సజ్జలకు సుప్రీంలో చుక్కెదురు

వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్  సజ్జల భార్గవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.  వైకాపా హాయంలో సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వారిపై ఇటీవల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందులో భాగంగా వైకాపా సోషల్ మీడియా  కన్వీనర్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలని సజ్జల భార్గవ్ సుప్రీం కోర్టు నాశ్రయించారు. అయితే కేసుల అంశం హైకోర్టులోనే  తేల్చుకోవాలని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.  అలాగే సజ్జల పిటిషన్ తిరస్కరించింది.   సజ్జల తరపున కపిల్ సిబల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. పాత కేసులను తిరగదోడి కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారని కపిల్ సిబాల్ సజ్జల తరపున వాదించారు.   మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సిద్దార్థ  ప్రభుత్వం తరపున లూద్రా వాదించారు. 

 తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పెద్ద పులి

 తెలుగు రాష్ట్రాలకు పెద్ద పులి భయం పట్టుకుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాలలో  మగపెద్ద పులులు ఆడపులుల కోసం వెతుకుతుంటాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మగ పెద్ద పులులు తెలుగు రాష్ట్రాలో ఎంటర్ అయినట్టు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.  పులులు గత రెండు రోజులుగా  ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి , సంతబొమ్మాళి మండలాల్లో బెంగాల్ టైగర్ సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా పులిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీప ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన మరువకముందే సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.ఈ క్రమంలో టెక్కలి  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. ఒంటరిగా రాత్రి పూట ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పెద్ద పులి భయంతో సాయంత్రమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం వణుకుతున్నారు. అటు, పులి సంచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని.. ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అటవీ అధికారులు మంత్రికి వివరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించిన అధికారులు.. కరపత్రాలు పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.అటు, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని రోజులుగా పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువుల మందలపై దాడులు చేస్తూ వచ్చాయి. చివరకు పత్తి ఏరుతున్న ఓ యువతిపై దాడి చేసి చంపేసింది. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి   మరో ఆరుగురు మహిళలతో కలిసి నజ్రుల్‌నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు వెళ్లారు. కొంతసేపటికే చేనులోకి వచ్చిన పెద్దపులి మహిళపై దాడి చేసి నోట కరచుకుని వెళ్లింది. అక్కడున్న వారు కేకలు వేయడంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.ఈ ఘటనతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగజ్‌నగర్‌ మండలంలో ఆంక్షలు విధించారు. దాదాపు పది, పదిహేను గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు.

బలహీన పడిన ఫెంగల్ తుఫాను ... ఐనా భారీ వర్షాలు

ఫెంగల్ తుఫాను బలహీనపడింది. అయినప్పటికీ దీని  ప్రభావం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఎపిలోని  నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. తుఫాన్‌ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రిడ్జ్‌ ప్రభావంతో ఫెంగల్‌ తుఫాన్‌ తీరందాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిందని విశ్లేషించారు. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.   

మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసిన కులాంతర  వివాహం

కులాంతర  వివాహం ఓ మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. స్వంత తమ్ముడే హత్యకు పాల్పడటం సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టి.. తర్వాత కత్తితో మెడపై నరికి చంపాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.భర్తకు విడాకులు ఇచ్చి కులాంతర వివాహం చేసుకున్ననాగమణిని స్వంత తమ్ముడు విభేధించి హత్య చేశాడు. హయత్‌నగర్‌ పీఎస్‌లో పనిచేస్తున్న నాగమణి.. డ్యూటీకి వెళ్తుండగా దుండగులు అటాక్ చేసి హత్య చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కానిస్టేబుల్‌ హత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు రేవంత్ చేతుల మీదుగా  ఆరోగ్య ఉత్సవాలు 

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ మరింత ముందుకు వెళుతుంది.ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 28 పారామెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీలు, 32 ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే కొత్తగా 213 అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మెడికల్‌ బోర్డు ద్వారా ఇటీవల నియమితులైన 442 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల (సీఏఎ్‌స)కు, 24 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేస్తారని పేర్కొంది. ఇటు.. హైదరాబాద్‌ బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 39వ వార్షికోత్సవానికి సీఎం హాజరై ప్రారంభించనున్నారు.కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు.  

షరియత్ ఆచరిస్తే సమాజంలో గుర్తింపు

ఇస్లాంలో అరబ్బీ నేర్చుకోవడం కంపల్సరీ అని జాపర్ భాయ్ తన మనవళ్లకు చెబుతున్నాడు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒకరోజు  మౌలానా దగ్గరికి వచ్చాడు.  జాఫర్ భాయ్: సలాం వాలేకూం మౌలానా సాబ్  మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్.  జాఫర్ భాయ్ : నా మనవళ్లకు అరబ్బీ నేర్పిస్తున్నాను. ఇస్లాంలో అరబ్బీ కంపల్సరా?  మౌలానా: లేదు జాఫర్ భాయ్. ఖురాన్ అరబ్బీలో ఉన్నప్పటికీ ముస్లింల మాతృభాష పార్సీ. బ్రిటీషు హాయంలో పార్సీని ప్రోత్సహించలేదు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద భాషగా పార్సీ అయితే ప్రజలు చైతన్యవంతం అవుతారన్న అనుమానంతో ఉర్దూను పరిచయం చేశారు. ఉర్దూ  ఇపుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు  ఉంది. అరబ్బీ కంపల్సరీ కాదు. మాతృభాష ప్రోత్సహించడానికి ఉర్దూ ప్రోత్సహించవచ్చు. కానీ అరబ్బీ నేర్చుకుంటే మంచిది. కానీ కంపల్సరీ కాదు.  ఇవ్వాళ డబ్బు కోసం  నానా గడ్డి తింటున్నారు. డబ్బు వల్ల సుఖం వస్తుంది. చిన్న కష్ట మొచ్చిన డిప్రెషన్ లో పడతారు. పరువు ప్రతిష్ట వల్ల సుఖం వస్తుంది.  డబ్బు వల్ల కూడా సుఖం వస్తుంది. కానీ డబ్బు ఉన్నా సుఖం దక్కడం లేదు. చాలామందికి అన్నీ ఉన్నా సుఖం దక్కడం లేదు. షరియత్ ఆచరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఒకసారి షరియత్ అమలు చేసే వ్యక్తి వెహికిల్ పంచర్ అయ్యింది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి పంచర్ అయిన వ్యక్తి వెహికల్ తొలుత పంచర్ చేయాలని సిఫారసు చేస్తున్నాడు.  గడ్డం, టోపీ ఉన్న వ్యక్తులను చూస్తే  సమాజంలో ఉన్న  మంచి గుర్తింపు అది. ఆఫీసుల్లో  చాలా చోట్ల నమాజు చదివే వ్యక్తిని తక్కువగా చూస్తున్నారు. నెత్తి మీద టోపీ పెట్టుకున్నా మౌలానా అని పిలుస్తున్నారు. దీనివల్ల చాలామంది నమాజు చేసిన తర్వాత టోపీలను జేబులో పెట్టుకుని వెళుతున్నారు. షరియత్ వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.  వాళ్లకు వాళ్లేమనుకున్నారు వీళ్లు ఏమనుకున్నారు అనుకోరు. అల్లా ఇచ్చే ఆత్మవిశ్వాసంతో వాళ్లు మరింత ముందుకు వెళుతున్నారు.  ప్రతీరోజు ఐదుసార్లు నమాజు చేయడం ప్రతీ ముస్లిం వ్యక్తి విధి. హజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. భార్య భర్తలు ఒకసారి హజ్ వచ్చారు. భార్యకు ఇష్టం లేనందువల్ల అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అల్లా పట్ల భక్తి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృష్టిలో అందరి కంటే గొప్ప వ్యక్తి అల్లా. చదువు కోసం అమ్మాయి పెళ్లిని వాయిదా వేయిద్దు.  పెళ్లి అయిన తర్వాత  కూడా చదువుకోవచ్చు.                                                                               బదనపల్లి శ్రీనివాసాచారి

తిరుపతి వాసులకు శ్రీవారి ఉచిత దర్శనం

ఇక నుంచీ ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి వాసులకు తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 3న తిరుమల వాసులకు ఉచిత దర్శనం లభించనుంది. ఇందుకోసం ఆదివారం (డిసెంబర్ 1)న టోకెన్లు జారీ చేస్తారు. తిరుమల, తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతి స్థానికులు అంటే తిరుమతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన వారు వస్తారని టీటీడీ స్పష్టత ఇచ్చింది.  ఈ ఉచిత దర్శనం ప్రతి నెలా మొదటి మంగళవారం ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. ఈ ఉచిత దర్శనం కోసం రెండు రోజుల ముందుగా టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం తిరుపతి నగరం తోపాటు రూరల్ మండలం, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలాలకు చెందిన వారికి ఆధార్ కార్డు తప్పని సరి. ఇక వీటి కోసం  టీటీడీ మహతి ఆడిటోరియంలో ఒకటి,  తిరుమల కమ్యూనిటీ హాల్ లో మరోటి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.  తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు కొలువు దీరిన తరువాత జరిగిన మొదటి సమావేశంలోనే టీటీడీ చైర్మన్ తిరుపతి స్థానికులకు శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని నిర్ణయించారు.  

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి కన్నుమూత

అమెరికాలో పెచ్చరిల్లుతున్న గన్ కల్చర్ కారణంగా అమాయకులు అసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలో కాల్పుల ఘటనలో తెలంగాణ యువకుడు మరణించాడు. ఎమ్ ఎస్ చదవడానికి నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లిన ఖమ్మానికి చెందిన సాయి తేజ ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కన్నుమూశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సాయి తేజ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసిన అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  సాయితేజ మరణ వార్తతో అతని స్వగ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.    ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల కుమారుడు సాయితేజ. ఉన్నత చదువుల కోసమని 4నెలల క్రితం అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే  ఒక షాపింగ్ మాల్‌లో స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.   శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం  ఒంటిగంట ప్రాంతంలో ఇద్దరు దుండగులు సాయితేజ పనిచేస్తున్న స్టోర్‌కు వచ్చి వచ్చీరావడంతోనే కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పుల్లో సాయితేజ అక్కడికక్కడే మరణించారు. కాల్పులు జరిపి మాల్ లో అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన దుండగులు కౌంటర్ నుంచి సొమ్ము దొంగిలించి పారిపోయారు. సాయితేజ కుటుంబ సభ్యులను మంత్రులు పొంగులేని శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. సాయితేజ భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 

బీఆర్ఎస్ దీక్షా దివస్ కు జనం దూరం.. కారణమేంటో తెలుసా?

తెలంగాణలో అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ తలవనైనా తలవని దీక్షా దివస్ కు  బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత  ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చింది. పదేళ్ల అధికారంలో ఉన్నా తెలంగాణ సాధన కోసం సావు నోట్లో కేసీఆర్ తలపెట్టిన రోజును మాత్రం ఎన్నడూ పెద్దగా స్మరించుకోలేదు. అయితే ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన తెలంగాణ ఆత్మను కూడా పార్టీలో లేకుండా చేసిన తరువాత.. ఔను రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వదిలేశారు. జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకుని ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులోంచి తెలంగాణను తీసేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాగించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆ మార్పుతోనే తెలంగాణ వాదంతో ఉన్న అనుబంధం పుటుక్కున తెగిపోయింది. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.  ఈ నేపథ్యంలోనే తమ పార్టీ గతంలో చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రజలకు గుర్తు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన నవంబర్ 19వ తేదీని దీక్షా దివస్ పేర ఘనంగా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమర వీరుల స్మారక చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు ర్యాలీలు, ప్రార్థనలతో హడావుడి చేశారు.  కరీంనగర్‌లోని అలుగునూరులో జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో పార్టీ  సీనియర్ నేత , మాజీ మంత్రని హరీశ్ రావు పాల్గొన్నారు. ఇక గత కొన్ని నెలలుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాగ్లొన్నారు. ర్యాలీలోనూ కనిపించారు. ఇంత వరకూ బానే ఉంది కానీ, నిజంగా ఈ కార్యక్రమానికి ప్రజలలో గుర్తింపు రావాలంటే ముఖ్యనేత, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్ పాల్గొనాలి. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ దీక్షా దివస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయింది.   

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ట్వీట్ 

తెలంగాణలో  పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి  ఈ రోజు(నవంబర్ 30) తో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది.   ఏడాది పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మార్పుకోసం పోలింగ్ బూత్ కు వెళ్లి  అరక కట్టాల్సిన రైతు ఓటేశాడు, ఆ ఓటే అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగ రాసింది.  ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తీసుకొచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు  రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కల్సి ఉమ్మడి పాల మూరుకు వస్తున్నా అని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ అయ్యింది. 

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం!

వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో తిరుమల కొండపై జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయ ప్రసంగాల నుంచి, రాజకీయ ప్రదర్శనలు, స్టిక్కర్ల ప్రదర్శనలకు తిరుమల వేదికగా మారింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం కూడా యథేచ్చగా సాగింది.  తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు.   ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమలలో అవినీతి అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ హయాంలో ఎంత జరగాలో అంతా జరిగింది. చివరికి శ్రీవారి ఆదాయానికి కూడా వైసీపీయులు శఠగోపం పెట్టేశారు. టీటీడీ చైర్మన్లుగా సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు ఉన్న సమయంలో  ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధుల వ్యయంలో గోల్ మాల్ జరిగిందని తేలింది. అలాగే ముడి సరుకులు కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలకు లెక్కే లేదు. మొత్తంగా జగన్ అధికారంలో ఉన్న కాలంలో శ్రీవారి ఖజానాకు 500 కోట్ల రూపాయలకు పైగా గండి పడిందని విజిలెన్స్ తేల్చింది.   వీటన్నిటికీ మించి తిరుమల కొండను వైసీపీయులు తమ రాజకీయ ప్రసంగాలు, ప్రచారాలకు వేదికగా చేసేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అధికారం కోల్పోయిన తరవాత కూడా వైసీపీయులు తిరుమల వేదికగా రాజకీయ ప్రసంగాలు చేయడంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలి బోర్డు సమావేశంలో తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించాలని తీర్మానించింది. ఇప్పుడు ఆ తీర్మానాన్ని అమలులోకి తీసుకువచ్చింది.  ఇక నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల కొండపై రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘించి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

కేసీఆర్ బాటలో కేటీఆర్?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తండ్రి కేసీఆర్ బాటనే అనుసరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటంచేశారు. ఎక్కడా బయటకు రావడంలేదు. ప్రసంగాలు చేయడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు. కేసీఆర్ ఆబ్సెన్స్ లో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఏడాది కాలంలోనూ బీఆర్ఎస్ ను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పథంలో నడపడంలో కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారంటూ ఇంటా బయటా వస్తున్న విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా.. రాజకీయ సన్యాసమా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి పోలిటికల్ గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ కు బ్రేక్ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారనీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారనీ, అందుకే కుమార్తె కవితను రంగంలోకి దింపారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ వైఫల్యాల కారణంగా పార్టీ మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు చేతుల్లోకి వెళ్లిపోతుందన్న ఆందోళనతోనే కేసీఆర్ కవితను రంగంలోకి దింపారని అంటున్నారు.  ఆ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయలకు ప్రకటించిన బ్రేక్ సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. 

పులివెందులలో వైసీపీ అరాచకాలకు అడ్డకట్ట పడుతోందా?

రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పులివెందులలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని ఇప్పటి వరకూ అందరూ చెబుతున్న మాట. పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట. వైఎస్ మరణం తరువాత కుటుంబంలో విభేదాలు తలెత్తినప్పటికీ, అక్కడ జగన్ అధిపత్యం ఇసుమంతైనా తగ్గలేదు. పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగానికి తోడు జగన్ రెడ్డి రాజ్యాంగం కూడా జమిలిగా అమలు అవుతోంది. అక్కడ వైసీపీగూండా రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందరి నోటా అదే మాట. అయితే ఏపీలో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు చేపట్టిన ఐదు నెలల తరువాత పరిస్ధితిలో క్రమంగా మార్పు వస్తున్నది. వైసీపీ గూండాల ఆటకట్టించేందుకు పోలీసులు నడుంబిగించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రారవీందర్ రెడ్డిని పులివెందుల గడ్డమీదే అరెస్టు చేసి జైలుకు తరలించారు.  తాజాగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా మూడేళ్ల నుంచి సాగిస్తున్న కార్ల దందాకు చెక్ పెట్టారు. విషయమేంటంటే.. తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి నుంచి పులివెందులకు చెందిన వైసీసీ నేతలు అద్దె కోసం అంటూ తీసుకువెళ్లారు. మూడేళ్ల నుంచీ అటు అద్దె చెల్లించకుండా, ఇటు కార్లు ఇవ్వకుండా వేధిస్తూ వస్తున్నారు. ఇదేంటని అడిగిన సతీష్ కుమార్ పై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. ఈ విషయమై మూడేళ్ల కిందటే తెలంగాణ పోలీసులకు సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే జగన్, రాజారెడ్డిల రాజ్యం అమలౌతున్న కాలం అది. పోలీసులు  చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో మూడేళ్ల నాటి కేసు ఫైలు బూజు దులిపిన తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో అడుగుపెట్టి వైసీపీ గూండాల చెర నుంచి సతీష్ రెడ్డి కార్లను విడిపించి అతనికి అప్పగించారు. అసలేంజరిగిందంటే.. మూడేళ్ల కిందట మెడికల్ కాలేజీ కోసం అంటూ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ కు చెందిన ఆరు కార్లను వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్ పై తీసుకువెళ్లారు. ఆ తరువాత అలా కార్లు తీసుకువెళ్లిన వారి ఆచూకీ సతీష్ కుమార్ కు దొరకలేదు. దీంతో జీపీఎస్ ట్రాక్ ద్వారా ఆ కార్లు పులివెందులకు చెందిన నేతల చేత్లుల్లో వేంపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సతీష్ కుమార్ వేంపల్లో వెళ్లి కార్లు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో వారు అతనిని ఇడుపుల పాయలో బంధించి భౌతిక దాడికి పాల్పడ్డారు. దీనిపై సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పట్టించుకోని పోలీసులు ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదిలారు. కడప పోలీసుల సహాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో గాలించి కార్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని సతీష్ కుమార్ కు అప్పగించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.  

తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి.. కేంద్రం ఆఫర్ నిజమేనా?

తెలుగుదేశం, బీజేపీల మధ్య 2014-2019 మధ్య కాలంలో సంబంధాలు బెడిసికొట్టడానికి విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేటాయింపులు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లతో  పాటు మరో అంశం కూడా కారణం అయ్యింది. అదే గవర్నర్ పదవి. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఓ గవర్నర్ పదవి ఇస్తానన్న హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఏదో ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తానన్న వాగ్దానం చేశారు. అయితే ఆ ఐదేళ్ల కాలంలో అది జరగలేదు. ఈ లోగానే విభజన హామీల అమలు, వాగ్దానాలను నెరవేర్చడంలో అప్పటి మోడీ సర్కార్ మొండి వైఖరి కారణంగా తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అప్పటి గవర్నర్ పదవి హామీ నెరవేరలేదు. గవర్నర్ గిరీ రాలేదన్న అలకతో మోత్కుపల్లి అప్పట్లో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోయారు. అది వేరే సంగతి. ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత  కేంద్రంలో మోడీ సర్కార్ తెలుగుదేశం మద్దతుపై మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనంత తానుగానే తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని అంటున్నారు. ఇలా మిత్రపక్షాలకు గవర్నర్ పదవి ఇవ్వడమన్నది కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికి అప్పటి కేంద్రం గవర్నర్ పదవులను కట్టబెట్టిన సంగతి విదితమే.  ఇప్పుడు కేంద్రం గవర్నర్ పదవి ఆఫర్ అన్నది వాస్తవమే అయితే ఆ పదవి కోసం కూడా తెలుగుదేశంలో పోటీ తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సీనియర్ నాయకులు అశోకగజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా కూడా తొలి నుంచీ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ముఖ్యంగా యనమల, అశోకగజపతిరాజులు చంద్రబాబుకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే పార్టీ కష్టకాలంగా గట్టిగా నిలబడ్డారు. నిజంగా తెలుగుదేశం నుంచి ఒకరిని గవర్నర్ గా పంపించాలని కేంద్రం భావిస్తే చంద్రబాబు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు  పార్టీలో జోరుగా సాగుతోంది. 

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురూ ఎవరు?.. పీటముడి పడిందా?

రాజ్యసభ ఉప ఎన్నికలలో ఏపీ నుంచి మూడు స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సభ్యులను బట్టి చేస్తే ఆ మూడు స్థానాలూ కూటమి అభ్యర్థులే గెలుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలా మూడు స్థానాలూ ఖాళీ ఎందుకు అయ్యాయంటే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలలో ముగ్గురు ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో  కూటమి పార్టాలలో ఎవరెవరికి స్థానం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే సహజంగానే తెలుగుదేశం ఈ స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ మిత్రధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని బీజేపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీకి వదిలివేయడానికి సుముఖంగా ఉంది. ఇక తెలుగుదేశం నుంచి పోటీ చేసే ఇద్దరూ ఎవరన్న విషయానికి వస్తే.. ముందస్తుగానే తెలుగుదేశం ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానం తాజా మాజీ బీద మస్తాన్ రావుకు ఖరారైంది. అలాగే బీద మస్తాన్ రావుతో పాటే వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం అధినేత కసరత్తు చేస్తున్నారు. ఇక ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగినా, స్వయంగా నాగబాబే అదంతా ప్రచారం మాత్రమేనని ఎక్స్ వేదిక ద్వారా స్పష్టం చేశారు. తనే సోదరుడు హస్తిన పర్యటన తనకు రాజ్యసభ స్థానం కోసమే అంటూ జరుగుతున్న ప్రచారానికి చుక్క పెట్టేస్తూ, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిలబడతారు కానీ స్వార్థం కోసం కాదని క్లారిటీ ఇస్తూ, ఆయన హస్తిన పర్యటనతో తనకు రాజ్యసభ స్థానం కోసం ఎలాంటి ప్రయత్నాలూ లేవని కుండబద్దలు కొట్టేశారు.  దీంతో ఇప్పుడు ఆ మూడో స్థానం ఎవరిది అన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో బలం పెంచుకునే క్రమంలో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కోరుతోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి ఇంకా ఏ గూటికీ చేరని ఆర్. కృష్ణయ్యకు కాషాయి కండువా కప్పి రాజ్యసభకు పంచించే యోచనలో బీజేపీ ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవలి హస్తిన పర్యటనలో మోడీతో జరిగిన చర్చల్లో ఈ మేరకు  అంగీకారం కూడా కుదిరిందంటున్నారు. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ కూడా.. మూడో స్థానం జనసేన, బీజేపీలలో ఎవరికైనా ఒక్కటే అన్న భావంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్.కృష్ణయ్య కమలం గూటికి చేరి రాజ్యసభకు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   బీసీ వర్గాల్లో మంచిఇమేజ్ ఉన్న కృష్ణయ్యను బీజేపీలో చేర్చుకుని రాజ్యసభకు పంపడం ద్వారా రాజకీయంగా తమకు లబ్ధి ఉంటుందని కమలనాథులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇక బీద మస్తాన్ రావు కాకుండా మరో స్థానానికి అభ్యర్థి ఎవరన్న విషయంలో తెలుగుదేశంలో తీవ్ర పోటీ నెలకొని ఉందని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని ఆయన సూచించిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ హయాంలో పార్టీ కోసం నిలబడి కష్టనష్టాలకు గురైన వారిని రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ తెలుగుదేశంలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు తెలుగుదేశం తరఫున టికెట్ దక్కేదెవరికి అన్న విషయంలో పీటముడి పడిందని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.  

అబ‌ద్ధాల ఆస్కార్ జ‌గ‌న్‌దే.. శాలువా క‌ప్పి స‌న్మానించాల్సిందే!

నేను రాష్ట్రానికి మంచి చేశా.. త‌క్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశా.. అందుకు నాకు శాలువా క‌ప్పి స‌న్మానం చేయాలి.. గొప్ప‌గా పొగ‌డాలి.. అలా చేయ‌కుండా నాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటి..? ఇవీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్య‌లు. ఒక‌ విధంగా చెప్పాలంటే.. మీడియా ముందు ఆయ‌న‌ క‌న్నీరు పెట్టుకున్నంత‌ ప‌నిచేశారు. దీంతో అయ్యో పాపం.. జ‌గ‌న్ ను ఇంత‌లా ఇబ్బంది పెడుతున్నారా అని ప్ర‌జ‌లు అనుకునేంత‌లా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న నాట‌కాన్ని మీడియా ముఖంగా పండించేశారు. వాస్త‌వంగా చెప్పాలంటే.. జ‌గ‌న్ కు ఇలాంటి వ్య‌వ‌హారాల్లో చాలా అనుభ‌వ‌మే ఉంది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలోనూ మాయ‌మాట‌ల‌తో త‌న ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకున్నారు. అయ్యో జ‌గ‌న్‌.. అయ్యో పాపం జ‌గ‌న్ అంటూ ప్ర‌జ‌లు   వైసీపీని అధికారంలోకి తెచ్చారు. ఆ త‌రువాత అర్ధ‌మైంది జ‌గ‌న్ అస‌లు రంగు. బాబాయ్ హ‌త్య కేసులో జ‌గ‌న్ ప్ర‌మేయంకూడా ఉంద‌న్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూర‌డంతో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి బుద్ధి చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌లకు ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నామ‌ని క‌న్నీరు పెట్టినంత ప‌నిచేశారంటే అయ్యో పాపం అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా వారి వైపుకు వెళ్లిపోతారు. వారిలోని ఆ వీక్‌నెస్ నే జ‌గ‌న్ గట్టిగా ప‌ట్టుకున్నాడు. అదానీ వ్య‌వ‌హారంలో త‌న ప్రేమ‌యం ఉన్న‌ట్లు ఆధారాల‌తో రుజువు అయిన తరువాత కూడా జ‌గ‌న్   న‌న్ను ఇబ్బంది పెడుతున్నారు.. న‌న్ను విమ‌ర్శిస్తున్నారు అంటూ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేశారు.   అస‌లు విష‌యంలోకి వెళితే..  గౌత‌మ్‌ అదానీ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సెకితో ఒప్పందంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అదానీ నుంచి రూ.1,750 కోట్ల లంచం అందిందని ఎఫ్‌బీఐ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ అమెరికాలో కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించాయి. ఈ విష‌యంపై గ‌త వారం రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కూట‌మి పార్టీల నేత‌లు జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం తాను  మంచి ప‌నే చేశాను, అందుకు నన్న  స‌న్మానించాలి అంటూ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న‌వారు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. అమెరికా సంస్థ‌ల నివేదిక‌ల్లో తన పేరు ఎక్కడ ఉందో చేపమంటూ   మీడియా ముఖంగా జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు.  దీంతో.. త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం  చేస్తున్నారని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఎందుకంటే.. సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ (ఎస్ఈసీ) నివేదిక చూస్తే జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న ఉంద‌ని ఎవ‌రికైనా అర్ధ‌మ‌వుతుంది. కానీ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా.. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌పై బుర‌ద జ‌ల్లేందుకు ఇలా చేస్తుంద‌న్న‌ట్లుగా క్రియేట్ చేసేలా మీడియా ముఖంగా జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేశారు. అదే విష‌యాన్ని త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప‌దేప‌దే ప్ర‌చారం చేయించారు. అయితే, ఎప్ప‌టికైనా నిజ‌మే గెలుస్తుంద‌ని జ‌గ‌న్ ఇంకా గుర్తించ‌కపోవటం ఆయన అవివేకమే అని చెప్పాలి. ఎస్ఈసీ నివేదిక‌లో ఏముంద‌న్నది ఒక సారి ప‌రిశీలిస్తే.. అదానీ విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి పాయింట్ల వారిగా నివేదిక‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వ‌ర‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం గురించి ప్ర‌స్తావించారు. అంటే ఇక్క‌డ జ‌గ‌న్ పేరును మెన్ష‌న్ చేయ‌లేదు.. కేవ‌లం ఏపీ ముఖ్య‌మంత్రి అని మాత్ర‌మే మెన్ష‌న్ చేశారు. 2021 ఆగ‌స్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని గౌత‌మ్ అదానీ వ్య‌క్తిగ‌తంగా క‌లిశాకే విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందం ముందుకు క‌దిలింద‌ని స్ప‌ష్టంగా వివ‌రించారు. లంచం సొమ్ము సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్లుగా.. అదానీ గ్రీన్స్ అంత‌ర్గ‌త రికార్డుల ద్వారా తెలుస్తోంద‌ని పేర్కొంది. ముఖ్య‌మంత్రిని క‌లిసి లంచం ఇస్తామ‌ని మాట ఇచ్చాకే సెకి ద్వారా అదానీ గ్రీన్‌, అజూర్ నుంచి విద్యుత్ కొంటామ‌ని స‌మాచారం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఆ త‌రువాత సెకి ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని తేల్చిచెప్పింది. అయితే, ఇక్క‌డ ఆశ్చ‌ర్య క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో తన పేరు ఎక్కడా లేదని చెప్పుకున్నారు.  అంతేకాదు.. తనపేరు ఉన్న‌ట్లు త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్న మీడియా సంస్థ‌ల‌పైన ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ హెచ్చ‌రిక‌లు  జారీ చేశాడు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లను చూసి వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 2021లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అదానీ భేటీ అయ్యారని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అని ప్ర‌స్తావించారు. అప్ప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాదా ? తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో లేను అని జగన్ ప్రజలకు చెప్పదలచుకున్ానరా?   ఇంతగా బ‌రి తెగించి జ‌గ‌న్ పచ్చి అబ‌ద్దాలు అడుతుండ‌టంతో వైసీపీ నేత‌లు సైతం చీద‌రించుకుంటున్నారు. జ‌గ‌న్ త‌న‌తీ రును మార్చుకోక‌పోతే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే అంటున్నారు.