Read more!

గులాబీకి గుచ్చుకున్న ముళ్లు!

ఓటమి బాధ్యత కేటీఆర్‌దే

 

అతి విశ్వాసమే కొంపముంచిందా?

 

సిట్టింగులకు ఇచ్చి తప్పు చేసిందా?

 

పద్మారావు ఇలాకాలోనే కారు క్లీన్‌స్వీప్

 

చక్రం తిప్పిన ‘డిప్యూటీ’ కొడుకులు

 

తలసాని నియోజకవర్గంలో తప్పిన గురి

 

ముషీరాబాద్, ఎల్బీనగర్‌లో పోయిన పరువు

 

అంచనాలు తల్లకిందులయ్యాయి. కారు జోరు మందగించింది. బీజేపీ దానికి అడుగడుగునా స్పీడు బ్రేకులుగా మారింది. సెంచరీ కొడతామన్న తెరాస నేతల బీరాలు బొక్కాబోర్లా పడ్డాయి. కాకపోతే.. ఏకైక పెద్ద పార్టీ అన్న గౌరవం ఒక్కటే దక్కించుకుంది. కేవలం నాలుగంటే నాలుగే సీట్లున్న బీజేపీ.. ఈసారి టీఆర్‌ఎస్‌కు ఏడు స్థానాలకు దగ్గరగా వచ్చిఆగింది. ఇది అధికార పార్టీకి శరాఘాతం కాదు. వజ్రాఘాతం! తెరాస అతి విశ్వాసానికి ఓ గుణపాఠం. కాంగ్రెస్‌ను పీకపిసికి, టీడీపీని తరిమివేసిన రాజకీయ వ్యూహం వికటించిన ఫలితంగా, బీజేపీ బాహుబలిగా అవతరించింది. ఇది తెరాస నాయకత్వ స్వయంకృతం.  కాంగ్రెస్‌ను బలహీనం చేయాలన్న కేసీఆర్ ఎత్తు.. చివరాఖరకు బీజేపీ రూపంలో... భవిష్యత్తులో తెరాసనే మింగేసే స్థాయికి చేరింది.

 

అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో, తెరాస సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ నైతికంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి మీసం మెలేసిన టీఆర్‌ఎస్... ఈసారి బీజేపీ ఇచ్చిన పోటీ కి ఉక్కిరిబిక్కిరయి.. ఊపిరాడక... కేవలం 55 సీట్లకే చతికిలపడాల్సిన దుస్థితి. అంటే  44 స్ధానాలు కోల్పోయిన విషాదం. దీనికి కారణం కచ్చితంగా స్వయంకృతమేనన్నది తెరాస శ్రేణుల వాదన. దాదాపు 46 మంది సిట్టింగ్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలున్నా, స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లొంగి తిరిగి వారికే సీట్లిచ్చినందుకు ‘ఫలితం’ అనుభవించాల్సి వచ్చింది.

 

దాదాపు డివిజన్‌కు మూడు కోట్లు ఖర్చు పెట్టి, సర్వశక్తులూ ఒడ్డినా తెరాస.. తనకున్న 44 స్థానాలు నిలబెట్టుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో సర్వం తానయి నిలిచిన మంత్రి కేటీఆర్, ఈ ఫలితాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత విజయానికి ఆయన బాధ్యత ఎంతో.. నేటి ఈ ‘నైతిక పరాజయాని’కీ ఆయనదీ అంతే బాధ్యత. అయితే, ఏకైక అతిపెద్ద పార్టీగా తెరాస అవతరించినా, 38 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతోపాటు, మజ్లిస్‌కు వచ్చిన 44 కార్పొరేటర్లు, మరో పదిమంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలసి, తెరాస అభ్యర్ధి మేయర్ కావచ్చు. కానీ నైతికంగా మాత్రం ఆ పార్టీది పరాజయమే. నిజానికి 64 మంది కార్పొరేటర్లు ఉంటేనే తెరాసకు మేయర్ వస్తుంది. ఇప్పుడు ఆ మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ చేరువ కాలేదు. అయితే మజ్లిస్‌తో చేయి కలిపి, మేయర్-డిప్యూటీ మేయర్లను ఆ పార్టీ చేజిక్కించుకోవచ్చు. కానీ.. రాజధాని నగరంలో ఒక ప్రతిపక్షం, తనకు సమీపంలో రావడం,  అధికార పార్టీకి  కచ్చితంగా ప్రమాదఘంటికనే.

 

గ్రేటర్  ఎన్నికల్లో తెరాస కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఖాతానే తెరవకపోవడం అత్యంత విషాదం. సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఎల్బీనగర్, ముఠా గోపాల్ ఎమ్మెల్యేగా ఉన్న ముషీరాబాద్‌లో తెరాస అసలు ఖాతానే తెరవకపోవడం అత్యంత విషాదం. ఇక్కడ కమలం వికసించింది. ఇక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌లో తెరాస క్లీన్‌స్వీప్ చేస్తుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎందుకంటే ఆయనకు,  నిత్యం జనంలో అందుబాటులో ఉండే నేతగా పేరుంది. వ్యక్తిగతంగా చాలామందికి సాయం చేసే నాయకుడిగానూ పేరుంది. అయినా ఆ నియోజకవర్గంలో , మూడు డివిజన్లు కమలం ఖాతాలో కలవడం ఆందోళన కలిగించే అంశమే. అభ్యర్ధుల ఎంపికలో జరిగిన పొరపాట్లే దానికి కారణమంటున్నారు.

 

అయితే బేగంపేటలో ఓడిపోయే అభ్యర్ధిని గెలిపించడం  కొంతలో కొంత ఊరట. నిత్యం అందరికీ అందుబాటులో ఉండే తలసాని, తన నియోజకవర్గంలో ఎందుకు క్లీన్‌స్వీప్ చేయలేకపోయారన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే, సనత్‌నగర్ నియోజవర్గంలోనే   తెరాస అభ్యర్ధులు ఎక్కువ ఖర్చు పెట్టారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఎన్నికల్లో దూసుకువెళ్లినా, తలసాని నియోజకవర్గంలో 3 సీట్లు బీజేపీకి రావడమే ఆశ్చర్యం.

ఇక మొత్తం తెరాస అభ్యర్ధులే క్లీన్‌స్వీప్ చేసిన ఘనత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్‌కే దక్కుతుంది. ఈ ఎన్నికల్లో పార్టీపరంగా ఆయనే హీరోగా నిలిచారు. నగరమంతా బీజేపీ హవా సాగినా, సికింద్రాబాద్‌లో మాత్రం ఒక్క  సీటు కూడా సాధించ లేకపోయింది. ఈ విషయంలో పద్మారావు అందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. ఆయన తన కుమారులను అన్ని డివిజన్లలో మోహరింపచేశారు. వారికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆర్ధిక వనరుల వ్యవహారాన్ని పద్మారావు స్వయంగా చూశారు.

 

నిజానికి సికింద్రాబాద్‌లో తార్నాక, బౌద్ధనగర్, సీతాఫల్‌మండిలో తెరాస తొలి నుంచీ కొంత బలహీనంగా ఉంది. ముఖ్యంగా తార్నాకలో బీజేపీ విజయం ఖాయమని, టీఆర్‌ఎస్ వర్గాలే అంచనా వేశాయి. అయితే అక్కడ పద్మారావు తనయులే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా మారిన బౌద్ధనగర్ డివిజన్‌లో,  తెరాస విజయం వెనుక పద్మారావు తనయుడి కృషి ఎక్కువగా ఉంది. అతనే అక్కడ తెరాస అభ్యర్ధికి రక్షకుడిగా మారారు. ఆరకంగా ఇప్పుడు  నగరంలో క్లీన్‌స్వీప్ చేసిన నేతగా పద్మారావు రికార్డు సృష్టించారు.

 

అయితే... గతంలో 99 సీట్లు సాధించిన తెరాస గురి ఈసారి దారుణంగా తప్పడం, బీజేపీ ఊహించని విధంగా తెరాసకు చేరువకావడమే ఆందోళన కలిగించే అంశం. అదికార పార్టీ 44 సిట్టింగు సీట్లను కోల్పోవడం, ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రచారంలో తెరాస అతి విశ్వాసం, సమన్వయలోపం, అభ్యర్ధుల ఎంపికలో లెక్కలేనితనం, ప్రచారంలో బీజేపీ బలం- వ్యూహంపై చిన్నచూపు, కేటీఆర్ మినహా మరో ఇతర నేతలకు భాగస్వామ్యం లేకపోవడం వంటి అంశాలే తెరాస కొంపముంచాయన్నది నిష్ఠుర సత్యం. చివరాఖరకు సీఎం కేసీఆర్ సభ పెట్టినా, కారు జోరందుకోలేకపోయింది.

 

ఇటీవలి వరద సమయంలో కేసీఆర్ ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడంలో తెరాస విఫలమయింది. ప్రభుత్వం తమను అనాధల్లా వదిలేసిందన్న ఆగ్రహాన్ని,  బీజేపీ సద్వినియోగం చేసుకుంది. వరద వచ్చిన ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ ఓడిపోవడం బట్టి.. అక్కడి ప్రజల్లో ఆ పార్టీపై ఎంత అసంతృప్తి ఉందో స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత పదివేల సాయం కొనసాగిస్తామని చెప్పినా, ప్రజలు నమ్మలేదంటే తెరాసపై నమ్మకం సన్నగిల్లుతున్నట్లే లెక్క.

 

ఇక చాలామంది సిట్టింగ్ కార్పొరేటర్లకే మళ్లీ సీట్లివ్వడం కూడా కారు కొంపముంచింది. ఇది తెరాస నాయకత్వ అంచనా లోపానికి పెనుమచ్చ. ఇళ్ల నిర్మాణాలు, స్థానిక పంచాయితీలలో వారు విచ్చలవిడితనంగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నా, మళ్లీ వారికే సీట్లివ్వడమే తెరాస పతనానికి ప్రధాన కారణమంటున్నారు. ఏదేమైనా..మళ్లీ నగరంలో పార్టీని పునర్నిర్మించుకోవాలన్న హెచ్చరిక సంకేతాలు, మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదన్న సందేశాన్ని గ్రేటర్ ఎన్నికలు మిగిల్చాయి.

-మార్తి సుబ్రహ్మణ్యం