టీటీడీ చైర్మన్ గా మళ్లీ వైవీ.. యువ నేతకు కీలక పదవి..
posted on Jul 17, 2021 @ 3:15PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాబితాను ప్రకటించారు మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు నియామకాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించగా, 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు దక్కాయి. కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేశారు. ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలకు చైర్మన్ పదవులకు అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కోర్పారేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిపారు.
గతంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే రోజా నిర్వహించిన ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డిని నియమించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్థానంలో అడపా శేషుకు ఇచ్చారు. రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్ సతీమణి, రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ, రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్, ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి) నియమితులయ్యారు.
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా సిద్ధార్థ్‌ను నియమించారు.2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డికి పడట్లేదని పలుమార్లు వార్తలు పెద్ద ఎత్తునే వచ్చాయి. పేరుకే ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన జగన్.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. టీటీడీ ఛైర్మన్‌గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. తనను నమ్ముకున్నోళ్లకి ఏమీ చేయలేకపోయానని.. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విషయం సీఎం జగన్‌కు వివరించానని కూడా చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. దీంతో ఆయన వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది. ఇవన్నింటికి చెక్ పెడుతూ.. తాజాగా జగన్ సర్కార్ ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది.