జోరు వానను లెక్కచేయన జనం.. రావిర్యాలలో రఫ్పాడించిన రేవంత్ 

అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్లాండ్ లీడర్ గా ఈ మల్కాజ్ గిరి ఎంపీకి పేరుంది. కొన్నేండ్లుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై మాట్లాడేందుకు నేతలంతా జంకుతున్నా.. తనదైన శైలిలో ఆయన విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ గా నియమించాకా మరింత జోరు పెంచారు రేవంత్ రెడ్డి. ప్రజాసమస్యలపై వరుస ఆందోళన కార్యక్రమాలతో అధికార పార్టీలో అలజడి రేపుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలో దరువేస్తున్నారు. పంచ్ డైలాగులు, పవర్ వుల్ ఆరోపణలతో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత భారీగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పాలనపై విసిగిపోయిన జనమంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. దీంతో రోజురోజుకు ఆయన క్రేజీ పెరిగిపోతోంది. ఎంతగా అంటే ఆయన కోసం ఏదైనా చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి సభ ఉందంటే వందల కిలోమీటర్లు సొంతగానే వెళుతున్నారు. ఇటీవల ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ సభ సక్సెస్ ఇందుకు ఉదాహారణ. తాజాగా రావిర్యాలలో జరిగిన రెండో సభను జనం పోటెత్తారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సభకు హాజరయ్యారు. సభకు రావడమే కాదు రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసేవరకు అంతా కదలకుండా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి ముందే భారీగా వర్షం కురిసింది. అయినా ఎవరు కదలలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జోరు వాన పడింది. అయినా వెనుదిరగకుండా అలాగే సభలో ఉండిపోయారు జనాలు. రేవంత్ రెడ్డి విసురుతున్న డైలాగులకు జేజేలు కొడుతూ విన్నారు. రావిర్యాల సభలో వచ్చిన స్పందన చూసిన వారంతా రేవంత్ రెడ్డి మేనియాను చూసి ఆశ్చర్యపోతున్నారు. రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి తన మార్క్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. రాష్ట్ర సీఎం, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేస్తామని అన్నారు తెలంగాణ కోసం పోరాడింది ఎవరూ.. సంపదను దోచుకుంటుంది ఎవరో ప్రజలు తెలుసుకోవాలని జనానికి పిలుపిచ్చారు. ఏడేళ్ల పాలనలో విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు.. ఇలా అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను పీసీసీ చీఫ్ చేయడంతో ప్రగతి భవన్ లో పిడుగు పడిందని.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని విమర్శించారు. అందుకే గత నెల రోజుల నుంచి కాళ్లు కాలిన పిల్లిలెక్క.. కల్లు తాగిన కోతిలెక్క గంతులేస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తే ఒక్క నియోజకవర్గంలోని దళితులకు రూ. 10 లక్షలు ఇస్తా అంటున్నారు. వారికే కాదు జై భీమ్, జై సేవాలాల్ అన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సచ్చింది ఒకరైతే.. సంపాదన కొల్లగొట్టింది మరొకరనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రిజర్వేషన్లు, పట్టాలు, భూములు, ఇండ్లు, ఉపాధి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అందులోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకులు, కేసీఆర్ మోచేతి నీళ్లకు ఆశ పడుతారని.. కానీ, తెలంగాణ బిడ్డలు మాత్రం స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారని.. ప్రజలకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. గత ఏడేండ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు కానీ.. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి, కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, బిడ్డకు ఎంపీ, ఎమ్మెల్సీ వస్తే.. సడ్డకుని కొడుక్కి రాజ్యసభ వచ్చింది అంటూ చురకలు వేశారు. ఈ పదవులతో కోట్లు కూడబెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని.. మరి అమరవీరులకు ఏం వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. త్వరలోనే గడీల పాలనకు బుద్ధి చెబుతామని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేస్తామంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.  

కదం తొక్కి.. పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

తెలంగాణ ప్రజల కడుపు మండుతోంది.. కండలు కరుగుతున్నయ్.. పేదలు ఆకలితో అలమటిస్తున్నారని కేసీఆర్ స‌ర్కారుపై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తొలి అడుగు ఇంద్రవెల్లిలో పెట్టినం.. మలి అడుగు మహేశ్వరంలో పెట్టినం.. ఇక మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద పెడుతాం అంటూ హెచ్చరించారు. రావిర్యాల దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్‌.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం తొక్కి.. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ద‌ళిత‌-గిరిజ‌న‌ సభ ద‌గ్గ‌ర పల్లీలు అమ్ముకునే వారు ఉన్నంత మంది కూడా.. హుజురాబాద్ సీఎం సభలో లేరని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు.  బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విరుచుకుప‌డ్డారు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలన్నారు. ‘‘ తెలంగాణ ప్రజలు ఆవేశంతో ఉన్నారు. మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారు. కృష్ణానది ఉప్పొంగినట్లు కాంగ్రెస్‌ సభకు ప్రజలు వచ్చారు. సీఎం హుజూరాబాద్‌ సభకు ఎంతమంతి వచ్చారో చూశాం. కాంగ్రెస్‌ సభలు చూసి కేసీఆర్‌ గుండెల్లో గునపం దిగినట్లుంది. టీఆర్ఎస్‌ ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయి’’ అని మండిప‌డ్డారు రేవంత్‌రెడ్డి.  దళిత బంధు పేరుతో ఓట్ల వేటకు బయల్దేరిన కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఏడేళ్ల పాలనలో ఎస్సీలను, ఎస్సీ అధికారులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌ .. ఎన్నికల కోసం కొత్త నాటకాలకు తెరతీశారని విమ‌ర్శించారు. దళిత బంధు కింద ఇస్తున్న రూ.10లక్షలు ఎవరి భిక్షం కాదని, ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు బాగుపడలేదని, సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రం ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆరోపించారు. విద్య, ఉపాధి కల్పించకుండా దళితబంధు పేరుతో కొత్త మోసానికి తెరతీశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్‌ ఎన్నికలు వేదిక కావాలన్న రేవంత్‌రెడ్డి.. మోసపూరిత హామీలను నమ్మి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలను కోరారు.    

సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు.. జైలు ఖాయమేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సంస్థల విచారణ ముమ్మరమైంది. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. వరుసగా చార్జీషీట్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి తాజాగా సీఎం జగన్ కు  సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.  వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణకు కూడా సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్ టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డితో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్‌కూ సమన్లు జారీ అయ్యాయి.  ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈనెల 25న తీర్పు రాబోతోంది. రఘురామ పిటిషన్ లో సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో నిర్ణయాన్ని కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తూ సీబీఐ కౌంటర్ వేసింది. బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపై న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని సీబీఐ తమ రిజైండర్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు.దీంతో జగన్ బెయిల్ రద్దు కేసులో సంచలన తీర్పు రాబోతోందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి రఘురామ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని, జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దాంతో పాటు జగన్ బెయిల్ రద్దయితే ఏపీకి కాబోయే సీఎం ఎవరు? ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటి? అన్న అంశాలపైనా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి ఆగస్టు గండంతో  జగన్ శిబిరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తాడేపల్లి క్యాంప్ వర్గాలు చెబుతున్నాయి. 

నానా పటేకర్ రాజకీయ తూటాలు.. వైరల్ చేస్తున్న జనాలు! సమాధానం చెప్పదెవరు? 

నానా పటేకర్ ఒక విలక్షణ నటుడు. సామాజిక స్పృహ కలిగిన మంచి రచయిత, కథకుడు, నిర్మాత, దర్శకుడు ... ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యమ కార్యకర్త. ఆయన తమ మనసులో మెదిలిన కొన్ని ఆలోచనలు, సంఘర్షణలకు అక్షర రూపం ఇచ్చారు ... కొనీ నిర్దిష్ట ప్రశ్నలను లేవనెత్తారు.. నిజానికి ఇవేవి కొత్తగా పుట్టుకొచ్చిన ప్రశ్నలు కాదు. మన అందరిలో రగులుతున్న అగ్నికణాలే  .. గొంతెత్తి నిలతీయాలని ... అనుకుంటూ .. అసక్తతతో గొండులోనే ఆగిపోతున్న చేదు గుళికలనే .. నానా పటేకర్ ..అక్షర తూటాలు చేసి సంధించారు ...  అవును .. మందరికీ కాకపోయినా కొందరికి అయినా, ఎప్పుడో అప్పుడు, ఇదేమిటి ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతు .. అదే పొలంలో అలా చనిపోవడం ఏమిటి, ఆ రైతు కొడుకు ఎక్కడో, దేశ సరిహద్దుల్లో, ఏ ముష్కరడో పేల్చిన తూటాకు నేల కొరగడం ఏమిటి? ఏమీ కానీ వాడు, ఏమీ చేయని వాడు ... రాజకీయ వేషం కట్టిన వాడు ఇక్కడ దేశంలో ... వాడి కడుపున  పుట్టడం తప్ప ఇంకే అర్హత, యోగ్యతా లేని, వాడి సంతానం అక్కడ విదేశాలలో అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ... విలాసవంత మైన జీవితాలను గడపడం ఏమిటి? అన్న ప్రశ్నలు వెంటాడే ఉంటాయి కదా.. అదిగో అలాంటి  ప్రశ్నలే .. నానా పటేకర్... మన ముందుంచారు ..చూడండి ..  రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు, కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు. ఇదేమిటి ... ఇదెక్కడి న్యాయం ? అని పటేకర్ తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని లోకాన్ని అని సమాజాన్ని నిలదీస్తున్నారు.  అలాగే రాజకీయ నాయకుల విద్యార్హతలను ప్రశ్నిస్తూ .. ఓక్ చేదు నిజాన్ని పటేకర్ నినదించారు .. ఆచేదు నిజం ఏమంటే,  ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి. అలాగే తమలో నిండిన అక్రోశాన్ని వ్యక్తపరుస్తూ ...ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు నేల కొరుగుతారో .. ఏ రోజు  నేతల పంటలకు అగ్గి తగులుతుందో... ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి, అంటారు. అదే విధంగా పటేకర్ ... ఒక్క సారి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి జీవితాంతం  పెన్షన్, ఇతర సదుపాయాలు ఎందు కివ్వాలి? ప్రశ్నిస్తున్నారు.. 25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ ఉండదు.కానీ,ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు.ఇలా ఎందుకు ఇవ్వాలి?  అలాగే పటేకర్ సంధించిన మరి కొన్ని తూటాలు .. నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.కానీ,భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు? రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.కాని,మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.రైతు తినేది దొంగ సొమ్మా? నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం. విద్యలో రాజకీయం 100% రాజకీయంలో విద్య 00% ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది.దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.నిజం, కానీ, నిజంగా చూస్తామా .. ఎప్పటికైనా అలాంటి రోజు ఒకటి వస్తుందా, అనుమానమేలేదు .. రాదు.  ₹399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి ₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?  ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా? అందరూ ఆలోచించాలి. అంతటూ నానా పటేకర్ .. తమ మనసు విప్పి మనముందు ఉంచారు.

బ‌ట్ట‌లు చింపి.. వంద‌లాది మంది చెర‌బ‌ట్టి.. పాక్ మ‌హిళపై మూక దాడి..

అది అఫ్ఘ‌నిస్తాన్ కాదు. వాళ్లు తాలిబ‌న్లు కూడా కాదు. కానీ, అంత‌కుమించి దారుణానికి తెగించారు పాకిస్తానీయులు. అది కూడా పాక్ ఇండిపెండెన్స్ డే రోజున‌. ఓ మ‌హిళా టిక్ టాక‌ర్ బ‌ట్ట‌లు లాగేసి.. గాల్లోకి ఎగ‌రేస్తూ.. అక్క‌డి వీధుల్లో ఊరేగించారు ఛాంద‌స‌వాదులు. పాక్ ముష్క‌ర మూక‌లు.  ఆగస్టు 14న లాహోర్‌లోని మినార్-ఈ-పాకిస్థాన్​ ద‌గ్గ‌ర‌ ఓ మహిళా టిక్​ టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో వందలాది మంది గుర్తుతెలియని దుండ‌గులు.. ఆ మహిళపై ఒక్క‌సారిగా దాడి చేశారు. పెద్ద గుంపు మీద ప‌డ‌టంతో అంతా బిత్త‌ర‌పోయారు.  ఆ లేడీ టిక్ టాక‌ర్‌ను వివస్త్రను చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె బ‌ట్ట‌లు లాగేసి గాల్లోకి ఎగరేసి పైశాచికంగా ప్ర‌వ‌ర్తించారు. మహిళపై వంద‌లాది మంది చేసిన మూక‌ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసిన వారంతా దుండ‌గుల దుశ్చ‌ర్య‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాధితురాలికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.  మూక దాడి అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు.. త‌న గ్రూప్ సభ్యులనూ వేధించారని.. పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తన ఒంటిపై ఉన్న బంగారం, సెల్ ఫోన్, 15వేలు నగదు లాగేసుకున్నారని కూడా కంప్లైంట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  మ‌హిళా టిక్ టాక‌ర్‌పై జ‌రిగిన‌ దారుణ ఘటనపై లాహోర్ డీఐజీ సాజిద్​ ఖియానీ స్పందించారు. దాడికి పాల్పడిన మూక‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక‌ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మ‌హిళ‌పై జ‌రిగిన పైశాచిక‌త్వంపై పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. తాలిబ‌న్ల‌లా ప్ర‌వ‌ర్తించిన ఆ పైశాచిక మూక‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.   

ప్రభుత్వ జీవోలు ఎందుకు దాచేస్తున్నారు.. హైకోర్టు సీరియస్ 

ఆంధ్రపదేశ్ లో ప్రస్తుతం జీవోల రచ్చ జరుగుతోంది. ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిగా బరి తెగించింది. పారదర్శకతకు పూర్తిగా పాతరేస్తూ జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్లలో పెట్టకూడదని నిర్ణయించింది. పాలనకు సంబంధించిన జీవోలు ప్రజలకు తెలియకుండా ఉండాలన్న  జగన్ ప్రభుత్వం నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో రచ్చ సాగుతోంది. విశ్వసనీయత, పారదర్శకత పై పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జీవోలు రహస్యంగా ఉంచుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రహస్య జీవోలు, ఖాళీ జీవోలు, కనిపించని జీవోలు అంటూ తెలుగుదేశం పార్టీ జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.  తాజాగా ఏపీ బాటలోనే తెలంగాణ సర్కార్ కూడా పారదర్శకతను తుంగలో తొక్కిన అంశాలు బయటికి వచ్చాయి. కేసీఆర్ సర్కార్  అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో లేకుండా దాచేసిందన్న అపవాదును మూటగట్టుకుంది. తెలంగాణలో అసలు వెబ్ సైట్ లోనే జీవోలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళితబంధు నిధులు విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్ సైట్ లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం తరుఫున అడ్వొకేట్ జనరల్  ప్రసాద్ స్పందించారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషన్ లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్ ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది శశికరణ్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని   ఘాటుగా ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం.. దళితబంధుపై దాఖలైన పిటిషన్ పై విచారణ ముగించింది.

హైకోర్టు భవన విస్తరణకు నిధులు.. కర్నూల్ కు షిప్టింగ్ లేనట్టేనా?

మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్ రెడ్డి వెనక్కి తగ్గారా? అమరావతిపై ఆయన మనసు మార్చుకున్నారా? అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. అమరావతి సచివాలయానికే వెళ్లడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి జగన్.. ఇకపై రెగ్యులర్ గా సచివాలయానికి వెళతానని ఇటీవలే ప్రకటించారు. ఇంతలోనే ముఖ్యమంత్రి పంద్రాగస్టు ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. తాజాగా జరిగిన మరో అంశం కూడా మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ రెడ్డి వెనక్కి తగ్గారా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అమరావతిలోని హైకోర్టు భవన విస్తరణకు వైసీపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది.  అమరావతిలో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతకొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనల్ని అంగీకరించని ప్రభుత్వం..  హఠాత్తు గా ఆమోదించింది. ఇందుకోసం రూ. 29 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది.అమరావతిలో ఇపుడున్న హైకోర్టు  భవనం హైకోర్టు పూర్తిస్ధాయి కార్యకలాపాలకు సరిపోవటంలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. తమ అవసరాలకు వెంటనే మరో భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో హైకోర్టు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇపుడున్న భవనం పక్కనే అదనంగా మరో  భవనాన్ని నిర్మించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రౌండ్+ మూడంతస్తుల భవనం నిర్మాణం 76 వేల చదరపు అడుగుల్లో ఉండనుంది. దీని నిర్మాణానికి రు. 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.  మొదట్లో 5 అంతస్తులు నిర్మించాలని అనుకున్నా ఎందువల్లో రెండంతస్తులు తీసేసి మూడంతస్తులకే పరిమితం చేశారు.  ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు భవనం కాదు. దాన్న జిల్లా కోర్టుగా వినియోగించుకుంటారు. అసలు హైకోర్టు భవనానికి డిజైన్లు ఖరారు కావడం ఆలస్యం కావడంతో ముందుగా ఈ భవనాన్ని శరవేగంగా నిర్మించారు. అసలు హైకోర్టు భవనం నిర్మాణం కూడా ప్రారంభమైంది. పునాదులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం మారడంతో అన్ని అమరావతి నిర్మాణాల్లాగే వాటినీ నిలిపివేశారు. నిర్మాణం కొనసాగి ఉంటే శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయి ఉండేది. కానీ ఆ నిర్మాణం నిలిపివేయడంతో ప్రస్తుతం ఉన్న భవనం హైకోర్టు కార్యకలాపాలకి సరిపోవడం లేదు. అదనపు భవన నిర్మాణంపై హైకోర్టు నుంచిచాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి. అయితే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకనుకున్నారో కానీ కర్నూలుకు తరలిపోయే హైకోర్టుకు అదనపు ఖర్చు ఎందుకు అనుకున్నారో కానీ హైకోర్టు ప్రతిపాదనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి కారణం ఏమిటో రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు.  ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబరులో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కర్నూలును న్యాయ రాజధాని గా ఏర్పాటు చేస్తామని చట్టం చేసింది. పాలనా వికేంద్రకరణ బిల్లు శాసనసభ, శాసనమండలిలో అనేక మలుపులు తిరిగినా చివరకు 2020 జూలైలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆమోదించిన పాలన వికేంద్రీకరణ చట్టం సీఆర్డీయే రద్దు చట్టాలను పలువురు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం కోర్టు స్టే విధించడంతో ఏడాదిన్నరగా పాలనా వ్యవహారాలు అమరావతి నుంచే కొనసాగుతున్నాయి. అదే సమయంలో రేపోమాపో రాజధాని తరలింపు అంటూ నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతలోనే అమరావతిలోని ఏపీ హైకోర్టు భవనాలను విస్తరించాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.  ఇదంతా బాగానే ఉందికానీ కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే మానవహక్కుల కమీషన్, లా కమీషన్ కార్యాలయాలను కర్నూలులోనే ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇపుడున్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని అమరావతిలోనే నిర్మించటంలో అర్ధమేంటి ? అన్నదే అర్ధం కావటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్నూలుకు హైకోర్టు తరలివెళ్ళటం ఇప్పుడిప్పుడే జరిగేపని కాదా అనే డౌటు పెరిగిపోతోంది. ఆగస్టు 15 వేడుకల ప్రసంగంలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఆ తర్వాత హైకోర్టు విస్తరణకు అనుమతి ఇచ్చారు. ఈ పరిణామాలతో ప్రభుత్వ విధానంపై రకరకాల చర్చలు జరగుతున్నాయి. మూడు రాజధానులపై సీఎం జగన్ వెనక్కి తగ్గారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

భార‌త్‌పై అఫ్ఘ‌నిస్తాన్‌ ఎఫెక్ట్‌.. వీటి ధ‌ర‌లు పెర‌గొచ్చు..

అఫ్ఘ‌నిస్తాన్‌. పేరుకు మామూలు దేశ‌మే అయినా.. దానికీ కొన్ని విష‌యాల్లో డిమాండ్ ఉంది. దేశాల మ‌ధ్య వ్యాపారం పెరిగిన నేప‌థ్యంలో.. ఒక ద‌గ్గ‌ర నాణ్య‌మైన స‌రుకు ఉందంటే.. యావ‌త్ ప్ర‌పంచం అక్క‌డ వాలిపోతుంది. అఫ్ఘ‌న్ సైతం అనేక దేశాల‌తో ప‌లు ర‌కాల బిజినెస్ చేస్తోంది. ఇండియా కూడా పొరుగు దేశం నుంచి ప‌లు వ‌స్తువులు పెద్ద ఎత్తున‌ దిగుమ‌తి చేసుకుంటోంది. మ‌రికొన్ని దిగుమ‌తుల‌కు త‌న భూభాగాన్ని అనుమ‌తిస్తూ భార‌త్‌కు స‌హ‌క‌రిస్తోంది అఫ్ఘ‌నిస్తాన్‌. తాజాగా, అఫ్ఘ‌న్ తాలిబ‌న్ల వ‌శం కావ‌డంతో ఇండియాపై ప‌లుర‌కాలుగా ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ప్ర‌భావం ప‌డ‌నుంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం విష‌యం ప‌క్క‌న‌పెడితే.. ప‌లు వ్యాపార అంశాల్లో భార‌త్‌పై ఎఫెక్ట్ ప‌డొచ్చ‌ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్- CAIT అంటోంది. ఇండియా - అఫ్ఘనిస్తాన్ మధ్య 2020-21లో 1.4 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జ‌రిగింది. అఫ్ఘ‌న్ నుంచి దిగుమ‌తుల‌తో పాటు.. మ‌న ద‌గ్గ‌రి నుంచి ప‌లు వ‌స్తువులు ఆ దేశానికి ఎగుమ‌తి కూడా అవుతుంటాయి. కాబూలీ చెన‌.. వినే ఉంటారుగా. పెద్ద సైజులో, తెల్ల‌గా ఉండే శ‌న‌గ‌లు. పేరులోనే ఉందిగా కాబూలీ అని. ఆ ర‌కం శ‌న‌గ‌ల‌కు అఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌ధాన కేంద్రం. ఇప్పుడు ఆ శ‌న‌గ‌ల దిగుమ‌తిపై ప్ర‌భావం త‌ప్ప‌కుండా ప‌డుతుంది. ఆ మేర‌కు ధ‌ర పెరుగుతుంది. శన‌గ‌లనే కాదు.. ప‌లు ర‌కాల డ్రైఫ్రూట్స్‌కు ఆ దేశం ఫుల్ ఫేమ‌స్‌. ఎండు ద్రాక్ష‌, వాల్‌న‌ట్‌, బాదం, పిస్తా, ఎండిన ఆప్రికాట్‌, అత్తి, పైన్ గింజ‌లు, పుచ్చ‌కాయ‌, చెర్రీస్‌, నేరేడు పండ్లు, ప‌లుర‌కాల ఔష‌ధ మూలిక‌లు అఫ్ఘ‌నిస్తాన్ నుంచి భార‌త్‌కు భారీగా దిగుమ‌తి అవుతుంటాయి. తాజా సంక్షోభం కార‌ణంగా దిగుమ‌తి ప‌రిమాణం త‌గ్గి.. వీటి ధ‌ర‌లు పెర‌గ‌వ‌చ్చు. ప్ర‌జ‌ల‌పై మ‌రింత భారం ప‌డొచ్చు.   

ద్యావుడా..? తాలిబన్లు సమరయోధులట! ఎస్పీ ఎంపీపై దేశ ద్రోహం కేసు..

పరిస్థితులు మారిపోతున్నాయి. అనూహ్యమైన, అవాంఛనీయమైన రాజకీయ వ్యాఖ్యానాలు  కలకలం రేపుతున్నాయి. తాలిబాన్ల గురించి ప్రపంచమంతా కలవరపడుతుంటే.. భారత్ లోని కొందరు నాయకులు, కొన్ని పార్టీలు మాత్రం తాలిబాన్లకు తాబేదార్లుగా మారుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), సంభల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ షఫీక్-ఉర్-రెహమాన్ బర్క్ తాలిబాన్లను మన దేశ స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చి సలాం కొడితే.. ఆ తరువాత కొన్ని గంటల తేడాతోనే ఓ భారతీయ ఇస్లామిక్ పండితుడు అదే రాగం అందుకోవడం కలకలం రేపుతోంది.  ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా సజ్జాద్ నోమానీ వివాదాస్పద కామెంట్లు చేశారు. షఫీక్ రహమాన్ చేసిన కామెంట్లను జాగ్రత్తగా పరిశీలించిన స్థానిక పోలీసులు ఆయన మీద ఐపీసీ సెక్షన్  124 A ప్రకారం రాజద్రోహం కింద కేసు బుక్ చేశారు. అలాగే ప్రజల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యానాలు చేసినందుకు, ప్రవర్తించినందుకు 153A, 295 కింద కూడా సంభల్ ఎంపీ మీద ఎఫ్.ఐ.ఆర్. బుక్ అయింది. బ్రిటిష్ పరిపాలనలో భారత్ ఉన్నప్పుడు భారతీయులు స్వాతంత్య్ర పోరాటం చేశారు. ఇప్పుడు తాలిబాన్లు కూడా వారి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. తాలిబాన్లు ఒక అద్వితీయమైన శక్తి.. రష్యా, అమెరికా వంటి శక్తిమంతమైన దేశాలను తమ భూభాగంలోకి రానివ్వవు... అంటూ రెహమాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు కొన్ని గంటల వ్యవధిలోనే మౌలానా సజ్జద్ నోమానీ కూడా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. తాలిబాన్లు కాబూల్ ను ఆక్రమించి ఎంతో మంచిపని చేశారని, ప్రపంచంలో తాలిబాన్లు ప్రపంచంలోని తిరగులేని శక్తుల దుమ్ము దులిపారని, కాబూల్ నేలను ముద్దాడిన వీర యోధులకు సలామ్ అంటూ తన మనోల్లాసం ప్రకటించారు. కాబూల్ అధ్యక్ష భవనాన్ని ఆక్రమించాక ఎంతో మర్యాదగా, అణకువగా వ్యవహరించారని, అలాంటివారి ఆధ్వర్యంలో పాలన చాలా బాగుంటుందని అల్లా దయ వారి మీద ఉండాలని కోరుకున్నారు.  అయితే వారి ప్రకటనలు భారతీయుల్లో చీలికలు తెచ్చేందుకు కారణమవుతున్నాయని, పలు పార్టీల నేతల కామెంట్లు కూడా అలాగే ఉంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాలిబాన్లను తాము గుర్తించడం లేదని ప్రపంచ దేశాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. యు.ఎన్.ఒ. కూడా అదే మాట చెప్పి ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా కెనడా, యు.కె., ఫ్రాన్స్ వంటి యూరోప్ దేశాలు కూడా తాము తాలిబాన్లను గుర్తించడం లేదంటున్నాయి. ఈ క్రమంలో భారతీయ ముస్లిం నేతలు, ఎస్పీ లాంటి పార్టీ నేతలు తాలిబాన్లను పొగుడుతూ, వారి రెచ్చిపోయే ప్రవృత్తిని, హింసా విధానాన్ని హీరోయిజంగా అభివర్ణించడం ప్రజల్లో చీలిక తెస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా తాలిబాన్లను భారత్ గుర్తించాలని, వారితో చర్చలు జరపాలని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. తాలిబాన్లను గుర్తిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని, చొరబాట్లను కూడా అధికారికంగా గుర్తిస్తే సీఏఏ వంటి చట్టాలతో పనేముంటుందని మేధావులు, రాజకీయ నిపుణులు అభ్యంతరం చెబుతున్నారు.  కాబూల్ లో అడుగుపెట్టిన తాలిబాన్ల గుంపులో కేరళకు చెందిన ఓ తాలిబాన్ కూడా ఉన్నాడు. మలయాళ భాషలో ఆ తాలిబాన్ మాట్లాడిన మాటలు ఎంతో సంస్కారవంతంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కితాబివ్వడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. తాలిబాన్లలో చేరి మలయాళ భాష మాట్లాడుతున్న ఇస్లామిక్ ఉగ్రవాది వ్యవహారాన్ని సమర్థించడం యావత్ మలయాళీలకే అవమానం అంటూ కేరళ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఖండించారు. ఇలాంటి కామెంట్లు చేసినవారి మీద రాజద్రోహం నేరాలు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియాలోని కొన్ని చిన్నా-చితకా పత్రికా సంస్థలు కూడా తాలిబాన్ల ఆక్రమణను విజయోత్సవ గాథగా పేర్కొనడం ఆందోళన రేపుతోంది.  ఒకవైపు మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చని చెబుతూనే ఓ మహిళా మేయర్ ను కిడ్నాప్ చేశారని, ఓ మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇకపై మహిళలు ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి రావచ్చా అన్న ప్రశ్నకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతినిధి పడీపడీ నవ్వడం వారిలోని కరుడుగట్టిన ఉగ్రనైజాన్నే చెబుతున్నాయి తప్ప... మానవీయతను ఎలా ఆశిస్తామన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగా తాలిబాన్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారే అయితే.. విమానం టైర్లకు వేళ్లాడుతూ ప్రజలు వెళ్లిపోతారా అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్ల సంగతి దేవుడెరుగు... మన భారతీయ నేతల వ్యవహార శైలి ఎక్కిడికి దారి తీస్తుందో అన్న ఆందోళన రేగుతోంది.

తాలిబన్ల తరహాలో ఏపీ వైసీపీ నేతలు! 

గుంటూరులో పట్టపగలు నడిరోడ్డులో దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నేతలు కేసు పెట్టడం తీవ్ర విమర్శల పాలవుతోంది. బాధిత దళిత కుటుంబానికి న్యాయం చేయలేకపోయిన ప్రభుత్వం.. వాళ్లకు బాసటగా నిలిచిన వారిని టార్గెట్ చేయడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. ఆప్ఙనీస్తాన్ లోని తాలిబన్‌ల మాదిరిగా వైసీపీ నేతలు ఏపీలో పని చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. లోకేష్ పై ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అట్రాసిటీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అట్రాసిటీ చట్టం ఎత్తివేయించేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. గాలివాటంగా వచ్చిన నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు.  తాము కూడా అధికారంలో ఉన్నామని...ఏ రోజు పోలీసు సిబ్బందితో ఇలాంటి పనికిమాలిన పనులు చేయించలేదని నక్కా ఆనంద్ బాబు అన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  టీడీపీ నేతలు పరామర్శిస్తుంటే వైసీపీ నేతలను పోలీసుల ఎలా తీసుకువస్తారని నిలదీశారు. అధికార పార్టీ నేతల వద్ద మార్కులు కోసం పోలీసులు పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పేకాట , గుట్కా, మద్యం విచ్చలవిడిగా  సాగుతుందని తెలిపారు. జిల్లా పోలీసుల అధికారుల  అవినీతిలో కూరుకపోయారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పోలీసు వచ్చి పేకాట శిభిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసులకు సిగ్గు చేటన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని...ఈ పోలీసు అధికారులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.  రమ్య మృతదేహానికి నివాళి అర్పించటానికి లోకేష్ వెళ్ళిన సమయంలో వైసీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారని మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. పరామర్శించటానికి వెళ్ళినందుకు వైసీపీ రాజకీయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్‌లు చూస్తే పోలీస్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిందో అర్థమవుతుందన్నారు. తమ మీద ఆరోపించిన విషయాల్లో పొంతన లేకుండా పోయిందని తెలిపారు. రక్షక యంత్రాంగం భక్షక యంత్రాంగంగా మారిపోయిందని విమర్శించారు. పోలీసులలో కొంత మంది ప్రభుత్వ మోచేతి నీళ్ళు తాగుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు జీజీహెచ్ వద్ద లేరా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రమ్య హత్య పోలీసు వైఫల్యం కాదా అని నిలదీశారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాపపు మాటలు మాట్లాడారని... ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతోందని ఆలపాటి రాజా అన్నారు. దళిత విద్యార్థిని రమ్యశ్రీ మృతదేహాన్ని చూడటానికి  వెళ్లిన నారా లోకేష్, టీడీపీ నేతలను వైసీపీ రౌడీమూకలు ఎందుకు అడ్డుకున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు.మృతురాలి కుటుంబసభ్యులతో లోకేష్ మాట్లాడకుండా, వారిని డీఎస్పీ ఎందుకు తన కారులో తీసుకెళ్లారని మాణిక్యరావు నిలదీశారు. లోకేష్ బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తడుపుకుంటున్నారన్నారు. లోకేష్‌ను ఆపడం వైసీపీ రౌడీమూకలు, పోలీసులు వల్లకాదన్నారు. దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు జరిగినప్పుడు మేరుగ నాగార్జున, నందిగం సురేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

మోడీ గ్రాఫ్ ఢమాల్.. సంఘ్ పరివార్ లో టెన్షన్ 

భారతీయ జనతాపార్టీ ఒక విభిన్నమైన పార్టీ. ఇతర పార్టీలకు బీజేపీకి మధ్య కేవలం సిద్దాంత విబేధాలే కాదు, సంస్థాగత నిర్మాణం, నాయకులు, కార్యకర్తల నిర్మాణ, ఐడిలాజికల్  కమిట్మెంట్, మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం ఇలా ఎలా చూసినా బీజేపీ భిన్నమైన పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి మధ్యేవాద పార్టీలతో, బీజేపీని అసలే పోల్చలేము. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువయితే, బీజేపీలో క్రమ శిక్షణ కొంచెం చాలా ఎక్కువ. అయితే ఇది ఇప్పటి మాట కాదు, ఒకప్పటి మాట. ఇప్పడు బీజేపీ మరో కాంగ్రెస్ పార్టీ కాదంటే ఇంకొక పార్టీ అంతే. అంతకంటే, గొప్పగా చెప్పుకునేందుకు ఏ ప్రత్యేకత పార్టీకి  మిగల లేదు. ఇంకా  ఎక్కడో, కొద్ది మందిలో పాతవాసనలు ఉంటే ఉండవచ్చును కానీ, ఒక పార్టీగా మాత్రం బీజేపీ పాత, విలక్షణ లక్షణాన్ని, విలువలను కోల్పోయింది. ఉద్దేశ పూర్వకంగానే వదిలించుకుంటోంది. అందుకే  ‘ఏ పార్టీ విత్ ఏ డిఫరెన్స్’ అనే ట్యాగ్ లైన్ బీజేపీకి చెరిగి పోయింది. అందుకే క్రమక్రంగా పార్టీ ప్రభ దిగజరిపోతోంది. కమల వెలుగు మసకబారి పోతోంది. ప్రధాని మోడీ గ్రాఫ్ కూడా డిమికీలు కొడుతోంది. దిగజారి పోతోంది.  ఇండియా టుడే, నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ డి నేషన్’ తాజా సర్వేలో మోడీ పాపులారిటీ గత సంవత్సరంతో పోలిస్తే, ఇంచుమించుగా  మూడింట రెండితలు పడిపోయింది. గత సంవత్సరం 66 శాతం మంది మోడీ పాలనను మెచ్చుకుంటే, ఈ సంవత్సరం కేవలం 26 శాతం మంది మాత్రమే మోడీకి ఓటేశారు. ఇలా ఒక్కసారిగా ప్రజాభిప్రాయం తిరగబడటానికి, కరోనా సెకండ్ వేవ్ కట్టిడిలో ప్రధాని వైఫల్యం ప్రధాన కారణంగా ప్రజాభిప్రాయంలో పాల్గొన్న ప్రజలు పేర్కొన్నారు. కరోనా  ఫస్ట్ వేవ్’ను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సెకండ్ వేవ్ విషయంలో ఘోరంగా విఫలమైందని సర్వే నివేదిక స్పష్టం చేసింది. అందుకే గత (2021) జనవరిలో నిర్వహించిన సర్వే లో ఫస్ట్ వేవ్ విషయంలో ప్రధాని చూపిన చొరవను 73 శాతం మంది మెచ్చుకున్నారు. అదే సెకండ్ వేవ్ విషయానికి వచ్చే సరికి ఆ శాతం 46 శాతానికి పడిపోయింది.  ఎన్నికల ప్రచార సభలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల సందర్భంగా, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత షా సహా, అన్ని పార్టీల నాయకులు   పాల్గొన్న  భారీ బహిరంగ సభలు కరోనా సెకండ్ వేవ్  ఉదృతికి కారణమని 27 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అలాగే, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు కూడా మోడీ పాపులారిటీ పడిపోవడానికి కారణంగా సర్వే సూచిస్తోంది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఇప్పటికీ, ఉత్తమ ప్రధాని ఎవరంటే.. మోడీనే అంటున్నారు మెజారిటీ జనం. అయితే, అది చూసి మురిసి పొతే కుదరదు ముందుంది  ముసళ్ళ పండగ అని సర్వే సూచిస్తోంది.నిజానికి, ఎన్నికల సహా సర్వేలు ఏవీ కూడా,వాస్తవ పరిస్టితిని నూటికి నూరు పాళ్ళు ప్రతిబింబించవు. కానీ, రైల్వే గైడ్ లాగా, కొంచెం అటూ ఇటుగా వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి. దేశం మూడ్’, జనంనాడి ఎలా వుందో సంకేత మాత్రంగా అయినా సూచిస్తాయి. ఇండియా టుడే సర్వే సర్వే కూడా అదే చేసింది. మోడీ ప్రభుత్వం ప్రమాదం అంచుల్లోకి చేరిందని హెచ్చరిస్తోంది.  నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ, కరోన ఫస్ట్ వేవ్ కట్టడి పై చూపిన శ్రద్ద సెకండ్ వేవ్ విషయంలో చూప లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా, మోడీ, షా జోడీ మిగిలిన్విష్యలు అన్నీ పక్కన పెట్టి పరుగులు తీశారు. కేంద్ర మంత్రులదీ అదే తీరు. నెలల తరబడి, బెంగాల్, మమత నమ జపం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి, హుజూరాబాద్ మీదనే దృష్టి నిలిపిన విధంగా, అప్పుడు మోడీ, షా జోడీ బెంగాల్ పైనే దృష్టి కేంద్రీకరించారు. అయినా, వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా, బెంగాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ కారణంగా కరోనా కట్టడిలో విఫలమై, రెంటికి చెడ్డ రేవడిగా తేలారు. అయితే, కరోనా వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వానిది ఎంత బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వాలదీ అంతే బాధ్యత అంతే వైఫల్యం.  ఇండియా టుడే సర్వేలో కూడా 44 శాతం మంది ప్రజలు కరోనా సెకండ్ వేవ్ ఉదృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిదీ సమాన బాధ్యతగా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు పోగొట్టుకున్న పాపులారిటీని, ఎలా రీగెయిన్ చేసుకోవాలో చూసుకోవలసిన బాధ్యత కోద్ద మోడీ, షా జోడీ మీదనే ఉన్నది. అదలా ఉంటే, అధికార యావలో పడి బీజీపీ మూలాలను వదిలేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాలలోనే వుంది. పాపులారిటీ పడిపోవడానికి ఇదీ కూడా ఒక కారణమే అంటున్నారు.

దండోరా గర్జనలు.. రాహుల్ టూర్లు! కేసీఆర్ కు సినిమా చూపించబోతున్న రేవంత్.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 70ఎం.ఎం త్రీడీ సినిమా చూపించడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేసుకున్నారు. వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లతో పాటు ఢిల్లీ లెవల్లో రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిర్విరామంగా ఉంచేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాను రూపొందించుకుంటున్న షెడ్యూల్స్ కు ఏఐసీసీ బాస్ రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షెడ్యూల్స్ కు ఫైనల్ టచప్ ఇచ్చే పనిలో రేవంత్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ షెడ్యూల్స్ తో, నాయకుల వరుస టూర్లతో అధికార టీఆర్ఎస్ తో పాటు, కేంద్రంలోని బీజేపీ నేతలకు కూడా ఏకకాలంలో సినిమా చూపించాలనేది రేవంత్ ప్లాన్.  2023లో రాష్ట్ర ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. రేవంత్ టీ-పీసీసీ చీఫ్ అయ్యాక రాష్ట్రంలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. హుజూరాబాద్ సభలో కేసీఆర్ స్వయంగా.. తన నోటి వెంట కేసీఆరో, పీసీఆరో ఎవరు గెలిచినా దళితబంధును కంటిన్యూ చేయాల్సిందే అంటూ తన గెలుపుపై తనే సందేహం వ్యక్తం చేయడం.. టీఆర్ఎస్ బాసులో నైరాశ్యాన్నే చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నట్లేనని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక భావనను మరింత వేగంగా పెంచేందుకు, అన్ని ప్రజాసమూహాల్లో బలంగా నాటేందుకు ఈ రెండేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ వ్యూహరచన చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకోసం దళితబంధు అస్త్రాన్నే రివర్సులో వాడుకోవాలని నిర్ణయించారు. అంటే అలాంటి పథకాన్నే అన్ని వర్గాలకు అందేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ఇందులో కీలకాంశం.  ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, రైతన్నలు, నేతన్నలు, నిరుద్యోగ యువకులు.. ఇలా అనేక వర్గాలకు దళితబంధు లాంటి ఫలాలే అందించాలనేది రేవంత్ ప్లాన్. ఆయా వర్గాలందరూ ఆత్మగౌరవంతో బతకతాలంటే ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు కచ్చితంగా అందించాలని ఆయన డిమాండ్ చేయబోతున్నారు. ఆత్మగౌరవ దండోరా పేరుతో తెలంగాణ అంతటా భారీ సభలు నిర్వహించి కేసీఆర్ పరిపాలనను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడమే ఇందులో ముఖ్యాంశం. ఆ సభలతో వాతావరణం వేడెక్కించేందుకు తెలంగాణలో ప్రతి 4 నుంచి 6 నెలల మధ్య ఒక్కో ఆత్మగౌరవ దండోరా ఉండేలా పక్కా ప్లాన్ వేస్తున్నారు రేవంత్. వచ్చే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేదాకా ఆత్మగౌరవ దండోరా యాత్రలు ఉంటాయని రేవంత్ వర్గీయులు కన్ఫామ్ చేస్తున్నారు.  ఒక్కో సామాజికవర్గం అధికంగా ఉన్నచోట ఆ వర్గాల డిమాండ్లకు ప్రాధాన్యం ఇస్తూ ఆత్మగౌరవ దండోరా ఉంటుందని, ఇలా దండోరా సభలు పూర్తయ్యాక అంతిమంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం మీద ఎన్నికల సమర శంఖం పూరించే అత్యంత భారీ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామంటున్నారు. ఆ సభతో కేసీఆర్ కుర్చీ కూలిపోవడం ఖాయమని, అందుకే ఇకనుంచి రేవంత్ షెడ్యూల్లో ఎక్కడా వ్యక్తిగత టూర్లు ఉండవని, కాంగ్రెస్ ను పవర్లోకి తీసుకొచ్చే దిశగానే రేవంత్ ప్రతీ ప్లానూ, టూరూ ఉంటాయంటున్నారు.  ఇక ఆత్మగౌరవ దండోరా సభలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకరకమైన సభలకు స్థానిక లీడర్లు హాజరైతే.. ఆ తరువాత జరిగే మరో సభకు స్వయంగా రాహుల్ గాంధీనే దింపాలని భావిస్తున్నారు. ఇలా ఆల్టర్నేట్ సభలకు రాహుల్ ను రప్పించడం ద్వారా స్థానిక నాయకుల్లో ఐక్యతతో పాటు పార్టీకి కట్టుబడి ఉండేలా చేయడం సులువవుతుందని, పార్టీ వాణిని ప్రజల్లోకి ఎపెక్టివ్ గా తీసుకుపోవచ్చని, పార్టీ నాయకుల కవరేజీ పెరిగి మీడియా ద్వారా భవిష్యత్ ఎజెండా ప్రజల మెదళ్లలో బ్రహ్మాండంగా రికార్డవుతుందని భావిస్తున్నారు. అలా జరిగినప్పుడే మీడియా వంటి పలు కీలకవర్గాలను తన అదుపులో ఉంచుకున్న కేసీఆర్ పాలనకు చరమగీితం పాడడం సులువవుతుందని రేవంత్ అనుచరవర్గం భావిస్తోంది. అయితే మొదటి సమావేశం మాత్రం సెప్టెంబర్ లోనే పెట్టాలని నిర్ణయించారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 17 కు తెలంగాణ విమోచన దినంతో పాటు, నరేంద్ర మోడీ జన్మదినం కూడా ఉన్నాయి. కాబట్టి ఆ తేదీతో క్లాష్ రాకుండా ఇతర తేదీలను ఎంచుకొని కేసీఆర్ కు దిమ్మతిరిగేలా షాకివ్వాలని యోచిస్తున్నారు. ఇక సెప్టెంబర్ లో జరిగే తొలి  ఆత్మగౌరవ దండోరా మాత్రం వరంగల్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ లో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓబీసీలు, నిరుద్యోగ యూత్, రైతన్నలు, నేతన్నలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలున్నారు కాబట్టి వారందరినీ కదిలించడంలో వరంగల్ సభ చక్కగా పనికొస్తుందని భావిస్తున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది.

నెటిజన్లను ఫిదా చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? 

సినిమాల్లో బాలనటులను మించిన అందంతో మెరిసిపోతున్న ఈ అమ్మాయి ఫొటోలకు నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. చాలా ముద్దుగా, బొద్దుగా ఉందని, మొహంలో తేజస్సు అద్భుతంగా ఉందని వారి హృదయస్పందనలు రాసేస్తున్నారు. ట్విట్టర్లో పెట్టిన వెంటనే చాలా మంది కామెంట్ల మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి గారాల మనవరాలు. పేరు సమైరా.  తన మనవరాలు సమైరాతో కలిసి పొలం దగ్గర దిగిన హై రిజల్యూషన్ పొటోలను రఘువీరారెడ్డి ట్విట్టర్లో షేర్ చేసి సమైరాను నెటిజన్లకు పరిచయం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన రఘువీరా.. రాష్ట్రం విడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా తన ఫాం హౌస్ కే పరిమితం అయ్యానని, రాష్ట్ర రాజకీయాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, ఇలాంటి రాజకీయాల్లో కొనసాగడం కన్నా పొలం పనులు చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఇటీవలే రఘువీరా మనసులో భావాలు పంచుకోవడం గమనార్హం. ఆయన వాలకం చూస్తే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని ఆయన అభిమానులు, రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు.  మరి ఉన్నట్టుండి మనవరాలి ఫొటోను ఎందుకు షేర్ చేశాడన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. తన భావి వారసురాలిగా మనవరాలినే ప్రొజెక్ట్ చేస్తాడా అన్న ఛలోక్తులు కూడా  వినిపిస్తున్నాయి. మొత్తానికి అడపాదడపా సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని పలకరిస్తున్న రఘువీరా.. లేటెస్ట్ గా ఇలా మనవరాలి అందమైన ఫొటోలు పెట్టడంలో మాత్రం ఏదో భవిష్యత్ ఆలోచన ఉండే ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

తాలిబన్ల పాల‌నంటే ఎందుకంత భ‌యం? ఎలాంటి రూల్స్‌, శిక్ష‌లు ఉంటాయి?

తాలిబ‌న్ల రాజ్య‌మంటే అఫ్ఘ‌న్‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. బ‌తుకు జీవుడా అంటూ విమానాల రెక్క‌లు ప‌ట్టుకొని వేలాడుతున్నారు. కుటుంబాన్ని, మ‌హిళ‌ల‌ను, పిల్ల‌ల‌ను వ‌దిలేసి.. దేశం నుంచి పారిపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాలిబ‌న్ల పాల‌న‌లో గ‌త చేదు అనుభ‌వాలు, క‌ఠిన శిక్ష‌లు ఇప్ప‌టికీ వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ భ‌యాన‌క ప‌రిస్థితులు మ‌ళ్లీ వ‌చ్చాయంటూ.. ఇక ఆఫ్ఘ‌నిస్తాన్‌లో బ‌త‌క‌లేమంటూ.. విదేశాల‌కు ఎగిరిపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల క‌ళ్ల‌ల్లో తాలిబ‌న్లంటే భ‌యం సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ పేరెత్తితేనే శ‌రీరం నిలువునా వ‌ణికిపోతోంది. మ‌రి, వారి నిబంధ‌న‌లు అలా ఉంటాయి.. వారి విధించే శిక్ష‌లు అంత క్రూరంగా ఉంటాయి.. ఇంత‌కీ తాలిబ‌న్ల రూల్స్ ఏంటి? ప‌నిష్మెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయి?  తాలిబ‌న్లు వారి సొంతంగా ఎలాంటి నిబంధ‌న‌ల‌ను, శిక్ష‌ల‌ను సృష్టించ‌లేదు. జ‌స్ట్ వారు ష‌రియా చ‌ట్టాలు అమ‌లు చేస్తారంతే. ష‌రియా చ‌ట్టం ఏం చెబితే అదే వారి పాల‌న‌. వాటిని తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాలని ఆదేశిస్తారు. అలా చేయ‌క‌పోతే.. ష‌రియా చ‌ట్టంలో ఉన్న ప్ర‌కార‌మే క‌ఠినాతిక‌ఠినంగా శిక్షిస్తారు. అందుకే, తాలిబ‌న్ల కంటే ష‌రియా చ‌ట్టాలే మ‌రింత ఖ‌త‌ర్నాక్ అని అంటారు. కాబ‌ట్టే, తాలిబన్లు అధికారంలోకి వస్తే షరియా చట్టాలను అమలు చేస్తారని అప్ఘన్ ప్రజలు ఇంత‌లా భయపడుతున్నారు.  షరియా.. అర‌బిక్ ప‌దం. దాని అర్థం మార్గం. షరియా న్యాయపరమైన హద్దులు గల మార్గం. సామాజిక వ్యక్తిగత జీవితాలను ఇది నిర్ధేశిస్తుంది. తప్పు చేసిన వారికి షరియా చట్టం ప్రకారం శిక్షించాలంటుంది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాలే మ‌హా క్రూరంగా ఉంటాయి కాబ‌ట్టే ష‌రియా చ‌ట్టాల‌న్నా, తాలిబ‌న్ల‌న్నా ఇంత‌టి భ‌యాందోళ‌న‌.  హ‌త్య చేసిన వారిని, అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్న వారిని.. స్త్రీ, పురుష బేధం లేకుండా బహిరంగంగా తలలు నరకడం కానీ, ఉరితీయడం కానీ చేస్తారు. దొంగ‌త‌నాలకు పాల్పడితే కాళ్లు చేతులు నరికేస్తారు. అందుకే, తాలిబ‌న్ల రాజ్యంలో నేరం చేయాలనే ఆలోచ‌న వ‌చ్చినా  భ‌యంతో చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.  షరియా చట్టాల ప్రకారం మ‌గ‌వారికి గడ్డాలు తప్పనిసరి. పదేళ్లు పైబడిన బాలికలు బడులకు వెళ్లకూడదు. సంగీతం, టీవీ, సినిమాలూ నిషేధం. మహిళలు బయటకు వెళ్లాలంటే తోడుగా మగవారు ఉండాలి. అత‌డు భ‌ర్త‌, తండ్రి, సోద‌రుడు, కుమారుడు లాంటి ర‌క్త‌సంబంధీకుడై ఉండాలి. మ‌హిళ‌లు హైహీల్స్ వేసుకోకూడ‌దు. కాలి నుంచి చేతి వరకు శరీరంలోని ఏ భాగం కనిపించకుండా బురఖా వేసుకోవాలి. తాజాగా, తాలిబ‌న్లు కాబూల్‌ను ఆక్ర‌మించుకోవ‌డానికి వ‌స్తుండ‌గా వారికి టైట్ డ్రెస్ వేసుకున్న మ‌హిళ క‌నిపించిందట‌. వెంట‌నే త‌ల్వార్‌తో న‌డిరోడ్డు మీద ఆమె త‌ల న‌రికేశార‌ని అంటున్నారు. తాలిబ‌న్లు ఇంత‌ క్రూరంగా ఉంటారు కాబ‌ట్టే.. వారంటే అంత భ‌యం.  మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు. బహిరంగ ప్రదేశంలో పెద్దగా మాట్లాడకూడదు. ఎనిమిదేళ్ల వ‌య‌సు వ‌చ్చాక బాలికలు చదవడానికి వీళ్లేదు. మహిళలు ఇంటి బాల్కానీలో నిల‌బ‌డ‌టం నిషేధం. ఇంటి కిటీకీలోంచి కూడా బ‌య‌ట‌కు చూడ‌కూడ‌దు. వీడియోలు, సినిమాల్లో న‌టించ‌కూడ‌దు. రేడియో, టీవీలలో పనిచేయకూడదు.సైకిల్ మోటార్ సైకిల్ నడుపకూడదు. మహిళలు బస్సుల్లో ప్రయాణించకూడదు. వారికోసం ప్రత్యేక మహిళా బస్సులు ఉంటాయి. మహిళలు బహిరంగ సమావేశాల్లో పాల్గొన‌కూడ‌దు. చివ‌రాఖ‌రికి భ‌ర్త‌ సైతం తన‌ భార్య ఫొటోను ఫోన్‌లో ఉంచుకోకూడదు. తాజాగా, తాలిబన్లు కాబూల్‌లోని ఓ బ్యూటీపార్ల‌ర్ గోడ‌ల‌పై ఉన్న మ‌హిళ‌ల బొమ్మ‌ల‌కు రంగులు వేసి మూసేయ‌డం తెలిసిందే. మొత్తం మీద తాలిబ‌న్ల పాల‌న‌.. మ‌గ‌వారికంటే మ‌హిళ‌ల‌పైనే ఎక్కువ ఆంక్ష‌లు.  అయితే, ఇవ‌న్నీ గ‌త తాలిబ‌న్ల విధానాలు. ఈ 20 ఏళ్లలో వారిలోనూ ఎంతోకొంత మార్పు వ‌చ్చిన‌ట్టుంది. తాము మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకం కాద‌నే మెసేజ్‌ను ఇప్ప‌టికే తాలిబ‌న్లు ఇచ్చారు. ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు చోటు క‌ల్పించేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. లేటెస్ట్‌గా, తాలిబ‌న్ల నాయ‌కుడు ఓ మ‌హిళా న్యూస్ యాంక‌ర్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం సంచ‌ల‌న విష‌య‌మే. తాలిబ‌న్ల నుంచి ఇలాంటి మార్పును ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఉద్యోగాల్లోనూ మ‌హిళ‌ల‌కు అనుమ‌తి ఇస్తామంటున్నారు. ప్ర‌జావ్య‌తిరేక‌త నుంచి కాచుకొని.. త‌మ పాల‌న‌ను సుస్థిరం చేసుకోవ‌డానికి కాబోలు.. తాలిబ‌న్ల‌లో ఇలాంటి చిన్న‌చిన్న మార్పులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. అయినా, వారిని న‌మ్మ‌లేమ‌ని.. గ‌త చేదు అనుభ‌వాల దృష్ట్యా.. తాలిబ‌న్ల పాల‌న అంటే భ‌య‌మే కానీ, ఏ ఒక్క అఫ్ఘ‌నిస్తానీలో కూడా వారిని స్వాగ‌తించ‌డం లేదు.   

పంజరంలో రామ చిలుకలా సీబీఐ.. మద్రాస్​ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మనదేశంలో జాతీయ స్థాయిలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ). ఎన్నో కఠినమైన కేసులను చేధించిన చరిత్ర సీబీఐకి ఉంది. అయితే కొంత కాలంగా సీబీఐపై ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ఎవరూ అధికారంలో ఉంటే.. వాళ్లకు సీబీఐ కీలుబొమ్మలా మారుతుందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. యూపీఏ హయాంలో ఉండగా... సీబీఐకి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ అని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉండగా... సీబీఐని బీజేపీ తొత్తుగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. సీబీఐ కేసుల విషయంలోనూ ఈ ఆరోపణలు బలపడేలా ఉంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలే ఎక్కువగా సీబీఐకి టార్గెట్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేతలపై ఒకలా, ఇతరుల విషయంలో మరోలా సీబీఐ వ్యవహరిస్తుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.  తాజాగా సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంజరంలో రామచిలుకలా సీబీఐ మారిపోయిందని, వెంటనే దానిని విడుదల చేయాలని ఆదేశించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం, కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలని, అది కేవలం పార్లమెంట్ కే రిపోర్ట్ చేయాలని సూచించింది.తమిళనాడులో జరిగిన 'పోంజీ' స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే  మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.  సీబీఐ వ్యవస్థలో మార్పులకు కోర్టు 12 పాయింట్ల నిర్మాణాత్మక సూచనలను చేసింది మద్రాస్ హైకోర్టు. సీబీఐకి చట్టబద్ధ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని చేయాలి. సీబీఐపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చూడాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. డీవోపీటీకి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి లేదా మంత్రికే రిపోర్ట్ చేసేలా కార్యదర్శి స్థాయి హోదాను సీబీఐ డైరెక్టర్ కు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఎక్కువ మంది సిబ్బంది లేరని పోంజీ స్కామ్ కేసును బదిలీ చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సంస్థలో వెంటనే కేడర్ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. నెలలోపు నియామకాలు చేపట్టాలని సూచించింది. అమెరికా ఎఫ్ బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్ లాగా సీబీఐని బలోపేతం చేయాలని, అందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది మద్రాస్ హైకోర్టు.

ఆఫ్ఘన్ లో తాలిబన్లపై తిరుగుబాటు.. మన దేశానిదే కీలక భూమిక?

ఆఫ్ఘనిస్థాన్  రాజధాని కాబూల్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నతాలిబన్లు సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరో వంక ఆ దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ వచ్చిన కిరాతక పాలనకు భయపడి వణికి పోతున్నారు. ఆనాటి అరాచక పాలన, ఆకృత్యాలను గుర్తుచేసుకుని,మాన,ప్రాణాలను కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి పోతున్నారు. ఇక అక్కడ స్థిరపడిన విదేశీయులు అయితే, ఎవరి దేశాలకు వారు పరుగులు తీస్తున్నారు. మరోవంక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష భవనాన్ని వదలి పారి పోయారు. దీంతో  ప్రపంచ దేశాలు కూడా ఆఫ్ఘన్ మరోమారు తాలిబన్ల గుప్పిటిలోకి వెళ్లి పోయిందనే, నిర్ణయానికి వచ్చారు. ఆఫ్ఘన్ పరిణామాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.  ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రకటించారు. ఓ చిరు దివ్వెను వెలిగించారు. అంతే కాదు తనను తాను దేశ తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగంలోని నిబంధనలను ఉదహరిస్తూ సలేహ్ కారణాలు ఏవైనా అధ్యక్ష స్థానంలో అధ్యక్షుడు లేనప్పుడు, మొదటి ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడవుతారని తెలిపారు.అమెరికా, నాటోవలే  తాము స్ఫూర్తిని కోల్పోలేదని పేర్కొంటూ సాలిహ్ తాలిబన్ అరాచకాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సమూహం “ప్రతిఘటన” లో చేరాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 న, తాలిబాన్లు కాబూల్‌లోకి ప్రవేశించినప్పుడు, వారికి లొంగిపోయే ప్రసక్తి లేదంటూ అమ్రుల్లా సలేహ్ ట్వీట్ చేశారు “నేను ఎప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబ్ ఉగ్రవాదులకు తలవంచను. నా హీరో అహ్మద్ షా మసూద్. కమాండర్ ఆత్మ, వారసత్వాన్ని నేను ఎన్నటికీ మోసం చేయను. లెజెండ్, గైడ్. నా మాట విన్న మిలియన్ల మందిని నేను నిరాశపరచను”అని పేర్కొన్నారు.  ఆ సమయంలో, సలేహ్ ఆచూకీ గురించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఆయన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సమావేశంలోని అగ్ర నాయకుల చిత్రాలలో స్పష్టంగా కనిపించలేదు. ఆయన దేశం వదిలి పారిపోయారని అంటూ పాకిస్తాన్ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఖాతాలు పుకార్లు వ్యాపింపచేశాయి. దానితో సలేహ్ బయటకు వచ్చి,  అన్ని పుకార్లను తోసిపుచ్చాడు.సలేహ్ ట్వీట్ చేసిన అదే రోజున తాను తాలిబాన్‌లో ఎన్నటికీ చేతులు కలిపే ప్రసక్తి లేదని అంటూ ఒక కొత్త చిత్రం తెరపైకి తెచ్చారు.  పంజ్‌షీర్ లోయలో దివంగత తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్‌తో సంప్రదింపులలో సలేహ్‌ను ఆ ఫోటో చూపించింది.  తాలిబాన్ చేతికి చిక్కని ఒకే ఒక్క ప్రాంతం పంజ్‌షీర్ వ్యాలీ.  ఇక్కడి నుంచే తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడిందని ఇప్పుడు కధనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ తాజిక్ కమాండర్, అహ్మద్ షా మసౌద్’కు గతంలోనూ తాలిబన్లను ఎదిరించడంలో,  భారత్ సహా ఇరాన్, రష్యా వంటి దేశాలతో ఉత్తర కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించారు. ఈ కూటమి సాయుధమై  తాలిబాన్లను తరిమికొట్టింది. పంజ్‌షీర్ లోయ దరిదాపుల్లోకి ఇంతకాలం  తాలిబన్లను చేరనీయ లేదు.అలాగే,  మసౌద్’ 1990 లలో, బుర్హనుద్దీన్ రబ్బానీ క్యాబినెట్‌లో అత్యంత శక్తివంతమైన రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారత నిఘా సంస్థల నుండి శిక్షణ పొందారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ గూఢచారిగా, తరువాత అంతర్గత మంత్రిగా, దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడ ఆయన సారధ్యంలో పంజ్‌షీర్‌లో తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది.   వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ఎజ్జతుల్లా మెహర్దాద్ పంజ్‌షీర్‌లో తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడుతోందని ధృవీకరించారు. “మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్, అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా ప్రతిఘటన దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు” అని తెలిపారు. బీబీసీ ప్రతినిధి యల్డా హకీమ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే భౌగోళికంగా కీలకైమైన చైనా, పాకిస్థాన్ తాలిబన్లకు మద్దతు ప్రటించిన నేపధ్యంలో, మరో సరిహద్దుగా ఉన్న మన దేశం మరింత అప్రమత్తం కావలసిన అవసరం ఏర్పడింది. అలాగే, తాలిబన్  వ్యతిరేక కూటమి ఏర్పాటు నిజమే అయితే, మన దేశం పోషించే పాత్ర కూడా కీలకంగా మారుతుంది. అందుకే మన దేశం ముందస్తు వ్యూహాలతో ముందుకు పోతోంది.

కేసీఆర్‌పై 84శాతం వ్య‌తిరేక‌తకు కార‌ణ‌మేంటి? స‌ర్వే గుణ‌పాఠ‌మా? రేవంత్‌కి మంచి అవ‌కాశ‌మా?

సీఎం కేసీఆర్‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని అంద‌రికీ తెలుసు. బ‌హుషా ఆయ‌న‌కు కూడా బాగానే తెలుసుంటుంది. అందుకే, ఇప్పుడు ఇంత‌గా హ‌డావుడి చేస్తున్నారు. ఇంతో, అంతో, ఎంతో ఉంటుంద‌ని అనుకున్నారు కానీ.. మ‌రీ ఈ రేంజ్‌లో ఏకంగా 84శాతం మంది ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్ పాల‌న‌పై అసంతృప్తిగా ఉన్నార‌ని ఊహించి ఉండ‌రు. ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేతో కేసీఆర్‌కు దిమ్మ తిరిగి ఉంటుంద‌ని అంటున్నారు.  కేవలం 3శాతం మంది మాత్ర‌మే కేసీఆర్ బెస్ట్ సీఎం అనుకుంటున్నారంటే.. దేశంలో ఆయ‌న ర్యాంక్ వెన‌కెన‌క్కి వెళ్లిందంటే మాట‌ల‌. ఇంత‌కంటే దారుణ అవ‌మానం ఇంకేమీ ఉండ‌క‌పోవ‌చ్చు. రైతుబంధు, ద‌ళిత బంధుతో ఊద‌ర‌గొడుతున్నా.. తెలంగాణ ప్ర‌జ‌లు త‌న పాల‌న‌ను అస‌హ్యించుకుంటున్నార‌ని తెలుసుకోలేక‌పోయారు. ఉప ఎన్నిక‌ల్లో ఎలాగోలా గెలుస్తున్నాం క‌దా.. ఓట్లు త‌మ‌కే ప‌డుతున్నాయి క‌దా.. అని ఇక‌పై ధీమాగా ఉండ‌లేని ప‌రిస్థితి.  కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌లు పెద‌వి విరుపున‌కు అనేక కార‌ణాలు. ప్ర‌ధాన‌మైన‌ది నిరుద్యోగ స‌మ‌స్య‌. ఏ నియామ‌కాల కోస‌మైతే తెలంగాణ సాధించుకున్నారో.. ఆ నియ‌మ‌కాలు లేక నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న దుస్థితి. ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల కోసం చ‌కోరా ప‌క్షుల్లా ఎదురుచూస్తున్నారు. అదిగో నోటిఫికేష‌న్లు అంటున్నారే కానీ, ఏళ్ల త‌ర‌బ‌డి నియామ‌కాల ఊసే లేదు. అందుకే, వైఎస్ ష‌ర్మిల సరిగ్గా ఇదే పాయింట్ మీద త‌న పార్టీ పునాదులు వేసుకుంటున్నారంటే నిరుద్యోగ స‌మ‌స్య తెలంగాణ‌లో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఎన్నిక‌ల హామీ అయిన‌ నిరుద్యోగ భృతిని ఎప్ప‌టిలానే అట‌కెక్కించేశారు. క‌రోనా సంక్షోభ‌మూ కేసీఆర్ ఖాతాలోనే ప‌డిన‌ట్టుంది. కొవిడ్‌ టెస్టులు, హాస్పిట‌ల్ బెడ్స్‌, ట్రీట్‌మెంట్ అంద‌క ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోయారు. ఆ మంట ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేష‌న్‌లో వెల్లువెత్తిన‌ట్టుంది. అందుకే, గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో మూడొంతుల మంది సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. రెండేళ్లుగా తెలంగాణ‌లో కొత్త పింఛ‌న్లు కానీ, కొత్త రేష‌న్ కార్డులు కానీ ఇవ్వ‌నే లేదు. ఓ వైపు పేద‌రికం పెరుగుతున్నా.. ప్ర‌భుత్వ ఆస‌రా ద‌క్క‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో క‌డుపుమంట పెరిగిపోయింది. ఇక‌, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ద‌క్క‌క‌పోవ‌డ‌మూ వారి ఆగ్ర‌హానికి ఓ కార‌ణ‌మే. అటు, జిల్లాల్లో టీఆర్ఎస్‌ ప్ర‌జాప్ర‌తినిధుల క‌బ్జాలు, అరాచ‌కాలు ప‌రోక్షంగా కేసీఆర్‌కు మైన‌స్‌గా మారాయి. అందుకే, తెలంగాణ వ్యాప్తంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌నే తేడా లేకుండా.. అన్నిన ప్రాంతాలు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇండియా టుడే స‌ర్వేలో సీఎం కేసీఆర్ పాల‌న‌పై అసంతృప్తి వ్యక్తం చేశార‌ని అంటున్నారు.  కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జా వ్య‌తిరేకంగా 84శాతం ఉండ‌టం.. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఎమ‌ర్జ్ కావ‌డం గులాబీ బాస్‌కు మింగుడుప‌డ‌ని అంశ‌మే. కేసీఆర్‌పై ఏ రేంజ్‌లో వ్య‌తిరేక‌త పెరుగుతూపోతోందో.. అదే స్థాయిలో రేవంత్‌రెడ్డి క్రేజ్ సైతం పీక్స్‌కు చేరుతోంద‌ని అంటున్నారు. అది కేసీఆర్‌కు మ‌రింత ప్ర‌మాద‌క‌రం. కేసీఆర్‌పై ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌తంతా.. రేవంత్‌కు అడ్వాంటేజ్ అవుతుంద‌ని అంటున్నారు. కేసీఆర్‌ను ఈసారి ఎలాగైనా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు లాగాల‌ని చూస్తున్న జ‌నానికి రేవంత్‌రెడ్డి స‌మ‌ర్థుడైన నాయ‌కుడిగా క‌నిపిస్తున్నారు. అయితే, మ‌ధ్య‌లో క‌మ‌ల‌నాథులు మేముసైత‌మంటూ పాద‌యాత్ర‌ల‌తో దూకుడు పెంచ‌డం ఒక్క‌టే కాంగ్రెస్‌కు కాస్త మైన‌స్‌. కేసీఆర్‌పై ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌త ఏదైనా ఒక్క పార్టీకి ఓట్లుగా మార‌కుండా.. కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్సార్‌టీపీ, బీఎస్పీల మ‌ధ్య చీలిపోతే.. అది మ‌ళ్లీ కేసీఆర్‌కే లాభం చేకూర్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అందుకే, ఇండియా టుడే నిర్వ‌హించిన మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే సీఎం కేసీఆర్‌కు చ‌క్క‌ని గుణ‌పాఠం అంటున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి ఇంకా చ‌క్క‌ని అనుకూలాంశం అని విశ్లేషిస్తున్నారు. 

సీఎం స్టాలిన్ స్టైలే వేరప్పా.. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పరిపాలనపై తనదైన ముద్ర వేసేందుకు, జనంలో మంచి మార్కులు కొట్టేసేందుకు గట్టి  ప్రయత్నమే చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దేశంలో, పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకునే ‘ధనిక’ రాష్టం తెలంగాణ సహా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా, పెట్రోల్, డీజిల్ లీటరు ధరను మూడు రూపాయలు తగ్గించి, జనం చేత జై కొట్టించుకున్నారు.ఇప్పుడు తాజాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, మంత్రులు, అధికారులకు భోజనపానాదులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్సులపై కోతపెట్టారు. ఉచిత భోజనాలకు స్వస్తి చెప్పారు.బహుమతులు, ఇతరత్రా దుబార ఆనుకున్న ఖర్చులు అన్నిటినీ కట్ చేశారు. కరోనా  కారణంగా  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శివాలయాన్ని తలపించే విధంగా మారింది. ఈకారణంగా బెల్టులు బిగించక, ఖర్చులకు తగ్గించుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చారు స్టాలిన్. అంతే ప్రత్యేక కేటాయింపుకు కట్ చేశారు.  అఫ్కోర్స్’ ఒక్క తమిళనాడు ఆర్థిక పరిస్థితి మాత్రమే శివాలయం మిగిలిన రాష్ట్రాలలో వెంకన్న హుండీ కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలదీ అదే పరిస్థితి. పొరుగునున్న ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అయితే, అసలు చెప్పనే అక్కరలేదు. ఏ పూటకు, ఆపూట అప్పు పుడితేనే  కానీ, రోజు గడవని పరిస్థితి. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విలాస, వినోదాలకు కోత కాదు గాటు కూడా పెట్టింది లేదు. ఓ చేత్తో ఓటు కొనుగోలు పందారాలు, మరో వంక దుబారా ఖర్చులు వేటికవి  యధేచ్చగా సాగిపోతున్నాయి. ఇక అవినీతి సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. అదొక మహా గ్రంధం అవుతుంది.    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలా కాదు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో పొదుపుగా నిధుల్ని వాడుకోవాలని మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇంతవరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్, గ్లాసుల మోత వరకు ప్రభుత్వ ఖజానా మీద ఆధారపడిన అమాత్యులు, అధికారులు అందరూ కూడా, జాగ్రత్త పడుతున్నారు. శాసన సభ సమావేశాల సమయంలో సహజంగా, ప్రతి మంత్రిత్వ శాఖకు, ఆహార పానీయాల కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తారు. ఆ నిధులతో స్టార్ హోటల్స్ నుంచి భోజనాలు వచ్చేవి. శాసన సభ సమావేశాల సమయంలో వెయ్యి మందికి పైగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగేది. అన్నీ, స్టార్‌ హోటళ్ల నుంచే వచ్చేవి. అలాగే, ఆయా శాఖల తరపున గిఫ్ట్‌లు సైతం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసంగా  ప్రతి మంత్రిత్వ శాఖకు లక్షల్లో నిధుల కేటాయింపు జరిగేది, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇకపై అది ఎల్లా ముడియాద్, ఇక పై ఆ పప్పులు ఉడకవు, అని నిదులకు కోత పెట్టారు. దీంతో శాసన సభ సమావేశాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు ఇంచక్కా ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. పండగ పూట కూడా పాత పెళ్ళామేనా అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఇంటి కూడేనా’ అని మంత్రులు, అధికారులు చాటుగా సణుక్కున్నా, జనం మాత్రం స్టాలిన్ కు మరోసారి జై కొడుతున్నారు.

పోస్కో పోయి టాటా వ‌చ్చే?.. విశాఖ ఉక్కు రేసులో టాటా స్టీల్‌!

ఓవైపు ఉక్కు ఉద్య‌మం ఉధృతంగా సాగుతోంది. మ‌రోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మ‌కమూ అంతే జోరుగా జ‌రుగుతోంది. ఉద్యోగులు, కార్మికులు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ట్టిగా పోరాడుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా వేగంగా అడుగులేస్తోంది. ఇన్నాళ్లూ విశాఖ ఉక్కును పోస్కోకు క‌ట్ట‌బెడుతున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా, దేశీయ కంపెనీ టాటా స్టీల్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంద‌ని తెలుస్తోంది.   తాజాగా, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌--ఆర్‌ఐఎన్‌ఎల్‌ను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌ ఆసక్తి కనబరుస్తోంది. టాటా స్టీల్‌ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్‌ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. విశాఖ ఉక్కును గొప్ప కొనుగోలు అవకాశంగా టాటా స్టీల్ భావిస్తోంది.  విశాఖ ఉక్కు ప్ర‌త్యేక‌త‌లెన్నో. దాదాపు 22,000 ఎకరాల భూమి. వార్షికోత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. దేశంలో తొలి తీరప్రాంత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్. తూర్పుతోపాటు దక్షిణాది మార్కెట్లను అనుసంధానించే ప్రాంతంలో విశాఖ ఉక్కు ప్లాంట్ ఉండ‌టం కీల‌కాంశం. తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ను దక్కించుకోగలిగితే టాటా స్టీల్‌కు ఆగ్నేయాసియా మార్కెట్లలో వ్యాపారం మరింత ఈజీ అవుతుంది.  దేశీయ మార్కెట్లోనూ రైలు, రోడ్డు మార్గాల్లో ఉక్కును సరఫరా చేసేందుకు అవకాశం లభించనుంది. ప్లాంట్‌కు స్వల్ప దూరంలోనే గంగవరం పోర్టు ఉండటం వైజాగ్‌ స్టీల్‌కు మరో అనుకూల అంశం. గంగ‌వ‌రం పోర్టు నుంచి బొగ్గు తదితర ముడిసరుకుల దిగుమతి, స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతి మరింత సులభమవుతుంది. అందుకే, విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై టాటా స్టీల్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది.  మ‌న విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీపై ఇంత మంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంటే అర్థం ఏంటి?  కంపెనీ బాగుంద‌నేగా? విశాఖ ఉక్కు లాభాల‌ను తెచ్చిపెడుతుంద‌నేగా? మ‌రి, అంత మంచి కంపెనీని అడ్డ‌గోలుగా అమ్మేసి.. ఎవ‌రికో లాభం చేయ‌డం ఎందుకు? ఆంధ్రుల హ‌క్కును వారి నుంచి లాక్కోవ‌డం ఎందుకు? ఇలాంటి ప్ర‌శ్న‌లేవీ ప‌ట్టించుకోకుండా కేంద్రం మాత్రం త‌న మొండివైఖ‌రితో ముందుకుపోతోంది.