మేడమ్‌కు సీఎం కిరణ్ మొర
న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి... అందుకుగల కారణాలను సోనియాకు వివరించారు. గురువారం ఢిల్లీలో ఆయన టెన్ జన్‌పథ్‌లో మేడమ్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల పరాజయం వెనుక కారణాలు, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోనియా సమక్షంలోను, ఆ తర్వాత సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లతో దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జగన్‌ను ఏమాత్రం ఉపేక్షించరాదని, ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని కిరణ్ అధిష్ఠానాన్ని కోరారు. "ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి వెనుక పెద్ద ఎత్తున ధన బలం పనిచేసింది. నన్ను అసమర్థుడిగా చిత్రీకరించి జగన్‌ను బలోపేతం చేసేందుకు పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు పరోక్ష ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అంతర్గత కుట్ర జరుగుతోంది'' అని కిరణ్ వివరించారు.
చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంతపురంలో జేసీ వర్గం కుట్రల మూలంగా పార్టీ పరాజయం పాలైందని సోనియాకు చెప్పారు. సొంత జిల్లాలో తనను దెబ్బతీస్తే, పార్టీని కూడా దెబ్బతీయగలమన్నది వారి ఉద్దేశమని కిరణ్ తెలిపారు. అయినప్పటికీ... చిత్తూరు జిల్లాలో కేవలం ఒకే ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని ఆయన తెలిపారు. గిడుగు రుద్రరాజు, గంగాభవానీలపై వారి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికే తిరిగి అవకాశం ఇవ్వడం తప్పైందని అంగీకరించారు. అయితే... "వారిని గెలిపిస్తామని అధిష్ఠానానికి, నాకు హామీ ఇచ్చిన కొందరు పెద్ద మనుషులు ఘోరంగా విఫలమయ్యారు'' అని చెప్పారు. నామినేటెడ్ అభ్యర్థుల విషయంలో ముందుగా నిర్ణయం తీసుకుని ఉంటే ఈ ఎన్నికలపై కొంత ప్రభావం చూపేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కడప జిల్లాలో ఎన్నిక గురించి సోనియా ప్రస్తావించారు. "జిల్లా అంతటా జగన్‌కు పట్టు లేదని తేలిపోయింది. ఇక్కడ కేవలం పది ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం'' అని కిరణ్ బదులిచ్చారు. జగన్ వర్గానికి గట్టి సమాధానం చెప్పడం పట్ల సోనియా సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా కిరణ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పాలనా విధానంపై అధిష్ఠానానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించారు.
ఈ భేటీలో సోనియా గాంధీ సీఎం పనితీరుపై విరుచుకుపడ్డారు. మీకు పగ్గాలు ఇచ్చి పొరపాటు చేశామని, మీ విషయంలో మా అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించే వరకూ ఆమె ఆగ్రహస్థాయి చేరుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలి ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మీ వ్యవహారశైలి, నిర్ణయాల వల్లే పార్టీ ఓటమిపాలయిందని, నేతలతో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని, ఇకపై సహించేది లేదని నిర్మొహమాటంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తప్పు చేసినట్లు భావించవలసి వస్తోందని సోనియా మండిపడ్డారు.