జలాలపై అసలుకే ఎసరొచ్చిందా? ఢిల్లీ పెత్తనంతో నష్టమేనా?
posted on Jul 17, 2021 @ 3:15PM
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుంది. రొట్టెముక్క కోసం కొట్టుకుంటే.. మధ్యలో కోతి వచ్చి కొట్టుకుపోయినట్లుంది. రాజకీయం కోసం మొదలెట్టారో... తెర వెనక ఏ కథ నడిపించడానికి రక్తి కట్టించారో తెలియదు గాని.. నదీజలాల వివాదాన్ని సడెన్ గా పెంచేశారు కేసీఆర్, జగన్ లు. నీళ్లు లేనప్పుడుంటే అనుకోవచ్చు.. నీళ్లు ఉన్నప్పుడు తగాదా ఎందుకు పడుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఏది కరెక్టో ఏది కాదో చెప్పాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా అని చాలామంది ప్రశ్నించారు. సమాధానం ఇవ్వకుండా.. ఏకంగా కొత్త ప్రశ్న మనకు విసిరేసింది కేంద్రం. ఎవరు ఏం చేయాలో చెప్పకుండా అంతా తానే చేస్తానని తేల్చేసింది. అసలుకే ఎసరొచ్చిందా అని ఇప్పుడు తగాదా పడిన నేతలు తలలు పట్టుకున్నారు. ఏపీ నేతలు సంతోషం అంటూనే సవరణలు కోరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ నేతలకు ఆ సంతోషం కూడా మిగల్లేదు.
ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని. బాసు అప్పుడే చెప్పాడు ఇలాంటి తగాదాలొస్తాయని. అయితే రాజకీయాల కోసం తగాదాలు అవసరమైనప్పుడల్లా పెట్టుకుంటారని మాత్రం చెప్పలేకపోయాడు. ఇప్పుడు అదే పరిస్దితి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అది కూడా ఏ మీటింగ్ లేకుండా పిడుగులాగా నోటిపికేషన్ ను విసిరేసింది. ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని ప్రకటించేసింది.
కేంద్రంలో ఉంది బిజెపి కాకపోయినా.. అక్కడ మోదీ, అమిత్ షాలు లేకపోయినా అంత భయపడనక్కర్లేదు. కాని ఉన్నదెవరో.. వాళ్ల స్టయిల్ ఏంటో అందరికీ తెలుసు. అనుకూలమైన పార్టీ అధికారంలో ఉంటే వరాలు.. లేదంటే కనీసం కంటి చూపు కూడా ఉండదు. అలాంటి వాళ్ల చేతిలోకి ఇన్ని ప్రాజెక్టుల నిర్వహణ వెళ్లిపోతే.. రేపు మాట వినకపోతే మడత పేచీ పెడితే... ఏంటి పరిస్దితి? సపోజ్ ఇప్పుడు జగన్ వారికి అనుకూలంగా ఉన్నాడు.. ఓకె. కేసీఆర్ కూడా వారికి అనుకూలమే అయినా అక్కడ బిజెపికి అధికారం వచ్చే ఛాన్స్ ఉందని బిజెపి అనుకుంటుంది. అందుకని..ఆ అధికారం కోసం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. ఏంటి పరిస్ధితి?
బిజెపికి రాజకీయంగా కలిసొస్తుందో లేదో గాని..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనవసరమైన భావోద్వేగాలు పెరిగిపోతాయి.. దీని వలన ప్రజలు ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు కాని.. అసలు సమస్యలు పక్కకుపోయి.. జనం వాటి గురించే మాట్లాడుకుంటారు. అప్పుడు అసలుకే నష్టం. అందుకే ఇలా అన్నిప్రాజెక్టుల నిర్వహణ బోర్డుల చేతిలోకి..బోర్డులు కేంద్రంలో చేతిలోనూ ఉన్నంతకాలం మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది.