శ్రీహరి చరిత్ర సృష్టిస్తాడా!
posted on Apr 26, 2013 @ 12:38PM
ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీహరి ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, పార్టీ తీర్ధం పుచ్చుకోకపోయినా, చంచల్ గూడా జైలు ఫార్మాలిటీలన్నీ రెండు నెలల క్రితమే పూర్తి చేసుకొన్నారు గనుక ఆయన పార్టీ సభ్యుడి కిందే లెక్క.
ఆయన మొన్న మీడియాతోమాట్లాడుతూ “నేను గనుక రాజకీయాలలోకి వస్తే, చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని, నేను ప్రాతినిద్యం వహించే నియోజక వర్గపు ప్రజలు ఎన్నడూ కూడా 'మా ఎమ్మెల్యే కనిపించడం లేదు' అని చెప్పుకొనే అవకాశం ఇవ్వకుండా వారికి సదా అందుబాటులో ఉంటూ, తన పలుకుబడితో అక్కడి సమస్యలన్నిటినీ తీర్చేస్తానన్నారు.”
అయితే, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా దృవీకరించలేదు. బహుశః హైదరాబాదులో ఏదయినా ఒక నియోజక వర్గం నుండి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి. సినీ పరిశ్రమలో మంచి పేరు కలిగి, చాలా కాలంగా సామాజిక సేవలు చేస్తు ప్రజల అభిమానం చూరగొన్న ఆయన, అవినీతి ముద్రపడి జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం ఆయన అభిమానులకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకు రాజకీయాలలో చేరదానికి ప్రధాన కారణం తన సామాజిక సేవా కార్యక్రమాలకు అదొక పొడిగింపుగా భావిస్తున్నందున, ఆయన స్వతంత్ర అభ్యర్దిగానో లేక ఇంతవరకు విలువలు పాటిస్తున్న లోక్ సత్తా వంటి పార్టీనో ఎంచుకొని ఉంటే సమజసంగా ఉండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చట్టం ముందు దోషిగా నిలబడున్న జగన్ మోహన్ రెడ్డి వంటి వారితో శ్రీహరి వంటి మంచి వ్యక్తి చేతులు కలపడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి శ్రీహరి తన అభిమానుల మాటను మన్నిస్తారో లేదో చూడాలి.