తెరాసకు జీవం పోసిన వైకాపా వ్యూహం
posted on Jul 26, 2013 @ 2:03PM
కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని తన చేతిలోంచి కాకిలా తన్నుకుపోయిన తరువాత, దిగాలుపడిన తెరాసకి మొన్న వెలువడిన మొదటి విడత పంచాయతీ ఫలితాలు మరో పెద్ద షాకిచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో ఏమిచేయాలో, ఏవిధంగా స్పందించాలో తెలియని తెరాస అధినేత కేసీఆర్ మళ్ళీ తన గుహలోకి (ఫాంహౌసులోకి) వెళ్ళిపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వైకాపా శాసనసభ్యులు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొని రాజీనామాలు చేయడంతో మళ్ళీ తెరాసకు శ్వాస ఆడింది.
సీమంధ్ర ప్రాంతానికి చెందిన నేతల అద్వర్యంలో నడుస్తున్న పార్టీలు, తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడేందుకే ఈ రాజీనామా డ్రామాలు మొదలుపెట్టాయని, వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే వెనుకనుండి ప్రోత్సహిస్తున్నారని తెరాస నేత హరీష్ రావు ఆరోపించారు.
ఇంతవరకు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడానికి ఎన్నితిప్పలు పడినప్పటికీ, ఆ పార్టీలో నలుగురైదుగురు పెద్ద నేతలు తప్ప ఎవరూ చేరలేదు. ఆ చేరిన వారిలో మళ్ళీ కాంగ్రెస్ యంపీలు వివేక్, మందా జగన్నాథం ఇద్దరూ కూడా ఏక్షణంలోనయినా తిరిగి కాంగ్రెస్ గూటికి ఎగిరిపోయెందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైకాపా తెలంగాణాలో అకస్మాతుగా బోర్డు తిప్పేయడంతో ఆ పార్టీకి చెందిన నేతలు,తప్పని పరిస్థితుల్లో తెరాసనే ఆశ్రయించవచ్చును.
అదేవిధంగా కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండా తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడానికి సిద్దపడటం జీర్ణించుకోలేని తెరాస నేతలకు, ఇప్పుడు వైకాపా రాజేసిన ఈ సమైక్యాంధ్ర మంటతో మళ్ళీ తెలంగాణా ప్రక్రియ ఆగిపోతే, అప్పుడు కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయపార్టీలతో తెలంగాణాలో చెడుగుడు ఆడేసుకొనే అవకాశం కూడా తప్పకుండా దొరుకుతుంది. నేడు వైకాపా రాజేసిన మంట రేపు తెలుగుదేశం పార్టీని తాకక మానదు. అప్పుడు తెదేపా గనుక మళ్ళీ తెలంగాణపై మాట మార్చితే అది తెరాసకు మరో ఆయుధంగా అందివస్తుంది.
కనీసం సీమంధ్ర ప్రాంతంలోనయినా బలపడాలనే ఆలోచనతో వైకాపా వేసిన ఈ ఎత్తుతో, వైకాపా ముందు తన తెలంగాణా ప్రాంత సభ్యులను పోగొట్టుకోవడమే కాకుండా తెరాసకు మరో లైఫ్ పాయింటు అందించింది.