టిడిపి మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వరరావు కన్నుమూత

      మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజేశ్వర రావు ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో రాజేశ్వర రావు బాధపడుతున్నారు. ఈ ఉదయం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌కు ఆయన విపరీతమయిన అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అందులో చేరి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ యువసేన పెట్టి ఆయన దగ్గరయ్యారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో శరీరంపై ఆయన ఎన్టీఆర్ బొమ్మను పచ్చ పొడిపించుకున్నారు. నిజాయితీ గల నేతగా ఆయన పేరుంది. ఆయన అంత్యక్రియలు రేపు బన్సీలాల్ పేట స్మశానవాటికలో నిర్వహిస్తారు.

త్వరలో పార్లమెంటు ఆవరణలో నందమూరి వారి విగ్రహం

    ఎట్టకేలకు పార్లమెంటు ప్రాంగణంలో తెలుగు సినీ జగత్తులో రారాజుగా వెలిగిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారి విగ్రహం పెట్టబోతున్నారు. ఆయన కుమార్తె శ్రీమతి పురందేశ్వరి కృషివల్లనే ఇది సాద్యం అయింది. లోక్ సభ స్పీకర్ మీరా కుమారిగారు వచ్చేనెల 7వ తేదీన ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. శ్రీమతి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, తన చిర కాల స్వప్నం ఈ నాటికి సాకారం అవుతున్నదుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులందరినీ ఈ విగ్రహావిష్కరణ సభలో పాల్గొనమని తానూ స్వయంగా ఆహ్వానిస్తానని ఆమె తెలిపారు. తెలుగు జాతి కీర్తిప్రతిష్టలకు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే నందమూరి వారి విగ్రహం దేశ రాజధాని డిల్లీలో ఆవిష్కరించబడటం తెలుగు ప్రజలందరికీ సంతోషం కలిగించే విషయమే.

బాబు సభకి హరికృష్ణ, కడియం, దాడి డుమ్మా

                        ఎంతో ఘనంగా, ఆర్భాటంగా జరుగుతున్నచంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకి హరికృష్ణ రాకపోవచ్చునని అందరూ ఊహిస్తున్నపటికీ, ఎవరూ ఊహించని విదంగా తెదేపా సీనియర్ నేతలు కడియం శ్రీ హరి మరియు దాడి వీరభద్రరావులు కూడా మొహం చాటేశారు.   గతంలో తనకు ప్రాదాన్యం ఈయలేదని మోత్కుపల్లి నరసింహులు అలిగితే, చంద్రబాబు ఆయనను ఎలాగో బుజ్జగించుకొని దారికి తెచ్చుకొన్నారు. కానీ ఇటీవల పార్టీ తెలంగాణా ఫోరం సమావేశంలో కడియం, మోత్కుపల్లి మద్య మొదలయిన ‘పార్టీలో చీడపురుగుల గొడవ’ ముదిరినప్పుడు చంద్రబాబు మొత్కుపల్లిని వారించకపోవడంతో మనస్తాపం చెందిన కడియం ఈ సభకి మొహం చాటేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలకి మనస్తాపం చెంది సభకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.   ఇక దాడి వీరభద్రరావు తనని మళ్ళీ రెండో సారి శాసనమండలికి నామినేట్ చేయనందుకు అలిగిన సంగతి తెలిసిందే. కానీ వచ్చే ఎన్నికలలో ఆయనకి లోక్ సభ టికెట్, ఆయన కొడుక్కి శాసనసభ టికెట్ కోరుతునట్లు సమాచారం.   ఇక హరికృష్ణ ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీకి మరింత దూరం అయినట్లు కనిపిస్తోంది. అందుకు చంద్రబాబు కూడా చింతిస్తున్నట్లు లేదు.   నిన్న ఈనాడు న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో “మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం.  తల్లి కాంగ్రెస్ లోఒకరు, పిల్ల కాంగ్రెస్ లో మరొకరు మావాళ్ళున్నారు. పార్టీకోసం అవసరమయితే కుటుంబ సభ్యులను కూడా వదులుకోవడానికి సిద్దం” అని చెప్పడం ఆయనను ఉద్దేశించినవేనని భావించవచ్చును.   ఇటువంటి పరిస్థితుల్లో ఈ సభకు హరికృష్ణ వస్తారని ఎవరూ భావించలేదు. కానీ, తన జీవితాంతం తెదేపా లోనే ఉంటానని, పార్టీ కోసమే పని చేస్తానని చెప్పిన జూ.యన్టీఆర్ ను కూడా సభకు పంపకపోవడం ద్వారా హరికృష్ణ తమ అభిప్రాయం చాలా స్పష్టంగానే తెలియజేసారు. అంతిమంగా ఈ పరిణామాలన్నీ తెదేపాలో ఉన్న అంతర్గత విబేధాలను మరోమారు బయట పెట్టింది. అంతే గాకుండా ఇప్పటికే ఉన్న దూరాన్ని మరింత పెంచింది.

టీఆర్ఎస్ లోకి 8 మంది ఎంపీలు,ఎమ్మెల్యేలు

      నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శనివారం జరుగుతున్న టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగించారు. త్వరలోనే ఏడు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మే నెల చివరి వరకు మిగతా పార్టీలన్నీ ఖాళీ అవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ నేతల రంగు బయట పడిందని, ఉద్యమం కొనసాగిస్తూనే రాజకీయశక్తిగా ఎదగాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కొంత మంది తెలంగాణ నేతలే తెలంగాణకు అడ్డంకిగా ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు, నిరసనలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కలేదని, అయినప్పటికీ తమ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం చేసిన వాగ్ధానాలను నిలుపుకోవాలంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.వరుసగా ఏడోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడుగా కేసీఆర్ ఎన్నికయ్యారు.

జయప్రదకు రాజమండ్రీ టికెట్ దొరికినట్లే

  ఆమె సోనియాగాంధీని కలిసి గట్టిగా రెండు రోజులయినా కాక మునుపే రాజమండ్రి లోక్ సభ సభ్యడు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఆమె గనుక రాజమండ్రీ నుండి పోటీ చేయదలిస్తే తానూ ఆమెకు అన్నివిధాల సహకారం అందిస్తానని చెప్పడం విశేషం. తనకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని మారు మాట్లాడకుండా చేపడతానని , ఒక వేళ పార్టీ ఆదిష్టానం తనను రాజ్యసభకు పంపించినా తనకు ఆనందమేనని ఆయన చెప్పడం గమనిస్తే, తానూ లోక్ సభ సీటుని జయప్రదకు అప్పగిస్తునందున బదులుగా పార్టీ తనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుoదని ఆయన సూచన ప్రాయంగా చెప్పడమే కాకుండా, పార్టీ కూడా ఆదే నిర్ణయించడం వలననే ఆయన ఈ ప్రకటన చేస్తున్నట్లు భావించవచ్చును.ఈ విషయంలో కేంద్రమంత్రి మరియు అలనాటి ఆమె హీరో చిరంజీవి కూడా ఆమె గురించి సోనియాగాంధీ చెవిలో ఒక ముక్క వేసి సాయపడ్డారేమో మరి తెలియదు. ఏమయితేనేమి ఎట్టకేలకు జయప్రద తన పంతం నెగ్గించుకోగలిగారు. ఇక నేదో రేపో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించడమే తరువాయి.

సరబ్జిత్ సింగ్ పై ఖైదీల దాడి, కోమాలోకి

        పాకిస్థాన్ లోని కోట్ లఖ్ పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ నిన్న ఖైదీల దాడిలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన మీద తోటి ఖైదీలు ఇటుకలు, కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. పాక్ లోని జిన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన ఆయన తలకు గాయం కారణంగా కోమాలో ఉన్నారు. ఆపరేషన్ చేసేందుకు ఐసీయూలో ఉంచినా కోమాలో ఉన్న కారణంగా ఎలాంటి శస్త్ర చికిత్స చేయకుండా ఆపారు. ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితిలో ఎలాంటి చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. 23 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న సరబ్ జిత్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ. మరోవైపు సరబ్ జిత్ పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జైలులో ఇంతకుముందు ఓ హత్యతో పాటు అనేక దాడులు జరిగాయి. అఫ్జల్ గురు ఉరి నేపథ్యంలో సరబ్ జిత్ కు భద్రత పెంచారు. నాలుగువేల మంది ఉండాల్సిన ఈ జైలులో 17 వేల మంది ఖైదీలు ఉన్నారు. దాడికి జైలు అధికారులు భాద్యత వహించాలని సరబ్ తరపు న్యాయవాది ఒవైస్ షేక్ డిమాండ్ చేస్తున్నారు.

విశాఖకు హరికృష్ణ, ఎన్టీఆర్ వస్తారా?

        తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం బహిరంగ సభకు నందమూరి వారసులు ఎవరెవరు వస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ పార్టీ నేతలకు, నందమూరి కుటుంబ సభ్యులకు, మిత్ర పక్షాల నేతలకు, దేశ విదేశాలలో ఉన్న పార్టీ అభిమానులకు టిడిపి ఆహ్వానాలు పంపింది. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తప్ప మిగతా నందమూరి కుటుంబ సభ్యులెవరూ ఈ సభలో పాల్గొనకపోవచ్చునని ప్రచార౦ జరుగుతోంది. విశాఖలో చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ప్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయన్న వార్తలు కూడా రకరకాల ఊహాగానాలకు తెరతీస్తున్నాయి. ఇటీవల ఫ్లెక్సీబ్యానర్లతో నందమూరి కుటుంబ సభ్యుల మద్య తలెత్తిన వివాదాల కారణంగా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవచ్చని చెబుతున్నారు. బాలకృష్ణ మినహా నందమూరి వారసులేవ్వరూ సభకు హాజరుకాకపోతే..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళా తాయంటూ పార్టీ నేతలు కొందరు హరికృష్ణ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు టిడిపి కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపార్టీ కార్యకర్తలు, నాయకులూ అందరు కలిసి దాదాపు 10లక్షల మంది వరకు రావచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 12 ప్రత్యేక రైళ్ళను, 500 బస్సులను, అనేక మినీ వ్యాన్లను ముందుగానే బుక్ చేసారు. అదేవిధంగా నగరంలో ఉన్న చిన్న పెద్దా హోటల్స్ మరియు గెస్ట్ హౌసులలో రూములు కూడా ఇప్పటికే చాలావరకు బుక్ అయిపోయినట్లు సమాచారం.   ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న జనాలను అదుపుచేసేందుకు పోలీసులు కూడా అదనపు బలాలను ఇతర జిల్లాల నుండి రప్పిస్తున్నారు. ఇక 26వ తేదీ నుండే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్ళింపులు ఉంటాయని పోలీసు అధికారులు తెలియజేసారు. సభాస్థలి జనసాంద్రత ఎక్కువ ఉండే నగరం నడిబొడ్డున ఉండటంతో పోలీసులు మరింత జాగురకతో వ్యవహరించాల్సి ఉంటుంది. చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 2,900కి.మీ. పాదయాత్ర దిగ్విజయంగా చేసుకొని ఇంత భారీ ఎత్తున ర్యాలీ, సభ నిర్వహించతుండటంతో పార్టీ కార్యకర్తలలో, నేతలలో మళ్ళీ చాలారోజుల తరువాత సమరోత్సాహం కనిపిస్తోంది.      

రాష్ట్రంలో హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు

  ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు తెదేపా మరియు తెరాసలు వేర్వేరు ప్రాంతాలలో సభలు నిర్వహించుకొంటుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి తెలంగాణాలో తన పార్టీని విస్తరించి, బలపరుచుకొనే ప్రయత్నంలో ఈరోజు నుండే తెలంగాణా ప్రాంతంలో పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ మూడు పార్టీలు ఒకేరోజున తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం యాదృచ్చికమే అయినా మూడింటికీ చాలా ప్రాముఖ్యత ఉంది.   చంద్రబాబు నాయుడు తన పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నంలో చేపట్టిన తన సుదీర్గ పాదయాత్రను ఈ రోజు ముగించుకొంటున్న సందర్భంగా సాయంత్రం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి దాదాపు 5లక్షల మంది తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చాలా రోజుల తరువాత పార్టీ ఇంత అట్టహాసంగా భారీ కార్యక్రమం చెప్పటడంతో పార్టీ శ్రేణుల్లోఇప్పుడు నూతన సమరోత్సాహం వెల్లివిరుస్తోంది.   ఇక, తెరాస ఆవిర్భవించి నేటికి సరిగ్గా 12సం.లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆ పార్టీ కూడా ఒక భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. గత 12సం.లుగా తెరాస ఎన్నడూ అధికారం చెప్పట్టకపోయినప్పటికీ, కేవలం ఉద్యమాలే ఊపిరిగా చేసుకొని, పార్టీ శ్రేణులను ఇంత సుదీర్గ కాలం ఏకత్రాటిపై నడపడం సామాన్యమయిన విషయం కాదు.   ఇటువంటి సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ అకస్మాత్తుగా తన పంధా మార్చుకొని, ఎన్నికలలో పోటీ చేసి పార్టీకి ఎక్కువ సీట్లు సాదించడం ద్వారా తెలంగాణా సాదిద్దామనే కొత్త ప్రతిపాదన చేయడంతో, నేటి సభకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. మళ్ళీ తెరాస అధ్యక్షుడిగా ఎన్నికయిన చంద్రశేఖర్ రావు తన నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కోనున్న తెరాస శ్రేణులకు ఈ సభలో బహుశః దిశా నిర్దేశం చేసి, ఎన్నికలకి సమార శంఖం పూరించవచ్చును. అదే సమయంలో తెలంగాణ సాదన కోసం తన భావి ప్రణాళికలను కూడా ప్రకటించవచ్చును.   ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీని బలోపేతం చేసుకొని మరింత వ్యాపింపజేసేందుకు ఈ రోజునుండే ఆమె తెలంగాణలోరచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు, తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదలయి, పార్టీ కార్యకలాపాలను స్వయంగా చూసుకొంటాడని భావిస్తూ ఎదురు చూసిన విజయమ్మగారు, ఇక ఆయన ఇప్పుడప్పుడే విడుదల అయ్యే సూచనలు కనబడకపోవడంతో ఆమె స్వయంగా నడుం బిగించి యాత్రలకు బయలు దేరక తప్పలేదు.   మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’కు ఈరోజుతో 10సం.లు పూర్తయిన సందర్భoగా ఆమె కూడా తన భర్తకు అచ్చొచ్చిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తన రచ్చబండ కార్యక్రమాలు మొదలుపెడతారు.   ఈవిధంగా మూడు ప్రధాన ప్రతిపక్షాలు తమ పార్టీలను పునరుజ్జీవింపజేసుకొని, అధికారం కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని చాలా తేలికగా తీసిపారేస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణలను “రాష్ట్రంలో ప్రజల మీద ప్రతిపక్ష పార్టీల ప్రభావం ఏవిధంగా ఉంది? వారు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రచారం వలన రాబోయే ఎన్నికలలో పార్టీ మీద ఏవిధంగా, ఎంత ప్రభావం ఉంటుంది?” వంటి ప్రశ్నలు సందించడం చూస్తే, రాష్ట్ర కాంగ్రెస్ కంటే, కాంగ్రెస్ అధిష్టానమే అప్రమత్తంగా ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఆయన సందించిన ప్రశ్నలు గమనిస్తే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆందోళనచెందుతున్నట్లు అర్ధం అవుతోంది.   కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అధికారం చేప్పటి దాదాపు 18నెలలు గడుస్తున్నపటికీ, ఇంతవరకు స్వంతపార్టీ వారితోనే ఎవరితోనూ సక్యత, నమ్మకం సాదించలేక అమ్మ హస్తం పట్టుకొని ఒంటరిగా ఇందిరమ్మ (పగటి) కలలు కంటున్నారు.

'వస్తున్నా మీకోస౦' ముగింపు

        'వస్తున్నా మీకోస౦' అంటూ గత ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొదలు పెట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఏడు నెలల పాటు సుధీర్ఘంగా సాగిన పాదయాత్రతో చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. ఏకధాటిగా 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేతగా రికార్డుల కెక్కారు. పాదయాత్ర ముగింపుకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. విశాఖలో నేడు పాదయాత్ర ముగింపు పైలాన్ ను ఆవిష్కరించి, ఆ తరువాత అక్కడి బహిరంగ సభలో ప్రసంగించి చంద్రబాబు రేపు ఉదయం విశాఖలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ప్రారంభిస్తారు.   గడచిన ఏడు నెలలుగా ఇంటి మొహం చూడకుండా 16 జిల్లాలలో పాదయాత్ర చేశారు. రేపు మధ్యహ్నం విశాఖలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ బాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒకరోజు విశ్రాంతి అనంతరం చంద్రబాబు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుని ఓ రోజంతా విశ్రాంతి తీసుకుంటారు.

సినిమా టిక్కెట్ ధరలు పెంచారు

        రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. రూ.10 నుంచి 20 దాకా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ పచ్చజెండా ఊపేసింది. ప్రభుత్వం పొద్దున ఇలా ఉత్తర్వులు ఇచ్చిందో లేదో.. థియేటర్ల యజమానులు మధ్యాహ్నం రెండుగంటల ఆట (మ్యాట్నీ) నుంచే రేట్లు పెంచి టికెట్లు అమ్మడం మొదలుపెట్టేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని సినిమా థియేటర్లను ఐదు కేటగిరీలుగా విభజించి పెంపును అమలు చేస్తారు. అవి ఇలా ఉంటాయి...   - హైదరాబాద్‌లో ఏసీ థియేటర్లలో రూ.55గా ఉన్న బాల్కనీ టికెట్ ధర ఇకపై రూ.75, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.70, ఫస్ట్‌క్లాస్ టికెట్ల వెల రూ.45. -విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, తిరుపతి, కర్నూలు, అనంతపురం లాంటి కార్పొరేషన్‌లలో బాల్కనీ రూ.75 (ఎయిర్‌కూల్డ్ రూ.70), తర్వాతి తరగతి టికెట్ల వెల రూ.40 . -సెలక్షన్, స్పెషల్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో బాల్కనీ రూ.55 (ఎయిర్‌కూల్డ్ 50), తర్వాతి తరగతి టికెట్ల వెల రూ.35 అవుతాయి. -సెకండ్, థర్డ్‌గ్రేడ్ మున్సిపాలిటీల్లో హైక్లాస్ రూ.50 (ఎయిర్‌కూల్డ్ రూ.45), దాని ముందు వరుస రూ.30. -నగర, గ్రామ పంచాయతీల్లో ఏసీ మొదటి తరగతి రూ.45 (ఎయిర్‌కూల్డ్ 40), రెండో తరగతి రూ.30 . - కేటగిరీలతో సంబంధం లేకుండా ఆఖరు తరగతి టికెట్లను రూ.10కే విక్రయించాలి.

ఇంటర్ ఫలితాలలో కృష్ణా ఫస్ట్

        ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. మార్కులు, గ్రేడుల రూపంలో ఈ ఏడాది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 65.36 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 69.04 శాతం, బాలురు 62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలను కనబరిచారని మంత్రి పార్థసారథి అభినందించారు. 2012 లో ఉత్తీర్ణతా శాతం 52.43గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 6.93 శాతం అధిక్యత సాధించినట్లు మంత్రి తెలిపారు.   మార్క్స్ మెమోను ఏప్రిల్ 30 ఆయా కాలేజీలకు అందజేయనున్నట్లు తెలిపారు. మే 22 ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. మే 22 ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండవ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. మే 6 సప్లమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ.  

చిక్కుల్లో మాగంటి బాబు కొడుకు

        ఈవ్ టీజింగ్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత మాగంటి వెంకటేశ్వరరావు ఆలియాస్ బాబు కుమారుడు రామచంద్రన్ ఆలియాస్ రామ్జీ ఇరుక్కున్నాడు. ఓ యువతిని వేధించడం, అసభ్యంగా మెసేజ్‌లు పంపుతున్నాడని రామచంద్రన్‌పై ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ నిమిత్తం రామచంద్రన్ను అరెస్టు చేయడానికి సైబరాబాద్ పోలీసులు ఏలూరు వెళ్లారు. అయితే ఏలూరు వెళ్లిన పోలీసులకు రామచంద్రన్ అందుబాటులోకి రాలేదు. కనిపించలేదు. దీంతో ఆయన తండ్రి మాగంటి బాబుని ప్రశ్నించారట. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉందని తెలుస్తోంది. ఆయన విశాఖలో చంద్రబాబు పాదయాత్ర ముగింపు ఏర్పాట్లలో ఉన్నారు. రాంచంద్రన్ తమకు అప్పగించాలని లేదా మాట్లాడించాలని పోలీసులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

        ఇంటర్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో మంత్రి కె.పార్థసారథి శుక్రవారం విడుదల చేశారు. మార్చి 7 నుంచి 23 వరకు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10,10,915 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో దాదాపు 10 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.   ఫలితాల కోసం కొన్ని వెబ్‌సైట్ అడ్రస్‌లు http://examresults.ap.nic.in; http://results.cgg.gov.in; www.apit.ap.gov.in; www.vidyavision.com; www.manabadi.com; www.gnanadeep.com; www.educationandhra.com; www.resumedropbox.com ఫలితాలు తెలుసుకునే ఇతర మార్గాలు... పరిష్కారం కాల్ సెంటర్ (ఈ-సేవ) నుంచి రాష్ట్రంలోని బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ద్వారా 1100కు డయల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ఏ ల్యాండ్‌లైన్ / మొబైల్ ఫోన్ మరియు ఈ-సేవ/ మీ సేవ/ రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారానైనా 1800-425-1110కి కాల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలోనూ ఫలితాలుంటాయి. ఐవీఆర్ఎస్ ద్వారా.. రాష్ట్రంలోని ఏ ప్రదేశం నుంచైనా ఎస్‌టీడీ కోడ్ లేకుండా బీఎస్ఎస్ఎల్ ల్యాండ్‌లైన్, బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి 1255225కు నేరుగా డయల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులైతే 550770కు, వొడాఫోన్ వినియోగదారులైతే 56731కు, ఇతర సెల్‌ఫోన్ల వినియోగదారులైతే 5664477కు కాల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా ... i. BSNL users INTER to 53345 or 53346. ii. All users IPEG2 to 5676750 for General results IPEV2 to 5676750 Vocational results. iii. Vodafone users IPEG2 to 56730 for General results IPEV2 to 56730 for Vocational results. iv. All users IPE2 to 56969 for General results IPEV2 to 56969 for Vocational results. v. All users AP12 to 5888. vi. ISY to 54999 vii. All users APSI to 56767999

తెలంగాణలో ఇతరపార్టీల క్యాడర్లపై తెరాస ఒత్తిడి

  త్వరలో తెలంగాణాలో తెదేపా దుఖాణం బంద్ అవుతుందని కేసీఆర్ పేర్కొనడం రోజూ వింటున్న సోదే అని అందరూ తేలికగా తీసిపారేసినా, కరీంనగర్ తెదేపా శాసన సభ్యుడు గంగుల కమలాకర్ పార్టీని వీడి తెరాసలో చేరిన తరువాత, అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి స్థానిక తెదేపా నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో కొన్నిఆసక్తి కరమయిన సంగతులు బయట పడ్డాయి.   జిల్లా కార్యదర్శి వాసాల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కే. ఆగయ్య, జిల్లా మైనార్టీ సెల్ నేతలు యాన్.ఖాన్, మొహమ్మద్ సలీం మరియు వాజీద్ ఆలి ఖాన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ గంగుల కమలాకర్ పార్టీకి ద్రోహం చేసి తెరాసలో చేరడమే కాకుండా తమను కూడా తనతో బాటు పార్టీలో చేరమని బెదిరిస్తున్నాడని వారు తెలిపారు. తనతో కలిసి తెరసాలో జేరకపోతే, శాసన సభ్యుడిగా కొనసాగుతున్నఆయన, తన చేతిలో ఉన్న నియోజక వర్గం అభివృద్ధి నిధులను మంజూరు చేయకుండా ఆపేస్తానని తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆయనతో ఇతరత్రా వ్యవహారాలు, అవసరాలు ఉన్నవారు తప్పనిసరిగా ఆయనను అనుసరించవలసి వస్తోందని వారు ఆరోపించారు. అయితే, ఆయన ఒత్తిడివల్ల పార్టీవీడిన కొందరు మళ్ళీ కార్యకర్తలు త్వరలోనే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.   తెదేపా నేతలు గంగుల మీద చేస్తున్న ఆరోపణలు గమనిస్తే, వారిపై తెరాస నుండి కూడా ఇవే రకమయిన ఒత్తిళ్ళుఉన్దిఉన్దవచ్చునని అర్ధం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, తెదేపాలను భూస్థాపితం చేస్తానని ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ బలమయిన నాయకులు లేని ప్రాంతాలలో కాంగ్రెస్, తెదేపాలను నయాన్నో లేక భయాన్నో లొంగదీసుకొని పార్టీ మార్పిళ్ళకు ప్రోత్సహించే అవకాశాలున్నాయి. బహుశః ఆ ఆలోచనతోనే తెరాస అధినేత కేసీఆర్ త్వరలో తెలంగాణ లో తెదేపా ఖాళీ అయిపోతుందని అంత ధీమాగా చెప్పగలుగుతున్నారు.   12సం.లుగా తెదేపాను అంటిపెట్టుకొని పనిచేసిన గంగుల కమలాకర్ కూడా స్థానికంగా ఉన్న తెరాస నేతలతో విభేదించి, తన వ్యాపార వ్యవహారాలలో ఇబ్బందులు కొని తెచ్చుకొనే బదులు తెరాసలో చేరడమే మంచిదని భావించడం వలననే పార్టీ మారి ఉండవచ్చును. అందుకే ఇప్పుడు తన అనుచరులను కూడా తనతో రమ్మని బలవంతం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఆయనకీ తెరాస నేతలతో అవసరాలున్నట్లే, ఆయనతో తెదేపా కార్యకర్తలకి అవసారాలు ఉండవచ్చును. అంతిమంగా ఇటువంటి వ్యవహారాలూ పార్టీల మార్పిళ్ళకి కారణం కావచ్చును,కానీ, వీటన్నికి తెలంగాణ ఉద్యమం రంగు పూయడమే విచిత్రం.   గంగుల కమలాకర్ కు గనుక తెరాస కరీం నగర్ నుండి పార్టీ టికెట్ ఇస్తానని మాట ఈయకపోయి ఉంటే, ఆయన తెరసాలో చేరే వారు కారేమో. ఒకవైపు పార్టీ టికెట్స్ గురించి బహిరంగంగా ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ, పార్టీ మారుతున్న నేతలందరూ కేవలం తెలంగాణ ఉద్యమంకోసమే పార్టీ మారుతున్నామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని చెప్పవచ్చును. 

శ్రీహరి చరిత్ర సృష్టిస్తాడా!

  ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీహరి ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, పార్టీ తీర్ధం పుచ్చుకోకపోయినా, చంచల్ గూడా జైలు ఫార్మాలిటీలన్నీ రెండు నెలల క్రితమే పూర్తి చేసుకొన్నారు గనుక ఆయన పార్టీ సభ్యుడి కిందే లెక్క.   ఆయన మొన్న మీడియాతోమాట్లాడుతూ “నేను గనుక రాజకీయాలలోకి వస్తే, చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని, నేను ప్రాతినిద్యం వహించే నియోజక వర్గపు ప్రజలు ఎన్నడూ కూడా 'మా ఎమ్మెల్యే కనిపించడం లేదు' అని చెప్పుకొనే అవకాశం ఇవ్వకుండా వారికి సదా అందుబాటులో ఉంటూ, తన పలుకుబడితో అక్కడి సమస్యలన్నిటినీ తీర్చేస్తానన్నారు.”   అయితే, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా దృవీకరించలేదు. బహుశః హైదరాబాదులో ఏదయినా ఒక నియోజక వర్గం నుండి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి. సినీ పరిశ్రమలో మంచి పేరు కలిగి, చాలా కాలంగా సామాజిక సేవలు చేస్తు ప్రజల అభిమానం చూరగొన్న ఆయన, అవినీతి ముద్రపడి జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం ఆయన అభిమానులకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకు రాజకీయాలలో చేరదానికి ప్రధాన కారణం తన సామాజిక సేవా కార్యక్రమాలకు అదొక పొడిగింపుగా భావిస్తున్నందున, ఆయన స్వతంత్ర అభ్యర్దిగానో లేక ఇంతవరకు విలువలు పాటిస్తున్న లోక్ సత్తా వంటి పార్టీనో ఎంచుకొని ఉంటే సమజసంగా ఉండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చట్టం ముందు దోషిగా నిలబడున్న జగన్ మోహన్ రెడ్డి వంటి వారితో శ్రీహరి వంటి మంచి వ్యక్తి చేతులు కలపడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి శ్రీహరి తన అభిమానుల మాటను మన్నిస్తారో లేదో చూడాలి.

'షాడో' థియేటర్ల పై దాడి చేసిన అభిమానులు

        మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన 'షాడో' చిత్రం థియేటర్ పై వెంకటేష్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న జగత్, విఖ్యాత్ థియేటర్ల వద్ద టికెట్ల కోసం ఈ ఉదయం నుండి అభిమానులు బారులు తీరారు. చివరికి టికెట్లు అయిపోయాయని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో అభిమానులు గొడవకు దిగారు. థియేటర్ అద్దాలు పగలగొట్టిన అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. థియేటర్ సిబ్బంది టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారని, అసలు టికెట్లు ఇవ్వకుండానే అయిపోయాయని యాజమాన్యం అబద్దాలు చెబుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని భూమా సినిమా హాలు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టికెట్లు అయిపోయాయని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో అభిమానులు అద్దాలు పగలగొట్టారు.

సుబ్బిరామిరెడ్డిని కలవరపరుస్తున్న పురందేశ్వరి మౌనం

  వైజాగ్ లోక్ సభ సీటు కోసం ఈ సారి టీ.సుబ్బిరామిరెడ్డి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిద్యం వహిస్తు, తనకు పోటీగా ఉన్నకేంద్రమంత్రి పురందేశ్వరి తనకు చెల్లెలువంటిదని చెపుతూనే, వైజాగ్ ను తనకు వదిలిపెట్టి, ఆమె పక్కనున్న నర్సాపురం నియోజక వర్గానికి వెళ్ళిపోతే ఇద్దరికీ బాగుంటుందని ఆయన మీడియా ముఖంగా ఆమెకు సలహాలు కూడా ఇచ్చారు.   నగరంలో జరిగే పలు చిన్నా పెద్దా కార్యక్రమాలలో ఇప్పుడు చురుకుగా పాల్గొంటున్న ఆయన ప్రతీ సభలో, సమావేశంలో ఈ సారి తానూ వైజాగ్ నుండే పోటీ చేయడం ఖాయమని పదే పదే చెపుతున్నారు కూడా. పనిలో పనిగా వైజాగ్ నగరాన్ని తానూ ఏవిధంగా మార్చివేయాలనుకొంటున్నారో తెలియజేస్తూ ఒక పెద్ద దీర్ఘకాళిక ప్రణాళిక కూడా ప్రకటించేశారు. తద్వారా, ఇక తానే వైజాగ్ కి ప్రాతినిద్యం వహించబోతున్నట్లు ప్రకటించేసుకొన్నారు.   పనిలో పనిగా ఇటీవలే వైజాగులో ఒక సభ నిర్వహించి తానూ చేసిన సేవలకి గాను కిరీటం కూడా పెట్టించుకొన్నారు. అయినప్పటికీ, పురందేశ్వరి మాత్రం తన సహజ సిద్దమయిన హుందాతనం కనబరుస్తూ, ఏనాడు ఆయన మాటలకు జావాబు ఈయలేదు. ఆమె అంత నిశబ్దంగా ఉండిపోవడంతో ఆమె అంతర్యం ఏమిటో అర్ధం కాక, కంగారుపడుతూన్న సుబ్బిరామిరెడ్డి ఎందుకయినా మంచిదని నిన్ననే డిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి, వైజాగ్ ప్రజలకు తానూ చేస్తున్న సేవల లిస్టులు, దాన ధర్మాల లిస్టులు, తన ధార్మిక వ్యవహారాల వివరాలను పూర్తిగా అప్పజెప్పి, వైజాగ్ లోక్ సభ సీటు తనకే ఇప్పించవలసిందిగా కోరారు. మరి సోనియా గాంధీ ఏమి హామీ ఇచ్చేరో ఆయన ఇంకా బయటపెట్టలేదు.త్వరలోనే ఆ సంగతీ ఆయనే స్వయంగా ప్రకటించుకోవచ్చును.

పాదయాత్ర ముగింపు సభకి రానున్న జూ.యన్టీఆర్

  రేపటితో చంద్రబాబు సుదీర్గ పాదయాత్ర ముగియనున్నందున, ఈ సందర్భంగా తెదేపా విశాఖ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 5 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులూ, పార్టీ అభిమానులు ఈ సభకు రానున్నట్లు అంచనా వేస్తున్న తెదేపా, ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ పార్టీ నేతలకు, నందమూరి కుటుంబ సభ్యులకు, మిత్ర పక్షాల నేతలకు, దేశ విదేశాలలో ఉన్న పార్టీ అభిమానులకు ఆహ్వానాలు పంపింది.   అయితే అనారోగ్య కారణాల వల్ల పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హాజరు కాకపోవచ్చునని ఆహ్వానకమిటీ భావిస్తోంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలలో ఆయన స్వయంగా పాల్గొనలేకపోయినపటికీ తన కుమారుడు జూ.యన్టీఆర్ ను మాత్రం పంపుతున్నట్లు సమాచారం అందింది. ఇటీవల ఫ్లెక్సీబ్యానర్ల కారణంగా నందమూరి కుటుంబ సభ్యుల మద్య తలెత్తిన వివాదాలకు తెరదించాలని అందరూ భావిస్తున్నందున, ఈ సభకు జూ.యన్టీఆర్ తప్పనిసరిగా హాజరవుతాడని పార్టీ నేతలు భావిస్తున్నారు. అతనితో బాటు, తారక రత్న, కళ్యాన్ రామ్ తదితరులు కూడా వచ్చి ఈ సభలో పాల్గొంటారు. లక్షలాది ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరవుతున్న సభకి హాజరవుతున్న సందర్బంగా, జూ.యన్టీఆర్ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని అందరిలో అపోహలు దూరం చేసే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగనున్నట్లు, పార్టీకే మద్దతు ఉటుందని ఒక విస్పష్టంగా ప్రకటన చేయవచ్చునని అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ సభలో విజయవంతంగా పాదయాత్ర ముగించుకొన్నచంద్రబాబు నాయుడు కంటే జూ.యన్టీఆర్, ఆ తరువాత వరుసగా లోకేష్, బాలకృష్ణలే ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నారని చెప్పవచ్చును.