనాలు. ఇలాంటి ఘటనలతో రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జవాన్లకు సాయం చేసే విషయంలో ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందని.. అలా కాకుండా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే తప్పును సరిదిద్దుకుని సిక్కోలు జిల్లాకు చెందిన ఇద్దరు వీర జవాన్ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని ఏపీ ప్రజలు, నేతలు కోరుతున్నారు.