మనసును స్వాధీనం చేసుకోవడానికి ఏమి చేయాలి?

మనసును తమ స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ మనసు నియంత్రణ గురించి ఎంతో కొంత తెలుసు. మనందరం మనసుల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ, దాని గురించి మరికొంత తెలుసుకొని, మరింత మెరుగ్గా, సమర్థంగా మనసును స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి.


ఈ విషయంలో మనకు ఎవరు సహాయం చేయగలరు? ఎవరైతే తమ మనసును సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకున్నారో వారు మాత్రమే మనకు సహాయపడగలరు! మనోనిగ్రహం ఎంతో ఆసక్తికరమైన ఆట. అయితే అది మనకు అంతర్గతమైనది. గెలుపు ఓటములను లెక్క చేయని మనస్తత్వం (క్రీడాస్ఫూర్తి) ఉంటే అప్పుడప్పుడు, తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచినా, ఈ ఆటను గొప్పగా ఆనందించవచ్చు. ఈ ఆట ఆడడానికి నైపుణ్యం, చురుకుదనం, హాస్యస్ఫూర్తి, మంచి హృదయం, వ్యూహాత్మక శక్తి, ధీరోదాత్తత అవసరం. అప్పుడే నూరుసార్లు అపజయం పాలైనా గుండె జారిపోకుండా నిలదొక్కుకోగలం. 

అత్యున్నత యోగస్థితిని ఎలా పొందగలమో శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. అర్జునుడు ఆయన చెప్పినది విని నిస్పృహతో భగవానుణ్ణి ఈ క్రింది విధంగా అడిగాడు. అతని నిస్పృహను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.


“ఓ కృష్ణా! మనను అత్యంత చంచలమైనది! నువ్వు బోధించే ఈ యోగం సంపూర్ణంగా నిశ్చలమైన మనసును కలిగివున్నప్పుడే సాధ్యం కదా! కాబట్టి ఈ యోగస్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్థం కావడం లేదు. అంతేకాక  మనసు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది. అది శక్తిమంతమైనది, మూర్ఖమైనది. గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో మనసును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నాకు తోస్తున్నది” అని అర్జునుడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు.


మానవులందరూ సర్వసాధారణంగా అడిగే ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు సర్వమానవాళీ ఎల్లకాలం గుర్తుంచుకోదగిన సందేశాన్నిచ్చాడు. మనసు నియంత్రణకు సంబంధించిన భారతీయ ఆలోచనా ధోరణి, సాధనా విధానం చాలావరకూ ఈ సందేహం మీదే ఆధారపడ్డాయి. 


శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు.. “ఓ అర్జునా! నిస్సందేహంగా మనసు ఎంతో చంచలమైనది. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.” 'అభ్యాసం', 'వైరాగ్యం' అనే ఈ రెండు మాటలలో శ్రీకృష్ణుడు మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన రహస్యాన్నంతటినీ  అందించాడు.


కానీ, వాటిని మన జీవనస్రవంతిలోకి తెచ్చేది ఎలా? అదే అసలు సమస్య. దీన్ని పరిష్కరించడానికి..


=> మనసును స్వాధీనపరచుకోవాలన్న దృఢ సంకల్పం కలిగివుండాలి.


=> మనసు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.


=> మనోనిగ్రహం కోసం క్రమం తప్పకుండా ప్రయత్నించాలి. 


ఈ మూడు చేస్తే మనసు స్వాధీనంలో ఉంటుంది.


                                     *రూపశ్రీ.

 

Teluguone gnews banner