భర్త కోసం లండన్ ప్రయాణం.. ప్రమాదంతో అనంతలోకాలకు.. నవ వధువు విషాదం
posted on Jun 13, 2025 @ 10:18AM
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో తన భర్తను కలవడానికి రాజస్థాన్ నుంచి యూకే వెడుతున్న నూతన వధువు ఖుష్బూ ఒకరు. రాజస్థాన్ బలోత్రా జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఖుష్బుకు లండన్లో డాక్టర్ గా పని చేస్తున్న విపుల్ తో గత జనవరిలో వివాహం జరిగింది. పెళ్లయిన రెండు నెలలకు విపుల్ లండన్ వెళ్లి పోయారు. ఖుష్పు పాస్ పోర్ట్ వీసా వంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడానికి ఇండియాలోనే ఉండిపోయారు. చివరకు అన్నీ క్లియరెన్సులూ వచ్చి భర్త వద్దకు చేరుకోవడానికి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
ఖుష్బూ తండ్రి, స్థానిక బీజేపీ నేత, వ్యవసాయదారుడు. తన కుమార్తెను తీసుకుని జూన్ 11 రాత్రి అహ్మదాబాద్ కు చేరుకున్నారు. కుమార్తెకు వీడ్కోలు ఇచ్చే ముందు ఎయిర్ పోర్టు వద్ద సెల్ఫీ తీసుకుని తమ కుటుంబ గ్రూపులలో షేర్ చేశారు. అదే చివరి చూపు, చివరి ఫొటో అయ్యింది. విమాన ప్రమాదంలో ఖుష్బు మరణించారు. కొత్త జీవితంపై కోటి ఆశలతో అహ్మదాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఖష్బు ప్రాణాలు ఆ ప్రమాదంలో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.