ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్..పంద్రాగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం

  ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు. జూన్ నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సభకు హాజరైన ప్రజలతో ప్రమాణం సీఎం చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.  ప్రపంచం మెచ్చుకునేలా విశాఖలో యోగా డే ను నిర్వహించబోతున్నామని.. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తానే రైతు బజార్‌ లను ఏర్పాటు చేశానని అన్నారు. కర్నూలులోని రైతు బజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో రైతు బజార్‌లను పెడతామని అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర దిశగా అందరం ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదని.. అన్నీ ఏదో రూపంలో ఉపయోగపడుతాయని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని అన్నారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించానని తెలిపారు. చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు పని చేస్తున్నాయని అన్నారు. రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు.  

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించండి : కాంగ్రెస్ నేత కపిల్ సిబల్

  పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు తగ్గాయని ఆయన తెలిపారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉన్న రోజుల్లో భారత సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఉగ్రవాదం కూడా తగ్గుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశానికి నిజమైన సమస్య టెర్రరిజమేనని పేర్కొన్నారు.  అందుకే మన విదేశాంగ విధానం పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందనే వాస్తవంపై ఇప్పటికైనా ఎన్డీయే సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. దాయాది పోషిస్తున్న టెర్రరిజంపై ప్రపంచ దేశాలకు అసలు వాస్తవాలను ముందుంచి.. పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమ కార్యకలాపాల  చట్టంలో కొన్ని సవరణలు తప్పనిసరి అని కపిల్ సిబల్ అన్నారు.  

ఐపీఎల్ పునఃప్రారంభం.. కోల్‌కతాతో ఆర్సీబీకి కీలక మ్యాచ్

భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ , కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి.  అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 12 మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించి, ఆరో స్థానంలో ఉంది.  ఈ లీగ్ దశ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో దాని స్థానం పదిలం అవుతుంది. కానీ, ఈ సీజన్‌లో సొంత మైదానంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆర్‌సీబీకి, అదే మైదానంలో కేకేఆర్‌తో జరిగిన పేలవమైన రికార్డు మరో తలనొప్పిగా మారింది. నిజానికి, 2015 నుంచి ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా చేతిలో వరుసగా ఓడిపోతూనే ఉంది. అంటే, శనివారం ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఆర్‌సీబీ 10 సంవత్సరాల చరిత్రను మార్చాల్సి ఉంటుంది. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన బాగాలేదు. ఈ మైదానంలో ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఆర్‌సీ  బీపై విజయం సాధిం చింది. 2015 తర్వాత ఆర్‌సీబీ వారి సొంత గడ్డపై ఒక్కసారి కూడా కేకేఆర్‌ను ఓడించలేకపోయింది. అదే సమయంలో, ఈ మైదానంలో రెండు జట్ల మొత్తం రికార్డులు చూస్తే ఆర్‌సీబీ వెనుకబడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగగా, బెంగ ళూరు కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. కోల్‌కతా 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరిగాయి. ఆర్‌సీబీ  15 గెలిచి, 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, ఈ సీజన్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ అనేక పాత రికార్డులను బద్దలు కొట్టింది. అది 17 సంవత్సరాల తర్వాత చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 10 సంవత్సరాల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించగలిగింది. ఆర్‌సీబీ ఇప్పుడు కోల్‌కతాపై కూడా అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.

ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌ను కలిసిన సీపీ సీవీ ఆనంద్

  ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.  ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్  డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ నెంబర్‌‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ  కోసం తన కలలను సాకారం చేస్తున్న పోలీసులకు ఎప్పుడు మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు  ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.  

మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట..8 ఏళ్లనాటి కేసు కొట్టివేత

  తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఇది రైతుల విజయమని, చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలపై నమ్మకం బలపడిందని మంత్రి తెలిపారు. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూసేకరణపై ప్రజా విచారణ జరుగుతున్న సమయంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన తాము నిలిచామని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. రైతుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించింది అని ఆయన వివరించారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగిందని, తాజాగా నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేయడం సంతోషకరమని శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, పోలీసులను అడ్డగోలుగా వినియోగించుకున్నారని ఆరోపించారు. 

మళ్లీ ఆస్పత్రికి వల్లభనేని వంశీ

విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.   వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్‌ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన నూజివీడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్ పై  నూజివీడు కోర్టు సోమవారం (మే 20)  దీనిపైన విచారణ జరపనుంది. 2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం పని చేసిన బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాలకు చెందిన కొంత మందికి నకిలీ ఇళ్ల స్థలాల పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ అక్టోబరులో హనుమాన్‌ జంక్షన్‌ పీఎస్‌లో  9 మందిపై కేసు నమోదు చేశారు. అయితే నాడు కేసు నమోదు చేసిన వారి జాబితాలో వంశీ పేరు లేదు. అయితే 2024లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇదే కేసుకు సంబంధించి ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వంశీ హయాంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, వీటిపైన అధికార ముద్రలు నకిలీవని రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదకలో తేలిందని, దీంతో వంశీని కూడా  నిందితుడుగా చేర్చారు.  ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం జైల్లో ఉన్న వంశీని శుక్రవారం నూజివీడు 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శ్రావణి ముందు పోలీసులు హాజరు పరిచారు. అదలా ఉంటే.. వల్లభనేని వంశీ గురువారం (మే 17) జైలులో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిక ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం అదే రోజు మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు వంశీని తీసుకువెళ్లారు. తాజాగా శనివారం కూడా వల్లభనేని వంశీ మరో సారి అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆయనను ఆస్పత్రికితి తరలించారు.   

రేపే పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం...ఇస్రో 101వ ప్రయోగానికి సర్వం సిద్ధం

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు 100 రాకెట్లను ప్రయోగించింది. 101వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. విజయం పరంపరంలో కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం అయ్యేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట -షార్ నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం 5.59 నిమిషాలకు పి ఎస్ ఎల్ వి సి61 రాకెట్ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లను ఇస్రో సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి...1696.24 కేజీల బరువు కలిగిన ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్  44.5 మీటర్ల పొడవు 321 టన్నుల బరువు కలిగి ఉంటుంది. పిఎస్ఎల్వి  సి 61 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం  7.59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానున్నది.  కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటలు కొనసాగిన అనంతరం ఆదివారం ఉదయం  5.59 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో నిర్ణయించింది. భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టి భారత భూభాగం పైన నిశితంగా పరిశీలించే నిఘా ఉపగ్రహముగా పనిచేయునున్నది. భారత దేశ భూభాగాన్ని మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా నిగా పెట్టడమే ఈవో ఎస్ -09 సాటిలైట్ ముఖ్య ఉద్దేశం. గతంలో దేశ రక్షణ కోసం ప్రయోగించిన ప్రయోగాల కన్నా.. ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని కొత్త సాంకేతికంగా శాస్త్రవేత్తలు రూపుదిద్దారు. భారత్- పాక్ సరిహద్దుల వద్ద ఉద్రుక్తత పరిస్థితులు నెలకొనడంతో... శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి సి 61 రాకెట్ ప్రయోగానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణ శ్రీహరికోటకు చేరుకొని.. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

సెక్రటేరియట్ వద్ద ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు..కేసు నమోదు

  మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హైదరాబాద్ సచివాలయం దగ్గర కలకలం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ వద్ద వివిధ దేశాల జెండాలు ఏర్పాటు చేయగా ఇజ్రాయిల్ జెండాను జకీర్ అనే వ్యక్తి తొలగించాడు.  జెండాను తొలగిస్తూ సోషల్ మీడియాలో లైవ్ కూడా పెట్టాడు జకీర్ అనే యువకుడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే అధికారులు స్పందించారు. అనంతరం రంగంలోకి దిగిన అధికారులు తిరిగి ఇజ్రాయిల్ జెండాను ఏర్పాటు చేశారు.ఈ సంఘటనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నమోదు అయింది.  సదరు వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇలా ఇజ్రాయిల్ జెండాను తొలగించడం పై కొత్త చర్చ జరుగుతుంది.ఆ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇలా ఇజ్రాయిల్ జెండాను తొలగించడం పై కొత్త చర్చ జరుగుతుంది.  

సింహపురి రూరల్ పాలిటిక్స్... కోటంరెడ్డి బ్రదర్స్ మార్క్

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన బ్రాండ్ ఉన్న నేతల్లో ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టీడీపీ అధికారంలోకి రావడానికి తొలిమెట్టు ఆయనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుటా ఎగురవేశారు. దాంతో అప్పటి అధికార పార్టీ  సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు పార్టీ ఫిరాయించడంతో, పార్టీ పిరాయంపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అనార్హత వేటు వేయాలని  స్పీకర్ కు లేఖలు అందించింది. చర్యలు తీసుకునే లోపే ఎన్నికలు వచ్చాయి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయ ఢంకా మోగించి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. సంచలన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటారు టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజాభిమానంతో వరుసగా మూడుసార్లు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని లీడర్‌గా ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేసి, మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే ఎమ్మెల్యే కోటం రెడ్డి హ్యాట్రిక్ విజయాల వెనుక తన తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమంట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి  స్వయంగా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. రూరల్ నియోజక వర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన ఈ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఇపుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.    నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. సుదీర్ఘకాలం తమ అడ్డాగానే ఉండాలనే లక్ష్యంతో కోటం రెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లాన్ తో కోటంరెడ్డి బ్రదర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. ఈసారి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నిలబెట్టేందుకు తన రాజకీయ వారసుడిగా తెరమీదకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తనను ఆదరించినట్లే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని కూడా ఆదరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరుతున్నారట. రేపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త సెగ్మెంట్లు ఏర్పడతాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంట. మరో పక్క ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుసరించిన స్ట్రాటజీనే తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు.. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం.. అభివృద్ధి పనులు చేయడం..వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచు కోవడం..  ఇవే కోటంరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేని చేశాయంట. ఇప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఇదే బాటలో  పయనిస్తున్నారు. ఇప్పటికే "గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి" కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.  మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా తన తమ్ముడితో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. రూరల్ నియోజకవర్గంలో దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని విధంగా ఒకేరోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు.  తర్వాత వారం రోజుల్లో వరుసగా 234 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మంత్రి లోకేష్ అభినందనలు అందుకున్నారు. మొత్తం 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తానని ఆరోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేయించారు. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధవీరులకు అంకితమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చెప్పిన మాటకు కట్టుబడి 5  రోజుల ముందే 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇలా ఒకవైపు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయిస్తూ, మరో వైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్ట పరుస్తూ.. కోటంరెడ్డి బ్రదర్స్ తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్డారు.  నిత్యం ప్రజల్లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకుని దాన్నే ఎన్నికల్లో అస్త్రంగా వాడు కుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగే  ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్టు కాకుండా, ప్రతిరోజు ఎన్నికలన్నట్టు కోటంరెడ్డి బ్రదర్స్ కష్టపడుతూ ... ఎన్నికలకు నాలుగేళ్ల ముందు నుంచే ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటుండటంతో కోటంరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నా.. రాజకీయంగా ఎదుర్కోవాలన్నా.. ప్రత్యర్థి పార్టీలకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోందట.  అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. అయితే ఆ పార్టీ నుంచి జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ , ఆనం రామనారాయణరెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. దాంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కావాలన్నా కల నెరవేరలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగా క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరి కోటంరెడ్డి క్యాబినెట్ బెర్త్ ఆశలు ఎప్పటికి నెరవేరతాయో చూడాలి.

ఏపీ మద్యం కుంభకోణం కేసు..జగన్ అరెస్టు ఖాయమంటున్న పేర్ని?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలా ఉండగా ఇదే కేసులో  మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లకు సుప్రీం కోర్టు ఇలా బెయిలు నిరాకరించగానే సిట్ అలా అరెస్టు చేసింది.  ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాదశం ఉంది.  మొత్తం మీద మద్యం కుంభకోణం కేసు విషయంలో ఒక లాజికల్ ఎండ్ కు వచ్చే దశగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి అరెస్టు జగనే అంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని బాంబు పేల్చారు.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్ ను అరెస్టు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నదన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం కూడా లేదనీ, అయినా కూడా జగన్ కు సన్నిహితంగా ఉన్న వారందరినీ అరెస్టు చేసి వారి చేత బలవంతంగా  జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏదో విధంగా జగన్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.  పేర్ని నాని విమర్శలు, ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేస్తామని అటు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎవరూ ఇప్పటి వరకూ చెప్పలేదు. ఎవరి నోటా రాని జగన్ అరెస్టు మాట మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నొ నాని నోటి వెంట రావడమే పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.   ఈ కేసులో జగన్ ప్రమేయం  బయటపడటం ఖాయం, జగన్ అరెస్టు తథ్యం అని వైసీపీ శ్రేణులకు పేర్ని నాని చెప్పకనే చెప్పినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో   జగన్‌ అరెస్టు తప్పదన్న భావనకు పేర్నినాని వచ్చేసినట్లే కనిపిస్తోందని అంటున్నారు. 

తప్పలేదు పాపం.. నూర్ వైమానిక స్థావరంపై భారత్ దాడి నిజమే.. పాక్ ప్రధాని ఒప్పుకోలు

బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని  షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.  అంతే కాదు అన్ని విధాలుగా అసహాయంగా మిగిలిపోవడం వల్లనే భారత్ కాళ్లా వేళ్లా పడి  కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని కూడా బేలగా చెప్పేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్  లో భాగంగా ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత.. మే 10 తెల్లవారు జామున రెండున్నర గంటలకు పాకిస్థాన్ వైమానిక స్థావరంపై మిస్సైల్ స్ట్రైక్ జరిగిందనీ, ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు.  ఇదే పాక్ ప్రధాని నిన్న మొన్నటి వరకూ భారత్ ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అనీ, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలకు కారణమైన ఆ ఆపరేషన్ ను విజయవంతంగా ఫెయిల్ చేశామనీ, భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిందనీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ పార్లమెంటులో కూడా ప్రకటించారు. అయితే అవన్నీ బుకాయింపులేనని అంగీకరిస్తూ ఇప్పుడు వాస్తవాన్ని ప్రకటించారు. భారత్ కచ్చితత్వంతో దాడులకు పాల్పడిందనీ, ఆ దాడులలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైందనీ అంగీకరించేశారు. అయితే  దాడుల కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ఇప్పటికీ దాచిపెడుతున్న ఆయన భారత్ తో యుద్ధాలు గెలవలేమని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఇక చర్చలు మార్గమని తేల్చేశారు.  వాస్తవానికి  భారత్ దాడులలో పాకిస్థాన్ లోని అన్ని వైమానిక స్థావరాలు, రాడార్లు, ఆర్మీ కంటోన్మెంట్ లు ధ్వంసమైనట్లు సమాచారం ఈ దాడులలో  పాకిస్తాన్ సైనికులతో పాటు, టర్కీ సైనికులు కూడా మృతి చెందారు. 

హరీష్ రావు నివాసానికి కేటీఆర్.. తెరవెనుక కథేంటి?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీలో కీలక నాయకులూ, అందునా దగ్గరి బంధువులు అయిన వారిరువురూ భేటీ కావడం వాస్తవానికి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో వారిరువురి భేటీయే అత్యంత ప్రధాన వార్తగా మారిపోయింది. మిగిలిన విషయాలన్నీ మరుగున పడిపోయి.. ఇప్పుడు చర్చంతా వారిద్దరి రెండు గంటల భేటీపైనే కేంద్రీకృతమై ఉంది.  ఇందుకు కారణం లేకపోలేదు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం, త్వరలో పార్టీ పగ్గాలు తన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించనున్నారన ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. అదీ కాకుండా ఒక ప్రణాళిక మేరకు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.  ఇటీవల బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో జరిగిన  భారీ సభ సందర్భంగా హరీష్ రావుకు ఇసుమంతైనా ప్రాధాన్యత లభించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. అదే సమయంలో హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేయనున్నారనీ, టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదంతా అవాస్తవ ప్రచారం అంటూ హరీష్ రావు ఇచ్చిన వివరణ కూడా ఆ ప్రచారం మరింత జోరందుకోవడానికి దోహదపడిందే తప్ప మరో ప్రయోజనం సిద్ధించలేదు. హరీష్ రావు కారు దిగి, వేరే పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో వాటిని పార్టీయే కాదు.. ప్రజలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అందుకు కారణం కేసీఆర్. కేసీఆర్ ను కాదని హరీష్ రావు పక్క చూపులు చూస్తారంటే ఎవరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేసీఆర్  పోలిటికల్ గా యాక్టివ్ గా లేరు. పార్టీ వర్గాలే ఆయన ఇక పార్టీ పగ్గాలను తన రాజకీయవారసుడికి అప్పగించేసి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారంటున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో  జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల పోస్టర్లలో హరీష్ ఫొటోనే కనిపించలేదు. దీంతో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖారరైపోయిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది.  ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా  వెలుగొందని హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి, ఆయన స్థాయికి తగ్గ గౌరవం కూడా ఇవ్వడం లేదన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేస్తుంటే మౌనంగా ఉంటారా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో కేసీఆర్ తనయ, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మాటేంటంటూ గొంతెత్తడం మొదలెట్టారు. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడటంతో పార్టీలో లుకలుకలు ఉన్నాయనీ, అవి కూడా కేసీఆర్ కుటుంబం నుంచే మొదలయ్యాయన్న భావన అందరిలో వ్యక్తం అయ్యింది.  ఈ తరుణంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అ భేటీలో  ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వెల్లడించలేదు. అయినా భేటీ చుట్టూ ఊహాగాన సభలు మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి.  అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. హరీష్ రావు, కేటీఆర్ ల భేటీపై రాజకీయ చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మళ్లీ పార్టీలో ఇటీవలి కాలంలో హరీష్ రావుకు తగ్గుతున్న ప్రాధాన్యతే అనడంలో సందేహం లేదు.  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో హరీష్ కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోవడం, పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా ఎక్కడా హరీష్ రావు పేరు వినిపించకపోవడం, ఫొటో కనిపించకపోవడంపై కేటీఆర్ హరీష్ కు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారనీ, విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలన్న ప్రతిపాదన చేశారనీ అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురి మధ్యా విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిన తరువాతే పార్టీ పగ్గాల అప్పగింత ఉంటుందన్న కేసీఆర్ విస్పష్టంగా చెప్పి కే టీఆర్ ను హరీష్ నివాసానికి పంపారని కూడా అంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేసీఆర్ ఈ ముగ్గురితోనూ భేటీ  అయ్యే అవకాశాలు ఉన్నాయి.  మొత్తం మీద పార్టీలో లుకలుకలు, చీలిక వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారని చెబుతున్నారు. 

జగన్ ఒక సీతయ్య.. ఎవరి మాటా వినడు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం. ఈ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పని చేసిన పార్టీ నేతలే కాదు, ఉన్నతాధికారులూ చెబుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే జగన్ ఎవరి సలహాలూ, సూచనలూ స్వీకరించరు. తోచింది చేసేస్తారు. వాటి పర్యవశానాల వల్ల తనకు అత్యంత సన్నిహితులు, తనను నమ్ముకున్న వారూ నిండా మునిగిపోయినా పట్టించుకోరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సీతయ్య ఎవడి మాటా వినడు అని. జగన్ సీతయ్యకు మించి..ఆయన కూడా ఎవడి మాటా వినరు. వినకపోవడమే కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సహించరు. ఔను.. ఈ విషయం ఎవరో కాదు.. గతంలో  జగన్ అధికారంలో ఉండగా సీఎస్ గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా చెప్పిన మాట. ఇటీవల ఓ సందర్భంలో ఆయన జగన్ వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ, ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనీ, ముందు వెనుకలు ఆలోచించరనీ, ఎవరైనా చెప్పినా వినరనీ, అలా చెప్పడానికి ప్రయత్నించిన వారపై ఫైర్ అయిపోతారనీ చెప్పారు. జగన్ ఆ వైఖరి కారణంగానే ఆయనకూ, ఆయన పార్టీకీ కూడా భారీగా డ్యామేజి జరిగిందని వివరించారు.  జగన్ తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుని ఇక వాటికే కట్టుబడి ఉంటారనీ, మంచి చెడ్డల గురించి చెప్పబోయినా వినిపించుకోరనీ వివరించారు. జగన్ తీరు కారణంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎల్వీ చెప్పారు.   ఇందుకు జగన్ తీసుకువచ్చిన ఇసుక విధానమే పెద్ద ఉదాహరణ అని అయన అన్నారు. జగన్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఇసుక ఉచితంగా లభ్యమయ్యేది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పలు కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. అలాగే మద్యం విధానం కూడా జగన్ ప్రభుత్వానికి పూడ్చలేనంత నష్టం చేసింది. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ ఇసుక, మద్యం విధానాల విషయంలో వెనక్కు తగ్గలేదు. అధికారులు ఏమైనా చెప్పబోయినా, నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఇక మార్చేది లేదు. అని కరాఖండీగా చెప్పేసి వాళ్ల నోళ్లు మూయించే వారని ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ హయాంలో అధికారుల అసహాయత, నిస్సహాయత గురించి వవరించారు. జగన్ వైఖరి పట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి చెందేవారనీ, ఈ యాటిట్యూడ్ ఏమిటని ఆశ్చర్యపోయారనీ కూడా ఎల్వీ వివరించారు. అన్నిటికీ మించి జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ప్రభుత్వోద్యోగం అన్నట్లుగా వ్యవహరించేవారిని ఎల్వీ గుర్తు చేసుకునే వారు. ఒక రాజకీయ  నాయకుడి నుంచి అందరూ ఆశించే పనితీరు ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదన్నారు.  ప్రజా సమస్యల పట్ల ఆయనలో ఇసుమంతైనా  సీరియస్ నెస్ కనిపించేది కాదన్నారు. డబ్బు, అధికారం ఉంటే చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉండేదన్నారు. జగన్ ముందు చూపు లేని వ్యవహార శైలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారనీ, అందుకే జగన్ పట్ల స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందనీ వివరించారు. జగన్ తన నిర్ణయాల కారణంగా ప్రభుత్వం, ప్రజలూ కూడా ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నా కూడా జగన్ తాను చేసిందే రైట్ అని భావించేవారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు.  మొత్తం మీద జగన్ ప్రభుత్వ పనతానికి పూర్తి కారణం ఆయనేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పకనే చెప్పారు. 

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

  భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నా పేరు మీద ఒక స్టాండ్ కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి అవుతుంది.  భారతదేశం ఇక్కడ ఏ జట్టుతో ఆడినా, అది మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు.  ఈ పెద్ద గౌరవం లభించినందుకు నేను కృతజ్ఞుడను’’ అని అన్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రోహిత్ శర్మ తల్లిదండ్రులు నేడు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. రోహిత్ శర్మతో పాటు అతడి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు మైదానం మధ్యలో నుంచి రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌లతో పాటు రోహిత్‌ సతీమణి రితికా సజ్దే పాల్గోన్నారు

భారత సైనిక దళాలను చూస్తే గర్వంగా ఉంది : సీఎం చంద్రబాబు

  విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త 'తిరంగ యాత్రలో భాగంగా నేడు ఏపీలో భారీ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ.. భారత సైనికులకు మద్ధతు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు మన దేశాన్ని, మనల్ని కాపాడిన జవాన్లకు సెల్యూట్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆపరేషన్ సిందూర్ అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.  అంతా గర్వించదగ్గ దళాలు మనకుండటం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతంవారే కావడం మన అదృష్టం. పహల్గామ్ అనగానే మనలో ఖబర్దార్ అని హెచ్చరించే పౌరుషం వస్తోంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యే, టీడీపీ బీజేపీ, జనసేన నాయకులు, నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు విచారణలో భాగంగా ప్రశ్నించిన అధికారులు తాజాగా వీరిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. రేపు వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కార్యాలయ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి సాయంత్రం వరకు వారిని అరెస్ట్ చేయకూడదు అనే ఆదేశాలు ఉండటంతో.. ఈ మూడు రోజులు వారిని సిట్ ఆఫీసులో విచారించారు. సుప్రీం విధించిన గడువు ముగియడంతో కొద్దిసేపటి క్రితం వారిని అరెస్ట్ చేశారు అధికారులు. ఈ ఉదయం వీరిద్దరు దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

విశాఖలో యోగా డే రికార్డు సృష్టిద్దాం : సీఎం చంద్రబాబు

  విశాఖలో జూన్ 21న యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు  అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో ప్రచారం చేపట్టలని దీనిపై ప్రజలకు సన్నద్దం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. జూన్‌ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్‌ చేసిన వారికి సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారని, ఆర్‌కే బీచ్‌ నుంచి సముద్రతీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు.  యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

  ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పలు లెక్చరర్ పోస్టుల పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, టీటీడీ కళాశాలలు కోసం జూన్ 16 నుండి 26 మధ్య జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది.  కొత్త తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లు 13/2023, 16/2023, 17/2023 కింద 99 పాలిటెక్నిక్, 47 జూనియర్, 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, టీటీడీ పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (https://psc.ap.gov.in) పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.