తెలంగాణలో ఇతరపార్టీల క్యాడర్లపై తెరాస ఒత్తిడి
posted on Apr 26, 2013 @ 3:05PM
త్వరలో తెలంగాణాలో తెదేపా దుఖాణం బంద్ అవుతుందని కేసీఆర్ పేర్కొనడం రోజూ వింటున్న సోదే అని అందరూ తేలికగా తీసిపారేసినా, కరీంనగర్ తెదేపా శాసన సభ్యుడు గంగుల కమలాకర్ పార్టీని వీడి తెరాసలో చేరిన తరువాత, అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి స్థానిక తెదేపా నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో కొన్నిఆసక్తి కరమయిన సంగతులు బయట పడ్డాయి.
జిల్లా కార్యదర్శి వాసాల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కే. ఆగయ్య, జిల్లా మైనార్టీ సెల్ నేతలు యాన్.ఖాన్, మొహమ్మద్ సలీం మరియు వాజీద్ ఆలి ఖాన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ గంగుల కమలాకర్ పార్టీకి ద్రోహం చేసి తెరాసలో చేరడమే కాకుండా తమను కూడా తనతో బాటు పార్టీలో చేరమని బెదిరిస్తున్నాడని వారు తెలిపారు. తనతో కలిసి తెరసాలో జేరకపోతే, శాసన సభ్యుడిగా కొనసాగుతున్నఆయన, తన చేతిలో ఉన్న నియోజక వర్గం అభివృద్ధి నిధులను మంజూరు చేయకుండా ఆపేస్తానని తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆయనతో ఇతరత్రా వ్యవహారాలు, అవసరాలు ఉన్నవారు తప్పనిసరిగా ఆయనను అనుసరించవలసి వస్తోందని వారు ఆరోపించారు. అయితే, ఆయన ఒత్తిడివల్ల పార్టీవీడిన కొందరు మళ్ళీ కార్యకర్తలు త్వరలోనే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
తెదేపా నేతలు గంగుల మీద చేస్తున్న ఆరోపణలు గమనిస్తే, వారిపై తెరాస నుండి కూడా ఇవే రకమయిన ఒత్తిళ్ళుఉన్దిఉన్దవచ్చునని అర్ధం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, తెదేపాలను భూస్థాపితం చేస్తానని ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ బలమయిన నాయకులు లేని ప్రాంతాలలో కాంగ్రెస్, తెదేపాలను నయాన్నో లేక భయాన్నో లొంగదీసుకొని పార్టీ మార్పిళ్ళకు ప్రోత్సహించే అవకాశాలున్నాయి. బహుశః ఆ ఆలోచనతోనే తెరాస అధినేత కేసీఆర్ త్వరలో తెలంగాణ లో తెదేపా ఖాళీ అయిపోతుందని అంత ధీమాగా చెప్పగలుగుతున్నారు.
12సం.లుగా తెదేపాను అంటిపెట్టుకొని పనిచేసిన గంగుల కమలాకర్ కూడా స్థానికంగా ఉన్న తెరాస నేతలతో విభేదించి, తన వ్యాపార వ్యవహారాలలో ఇబ్బందులు కొని తెచ్చుకొనే బదులు తెరాసలో చేరడమే మంచిదని భావించడం వలననే పార్టీ మారి ఉండవచ్చును. అందుకే ఇప్పుడు తన అనుచరులను కూడా తనతో రమ్మని బలవంతం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఆయనకీ తెరాస నేతలతో అవసరాలున్నట్లే, ఆయనతో తెదేపా కార్యకర్తలకి అవసారాలు ఉండవచ్చును. అంతిమంగా ఇటువంటి వ్యవహారాలూ పార్టీల మార్పిళ్ళకి కారణం కావచ్చును,కానీ, వీటన్నికి తెలంగాణ ఉద్యమం రంగు పూయడమే విచిత్రం.
గంగుల కమలాకర్ కు గనుక తెరాస కరీం నగర్ నుండి పార్టీ టికెట్ ఇస్తానని మాట ఈయకపోయి ఉంటే, ఆయన తెరసాలో చేరే వారు కారేమో. ఒకవైపు పార్టీ టికెట్స్ గురించి బహిరంగంగా ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ, పార్టీ మారుతున్న నేతలందరూ కేవలం తెలంగాణ ఉద్యమంకోసమే పార్టీ మారుతున్నామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని చెప్పవచ్చును.