Read more!

కేసీఆర్ ను అందుకే పక్కన పెట్టారా? ప్రధాని పర్యటనపై రాజకీయ మంటలు!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనపై రాజకీయ దుమారం రేగుతోంది. భారత్ బయాటెక్ లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తున్న ప్రధాని పర్యటనలో కేవలం అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం లేదు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్ కు వస్తున్న ప్రధానికి అహ్వానం చెప్పటానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానిస్తోందని మండిపడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అయ్యేలా ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

టీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలం నేతలు. ప్రధాని మోడీ కేవలం కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు మాత్రమే వస్తున్నారని, అందుకే కేవలం అధికారులను మాత్రమే ఆహ్వానించారని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా ఎవరూ ప్రధానిని కలిసేందుకు వెళ్లడం లేదంటున్నారు. కేసీఆర్ కావాలనే రాద్దాంతం చేస్తున్నారని, గవర్నర్ కు కూడా ఆహ్వానం లేదన్నది టీఆర్ఎస్ నేతలు గుర్తించుకోవాలని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తున్న ప్రధాని మోడీ పర్యటనపైనా రాజకీయం చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నాకు బీజేపీ నేతలు. తెలంగాణకు అవమానంటూ గులాబీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు కమలనాధులు.

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన, సీఎం కేసీఆర్ కు ఆహ్వానం లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్ రాబోతుందని గతంలో పలు సార్లు కేసీఆర్ చెప్పారు. భారత్ బయోటిక్ చేస్తున్న పరిశోధనలను తనకు ప్రయోజనం కలిగేలా మలుచుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ అంశంతో రాష్ట్రానికి సంబంధం లేకున్నా.. తన పాత్ర ఉందనేలా కేసీఆర్ ప్రచారం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తనతో పాటు కేసీఆర్ ను అక్కడికి తీసుకెళితే... తానే కరోనా వ్యాక్సిన్ తయారీకి సూచనలు చేశానని కేసీఆర్ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని బీజేపీ నేతల అనుమానం. భారత్ బయోటిక్ గురించి గతంలోనే చెప్పానని, తమ సహకారం వల్లే టీకా వచ్చిందని కేసీఆర్ చెప్పుకున్నా అశ్చర్యం లేదంటున్నారు కమలనాధులు. అందుకే ప్రధాని మోడీ తన పర్యటనలో సీఎం కేసీఆర్ ను పక్కన పెట్టారని బీజేపీ నేతలు చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరుగుతోంది. వ్యక్తిగత, విద్వేష, రెచ్చగొట్టే మాటలు చేసుకుంటున్నారు లీడర్లు. ఈ సమయంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటే గ్రేటర్ ప్రజలకు మరో సంకేతం వెళుతుందనే ఆందోళన కూడా బీజేపీలో ఉందంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో దోస్తీ .. గల్లీల్లో ఫైటింగ్ చేస్తూ డ్రామాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ సమయంలో మోడీ, కేసీఆర్ కలిస్తే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యే అవకాశం ఉందనే భయం కూడా ఉందంటున్నారు. అందుకే ఏ సమస్య లేకుండా ప్రధాని పర్యటనకు కేసీఆర్ ను దూరం పెట్టారని చెబుతున్నారు.

మరోవైపు ప్రధాని హైదరాబాద్ పర్యటనపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని పర్యటనలో లోకల్ ఎంపీకి ఆహ్వానం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ‘గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు ఈ రోజు భారత్ బయోటెక్ కు రానున్నారు. హకీంపేట ఏఎఫ్ఎస్‌లో ఆయన ల్యాండ్ అవుతారు. అవి రెండు మల్కాజిగిరి నియోజక వర్గం కిందకు వస్తాయి. ఇక్కడ మోడీ పర్యటన నేపథ్యంలో స్థానిక పార్లమెంటు సభ్యుడిని పిలవకపోవడం సరికాదు’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలోని జాతీయ మీడియా సంస్థలన్నింటి హ్యాష్‌ట్యాగ్‌లను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జత చేశారు.

భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ పురోగతిని పరిశీలించడమే ప్రధాని నరేంద్రమోడీ టూర్ షెడ్యూల్. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి, హకీంపేట ఎయిర్‌పోర్టు ఆఫీస్ కమాండెంట్ కు మాత్రమే ఆహ్వానం వచ్చింది. ప్రధానికి హాకింపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలకాలని భావించిన సీఎం కేసీఆర్.. దీనికి సంబంధించి పీఎంవోకు సమాచారం ఇచ్చారట. అయితే ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్.. సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఫోన్ లో తెలిపారని చెబుతున్నారు. దీనిపైనే టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.