బాబా వంగా జోస్యం నిజమవుతుందా?... మూడో ప్రపంచ యుద్దం తప్పదా?

  బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పింది నిజమవుతోందా? 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి. 9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026ను యుద్ధం, విధ్వంసం జరిగే సంవత్సరంగా అభివర్ణించారు.  వెనిజులాపై అమెరికా సైనిక దాడి, రష్యా – ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, రష్యా చమురు నౌకలపై అమెరికా దాడులు, ఇరాన్‌లో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, తైవాన్‌పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు.. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలతో కయ్యానికి సిద్ధమవుతున్నారు.  కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ట్రంప్ చర్యలకు సిద్ధమవుతున్నారు. లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయని చాలా మంది భయపడుతున్నారు . అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. మరి, ఈ పరిస్థితులు సద్దుమణిగి శాంతి నెలకొంటుందా? లేదా బాబా వంగా చెప్పినట్టు ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  

వడోదరలో చోటా కోహ్లీ

  టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు ప్రారంభం అయింది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరిగింది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాటో కోహ్లీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.  ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి.

కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో మయన్నార్ బాధితులు స్వదేశానికి

  ఉద్యోగుల కోసమని మయన్మార్ వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయిన పది మందిని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యక చొరవతో స్వదేశానికి వచ్చేలా చేశారు. భాధితుల ఇబ్బందులను వారి కుటుంబ సభ్యులు ఇటీవల రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌రే లేఖ రాసి రక్షించమని కోరారు.  దాంతో యాంగోన్‌లోని భారత రాయబా కార్యాలయం అధికారులు అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చించి 10 మందిని ఢిల్లీకి తరలించారు. బాధితులను ఏపీ భవన్ అధికారులు వారి స్వస్థలాలైన విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు తరలించాు. మయన్నార్‌లో 80 మందికి పైగా భారతీయులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్నారని, వారందర్నీ వెనక్కు రప్పించే ప్రయత్నం చేయాలని రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు.

సిరియాలో ఐసిస్ స్థావరాలపై యూఎస్ దాడులు

  సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దళాలు భారీ దాడులు చేపట్టాయి. గత నెల ఐసిస్ జరిపిన దాడుల్లో తమ ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తమ పౌరులకు హాని తలపెట్టిన వారిని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని చంపేస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.  మిత్ర దేశాల దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది.  గత నెలలో ఐసిస్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఓ పౌరుడు చనిపోయాడని.. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా.. ఎవరైనా తమ సైనికులకు హాని తలపెడితే.. వారు న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదని పేర్కొంది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని చంపేస్తాము యూఎస్ సెంట్రల్ కమాండ్ అని ఆ ప్రకటనలో పేర్కొంది.   2025 డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు పాల్మిరా, సిరియాలో.. అమెరికా, సిరియా భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు అమెరికాకు చెందిన ట్రాన్స్‌లేటర్ మృతి చెందాడు. యూఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 19న ఆపరేషన్ హాక్‌ఐ పేరుతో ఐసిస్‌పై దాడులు నిర్వహించింది. జోర్డాన్‌తో కలిసి దాదాపు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు చేసింది. తాజాగా అదే ఆపరేషన్‌కు కొనసాగింపుగా ప్రతీకార దాడులు నిర్వహించింది అమెరికా. కాగా, ప్రస్తుతం సిరియాలో దాదాపు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.  

మేడారానికి పోటెత్తిన భక్త జనం

  ములుగు జిల్లా మేడారానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో అమ్మవార్లను దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గద్దెల ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారుల అంచనా వేస్తున్నారు. రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు.  మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.  అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే.   

తెలంగాణలో చలి పంజా...మూడు రోజులు వణుకుడే

  తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పలుజిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు చేరడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవడం చలి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో  4.8 °C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు సౌత్ ఢిల్లీలోని అయా నగర్‌లో 2.9 °C  ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఎమ్మెల్యేపై మూడో రేప్ కేసు...అరెస్ట్ చేసిన పోలీసులు

    కేరళ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో ఆయను అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పాలక్కాడ్‌లో ఆయన్ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్బవతిని చేసి మోసం చేశాడని సదరు మహిళ ఆరోపించారు.  నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు తెలిపింది.  అబార్షన్ చేయించుకోమని బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నది.  రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని.. అయితే ఎమ్మెల్యేపై రేప్‌ కేసులు నమోదుకావడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వరుస లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతడిని బహిష్కరించింది. సీఎంవో ఆఫీసుకు మెయిల్ ద్వారా రాహుల్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీఎంవో క్రైమ్ బ్రాంచ్ కు పంపగా.. విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.  ప్రాథమిక విచారణ తర్వాత తిరువల్ల కోర్టులో రాహుల్ ను ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్నట్లు వెల్లడించారు.  

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

  జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బ‌రిలో దిగాలని ఆ పార్టీ డిసైడ్ అయింది. ఎన్నిక‌ల‌కు నెల రోజుల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నప్ప‌టికీ సాధ్య‌మైన‌న్ని స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేయున్నట్లు తెలిపారు. ప్ర‌తి జ‌న‌సైనికుడు, వీర మ‌హిళ ఉత్సాహంగా ప్ర‌చారానికి సిద్ధం కావాల‌ని ప్ర‌క‌టించింది.  పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, అధ్యక్షుడు  ప‌వ‌న్ క‌ల్యాణ్ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డం ద్వారా తెలంగాణలో స‌రికొత్త రాజ‌కీయ వేధిక‌కు పునాధి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించింది. త్వ‌ర‌లోనే పార్టీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.   ఈ ఎన్నికల ప్రచారంలో జనసైనికులు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది.  

నేను డాక్టర్‌ను కాదు... కానీ సోషల్ డాక్టర్‌ను : సీఎం రేవంత్‌రెడ్డి

  హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. “నేను మెడికల్ డాక్టర్ కాదు… కానీ సోషల్ డాక్టర్‌ను” అంటూ ఆయన ప్రారంభించారు. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హైదరాబాద్‌కు రావడం గర్వకారణమని అన్నారు. డాక్టర్ల వృత్తిలో నిరంతరం నేర్చుకోవడం అత్యంత కీలకం అని రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త జ్ఞానం, నైపుణ్యాలను నిర్లక్ష్యం చేస్తే కెరీర్‌ అంతమైన్నట్లేనని స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల ఆవిష్కరణలకు హబ్‌గా హైదరాబాద్ వేగంగా ఎదుగుతోందని ఆయన గుర్తుచేశారు. డాక్టర్లు సమాజంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారని, ప్రాణాలను కాపాడే దేవతలుగా ప్రజలు వారిని నమ్ముతారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, మెరుగైన హెల్త్ పాలసీల కోసం వైద్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలతో ఆరోగ్యరంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, డాక్టర్లు టెక్నాలజీతో పాటు మానవత్వాన్ని కూడా మర్చిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు.ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నందున, వాటిని నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములై పనిచేయాలని సూచించారు.  ముఖ్యంగా విద్యార్థులకు CPR శిక్షణ అందించడంలో వైద్యులు ముందుకు వస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు.నివారణపై అవగాహన కల్పించడం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్న సీఎం, క్వాలిటీ హెల్త్‌కేర్ అందించడంలో భారత్ ప్రపంచంలోనే ఉత్తమంగా నిలవాలని, ప్రతి వైద్యుడు ఉత్తముడిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

డెయిరీ రంగ సేవలకు భువనేశ్వరికి అరుదైన అవార్డు

  భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025' సౌత్‌జోన్ ప్రదానం చేసింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన దూరదృష్టి నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టంపై ఆమె కల్పించిన సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు వరించింది.  ఈ నెల 9న కేరళలోని కోజికోడ్‌లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్ - 2026 ప్రారంభ సమావేశంలో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జే.చించు రాణి చేతుల మీదుగా భువనేశ్వరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడంపై భువనేశ్వరి స్పందించారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భారత డెయిరీ రంగం అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని మరోసారి స్పష్టం చేశారామె.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు.  ఆమెకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పురస్కారం భువనేశ్వరి సహా ఆమె బృందానికి దక్కాల్సిన సరైన గుర్తింపు అని సీఎం పేర్కొన్నారు. ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కృషి ఉందన్నారు.  

మహిళా ఐఏఎస్‌లపై వచ్చిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నాం : మంత్రి సీతక్క

  మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా వేదికలు అసభ్యంగా, అనుచితంగా, దూషణాత్మకంగా వార్తలు, వ్యాఖ్యలు చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం అని తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క  పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా ఐఏఎస్ అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె అన్నారు. మహిళలు ఉన్నత స్థాయిలకు చేరితే వాటిని తట్టుకోలేని ఫ్యూడల్ మానసికతే ఈ రకమైన దుష్ప్రచారాలకు మూలమని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని, అటువంటి పరిస్థితుల్లో మహిళా అధికారులను కించపరిచే వ్యాఖ్యలను, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారాన్ని సహించబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను ధైర్యంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, వారి వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ తరహా దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలపై ద్వేషం, అవమానంతో కూడిన ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

చైనాలో ఒక్కో కోతి ధర రూ.25 లక్షలు

  చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కోతికి ఏకంగా రూ.25 లక్షల వరకు చెల్లిస్తున్నారు. కొత్తగా తయారు చేసిన మందుల  క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా కోతులపై ఆధారపడుతోంది.  కోతుల కొరత కారణంగా.. ఔషధాలు తయారు చేసే వ్యయం పెరగడంతోపాటు.. కొత్త పరిశోధనలు ఆలస్యం అవుతున్నాయని చైనా ఆందోళన చెందుతోంది.  చైనాలో బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో.. ల్యాబ్‌లలో ప్రయోగాల కోసం ఉపయోగించే కోతుల కొరత ఏర్పడింది. దీంతో కోతుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.   దీని వల్ల మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని.. కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత  గతేడాది ఒక్కో కోతి సగటు ధర సుమారు 1,03,000 యువాన్లు అంటే దాదాపు రూ.13 లక్షలు ఉండగా.. 2026 ప్రారంభం నాటికి రూ.25 లక్షల వరకు చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయికి చేరిన కోతుల ధరలు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం పరిశోధనా సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

మాజీ ఐపీఎస్‌ అధికారి భార్యకు రూ.2.58 కోట్ల టోకరా

  స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య నుంచి రూ.2.58 కోట్లను కాజేసిన ఘటన హైదరాబాద్‌ నగరంలో కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వాట్సాప్‌ ద్వారా మొదలైన మోసం గత నెలలో బాధితురాలికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని ఒక సందేశం వచ్చింది. పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలోనే భారీ లాభాలు సాధించవచ్చని, తామిచ్చే సలహాలు పూర్తిగా నిపుణులవి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో, బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపి, ఆయన్ను కూడా ఆ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించింది.  29.11.2025న, నా భర్త “స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ 20” అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు, అందులో సుమారు 167 మంది సభ్యులు ఉన్నారు.ఆ తర్వాత కొద్దికాలానికే, దినేష్ సింగ్ అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, 9685717841 అనే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి, గ్రూప్‌లో వివరణాత్మక సందేశాలను పంపుతూ చురుకుగా తరగతులు మరియు చర్చలు నిర్వహించడం ప్రారంభించాడు. అతను సామూహిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత, ట్రేడింగ్‌లో క్రమశిక్షణ మరియు సమన్వయ వ్యూహాల ప్రయోజనాలను వివరించాడు.  అతని సందేశాలు అత్యంత పాండిత్యంతో, విశ్లేషణా త్మకంగా వివరించారు. అతని మాటలు ఆ గ్రూపులో ఉన్న వారందరూ నమ్మారు.. ఇతను చాలా స్టాక్ మార్కెట్ గురించి వివరించారు. చాలా మంది గ్రూప్ సభ్యులు ఈ స్టాక్‌లు మంచి లాభాలను ఇస్తున్నాయని పేర్కొంటూ గ్రూప్‌లో సందేశాలను మరియు స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయడం ప్రారంభించారు.  అలా గ్రూపులో ఉన్న సభ్యులందరూ మెసేజ్లు చేయడంతో బాధితురాలు అది నిజమని పూర్తిగా నమ్మింది. వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులకు 500 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. తమ సంస్థ సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అంటూ ప్రచారం చేశారు. దీనికి మద్దతుగా సెబీకి చెందినట్లుగా కనిపించే నకిలీ సర్టిఫికెట్లు, డాక్యు మెంట్లను కూడా వాట్సాప్‌లో పంపించారు. ఈ నకిలీ ధృవపత్రాలను చూసి బాధితురాలు నిజమేనని విశ్వసించారు. సైబర్ నెరగాళ్లు బాధితురాలు చేత తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టించి, ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ.... మరింత పెట్టుబడి పెట్టేం దుకు ప్రోత్సహించారు. సైబర్ నేరగాళ్ల మాటలు పూర్తిగా నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 ట్రాన్సాక్షన్లలో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టారు.కొంత కాలానికి అనుమానం రావడంతో బాధితురాలు పెట్టుబడి నిలిపివేయగా, సైబర్ నేరగాళ్లు తీవ్ర ఒత్తిడి మొదలుపెట్టారు. మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాలని, పెట్టుబడి చేయకపోతే ఇప్పటివరకు పెట్టిన మొత్తం డబ్బు మొత్తం పోతుందని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పరిణామాలతో  భారీ మోసానికి గురైనట్టు తెలుసుకున్న బాధిత కుటుంబం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ సెబీ సర్టిఫికెట్లు, వాట్సాప్ గ్రూప్ లింకులు, బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా నిందితుల జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పెట్టుబడుల పేరిట వచ్చే వాట్సాప్ సందేశాలు, అధిక లాభాల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెబీ సర్టిఫికేషన్ పేరుతో వచ్చే లింకులు, డాక్యుమెంట్లను అధికారిక వెబ్‌సైట్లలో ధృవీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.

త్వరలో 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ

  2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం బులిటెన్ ద్వారా వెల్లడించింది, వీళ్లలో దశాబ్దాలుగా పని చేసిన అనుభవఘ్నలైన నేతలు కూడా ఉన్నారు. రాజ్యసభలో ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య కాలంలో 73 మంది ఎంపీలు సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సభ్యుల పదవీ విరమణతో పలు రాష్ట్రాల నుంచి ఖాళీలు ఉంటాయి. ఈ 73 మంది సభ్యులలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు బయటకు వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీకి చెందిన అయోధ్య రామి రెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్‌బాబు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నాలుగు స్థానాలూ రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకే దక్కే అవకాశాలు న్నాయని భావిస్తున్నారు.  ఇక తెలంగాణ విషయాని కొస్తే, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కూడా పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఖాళీ కానున్న 73 సీట్లకు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది, ఏప్రిల్ నెలలో తొలి విడత నవంబర్ లో రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

అయోధ్య ఆలయంలో నమాజ్‌.. కశ్మీర్ యువకుడి అరెస్ట్

  అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కాంప్లెక్స్ ఆవరణలో నమాజ్ చేసేందుకు ప్రయత్నించిన కశ్మీర్ యువకుడిని భద్రతా సిబ్బంది శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంప్లెక్స్‌లోని దక్షిణ గోడల ప్రాంతం వద్ద ఉన్న సీతాదేవి వంటగది సమీపంలో ఆ యువకుడు నమాజ్‌కు ప్రయత్నించినట్టు సమాచారం.  కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన యువకుడు గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఒక మతానికి చెందిన వ్యక్తుల సపోర్ట్ కోరుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం అతన్ని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయం ట్రస్టు సైతం వెంటనే స్పందించలేదు.  మరోవైపు, రామాలయానికి 15 కిలోమీటర్ల లోపు నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని సరఫరా చేయరాదంటూ జిల్లా యంత్రాంగం ఒక అధికారిక ప్రకటన చేసింది. అతిథులకు నాన్‌వెజిటేరియన్ ఆహారం, ఆల్కహాలిక్ డ్రింకులు సరఫరా చేయరాదని హోటళ్లు, వసతి గృహాలకు హెచ్చరికలు చేసింది. ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చిన టూరిస్టులకు నాన్‌వెజ్ సరఫరా చేస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో రామాలయం, సమీప ప్రాంతాల్లో ఆన్‌లైన్ డెలివరీపై నిషేధం విధించామని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సూరత్ ఎయిర్‌పోర్టులో బిగ్ బికి తప్పిన పెద్ద ప్రమాదం

  సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సూరత్ విమానాశ్రయానికి అమితా బచ్చన్ చేరుకున్నప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఆయన తన కారు వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో సెల్ఫీల కోసం ముందుకు దూసుకురావడంతో అక్కడ తోపులాట జరిగింది.  జనాల ఒత్తిడితో ఎయిర్ పోర్ట్‌లోని ఒక భారీ అద్దం పగిలిపోయింది. ఈ ఘటన జరిగే సమయానికి అమితా బచ్చన్ అద్దానికి సమీపంలో ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను అప్రమత్తం చేసి సురక్షితంగా కారులోకి తరలించడంతో ప్రమాదం తప్పింది.  ఒకవేళ ఆ అద్దం ఆయనపై పడి ఉంటే తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. అమితా బచ్చన్, తన స్నేహితుడు సునీల్ షాను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అభిమాన హీరో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తిగా ఆరిపోయిన బ్లో అవుట్ మంటలు

  డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో  ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ సిబ్బంది మంటలార్పారు. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో ఈనెల 5న ఓఎన్జీసీ యాజమాన్యంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.  దాదాపు 20 మీటర్ల ఎత్తు భారీ అగ్నికీలలు ఎగిసి పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500- 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీని సమన్వయం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు.  ఈ మేరకు మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు. బ్లోఔట్ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఓఎన్జీసీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ

  ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం, మక్తా మహబూ బ్‌పేట పరిధిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నాలను హైడ్రా పూర్తిగా అడ్డుకుంది. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్‌ 44లో ఉన్న ప్రభుత్వ భూమి గత కొంతకాలంగా అక్రమ ఆక్రమణలకు గురవుతు న్నట్టు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.  ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్‌  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇదే సర్వే నంబర్‌లో గతంలోనే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, తాజాగా మరోసారి సమగ్ర విచారణ జరిపి 15 ఎకరా లకు పైగా భూమిని పూర్తిగా కాపాడినట్లు ప్రకటించింది. ఈ భూమి మియాపూర్– బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్ట ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, రియల్ ఎస్టేట్ లాబీలు అక్రమ నిర్మాణాలకు యత్నించాయి.  గతంలోనే చెరువు కట్టపై సుమారు 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ల ప్రయత్నాలు కొనసాగడంతో తాజా ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.హైడ్రా అధికారులు తాజా విచారణలో, తప్పుడు పత్రాల ఆధారంగా సర్వే నంబర్‌ 44లోని దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నట్టు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సర్వే నంబర్‌ 159కి సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్‌ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకు అక్రమంగా కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమిపై ఇకపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, లావా దేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ అక్రమ ఆక్రమణలపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.  

చెంగాలమ్మ సేవలో ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  అనంతరం వేద పండితులచే అమ్మవారికి పూజలు నిర్వహించారు.  ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు.  ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో   ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వి. నారాయణన్  రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 12.19 గంటలకు ప్రారంభమౌతుందన్నారు.  ఆ మరుసటి రోజు అంటే సోమవారం (జనవరి 12 )ఉదయం  10.19 గంటలకు పీఎస్‌ఎల్‌వి -సి62 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌ -ఎన్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.