పరాకామణి కేసు... తప్పు ఒప్పుకున్న రవికుమార్

  తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు. చేసిన మహా పాపానికి ప్రాయిశ్చితంగా నా ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించాని తెలిపారు. నేను మా కుటుంబం అనుకున్న విధంగానే నా ఆస్తి స్వామి వారి పేరిట రాసామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు అల్లుతున్నారు… నాపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, నా ఆస్తులు రాసుకున్నారని ప్రచారంలో వాస్తవం లేదని రవి కుమార్ తెలిపారు.  నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వారిపై కేసులు కూడా పెట్టాని తెలిపారు. నాపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు చేశారు, ప్రైవేట్ పార్ట్ లో శాస్త్ర చికిత్స చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు…ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకున్నామని  న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అందుకు నేను సహకరిస్తాని తెలిపారు. నేను చేసింది మహా పాపం, బాధపడని రోజంటూ లేదని ఆయ వాపోయారు.

ప్రపంచంలో రోల్ మోడల్‌గా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ : మంత్రి పొంగులేటి

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే  గ్లోబల్  సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్ గా  నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  అన్నారు.   ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను  మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడారు. ఈ స‌మ్మిట్‌కు దేశ‌విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష‌ గుర్తింపు పొందిన దిగ్గ‌జాలను ఆహ్వానించ‌డం జ‌రిగింద‌న్నారు.   గ‌డ‌చిన రెండు సంవ‌త్స‌రాల‌లో చేప‌ట్టిన అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తోపాటు 2037 విజ‌న్‌, 2047 విజ‌న్ ఈ రెండు సెక్టార్ల‌కు సంబంధించిన ప్ర‌భుత్వ లక్ష్యాలు, ఆలోచ‌న‌ల‌ను ఈ స‌మ్మిట్‌లో వివ‌రించ‌బోతున్నామని పేర్కొన్నారు.     ముఖ్య‌మంత్రి  సూచ‌న‌ల  మేర‌కు ఈ రోజు స‌మ్మిట్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని, గ‌డువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్ల‌కు ముమ్మ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.    తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా  ముఖ్యమంత్రి  సారధ్యంలో ఇందిర‌మ్మ కాంగ్రెస్  ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పొంగులేటి అన్నారు                     2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌నిచేస్తున్నాం.   2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద‌న్నారు.  స‌మ్మిట్‌పై ఇండిగో విమానాల ర‌ద్దు ప్ర‌భావం ఏమాత్రం చూప‌ద‌ని ముఖ్య‌మంత్రి  దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే అతిధుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌రిశీస్తున్నార‌ని చెప్పారు.

కేసీఆర్‌ను కొడుకు, అల్లుడు, బిడ్డే ముంచుతారు : సీఎం రేవంత్‌

  కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నల్గొండ దేవరకొండలో ప్రజాపాలన  ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. పేదలకు ఇళ్లివ్వని మాజీ సీఎం కేసీఆర్ 2వేల కోట్లతో గడీకట్టుకున్నారని సీఎం అన్నారు. ఆ పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే 22 లక్షల ఇళ్లు ఇచ్చేదని తెలిపారు.  ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం...డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిన చోట కేసీఆర్ ఓట్లు అడగాలి.. ప్రజలే తీర్పు చెప్తారని ఆయన స్ఫష్టం చేశారు. గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డులో పేరు కూడా చేర్చలేదని వెల్లడించారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ ఉపయోగపడిందని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.  ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చింది.. కాంగ్రెస్.. కాంగ్రెస్ గిరిజనుల పార్టీని అన్నారు. మీకు మంచి రోజులు కాదు... కొడుకు, అల్లుడు, బిడ్డలు ముంచే రోజులు వస్తాయి.. నీ కొడుకు చాలు కేసీఆర్.. నీ పార్టీని బొందపెట్టడానికని ముఖ్యమంత్రి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం జరిగిందన్నారు. ఎస్ఎల్ బీసీ  టన్నెల్ లో 10 కిలోమీటర్ లు తవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ దాని ఆరొపించారు.  ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిన ప్రమాదంలో 8 మంది చనిపోతే.. బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎస్ఎల్ బీసీనీ పూర్తి చేస్తాం.పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రితో కలిసి ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే తో కలిసి పని చేసే వాళ్లకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వండని కోరారు. ఇందిరమ్మ చీరలను వాళ్ల ఇంటికే పంపిస్తామని ఇందిరమ్మ చీర కట్టుకోండి.. సర్పంచ్ కు ఓటేయండని రేవంత్ పిలుపునిచ్చారు.

విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

  ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన ధరలు ప్రకటించింది. ఈ నూతన నిబంధనల ప్రకారం, 500 కిలోమీటర్ల వరకు గరిష్ఠంగా రూ. 7,500, 500 కి.మీ. నుండి 1000 కి.మీ. వరకు రూ. 12,000, అలాగే 1000 కి.మీ. నుండి 1500 కి.మీ. వరకు రూ. 15,000 మాత్రమే ఛార్జ్ వసూలు చేయడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఉదయం నుంచే కేంద్రం అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలు పెంచితే  కఠిన చర్యలు చర్యలు తీసుకుంటమని కేంద్రం తెలిపింది.1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని విమానయాన శాఖ తెలిపింది  

తెలంగాణ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నది వద్ద పులి జాడలు కలకలం సృష్టించాయి. పులి జాడలను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.   తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన  థరూర్‌ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పులి అడుగుల గుర్తుల వీడియో సోషల్‌ మీడియాలో  పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణ సరిహద్దుల్లో  పులి సంచరించిన ఆనవాలు లేకపోయినప్పటికీ.. సరిహద్దుకు అతి సమీపంలో పులి అడుగుజాడలు ఉండటంతో  తెలంగాణ అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉండే గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.  ముఖ్యంగా  తాటిపల్లి గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ  చాటింపు వేయించారు. రైతులు  ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇలా ఉండగా వార్దా నది ఒడ్డుల పులిని చూశామని తాటిపల్లి గ్రామస్థులు చెబు తున్నారు.  

పాట్నాలో శ్రీవారి ఆలయం...బీహార్ సర్కార్ అంగీకారం

  బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి కోసం 10.11 ఎకరాల భూమిని  కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి ప్రభుత్వం లేఖ పంపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్త్నె, బెంగళూరు వంటి నగరాల్లో టీటీడీ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల జమ్మూలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు.  పాట్నాలో టిటిడి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ ఛైర్మెన్  బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై  సీఎం  చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించిందినట్లు ఛైర్మన్ తెలిపారు. సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఛైర్మెన్ తెలిపారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు.  బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ తో టీటీడీ ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టీటీడీ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.  

వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం!

వారసత్వ ఆస్తులు, ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళతరం, సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇకపై ఈ రిజిస్ట్రేషన్లు గ్రామ, వార్డు సెక్రటేరియెట్లలో నే చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు. భూయజమాని మరణం తర్వాత కుటుంబసభ్యులు ఆ ఆస్తులను తమ పేర్లపై బదలాయించుకోవడానికి రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవ్వడమే కాకుండా,  డాక్యుమెంట్లు.. ఫ్యామిలీ సర్టిఫికెట్ల సమస్యలతో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఈ కారణంగా భూవివాదాలు పెచ్చరిల్లు తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.   ఈ కొత్త విధానంలో డెత్,  లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు,  ఆధార్, ఆస్తి డాక్యుమెంట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్  సమర్పిస్తే.. డిజిటల్ అసిస్టెంట్ వాటిని వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక మ్యూటేషన్ కూడా ఆటోమేటిగ్గా అయిపోయి, పాస్ బుక్  జారీ అవుతుంది. వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మ్యూటేషన్ ఆటోమేటిక్‌గా జరిగి, ఈ-పాస్‌బుక్ జారీ అవుతుంది. గతంలో అయితే.. వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎమ్మార్వో లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది, అక్కడ ప్లెయిన్ పేపర్‌లో వివరాలు సమర్పించి కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ కొత్త సరళీకరించిన విధానంతో  స్థానిక సెక్రటేరియట్లలోనే ఈ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది.  

జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానుల హడావుడి.. ఉద్రిక్తత

హైదరాబాద్‌ జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానులు హంగామా సృష్టించారు. సయ్యద్ ముస్తాక్ అలీ రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు జితేష్ శర్మ, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్ వచ్చారన్న సమాచారంతో  పెద్ద సంఖ్యలో  అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు తరలి వచ్చారు. గ్రౌండ్ లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా గుమిగూడటంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎవరినీ మైదానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ లోగా కొందరు గోడలు దూకి, చెట్లు ఎక్కి మైదానంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో గాయపడ్డారు.  పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు  వారిని అదుపు చేశారు.  

ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్

  ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. రద్దు చేసిన విమాన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని సూచించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ నియంత్రణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఫ్లైట్స్ రద్దు కారణంగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 405 డొమెస్టిక్ విమానాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం, రద్దయిన విమానాల ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.  అంతేకాకుండా, ప్రయాణికులకు దూరమైన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి, వారి నివాసానికి లేదా వారు కోరుకున్న చిరునామాకు చేర్చాలని ఆదేశించింది. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి, రిఫండ్‌ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కేంద్రాలు బాధితులైన ప్రయాణికులను స్వయంగా సంప్రదించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా రిఫండ్‌లు అందేలా చూడాలని తెలిపింది. మరోవైపు ఇండిగో సంక్షోభాన్ని కొన్ని విమాన సంస్థలు సోమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. ఇంటర్‌నేషనల్ సర్వీసుల కంటే నేషనల్ సర్వీసుల ధరలు రెట్టింపు అయ్యాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విమాన సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచడాన్ని కేంద్రం తప్పుబట్టింది. విమాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.  

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు

  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీలో జనవరి 8,9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమిట్‌ అజెండా ఖరారైంది. రెండు రోజుల కార్యక్రమంలో 27 ప్రత్యేక సెషన్లు ఉండనున్నాయి. రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డ్యాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా అభివృద్ధి చేసే రోడ్ మ్యాప్ ప్రకటిస్తారు.  దీనికి దేశ, విదేశాల ప్రముఖుల హాజరుకానున్నారు. 9న సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.  ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా పాల్గొననున్నారు. క్రియేటివ్ సెషన్‌లో రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా పాల్గొంటారు  

సెల్ ఫోన్లలో లైవ్ లొకేషన్ ట్రాకింగ్.. కేంద్రం యోచన

నిరసనలూ, వ్యతిరేకతలను ఇసుమంతైనా పట్టించుకోకుండా అన్ని మొబైల్ ఫోన్లలోనూసైబర్ సెక్యూరిటీ అప్లికేషన్ ‘సంచార్ సాథి’ని అమలు చేయాలన్న భావనకే కేంద్రం కట్టుబడి ఉంది. గతంలో వ్యతిరేకతకు వెరసి దానిని ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం  దేశ వ్యాప్తంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఆన్ లైన్  లొకేషన్ ట్రాకింగ్‌ను అమలు చేసే అంశాన్ని కేంద్రం చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది.   వాస్తవానికి గోప్యతా సమస్యల కారణంగా దీనికి ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.    కేసుల దర్యాప్తు కోసం  టెలికాం సంస్థలు  చట్టపరంగాకోరిన సందర్భాలలో  ఖచ్చితమైన లొకేషన్‌లను పొందగలిగేలా స్మార్ట్ ఫోన్ లలో లోకేషన్ ట్రాకింగ్ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే దిశగా అడుగులు వేస్తున్నదని సమాచారం.  ప్రస్తుతం, టెలికాం ఆపరేటర్లు  సెల్యులార్ టవర్ డేటా ద్వారా సుమారు లొకేషన్ ను మాత్రమే అందించే అవకాశం ఉంది. ఇలా చేయడం వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే కాకుండా సున్నితమైన రంగాలకు హాని చేకూరే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని మొబైల్ వినియోగదారులు కూడా ఇష్టపడరని చెబుతున్నారు.  అయితే ఈ విషయంలో ఇప్పటివరకు  ప్రభుత్వం ఎటువంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయంపై  చర్చించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్  సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించతలపెట్టిన సమావేశం వాయిదా పడింది. అయితే ఆన్ లైన్ లైవ్ ట్రాకింగ్ విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.  

ఉగ్ర చెరలో భువనగిరి యువకుడు

దక్షిణాఫ్రికాలోని మాలిలో భువనగిరికి చెందిన ఓ యువడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మాలిలోని కోబ్రీలో రూబి బోర్ వెల్ సంస్థలో పని చేయడానికి వెళ్లిన భువనగిరి యువకుడు ప్రవీణ్ ను గత నెల 23న జెఎన్ఐ ఉగ్రవాదులు   కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడి కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకుంటున్నారు. గత 14 రోజులుగా మాలిలో  ఉగ్రవాదులచెరలో ఉన్న నల్లమాస ప్రవీణ్ ను విడిపించి క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వేడుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమరం గ్రామానికి చెందిన నల్లమస ప్రవీణ్ జీవనఉపాధి కోసం ఆఫ్రికా ఖండం లోని మాలి  రాష్ట్రంలోని ఓ  బోర్వెల్ కంపనీ నుంచి నల్లమసు ప్రవీణ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్ లో మాలీ  వెళ్లినప్రవీణ్,  గత నెల 23న చివరిసారిగా  తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం అదే రోజు రాత్రి  కిడ్నాప్ నకు గురయ్యాడు. అప్పటి నుంచీ  ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన  తల్లిదండ్రులు సంబంధిత బోర్ వెల్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు.  దీంతో ప్రవీణ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి వారికి తెలిసింది.   తమ కుమారుడిని ఉగ్రవా దుల చర నుంచి విడిపించి క్షేమంగా తమ ఇంటికి పంపిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రవీణ్ తల్లిదండ్రులు వేడుకుం టున్నారు. ఇప్పటివరకు ప్రవీణ్ గురించి ఎటువంటి సమాచారం తెలియదని వారు తెలిపారు. 

ఆత్మగౌరవం విద్యతోనే సాధ్యమని చాటిన అంబేడ్కర్

రాజ్యాంగ రూపశిల్పి ,దళితుల ఆశాజ్యోతి బీఆర్.అంబేడ్కర్.. రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమా నత్వం,న్యాయం అంశాలు చేర్చడం ద్వారా భారతీయులందరూ చట్టం ముందు   సమానమేనని ప్రతిపాదించి,  అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విద్యే ఆయుధమని బోధించారు.విద్య,ఉద్యోగాల్లో వారికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం  అంబేడ్కర్ ఆలోచన. బాలగంగాధర్ తిలక్ గనుక అంటరాని వాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని కాకుండా, అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, జన్మహక్కు అనేవాడు అన్న గొప్ప సమతావాది అంబేడ్కర్.  ఆయన అసలు పేరు భీం రావు రాంజీ అంబేడ్కర్. చిన్నతనం నుంచి ఆయన వర్ణవివక్ష, అస్పృశ్యత  స్వయంగా అనుభవించాడు. భారత్ లో దళితుల అభ్యున్నతికి జీవితకాలం పొరాడిన యోధుడు.అంటరానితనం,కులనిర్మూలన కోసం కృషి చేసిన సంఘసంస్కర్త.  అంబేడ్కర్ భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా పని చేసారు. 1927లో శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అంబేడ్కర్  పీష్వాల సామ్రాజ్య పతనం కేవలం అస్పృశ్యత పాటించడం వల్లేనన్నారు.  అంటరానివారుగా భావిస్తున్న కులాలవారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేసి ఆయా వృత్తులు చేస్తున్నారని, వారిని ఇతర వర్ణాలవారు గౌరవించడం ధర్మమ న్నారు.అంబేడ్కర్ స్వతంత్ర్య భారత్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. 1930,31,32 లలో లండన్లో  జరిగిన  రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.రెండో సమావేశం లో గాంధీ పాల్గొన్నారు.ఈ సమావేశంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని అంబేడ్కర్  డిమాండ్ కు హిందూ సమాజం విచ్ఛన్నమవుతుందంటూ గాంధీ వ్యతిరేకించారు. ఏకాభిప్రాయం కుదరక గాంధీ సమావేశం నుంచి  వాకౌట్ చేశారు. గాంధీ, అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం జరిగింది.తర్వాత గాంధీ  హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పాటు చేసి అస్పృశ్యత నివారణ కు కృషి చేశారు. ఆ కృషిలో అంబేడ్కర్ నూ గాంధీ భాగస్వామి చేసారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు సహకరించకపోవడంతో అంబేద్కర్  బయటకు వచ్చి  షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్' ఏర్పాటు చేసి దళితులను సమీకరించారు. స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగపరిషత్ సభ్యుడిగా అంబేడ్కర్ నియామకం జరిగింది. భారత రాజ్యాంగం అత్యంత ప్రామాణికం కావడం వెనుక ఉన్నది అంబేద్కర్ కృషి అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. .  1956లో ఐదులక్షల మందితో  అంబేడ్కర్  బౌద్ధమతం స్వీకరించారు. గాంధీతో విభేదించినా మతం మారదల్చుకున్నప్పుడు భారత సంస్కృతి లో భాగమైన బౌద్ధాన్ని ఎన్నుకున్నానని చెప్పడం ఆయన దేశభక్తి,భారతీయత పట్ల అభిమానానికి చిహ్నంగా చెప్పుకోవాలి.  ముంబైలో బీఏ పూర్తిచేసి లండన్లో ఎం.ఏ, ఎమ్మెస్సీ, పీ.హెచ్.డీ, డీ.ఎస్.సీ, బారిష్టర్, ఎల్ఎల్, డీ.లిట్ చదివారు. 1891ఏప్రిల్ 14న ఇప్పటి మధ్యప్రదేశ్ లోని మౌ అనే గ్రామంలో రాంజీ,భీమాభాయిలకు 14వ సంతా నంగా జన్మించిన  అంబేడ్కర్ బరోడా మహారాజు ఇచ్చిన విద్యార్థి వేతనంతో బీఏ పరిక్ష లో ఉత్తీర్ణత సాధించారు. విదేశాల నుంచి డాక్టర్ అంబేద్కర్ గా 1917లో స్వదేశం వచ్చారు.అప్పటికి ఆయనకు 27ఏళ్లు.   మహారాజు శాయోజీరావు సంస్థానం లో సైనిక కార్యదర్శి గా పనిచేసారు. కొల్హాపూర్ మహారాజు సహాయంతో  మూకనాయక్  పత్రిక కు సంపాదకుడిగా పని చేశారు.  విదేశాలకు వెళ్లి మరిన్ని ఉన్నత విద్యలు అభ్యసించి తిరిగి వచ్చాడు.1936లో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937ఎన్నికల్లో ఆ పార్టీ 14 స్థానాలు గెలుచుకుంది. ఆయన యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్  పుస్తకం కులవ్యవస్థ ను తీవ్రంగా విమర్శించింది.దళితులు భారతీయ ముస్లింల కంటే కాంగ్రెస్ విధానాల వల్ల అణచివేయబడ్డారని విమర్శించారు.  అనారోగ్యంతో 1956 డిసెంబర్ 6వ తేదీ మరణించారు.ఆయన మరణించి  69 ఏళ్లు గడిచినా అంబేద్కరిజం భారత్ లో సజీవంగా ఉంది.   నేడు దళితులు సాంఘికంగా,రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందడం ఆయన పోరాటం ఫలితమే.  ఆయన చూపిన దారిలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాలిదారిలో నడవడం నిజమైన నివాళి.   అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా..

రాజ్యసభలో విమానాల రద్దు అంశం.. చర్యలు తీసుకుంటామన్న కేంద్రం

గతమూడు నాలుగు రోజులుగా రోజులుగా విమానాల రద్దు అవుతూ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడటం, విమానాశ్రాయాలలో ఆందోళనలకు దిగడం తెలిసింది. ముఖ్యంగా ఒక్క ఇండిగో సంస్థ  దాదాపు 500 విమానాలను రద్దు చేసిన అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.  ఈ విమానాల రద్దు అంశం సాధారణ పౌరుల నుంచి ఏంపీల వరకూ అందరిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి రాజ్యసభలో చెప్పారు. రాజ్యసభ జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన  ఒక విమానయాన సంస్థ గుత్తాధిపత్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి  ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సభకు చెప్పారు.  తాను పౌర  విమానయాన శాఖ మంత్రితో మాట్లాడానన్న ఆయన  విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.  వాస్తవానికి నిర్వహణ లోపాల కారణంగానే  ఇండిగో విమాన సర్వీసులకు ఆటంకం కలిగిందని, ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై కేంద్రం కూడా రంగంలోకి దిగి విమానాల రద్దుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని కిరణ్ రిజుజు అన్నారు.  బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  అదలా ఉంటే..  విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ   పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలిస్తూ శుక్రవారం  ఉత్తర్వులు జారీ చేసింది. పైలట్లకు  వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయ రాదు అన్న షరతులు ఉపసంహరించింది. ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  ఇలా ఉండగా ఒక్క శుక్రవారం (డిసెంబర్ 5)నే  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు  క్యా న్సెల్ అయ్యాయి. అలాగే వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 

మాలిలో ఇద్దరు తెలుగు కార్మికులు కిడ్నాప్

పొట్ట కూటి కోసం కూలీలుగా మాలిలో పని చేస్తున్న ఇద్దరు తెలుగు కార్మికులు   కిడ్నాప్‌ నకు గురయ్యారు. వీరిలో ఒకరు యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమరం గ్రామానికి చెందిన నల్లమాస్ ప్రవీణ్ కాగా, మరొకరు అలాగే సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన రామచంద్రన్. వీరిరువురూ ఏడాది కిందట  రూబీ బోర్‌వెల్ కంపెనీ ఉద్యోగం కోసం మాలి దేశానికి వెళ్లారు.  అయితే గత నెల   23న  గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.  కాగా అప్పటి నుంచీ  మొబైల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు.  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ వారిని  సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. కాగా మాలిలో తెలుగు యువకుల కిడ్నాప్ నకు సంబంధించి సంబంధిత అధికారులు  దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వీరి గురించి ఎటువంటి సమాచారం అందలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమౌతున్నారు.   ఇలా ఉండగా వీరిని జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ (జేఎన్ఐఎం) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కాగా వీరు పని చేస్తున్న బోర్ వెల్ సంస్థ యాజమాన్యం కూడా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగుల విడుదల కోసం ఉగ్రవాదులు ఏ డిమాండ్ చేసినా అంగీకరించి తీర్చుందుకు సిద్ధంగా ఉన్నట్లు బోర్ వెల్ సంస్థ యాజమాన్యం ఎంబసీ అధికారులతో చెప్పినట్లు సమాచారం.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం… ఐదుగురు ఏపీ వాసులు మృతి

తమిళనాడులో శనివారం (డిసెంబర్ 6) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  మృతులు, క్షతగాత్రులూ కూడా ఏపీ వాసులే.  శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు తిరుచిరా పల్లి–సేలం జాతీయ రహదారిప్రమాదానికి గురైంది. ఈ ఏడుగురు యువకులూ ప్రయాణిస్తున్న కారును ఆపి రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటుండగా, లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొంది.  ఈ సంఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సంఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మిగిలిన ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు.  మృతులలో కొరప కొత్తవలస వాసులు వంగర రామకృష్ణ), మార్పిన అప్పల నాయుడు, మరాడ రాము, గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు ఉన్నారు. 

ఐదు వేల మంది పోలీసులతో ఆపరేషన్ కవచ్

నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్‌ కవచ్‌  పేరిట భారీ నాకాబందీ  నిర్వహించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో శుక్రవారం (డిసెంబర్ 5) రాత్రి ఈ ఆపరేషన్ జరిగింది. ఏకకాలంలో ఐదువేల మంది పోలీసులతో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఇంత మంది పోలీసు సిబ్బందితో నాకాబందీ చేపట్టడం కమిషనరేట్‌ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఏకకాలంలో నగరంలోని 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ ఫోర్స్‌ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్ , బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు  పాల్గొన్నాయి.   ఆపరేషన్‌ కవచ్ నేపథ్యంలో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ సజ్జనార్  ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ తనిఖీలకు నగర పౌరులందరూ పూర్తి సహకారం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్  కవచ్ అనంతరం కూడా  మీ భద్రత – మా బాధ్యత అంటూ సజ్జనార్ మరో పోస్టు చేశారు. 

పరకామణి చోరీపై జగన్ కామెంట్స్...ముప్పేట దాడి షురూ

  పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  తిరుమల పరకామణి చోరీని..చిన్న చోరీ అనడం చర్చనీయాంశమయ్యాయి. జగన్ వ్యాఖ్యలు దొంగలను సమర్థిస్తున్నాయంటూ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకుతిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  తిరుమల పరకామణి చోరీని చిన్న చోరీ అన్న జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూనే...దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని...అలానే తిరుమలలో జరిగిందనే విధంగా జగన్‌ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కలియుగ దైవంగా కొలిచే తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని.... చిన్న చోరీగా జగన్ అభివర్ణించడం రాజకీయ నేతలు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.    పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా...నిందితుడితో టీటీడీ పెద్దలు రాజీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. కానీ  కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.  ఓవైపు సీఐడీ విచారణ జరుగుతున్న క్రమం...మరోవైపు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదో చిన్న కేసు అంటూ కేవలం  9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా... తమ హయాంలోనే పట్టుకున్నామని...చోరీని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు,సోషల్ మీడియాలో దుమెత్తిపోస్తున్నారు.  అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే...దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసిచ్చారని జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారట.  72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరపాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయట.  చోరీని తక్కువ చేసి చూపడం దొంగలను సమర్థించడమే అవుతుందని భక్తులు మండిపడుతున్నారట. పరమ పవిత్రంగా భావించి శ్రీవారికి సమర్పించుకున్న మొక్కులు, కానుకలు చోరీకి గురైతే చిన్న చోరీ అంటూ దొంగలకు వత్తాసు పలుకుతూ మరో మహా పాపానికి ఒడిగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట.వాయిస్-జగన్ చేసిన కామెంట్స్‌పై రాజకీయంగానూ విమర్శల వేడి పెరిగింది.  దేవదేవుని పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న దొంగతనమే కదా అని వ్యంగ్యంగా మాట్లాడం చూస్తుంటే బాధకలుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే చిన్న దోంగ తనం అంటూ మాట్లాడిన జగన్‌ సంగతి దేవుడే చూసుకుంటాడని లోకేష్ అన్నారు. పరకామణి చోరీని చిన్న తప్పు అనడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలియువ వెంకటేశ్వరుడి ఆలయంలో చోరీ చేయడమే మహాపాపం అని అన్నారు. వెంకన్న ఖజానాలో చోరి జరిగితే చిన్న చోరీ అంటావా...బుద్దుందా జగన్ అంటూ బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. 72వేల చోరీ చేసిన వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు జగన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం సమర్ధించే విధంగా మాట్లాడుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. దొంగ ఇచ్చిన 14 కోట్ల రూపాయలను టీటీడీ మాజీ ఛైరెమన్ భూమన కరుణాకర్‌ రెడ్డి దానంగా చెప్పుకురావడం మరింత సంచలనంగా మారింది.  టీడీడీకి ఎవరు దానం ఇచ్చినా...దానంగానే పరిగణిస్తారని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.  దొంగ ఇచ్చారా...మరొకరిచ్చారా అనేది కాదని...ఎవరిచ్చినా తీసుకునే పరిస్ధితి టీటీడీలో ఉందంటూ భూమన కరుణా రెడ్డి మరో వివాదానికి తెరలేపారు జగన్‌ వ్యాఖ్యలతో మరోసారి రాజకీయానికి కేంద్రబిందువుగా తిరుమల పరకామణి ఇష్యూ మారింది. జగన్‌ వ్యాఖ్యలు దొంగను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కూటమి పార్టీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం..జగన్‌ను వెనకేసుకొస్తుండటం..అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోందట.  

అమెరికాలో అగ్నిప్రమాదం .. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

  అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన  అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో అలబామా యూనివర్శిటీలో చదువుకుంటున్న సుమారు 10 తెలుగు విద్యార్థులు నివాసముం టున్నారు.  ఈరోజు ఉదయం బర్మింగ్‌ హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు మొదలైన కొద్ది క్షణాల్లోనే దట్టమైన పొగలు ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని కమ్మేశాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ త్వరగా వ్యాపిస్తూ ఉండడంతో కాసేపటికే అపార్ట్‌మెంట్‌ను దట్టమైన పొగతో కమ్మేయడంతో అందులో నివాసం ఉంటున్న విద్యార్థులు శ్వాస తీసుకో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు భయంతో గట్టి గట్టిగా అరుస్తూ బయట పడేందుకు ప్రయత్నించారు.  కానీ అప్పటికే అపార్ట్మెంట్ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించ డంతో వారు లోపలే చిక్కుకుపోయారు. సమా చారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘ టనా స్థలానికి చేరుకుని లోపల చిక్కుకొని పోయిన వారందరినీ బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టింది. మొత్తం 13 మంది విద్యార్థులను రెస్క్యూ చేసి బయటకు తీసుకువచ్చిన అనంతరం ఫైర్ సిబ్బంది వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్ర గాయాలైన ఇద్దరు విద్యార్థులు హాస్పి టల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.  మృతుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, మరో విద్యార్థి కూకట్‌పల్లి ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ అల బామా యూనివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తు న్నారు.ఈ ఘటనతో అమెరికాలో ఉన్న తెలుగు  విద్యార్థుల వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.