Read more!

మగవాడి కష్టాలు పగవాడికి కూడా వద్దు


కాలం మారుతోంది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా తిరగగలుగుతున్నారు!... ఇలాంటి మాటలు మనకి తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆడవారి పట్ల వివక్ష ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉందని మనకి తెలుసు. అంతేకాదు! ‘మగవాడు’ అన్న పదానికి నిర్వచనంలో కూడా పెద్దగా మార్పు రాలేదు. కానీ ‘మగవాడు’గా నిరూపించుకోవాలంటే భారీమూల్యం చెల్లించక తప్పదంటోంది ఓ పరిశోధన.

 

11 లక్షణాలు

గెలవాలనే పట్టుదల, భావోద్వేగాల మీద అదుపు, తెగింపు, హింసాత్మక ధోరణి, తమదే పైచేయి కావాలనుకోవడం, ఆడవారితో తిరగడం (Playboy), ఎవరి మీదా ఆధారపడకపోవడం, పనికి ప్రాధాన్యతని ఇవ్వడం, ఆడవారి మీద ఆధిపత్యం చెలాయించడం, స్వలింగ సంపర్కం అంటే ఏవగింపు, హోదా కోసం తపించిపోవడం... అనే 11 లక్షణాల ఆధారంగా సమాజం దృష్టిలో ‘మగవాడు’ అనే పదానికి నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నించారు అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.

 

ఆరోగ్యానికి లక్షణాలకీ లంకె

పైన పేర్కొన్న ‘మగవాడి’ లక్షణాలకీ వారి మానసిక ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం ఇప్పటివరకూ జరిగిన 78 పరిశోధనల తాలూకు గణాంకాలను సేకరించారు. వీటిలో 19,453 మంది ఆరోగ్యం, వ్యక్తిత్వాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇమిడి ఉంది. వీటిలో ప్లేబాయ్‌ మనస్తత్వం కలిగినవారు, ఆడవారి మీద ఆధిపత్యం చెలాయించే అలవాటు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే మానసికమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. 

 

కారణం లేకపోలేదు

సమాజం దృష్టిలో ‘మగవాడు’ అనిపించుకోవాలనే తపనలో, వ్యక్తి తన మనసుని కఠినంగా మార్చేసుకుంటాడట. ఈ ప్రయత్నంలో అతను స్త్రీల నుంచి, తోటి మగవారి నుంచే కాదు... తన సహజమైన వ్యక్తిత్వం నుంచి కూడా దూరమైపోతాడు. ఫలితం! అతనిలోని సున్నితమైన భావోద్వేగాలను విలువ ఉండదు. అనేక మానసిక సమస్యలు చుట్టముట్టడం మొదలవుతుంది. వ్యసనాలబారిన పడటం, డిప్రెషన్‌కు లోనవడం వంటి సమస్యల దగ్గర్నుంచీ ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుల వరకూ అతని జీవితం ఛిద్రమైపోతుంది.

 

ఆగని కథ

ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చు. మనసులో అలజడి చెలరేగవచ్చు. అయితే వీటికి స్పందించే విషయంలో కూడా ‘మగవాడి’ తీరు వేరుగా ఉండటాన్ని గమనించారు. ‘మగవాడు’ కాబట్టి తను డిప్రెషన్‌లో ఉన్న విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి మొహమాటపడతాడు. ఎలాంటి కష్టాన్నయినా తనకు తానుగా ఎదుర్కోవడమే మగతనం అనుకుంటాడు. తనలోని క్రుంగుబాటు పరాకాష్టకి చేరుకున్న తరువాత కూడా వైద్యులను సంప్రదించేందుకు వెనకాడతాడు. ఫలితం! పగవాడికి కూడా కలగకూడని మనోవేదనలో క్రుంగిపోతాడు.

 

అదీ విషయం! కాబట్టి ఎవరో మనకు ‘వాడు మగాడ్రా బుజ్జీ!’ అని బిరుదు ఇస్తారనుకుని మనలోని సున్నితమైన వ్యక్తిత్వాన్ని అణచివేసుకోకూడదని ఈ పరిశోధనతో తేలిపోతోంది. పైగా తోటివారిని గుర్తించాలనీ, ఆడవారిని గౌరవించాలనే విలువైన విలువలను గుర్తుచేస్తోంది.

 

- నిర్జర.