విజయమ్మ రాజకీయాలపై పట్టు సాదించినట్లే
posted on Apr 13, 2013 @ 11:33AM
వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షులు విజయమ్మ రాజకీయాలలో ప్రవేశించిన కొత్తలోతన కొడుకు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో నిర్బంధించడం గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ, క్రమంగా రాజకీయాలపై పట్టు సాదిస్తున్న ఆమె ఇప్పుడు జగన్ విషయం పాదయాత్ర చేస్తున్న తన కుమార్తె షర్మిలకు అప్పగించి, తను ఇతర సమస్యల గురించి మాట్లడుతున్నారు. ఒక విధంగా వారిరువురు పని విభజన చేసుకొన్నారని భావించవచ్చును. తద్వారా వివిధ అంశాలకు ఏవిధంగా స్పందించాలో తెలుసుకొన్న విజయమ్మ ఇప్పుడు ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో మాట్లాడగలిగే నేర్పు సంపాదించుకొన్నారు.
ఇటీవల తెనాలిలో మౌనిక అనే యువతిని కొందరు యువకులు మద్యం మత్తులో నడిరోడ్డుపై వేదింపులకు పాల్పడినప్పుడు, అడ్డుకొన్న ఆమె తల్లి సునీలని త్రోసివేయడంతో ఆమె లారీ క్రిందపడి మరణించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటనలోఅన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. అదే క్రమంలో విజయమ్మ కూడా భాదితురాలు మౌనికను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయిందని, ప్రభుత్వ అసమర్ధత వలన శాంతి భద్రతల పరిస్థితి నానాటికి దిగజారుతోందని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. సునీల హంతకులను పట్టుకొని కటినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె స్పందించిన తీరు చూస్తే ఆమె ఇప్పుడు ఏ అంశంపై మాట్లాడవలసి వచ్చినా దానిని ప్రభుత్వ వైఫల్యానికి ఏవిధంగా ముడిపెట్టవచ్చోఆమె బాగానే గ్రహించినట్లు తెలుస్తోంది.