అయోధ్య ఆలయంలో నమాజ్‌.. కశ్మీర్ యువకుడి అరెస్ట్

 

అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కాంప్లెక్స్ ఆవరణలో నమాజ్ చేసేందుకు ప్రయత్నించిన కశ్మీర్ యువకుడిని భద్రతా సిబ్బంది శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంప్లెక్స్‌లోని దక్షిణ గోడల ప్రాంతం వద్ద ఉన్న సీతాదేవి వంటగది సమీపంలో ఆ యువకుడు నమాజ్‌కు ప్రయత్నించినట్టు సమాచారం. 

కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన యువకుడు గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఒక మతానికి చెందిన వ్యక్తుల సపోర్ట్ కోరుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం అతన్ని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయం ట్రస్టు సైతం వెంటనే స్పందించలేదు. 

మరోవైపు, రామాలయానికి 15 కిలోమీటర్ల లోపు నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని సరఫరా చేయరాదంటూ జిల్లా యంత్రాంగం ఒక అధికారిక ప్రకటన చేసింది. అతిథులకు నాన్‌వెజిటేరియన్ ఆహారం, ఆల్కహాలిక్ డ్రింకులు సరఫరా చేయరాదని హోటళ్లు, వసతి గృహాలకు హెచ్చరికలు చేసింది. ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చిన టూరిస్టులకు నాన్‌వెజ్ సరఫరా చేస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో రామాలయం, సమీప ప్రాంతాల్లో ఆన్‌లైన్ డెలివరీపై నిషేధం విధించామని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

  ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్‌ అశోక్‌, చిత్తూరు జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.ఎస్‌.శోబిక, కడప జేసీగా నిధి మీనా, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివ్‌ నారాయణ్‌ శర్మ, పల్నాడు జేసీగా వి.సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా నియమితులైన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మార్కాపురం జాయింట్‌ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు పోస్ట్‌లు ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.

పతంగుల పండుగ.. మాంజా వినియోగించినా, విక్రయించినా జైలే.. సజ్జనార్

పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకూ ముప్పుగా పరిణమించిన చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సంక్రాంతి సంక్రాంతి పండుగను పతంగుల పండుగా కూడా జరుపుకుంటారు. ఈ పతంగులు ఎగురవేసే విషయంలో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే పతంగులను ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనా మాంజాపై నిషేధం ఉన్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పతంగులు ఎగురవేయడానికి దారం బదులుగా ఉపయోగించే చైనా మాంజా వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలకే కాకుండా పక్షులకూ ఇది పెనుముప్పుగా పరిణమిస్తున్నది. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ పోలీసులు చైనా మాంజా వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టులో  పతంగులు ఎగరేయడానికి ఎవరైనా చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.   అలాగే చైనా మాంజా విక్రయించేవారిపైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  చైనా మాంజా వినియోగం, విక్రయాలను సమూలంగా నిలిపివేయాలన్న లక్ష్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగిన దాడులలో దాదాపు 43 లక్షల రూపాయల విలువైన   2,150 మాంజా బాబిన్లను సీజ్​ చేసినట్లు తెలిపారు.   నిషేధిత మాంజాను విక్రయాలకు సంబంధించి 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గత నెల రోజులలో మాంజా విక్రయం, వినియోగం కు సంబంధించి   132 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన సజ్జనార్.. ఇందుకు సంబంధించి  .68 కోట్ల విలువైన 8,376 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకొన్నామనీ, మొత్తం  200 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.   

అల్ ఫలాహ్ వర్సిటీ ఆస్తుల జప్తునకు ఈడీ రెడీ!

హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆస్తుల జప్తు దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అడుగులు వేస్తున్నది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు పేలుడు కేసులో  ఈ వర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధికీకి సంబంధాలున్నాయన్న అనుమానంతో ఆయనను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హర్యానా  ఫరీదాబాద్‌లోని  ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ నిధులు మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చినవని ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. దీంతో ఈ వర్సిటీపై చర్యలకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే అల్ ఫలాహ్ ట్రస్టుకు  అస్తుల మదింపులో ఈడీ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ మదింపు పూర్తయిన వెంటనే యూనివర్సిటీ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

షిరిడీ సాయి సేవలో మంత్రి నారా లోకేశ్ దంపతులు

ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా సోమవారం (జనవరి 12) ఉదయం  ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. సూర్యోదయానికి  ముందు సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే  విశిష్ట కాకడ హారతి  కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. దర్శనం అనంతరం లోకేశ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి   తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటూ మంత్రి ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.

భారత్ పై ఆత్మాహుతి దాడులు.. కలకలం రేపుతున్న మసూద్ అజహర్ ఆడియో

 గణతంత్ర దినోత్సవ వేడుకల తరుణంలో భారత్ పై భారీ ఎత్తున దాడులకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థ జైషే హమ్మద్ కుట్ర పన్నుతోంది. భారత్ పై దాడులకు వేల మంది బాంబర్లు అంటే ఆత్మాహుతి దళ సభ్యులు రెడీగా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్  ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. మసూద్ అజహర్ గొంతుకగా చెబుతున్న ఈ  ఆడియో క్లిప్పింగ్ లో భారత్‌పై దాడులకు వేలమంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నాన్న హెచ్చరికలు కలకలం రేపాయి.  ఈ ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ఆడియో మేరకు  వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి సభ్యులు భారత్ పై ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉంది.  తమ యోధులు ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా  షహాదత్  అంటే అమరత్వం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ ఆడియో పేర్కొంది. ఇలా అమరత్వం కోసం భారత్ పై ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్న వారి సంఖ్య పదులు, వందలు, వేలూ కాదనీ, అంతకు మించి అని ఆ ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ ఆడియో  ప్రామాణికతపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.   అంతర్జాతీయ ఉగ్రవాదిగా  ఐక్యరాజ్య సమితి మసూద్ అజహర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ లో ఆ నిషేధిత ఉగ్ర సంస్థ అధినేతకు రాచమర్యాదలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.   పాకిస్థాన్ లో రాజభోగాలు అనుభవిస్తూ.. అక్కడ నుంచి  భారత్‌పై విషం చిమ్ముతూ మసూద్ అజహర్ పలు ఉగ్రదాడులకు కుట్రపన్నిన సంగతి తెలిసిందే.   2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా పలు భారీ ఉగ్రవాద ఘటనలకు మసూద్ అజహరే సూత్రధారి అన్న సంగతి విదితమే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ భారీగా నష్టపోయింది. ఆ సంస్థకు చెందిన అనేక మందిని భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిపిన దాడులలో హతం చేసింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా మసూద్ అజహర్ విడుదల చేసినట్లుగా చెబుతున్న ఆడియో హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల వెంబడి గస్తీని కట్టుదిట్టం చేశాయి. 

భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్  జిల్లాల్లో ఆదివారం (జనవరి 11) పాక్ డ్రోన్ల కదలికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.  వెంటనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించి కొద్ది సేపు తరువాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.   తొలుత రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని గనియా-కల్సియన్ గ్రామం వద్ద పాకిస్థాన్ డ్రోన్లు నింగిలో చక్కర్లు కొట్టడం గమనించినన భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి.  కాగా దాదాపు అదే సమ యంలో   ఖబ్బర్ గ్రామం వద్ద కూడా డ్రోన్ కదలికలను గుర్తించారు.  అలాగే సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్‌లలో కూడా పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయి.  ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను ఈ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి జారవిడిచారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆర్మీ, పోలీసులు ఆయా ప్రాంతాలలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.  ఇటీవలే సాంబా జిల్లా పాలూరా గ్రామం వద్ద డ్రోన్ ద్వారా పంపిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల తాజా  కదలికలను సీరియస్ గా తీసుకున్న భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం సమీపిత్తున్న ఈ సమయంలో  భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల సంచారం కలవరం రేపుతోంది. భద్రతా దళాలు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.  

యువతి దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో  ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన బోరబండ ప్రాంతంలో   కలకలం రేపింది. తనతో  మాట్లాడటం లేదన్న కోపంతోనే ఆ యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలు  గతంలో  బంజారా హిల్స్‌లోని ఓ పబ్‌లో పనిచేస్తున్న సమయంలో నిందితుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది.  ఇటీవల ఆమె అక్కడి ఉద్యోగాన్ని వదిలి ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి యువతి తనతో సరిగా మాట్లాడటం లేదనీ, తనను అవాయిడ్ చేస్తోందనీ అనుమానం పెంచుకున్న యువకుడు ఆమెను మాట్లాడుకుందాం రమ్మని  బోరబండ ప్రాంతానికి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉన్మాదంగా మారిన నిందితుడు ఒక్కసారిగా యువతి పై దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సోమనాథ్ ఆలయంలో డ్రమ్ములు వాయించిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా   ఆదివారం (జనవరి 11)  గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు సోమనాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరిస్తూ ఏర్పాటు చేసిన శౌర్య యాత్ర ఉత్సవ ఊరేగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 గుర్రాలతో  ఊరేగింపు జరిగింది. శౌర్య యాత్రలో భాగంగా ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని ప్రధాని మోదీ దారికి ఇరువైపులా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.  అంతే కాకుండా ఊరేగింపు సమయంలో ప్రధాని మోదీ  డమరుకం  వాయించారు.  గుజరాత్ ముఖ్య మంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ప్రధాని మోదీ, ఒక కిలోమీటరు పొడవునా సాగిన యాత్రలో పాల్గొన్నారు. సోమనాథ్ శౌర్యయాత్రలో భాగంగా మోదీ అక్కడి భక్తులతో కలిసి సాంప్రదాయ డ్రమ్ములను వాయించారు.  ఆ తర్వాత ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 'బాల గురువులు' పఠించే మంత్రాలను విన్నారు. అనంతరం  ఋషులకు, సాధువులకు, భక్తులకు అభివాదం చేశారు. 

కివీస్ పై టీమ్ ఇండియా విజయం.. కోహ్లీ వరల్డ్ రికార్డ్

న్యూజీలాండ్​తో   మూడు వన్డేల సిరీస్​లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఎవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి  300 పరుగులు చేసింది. 301 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన చేపట్టిన టీమ్ ఇండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే   లక్ష్యాన్ని ఛేదించింది.  ఛేదనలో తనకు ఎదురే లేదని కింగ్ విరాట్ కోహ్లీ మరో సారి నిరూపించుకున్నాడు. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగులు చేసి జట్టు స్కోరు   39 వద్ద ఉండగా ఔటయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, స్కిప్పర్ శుభమన్ గిల్ తో కలిసి రెండో వికెట్​కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో   గిల్​ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. కోహ్లీ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 93 పరుగులు చేసి ఔటయ్యాడు.   కోహ్లీ తృటిలో సెంచరీ మిస్సయినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అత్యంత వేగంగా 28వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి బ్యాటర్​గా రికార్డులకెక్కాడు.  అంతేకాకుండా మొత్తంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో మాస్టర్​ సచిన్​ టెండుల్కర్​ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.  

పురుషుల పొంగళ్ వేడుక.. ఎక్కడంటే?

ఆలయాల్లో జాతర్లు, తిరునాళ్లు జరిగితే,  మహిళలు పొంగళ్ళు పెట్టడం సాంప్రదాయం. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి కడప జిల్లాలోని ఒక ఆలయంలో వింత ఆచారం అమలులో ఉంది. ఆ ఆలయంలో పురుషులు పొంగళ్లు పెడతారు.   ఔను ఇక్కడి ఆచారం ప్రకారం ప్రతి ఏటా   సంక్రాంతికి ముందు సంజీవరాయ స్వామికి మగవాళ్ళు పొంగళ్ళు పెట్టి మొక్కలు తీర్చుకుంటారు. మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు. ఆలయంలో పెట్టిన నైవేద్యం కూడా మహిళలు ముట్టుకోరు. మగవాళ్ళేతింటారు.  ఉమ్మడి కడప జిల్లా  పుల్లంపేట మండలం తిప్పారు పల్లెలో ఈ  ఆచారం ఉంది.  ప్రస్తుతం ఈ పుల్లంపేట తిప్పారుపల్లె గ్రామం తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ మగవారి పొంగళ్ల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఆచారం ప్రకారం శ్రీ సంజీవరాయ స్వామికి మగవారే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొంగళ్ళు పెట్టారు. ఈ  పురుషుల  పొంగళ్ల వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం   సంజీవరాయునికి పొంగళ్లు పండుగను   సంక్రాంతి కంటే  ఘనంగా జరుపుకొంటారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.