కవిత దారెటు.. ఈ ప్రశ్నకు బదులేది?

సరదాగా.. కొంచే కామెడీ..గా అయితే.. బాలయ్య బాబులా... సరే.. సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి?’ అనుకోవచ్చు.  కాదూ..  కూసింత సీరియస్’గా చెప్పుకుందామంటే, రజనీకాంత్ చెప్పిన  అతిగా ఆశ పడే ఆడది.. ఆతిగా ఆవేశ పడే మగాడు సుఖ పడినట్లు చరిత్రలో లేదు  అన్న డైలాగు  గుర్తు చేసుకోవచ్చు.  అవును..  మన ఇప్పుడు మాట్లాడు కుంటున్నది  బీఆర్ఎస్ లో తిరుగు బావుటా ఎగరేసిన   ఎమ్మెల్సీ,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె  కల్వకుంట్ల కవిత గురించే.  నిజానికి..  కవిత మనసులో ఏముందో అప్పుడే కాదు.. ఇప్పటికీ అంటూ ఈరోజుకు కూడా ఎవరికీ తెలియదు. అందుకే..  ఆమె  ఏదో ఉహించుకుని అడుగు ముందుకు వేశారా.. లేక అత్యాశకు పోయి గడప  దాటారా? అనేది ఒక విధంగా ఈ రోజుకూ  శేష ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అలాగే..  అమెది తిరుగు బాటు కాదు..  కేసీఆర్ వ్యూహంలో భాగమనే ప్రచారం కూడా జరుగుతోంది.    అయితే..  రెండు రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు ఎదురు వెళ్ళిన   కవితను కంటి సైగతోనే  కేసీఆర్ దూరంగా ఉంచిన వైనం  గమనిస్తే..  కవిత ప్రవర్త కేసీఆర్ ను గట్టిగా హర్ట్ చేసిందనీ,  ఆమె పట్ల కేసీఆర్   నిజంగానే చాలా   కోపంగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైం దని అంటున్నారు. నిజానికి  అందరికీ మరీ ముఖ్యంగా కవితకు  తమ స్థానం ఏమిటో అర్థం అవడం కోసమే కేసీఆర్  అందరి ముందూ కవితను దూరం పెట్టారని అంటున్నారు. అలాగే  ఆమె ఎవరిని  దేవుడి చుట్టూ చేరిన దయ్యాలు గా పేర్కొన్నారో వారు అదే స్థానాల్లో అలాగే ఉన్నారు. కేసీఆర్ వారికి ముందు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇచ్చారు. ఇస్తున్నారనే విషయం కూడా విచారణ క్రమంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.   అంటే..  గతంలో తామే గులాబీ జెండా నిజమైన యజమానులమంటూ చిన్నపాటి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈటల రాజేందర్ తదితర నాయకుల పట్ల వ్యహరించిన తీరుగానే  కవిత విషయంలోనూ కేసీఆర్ కఠిన వైఖరి కొనసాగిస్తారని అనుకోవచ్చని అంటున్నారు.ఈ నేపధ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు  ఏమిటనేది  ప్రశ్నగా మారిందని అంటున్నారు. నిజానికి..  కవితకు ఇప్పటికే పరిస్థితి అర్థమైందనీ  అందుకే ఆమె  తండ్రికి దగ్గరయ్యేదుకు   ప్రయత్నాలు చేస్తున్నట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్  కు కాళేశ్వరం కమిషన్  నోటీసు ఇవ్వడాన్ని  ప్రశ్నిస్తూ..  ‘జాగృతి’ బ్యానర్ పై నిరసన ప్రదర్శన  నిర్వహించడం  పిలుపు లేకుండానే పలకరించేందుకు ఫార్మ్ హౌస్ కు వెళ్ళడంతో పాటుగా..  ఇతర చానల్స్ ద్వారా కూడా  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంత వరకు అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. అదే సమయంలో..  ఇప్పటికిప్పుడు పార్టీ పరంగా కవిత పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోక పోవచ్చని అంటున్నారు. అలాగే..  పార్టీ పెట్టే అవకాశం గానీ వేరే పార్టీలో చేరే పరిస్థితి కానీ  కవితకు లేదని అంటున్నారు.  ముఖ్యంగా  తాను కాంగ్రెస్ పార్టీలోఉన్నంత వరకు కేసీఆర్  ఫ్యామిలీలో ఎవరినీ కాంగ్రెస్  లో చేర్చుకునే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో కాంగ్రెస్  తలుపులు కవితకు మూసుకున్నట్లే అంటున్నారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనక్కరలేదు.  సో .. కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటి ? ఆమె మరో షర్మిల అవుతారా ? లేక ఏదో దారిన ఫార్మ్ హౌస్ కు చేరతారా? కవిత దారెటు .. ఈ ప్రశ్నకు బదులేది?

విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు విశ్వాస్ కీలక ప్రకటన

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ కీలక ప్రకటన సమాచారం వెల్లడించారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని ఆయన వెల్లడించారు. నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదని అని విశ్వాస్‌ కుమార్‌ వెల్లడించారు.  చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. వాటినుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా డీడీ న్యూస్‌ మీడియాతో మాట్లాడారు. విమాన భాగం విడిపోయి మెడికోల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది.  ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు రాగానే మంటలు అంటుకున్నాయి. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాని ఆయన తెలిపారు. ఎవరో నన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరిలించారు అని మీడియాతో తెలిపారు. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్‌కుమార్‌.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో విశ్వాస్‌ కుమార్‌ కూర్చున్నారు.

కేసీఆర్ విచార‌ణ ఇలా.. అప్పట్లో బాబు విచారణ అలా?

ఎలా అర్ధం చేసుకోవాలి గురూ!  మొన్నామ‌ధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వ‌చ్చి ఆయ‌న బంధువుల‌ను ప‌ర‌మార్శించిన విష‌యం గుర్తుందా?  అప్పుడు కేసీఆర్ ఎంత ప్ర‌శాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన‌పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా క‌ళ్ల‌న్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి బైట్ ఇవ్వ‌లేదు. ఎలాంటి యాక్టివిటీ లేదు. కమిషన్ ఎదుట హాజరైయ్యారు. వెళ్లారు. వాళ్లు అడిగింది. కేసీఆర్ చెప్పింది. రికార్డుల్లో భ‌ద్రంగా ఉంటుందేమోగానీ కేసీఆర్ హావ‌భావాలు ఏమంత తోట్రు పాటుకు గురైన‌ట్టు క‌నిపించ‌లేదు. అధికారం నుంచి దిగినోళ్ల‌కి ఇదంతా స‌హ‌జంర భ‌య్ అంటా ఒక ఈవెంట్ కి వ‌చ్చిన‌ట్టు వచ్చి వెళ్లిపోయారాయ‌న‌.  అదే ఏపీలో చంద్ర‌బాబు విచార‌ణ స‌మ‌యంలో న‌రాలు తెగే ఉత్కంఠ‌. ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం నుంచి కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌డం ద‌గ్గ‌ర వ‌ర‌కూ హై టెన్ష‌న్. ఆపై జైలుకు పంప‌డం వ‌ర‌కూ ఒక సుదీర్ఘ‌మైన ఉత్కంఠ భ‌రిత‌మైన వ్య‌వ‌హారం. ఈ మొత్తం మూడు నాలుగు ఎపిసోడ్లుగా సాగింది. ఎంతో ఎగ్జైట్ మెంట్ న‌డిచింది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న ఒక కుర్చీలో ఒంట‌రిగా కూర్చుని ఆలోచిస్తున్న పోజ్ అయితే బాబు అభిమానుల‌ను, టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ను ఒక  ఊపు ఊపేసింది. తీవ్ర స్థాయిలో చ‌లించిపోయారంతా. బాబుకేమి జ‌రుగుతుందో అన్న ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది.  అప్ప‌ట్లో బాబు ఆయ‌న అరెస్టు విచార‌ణ జైలు జీవితం అదో పెద్ద చ‌ర్చ‌.   అదే ఇక్క‌డ కేసీఆర్.. వ‌చ్చారు వెళ్లారు. అంతే మ‌ధ్య‌లో ఎలాంటి హైడ్రామా లేదు. ఒక ప‌క్క కుమార్తె గుడ్ మార్నింగ్ డాడీ అని ప‌ల‌క‌రించే య‌త్నం చేస్తే ఆగు అన్న‌ట్టు సైగ చేశారు త‌ప్పించి.. ఆమెతో క‌నీసం మాట్లాడ‌లేదు. ప్ర‌భుత్వ ప‌రంగా కూడా కేసీఆర్ ని మ‌రీ ఇబ్బంది పెట్టే య‌త్నం చేసిన‌ట్టు కూడా క‌నిపించ‌లేదు.బ‌హుశా కేసీఆర్ ని అంత‌క‌న్నా మించి ట‌చ్ చేయొద్ద‌ని రేవంత్ స‌ర్కార్ అనుకుందో ఏమో. మ‌ధ్య‌లో ఎలాంటి తోట్రుపాటు, త‌డ‌బాటు ఏదీ లేదు. అంటే అక్క‌డికి ఇక్క‌డికీ హై డ్రామాలో ఎంత మార్పు? ఇది ప్రాంతాల వారీగా ఉన్న తేడానా? లేక నాడు జ‌గ‌న్ చంద్ర‌బాబును వేధించినంత‌గా.. నేడు రేవంత్ స‌ర్కార్ కేసీఆర్ ని ఇబ్బంది పెట్ట‌డం లేద‌నుకోవాలా? ఎక్క‌డో ఎమోష‌న‌ల్ డ్రామా మిస్ అవుతోంద‌ని అంటున్నావాళ్లు లేక పోలేదు. ఒక్క క‌విత  నుంచి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామాకు తెర‌లేప‌డం త‌ప్ప‌.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌నంలో కేసీఆర్ ప‌ట్ల రేవంత్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై క‌నీస స్పంద‌న లేదు. ఈ విష‌యంలోని విభిన్న‌త గుర్తించిన చాలా మంది నాటి చంద్ర‌బాబు విచార‌ణ‌- నేటి కేసీఆర్ విచార‌ణ‌కు పోలిక తెస్తున్నారు. అంత హై డ్రామా లేదిక్క‌డ అంటూ కేసీఆర్ విచార‌ణా ప‌ర్వాన్ని ఒకింత తేల్చేసిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఆయ‌న కూడా ఏదో ఒక ఈవెంట్ కి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చి వెళ్లిపోవ‌డంతో అదే క‌రెక్ట్ అనుకుంటున్నారు.

కొమ్మినేనికి బెయిలు మంజూరు చేసిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో  సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం (జూన్ 13) విచారణ జరిపి బెయిలు మంజూరు చేసింది. దీంతో సుప్రీంలో కొమ్మినేనికి భారీ ఊరట లభించినట్లైంది. అయితే బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు కొమ్మినేనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అమరావతిపై మరోసారి అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించింది.   అదే సమయంలో ప్రభుత్వంపైనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని పేర్కొంటూ నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని సుప్రీం ప్రశ్నించింది.   ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వాటని ఖండిచకుండా కొమ్మినేని చర్చను కొనసాగించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అమరావతి మహిళలు కొమ్మినేని, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.

జగన్ ఇమేజ్ డ్యామేజ్!?

వైసీపీ అధినేత జగన్  సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తున్న దూకుడు విమర్శలపాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అలాగే తన   సొంత మీడియాలో అమరావతి మహిళలపై కొమ్మినేని, కృష్ణంరాజులు చేసిన చర్చపై జగన్ స్పందించిన తీరు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారిందని వైసీపీ శ్రేణులే వాపోతున్నాయంట. గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అనీ, ఆ మత్తులో కానిస్టేబుల్‌పై దాడి  కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అందుకనే  పోలీసులు ఆ విధంగా  దండించాల్సి వచ్చిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే వాళ్లు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులనీ, దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని వైసీపీ విమర్శిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హుటాహుటిన ఆ యువకుల పరామర్శ పేరుతో తెనాలి వెళ్లారు. అయితే అసలు ఆ ఘటనలో నిజానిజాలు ఏంటో తేలకుండా ఎందుకు  అంత హడావుడిగా వెళ్లారనేది  అంతుపట్టకుండా తయారైంది. పైగా వెంటనే టిడిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో  డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారని  అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది.  మరో వైపు తెనాలిలో జగన్ చేసిన ప్రసంగంలో  కూడా  స్పష్టత లేకుండా పోయింది.  నిజానికి ఇలాంటి అంశాల్లో  ప్రతిపక్ష పార్టీలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో..  నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోంది.  పోలీసులపై చట్టపరమైన చర్యలు, ఆ యువకులపై ఉన్న కేసులు విషయం పక్కన పెడితే  .. ఆ ముగ్గురి విషయమై స్థానికులు   నెగిటివ్ గానే  చెప్తున్నారు. ఆ క్రమంలో తెనాలి పర్యటన  జగన్‌కు కానీ,  వైసిపికి కానీ రాజకీయంగా ఏ విధంగానూ లాభించక పోగా నెగిటివ్ అయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయంట.  ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి  ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని  వెన్నుపోటు దినంగా నిర్వహించాలని  రాష్ట్ర వ్యాప్త నిరసనలకు జగన్ పిలుపు ఇచ్చారు. పార్టీ శ్రేణులన్నీ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  ఆ రోజున కీలక నేతలు అందరూ  వైసీపీ శ్రేణులతో కలిసి  నిరసనలు జరిపారు . బొత్స లాంటి సీనియర్ నేత కూడా  నిరసన చేస్తూ ఎండ వేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు.  2024 ఎన్నికల తర్వాత  ఏడాది కాలం లో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.  వైసీపీ కార్యకర్తలు, అభిమానులు  నెన్నుపోటు దినం నిరసనల్లో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన  జగన్ మాత్రం   బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసిపి శ్రేణులే. బహిరంగంగా వాళ్ళు చెప్పకపోయినా పార్టీ పరంగా నిర్వహించిన అంత ముఖ్యమైన కార్యక్రమంలో  పార్టీ అధ్యక్షుడు పొల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోవడం పట్ల వైసీపీ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయంట. అలా మళ్లీ జగన్ జనంలో నెగిటివ్ అయ్యారంటున్నారు.   ఇక లేటెస్ట్ కాంట్రవర్సీ  రాజధాని అమరావతి  దేవతల రాజధాని కాదంటూ  రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు  వ్యాఖ్యానించారు.  ఆ షోకి యాంకర్ గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్  కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతు ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అది  ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది.  ఆల్రెడీ కొమ్మినేనిని, కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు.  మొదటినుంచి మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగన్ అన్నట్లు అమరావతి ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం కచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. అయితే వైసీపీ నేతలు మాత్రం సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా  సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అటు ఛానల్ పైన ఇటు ఆ జర్నలిస్టుపైనా అందరూ విరుచుకుపడుతున్నారు.  మహిళలకు క్షమాపణ చెప్పడం మాని కొమ్మినేని అరెస్టును జగన్ తప్పుపడుతున్నారు. ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ టూగా ఫోకస్ అవున్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి మహిళలను మళ్లీ టార్గెట్ చేస్తున్నారు. కొమ్మినేని, కృష్ణంరాజుల డిస్కషన్‌పై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకర జాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకర జాతి వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన మహిళల త్యాగాలను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  అమరావతి రాజధాని విషయంలో వైసీపీ రాజకీయ కోణం అందరికీ తెలిసిందే కానీ .. ఆ అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసిపి ముఖ్యులు దారుణంగా ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి జగన్ అనాలోచితంగా ప్రదర్శిస్తున్న దూకుడు పార్టీ ప్రతిష్టాను మరింత దిగజార్చుతోందని ఆ పార్టీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

జూబ్లీ ఉప పోరుకు వ్యూహాలు రెడీ !

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో..  దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత, బీఆర్ఎస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఇటీవల కంటోన్మెంట్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.  సో.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్‌ నియోజక వర్గంలోనూ త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి.. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్  సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.   ముఖ్యంగా  కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీ హిల్స్  సీటును కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక బీఆర్ఎస్  సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. వరసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీకి, పార్టీ కంటే మిన్నగా,పార్టీ అధినేత కేసీఆర్ కు ఉన్నఅనుబంధం దృష్ట్యా..  నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు చెపుతున్నారు. మాగంటి సతీమణి సునీతను బరిలో దించి గెలిపించుకోవాలని, ఇప్పటికే కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించినట్లు చెపుతున్నారు. అయితే..  ఆమె పోటీకి సుముఖంగా ఉన్నారా, లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాల సమాచారం.  ఒక వేళ ఆమె పోటీకి సుముఖంగా లేకుంటే..   కేసీఆర్ కుటుంబం నుంచే మరో మహిళను పోటికి దించే ఆలోచన ఉందంటున్నారు.  అయితే.. కేసీఆర్ అందుకు అంగీకరించక పోవచ్చని కూడా చెబుతున్నారు.   మరోవంక.. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్  స్ట్రాటజీ నే జూబ్లీ హిల్స్  లో రీప్లే  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు.  ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. అయితే..  నాగేందర్  ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఉడుతుందా అనేది తేలకుండా వుంది. అది వేరే సంగతి.  కంటోన్మెంట్ కు అదనంగాజూబ్లీహిల్స్‌ సీటునూ గెలుచుకుని హైదరాబాద్‌లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు అండతో గెలిచే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి  పోటీ  చేసి ఓడిపోయినా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లేదా గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీచేసిననవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి, ఎంఐఎం మద్దతుతో ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ నాయకత్వం లెక్కలు వేస్తునట్లు చెపుతున్నారు.  ఇక బీజేపీ విషయానికి వస్తే..  ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన    కూటమి ప్రయోగాన్ని  తెలంగాణాలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా  భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి..  మాగంటి గోపీనాథ్   టీడీపీ ప్రోడక్ట్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆతర్వాత.. మారిన పరిస్థితుల కారణంగా  2016లో బీఆర్ఎస్ లో చేరి వరసగా 2018, 2023 ఎన్నికల్లో విజయ సాధించారు. అయినా..  తెలుగు దేశం పార్టీతో, ముఖ్యంగా చంద్రబాబు నాయు డుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి. అందుకే..  మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో  తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అయితే   ఇంతవరకు ఈ విషయం పై పార్టీ కేంద్ర నాయకత్వంతో  చర్చించలేదని, ఏదైనా తెలంగాణలో కూటమి ఎంట్రీ గురించి, పై స్థాయిలో నిర్ణయం జరగ వలసి ఉంటుదని అంటున్నారు.  ఏది ఏమైనా బీజేపీ గట్టి అభ్యర్ధిని బరిలో దించి  గట్టి పోటీ ఇస్తుందని,ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. 

భర్త కోసం లండన్ ప్రయాణం.. ప్రమాదంతో అనంతలోకాలకు.. నవ వధువు విషాదం

 అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో త‌న భ‌ర్త‌ను క‌ల‌వ‌డానికి రాజ‌స్థాన్ నుంచి యూకే వెడుతున్న నూత‌న వ‌ధువు ఖుష్బూ ఒక‌రు. రాజ‌స్థాన్ బ‌లోత్రా జిల్లాకు చెందిన‌ 21 ఏళ్ల ఖుష్బుకు లండ‌న్లో డాక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న విపుల్ తో గ‌త జ‌న‌వ‌రిలో వివాహం జ‌రిగింది. పెళ్ల‌యిన  రెండు నెల‌ల‌కు విపుల్ లండ‌న్ వెళ్లి పోయారు. ఖుష్పు పాస్ పోర్ట్ వీసా వంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడానికి ఇండియాలోనే ఉండిపోయారు. చివరకు అన్నీ క్లియరెన్సులూ వచ్చి భర్త వద్దకు చేరుకోవడానికి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.   ఖుష్బూ   తండ్రి,  స్థానిక బీజేపీ నేత, వ్యవసాయదారుడు. తన కుమార్తెను తీసుకుని   జూన్ 11 రాత్రి అహ్మదాబాద్ కు చేరుకున్నారు. కుమార్తెకు వీడ్కోలు ఇచ్చే ముందు ఎయిర్ పోర్టు వద్ద సెల్ఫీ తీసుకుని తమ కుటుంబ గ్రూపులలో షేర్ చేశారు. అదే చివరి చూపు, చివరి ఫొటో అయ్యింది. విమాన ప్రమాదంలో ఖుష్బు మరణించారు. కొత్త జీవితంపై కోటి ఆశలతో అహ్మదాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఖష్బు ప్రాణాలు ఆ ప్రమాదంలో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.  

ఆశలను చిదిమేసిన విమాన ప్రమాదం.. మాటలకందని విషాదం

విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ కు చెందిన  ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లోనే పని చేస్తున్నారు. ఆయన కల కుటుంబం మొత్తాన్ని లండన్ కు తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలని. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చిందని సంబరపడ్డారు. భార్యా, ముగ్గురు పిల్లలను తీసుకుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరారు. విమానం టేకాఫ్ కు ముందు కుటుంబంతో సెల్ఫీ దిగి బంధుమిత్రులకు గుడ్ బై చెబుతూ షేర్ చేశారు. అయితే అదే చివరి ప్రయాణమనీ, తిరిగి రాని లోకాలకు వెడుతున్నామనీ ఆ క్షణంలో వారికి తెలియదు.  లండన్ ప్రయాణం ఖరారు కావడంతో ప్రతీక్ జోషి భార్య కోమి వ్యాస్  తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ లు సహా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించారు.   గత ఆరేళ్లుగా లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతీక్ జోషి.. ఈ ఆరేళ్లూ భార్యాబిడ్డలను లండన్ తీసుకువెళ్లి అక్కడ స్థిరపడాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. ఆ లక్ష్య సాధన కోసం శ్రమించారు. చివరకు అన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలో.. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా.. ఘోర విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది.    ఇలా ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. అందులో రాజస్థాన్ కు చెందిన ఖుష్బూ గాధ ఒకటి. ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. ఆమె భర్త లండన్ లో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  తన భర్తను కలిసేందుకు ఆమె లండన్ బయలుదేరారు.  అయితే ఆమె లండన్ చేరలేదు. ఆహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే భారత పర్యటనకు వచ్చిన ఇద్దరు బ్రిటిషర్లది మరో విషాదం. భారత్ సంస్కృతి పట్ల అభిమానంతో.. భారత్ లో పర్యాటక ప్రదేశాలను చూసి ఆ అనుభవాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలన్న ఆశలో  ఇద్దరు బ్రిటిషర్ లు భారత పర్యటనకు వచ్చి... బ్రిటన్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇద్దరూ అసువులు బాసారు. బుధవారం (జూన్ 11) వీరు   ఇన్ స్టా గ్రాంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ లో ఇది మాకు చివరి రాత్రి అంటూ మొదలు పెట్టి.. భారత్ పర్యటన మాకు ఎన్నో మరపురాని అనుభూతులను మిగిల్చింది. ఈ పర్యటనతో భారత్ పట్ల మా అభిమానం, ఇష్టం ఎన్నో రెట్లు పెరిగింది. కొన్ని గంటల్లో ఈ దేశం విడిచి వెడుతున్నాం. అందుకు చాలా బాధగా ఉంటోంది అంటూ సాగిన వారి ఇన్ స్టా గ్రాం పోస్టు కంటతడి పెట్టిస్తోంది. భారత్ పై అంతటి అభిమానాన్ని పెంచుకున్న వారు  ఇలా విమన ప్రమాదంలో మరణించడం బాధేస్తోందంటూ నెటిజనులు కామెంట్లు పెడతున్నారు. 

విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత్ కు బ్రిటన్ ఏఏఐబీ బృందం

అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఎయిర్ ఇండియాకు చెందిన  విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  కూలిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విమాన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ కు అండగా ఉంటామని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.  ప్రధాని నరేంద్రమోడీ ప్రమాద స్థలాన్ని ఈ రోజు సందర్శించనున్నారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అదలా ఉంటే..  ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తులో పాలుపంచుకునేందుకు  బ్రిటన్‌కు చెందిన  ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్  (ఏఏఐబీ) బృందం భారత్‌కు వస్తోంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో  ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఏఏఐబీ  ఈ దర్యాప్తులో భారత్ కు సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున, భారత దర్యాప్తులో తమకు 'నిపుణుల హోదా' ఉంటుందని బ్రిటన్ పేర్కొంది.   విమాన ప్రమాదంలో మరణించిన వారిలో వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒక కెనడా పౌరుడు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఉన్నారు. 

పక్షులు ఢీ కొనడం వల్లే విమానం కుప్పకూలిందా?

అహ్మ‌దాబాద్  విమాన ప్రమాదంలో 8200 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్, అలాగే  కోపైలట్  కో పైలట్ క్లైవ్  కుంద‌ర్  మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 298 మంది చనిపోయారు. మరణించిన వారిలో 241 మంది విమాన ప్రయాణీకులు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన మిగిలిన వారంతా బీజే మెడికల్ కాలేజీ విద్యార్థలు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ ను ఢీ కొనడంతో వారు మరణించారు. లంచ్ టైమ్ లో ఈ దారుణం సంభవించింది. భోజనాలు చేస్తున్న విద్యార్థులు అలాగే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా కూడా వైద్య విద్యార్థులే. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.   విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. ప్రాధ‌మికంగా అయితే ప‌క్షులు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  

జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

  జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ ఇన్‌చార్జిగా సీతక్క, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జిగా తుమ్మల నాగేశ్వర రావు, మహబూబ్ నగర్ ఇన్‌చార్జిగా దామోదర్ రాజనర్సింహా, రంగారెడ్డి ఇన్‌చార్జిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్‌చార్జిగా పొన్నం ప్రభాకర్‌, వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.  సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సీపీఆర్‌ఓ గా గుర్రం మల్సూర్‌ను ప్రభుత్వం  నియమించింది. 

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు

  తెలంగాణలో భారీగా  ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు  ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, . పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది.  గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది.  సిద్దిపేట కలెక్టర్‌గా కే హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌ను నియమించింది. 

ఒక విమాన ప్రమాదం...ఎన్నో ముఖ్యాంశాలు

  పాపం ఆ మెడికోలు.. వారి హాస్టల్ పక్కనే.. అహ్మదాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటే అదో ల్యాడ్ మార్క్ అనుకున్నారు. మా హాస్టల్ ఎయిర్ పోర్టు పక్కనే ఉందని చెప్పుకుంటే అదో గర్వకారణంగా భావించారు. కానీ, జూన్ 12న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో.. బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన 30 సెకన్లకే.. తాము భోంచేస్తున్న సమయంలో వచ్చి మీద పడి.. తమ వారి ప్రాణాలను పట్టుకుపోతుందని వారు అస్సలు ఊహించలేదు. వచ్చే రోజుల్లో ఇదే హాస్టల్లో కూర్చుని ఈ మెడికోలు భోం చేస్తుంటే.. ఏదైనా ఫ్లైట్ ఎగురుతున్న శబ్ధం రాగానే వారి గుండె గతుక్కుమనడం ఖాయం. అయినా ఇది ఎంత అన్యాయమైన అనుభవం? ఇక ఇదే ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్. ఇదే ఫ్లైట్ లో తాను సీపీ- 11 ఏ సీటు రిజర్వ్ చేసుకుంటున్నపుడు బహుశా అనుకుని ఉండడేమో. తానీ సీటు ద్వారా బతికి బట్టకట్టబోతున్నానని. వచ్చే రోజుల్లో ఈ సీటు నెంబర్ కి డిమాండ్ ఏర్పడినా ఏర్పడుతుంది కాబోలని అంటారు కొందరు. ఇంతటి విషాదంలోనూ కాస్తంత ఊరటనిచ్చే అంశం ఇదే. అన్నింటికన్నా అత్యంత విచారకరం.. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం. ఇది గుజరాత్ ప్రజలను చాలా చాలా దారుణంగా బాధిస్తోంది. లండన్ లో ఉన్న తన భార్యను చూడ్డానికి వెళ్తున్న ఆయన ఈ విధంగా విమాన ప్రమాదంలో పడి కాలి బూడిదవుతారని మాత్రం ఎవరు ఊహించగలరు? ఇక ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులుండగా, బ్రిటీషర్లు- 53, పోర్చుగీసు- ఏడుగురు ఒక కెనడియన్ ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, పది మంది ఫ్లైట్ క్రూ  సైతం ఉండటం.. ఈ ప్రమాద తీవ్రత ఎలాంటిదో చెప్పే గణాంకం. ఒక్కొక్కరికీ కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూపు. అయితే ఈ ప్రమాదానికి కారణం పక్షులు వచ్చి గుద్దుకోవడంగా భావిస్తున్నారు. ప్రమాద స్థలిలో చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, వాటిపై పక్షులు వాలే అవకాశాలెక్కువ కావడం వల్ల.. ఇదే జరిగి ఉంటుందని ఇప్పటికైతే ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇదే ప్రమాదం ద్వారా కొందరికి తెలియని విషయం ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో మేడే కాల్ అంటూ ఒకటి చేస్తారని.  ఈ కాల్ వచ్చిందంటే ఆ ఫ్లైట్ డెత్- డేంజర్లో పడి ఉంటుందని ఏటీసీ భావించాల్సి ఉంటుంది. అంతే కాదు బోయింగ్ 787 - 8 మోడల్లోని ఈ డ్రీమ్ లైనర్ 2011 లో ప్రపంచ విమానరంగానికి పరిచయం కాగా.. ఇప్పటి వరకూ 100 కోట్లకు పైగా ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చిందట. సరిగ్గా అదే సమయంలో ప్రమాదం జరిగిన ఈ ఏ1 171 అనే ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ 787-8 విమానం ఆరు నెలల క్రితం అంటే, గత డిసెంబర్లో ఒకసారి సాంకేతిక సమస్యతో ఇలాగే ఆగిపోయిందట. అప్పట్లో ఇదే విమానంలో 300 మంది ఉండగా.. వారందరి లండన్ ప్రయాణం నిలిచిపోయిందట.   ఇక ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదం ఎప్పుడని చూస్తే 2020 సంవత్సరం- కేరళలో. అప్పట్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ద్వారా ఇద్దరు సిబ్బందితో పాటు 21 మంది మరణించారు.అయితే డ్రీమ్ లైనర్ సీరీస్ అయిన ఈ భారీ విమానాన్ని బోయింగ్ తెచ్చిన ఉద్దేశమేంటంటే.. లైట్ వెయిట్ తో తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణ సదుపాయం కల్పించాలని. ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే కాక.. అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, జపాన్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్‌లు సైతం ఈ మోడల్ విమానాలను కలిగి ఉన్నాయి.  ఎందుకంటే ఇది ఏక్ దమ్ 13 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. దీంతో దూరభారాలకు సంబంధించి దీన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తాయి విమానయాన సంస్థలు.అయితే ఇప్పటి వరకూ ఈ డ్రీమ్ లైనర్ ని వాడిన పైలెట్లు ఇంజిన్ మీద, బ్యాటరీ మీద, ఇతరత్రా సాంకేతిక సమస్యలపై ఎన్నో సార్లు కంప్లయింట్ చేశారు. 2013లో రెండు వేర్వేరు ఘటనల ద్వారా.. జపాన్ విమాన యాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని ద్వారా ప్రయాణాలను నిలిపివేశారు. డ్రీమ్ లైనర్ సీరీస్ పై 2024లో యూఎస్ సెనెట్ కి కూడా కంప్లయింట్లు వెళ్లాయి.  దీంతో FAA దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ఇలా కొనసాగుతుండగానే ఈ భారీ ప్రమాదం జరగటం.. ఇటు టాటా వారి ఎయిర్ ఇండియాకి మాత్రమే కాదు బోయింగ్ డ్రీమ్ లైనర్ సీరీస్ మనుగడకే ప్రమాదం వచ్చిపడేలా తెలుస్తోంది.

మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్

  అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం ఘటనపై టాటా గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం టాటా గ్రూప్ ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నాది. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని ప్రకటించింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా మృతిచెందారు.  ఈ ఘటన మొత్తం దేశాన్ని కలిచివేసింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విమాన ప్ర‌మాదంలో మాజీ సీఎం రూపానీ మృతి..నిర్దారించిన అధికారులు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు  ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171, అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చున్నట్లు తెలుస్తోంది. రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు. తన ప్రశాంత స్వభావం, దృఢమైన పరిపాలనా శైలితో పేరుపొందిన ఆయన, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, కోవిడ్ అనంతర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న కీలక సమయంలో గుజరాత్‌ను సమర్థవంతంగా నడిపించారు.  ఆయన పాలనలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విజయ్ రూపానీ సతీమణి అంజలి రూపానీ సామాజిక కార్యకర్త. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. మృదుస్వభావిగా, క్రమశిక్షణ కలిగిన జీవనశైలితో, బలమైన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా రూపానీకి పేరుంది. ఆయన తరచూ గుజరాత్‌లోని వివిధ దేవాలయాలను సందర్శిస్తూ, మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన ఆకస్మిక మరణం గుజరాత్ రాజకీయాల్లో, బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  

విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది..ఎవరినీ వదలం : రామ్మోహన్ నాయుడు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంఘటనా స్థలాన్ని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానం కూప్పకూలిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు  ప్రమాద ఘటన వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రమాదం విషయం తెలియగానే విజయవాడ నుంచి బయలుదేరానన్నారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని.. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని.. విమాన ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో విజయ్‌ రూపానీ ఉన్నారన్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో  డైరెక్టర్ జనరల్ దర్యాప్తు కోసం బృందంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రమాదానికి సంబంధించి అన్ని కారణాలపై ఆరా తీస్తున్నది. దర్యాప్తు తర్వాత ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశాలున్నాయి  

మృత్యుంజయుడు.. ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు

  ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ మాలిక్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే  సీటు ఏ11 ప్రయాణికుడు నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రయాణికుడు 38ఏళ్ల రమేష్‌ పటేల్‌ అని తెలుస్తోంది. విమానం కూలిన తర్వాత ఎమర్జెన్సీ గేటు నుంచి భయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే,మృతుల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ నివాస ప్రాంతంలో విమానం  కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’అని కమిషనర్ అన్నారు. కాగా అతనికి ఛాతీ, కన్ను, కాలికి గాయాలయ్యాయి. మృత్యుంజయుడగా ప్రమాదం నుంచి  ప్రాణాలతో బయటపడ్డాడు.