పేకముక్కల లక్ష్మిపార్వతి.. రఘురామ హాట్ కామెంట్స్
posted on Jul 17, 2021 @ 2:09PM
తెలుగు అకాడమి పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం కొనసాగుతోంది. జగన్ సర్కార్ నిర్ణయంపై మెజార్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. తెలుగు బాషను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యమంత్రికి లేఖలు సంధిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. తెలుగు అకాడమీ పేరు మార్పుపై ఘాటుగా స్పందించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ రాజు తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడమేంటని ప్రశ్నించారు. సంస్కృత అకాడమీ కావాలంటే దాని కోసం వేరుగా అకాడమీ పెట్టుకోవాలని సూచించారు. తెలుగు, సంస్కృత అకాడమీ అంటూ రెండింటినీ కలిపి వ్యవహరించడం సరికాదన్నారు.తెలుగు భాషాభిమానుల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా పేరు మారుస్తారా అని రఘురామ నిలదీశారు. ప్రభుత్వ చర్యను సమర్ధించిన తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మిపార్వతీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ రఘురామ రాజు.
లక్ష్మీపార్వతి వయసులో పెద్ద వారని, అటువంటి వ్యక్తి తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడాన్ని సమర్థిస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ హోదాలో లక్ష్మీపార్వతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె అంటున్నారని చెప్పారు. రెండు భాషలు పేకముక్కల్లా కలిసి పోతాయని లక్ష్మిపార్వతి మాట్లాడటంపై ఘురామ కృష్ణరాజు ఫైరయ్యారు. పాలు, నీళ్లలా కలిసిపోతాయని అయినా అనలేదని పేకముక్కలు అంటూ వ్యాఖ్యలు చేయడం ఏంటని రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు.
జూదప్రియులకు తప్ప ఇతరులెవ్వరికీ రుచించని విధంగా ఆమె మాట్లాడడం సరికాదన్నారు రఘురామ రాజు. ఆ పద ప్రయోగం వల్ల తెలుగు భాషను ప్రేమించేవారంతా బాధపడుతున్నారని చెప్పారు. గొప్ప అకాడమీకి చైర్మన్‌గా ఉన్న ఆమె స్థాయికి ఈ పద ప్రయోగం తగదని చెప్పారు. పేకముక్కలు అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లక్ష్మీపార్వతిని విన్నవించుకుంటున్నానని రఘురామ అన్నారు.