బీజేపీ-టీఆర్ఎస్ భవిష్యత్తు మిత్రులా?
posted on Feb 17, 2015 @ 1:24PM
నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోడీని, ఆయన ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెడుతూ వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మోడీ భజనలో తరించిపోతున్నారు. అందుకు కారణం ఆయన కుమార్తె కవితకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకొనేందుకేనని టీ-కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు. నిప్పులేనిదే పొగ రాదూ కదా! అని మీడియా కూడా వారికి వంతపాడుతోంది.
ఒక ప్రముఖ తెలుగు పత్రిక అయితే కేవలం కవితకి మాత్రమే కాదు ఆమెతో బాటు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మహబూబాబాద్ ఎంపీ ప్రొ.సీతారాంనాయక్‌లకు కూడా మోడీ క్యాబినెట్లో సీట్లు ఖరారయిపోయాయని ప్రకటించేసింది. కానీ “అవన్నీ ఒట్టి పుకార్లే మేము బీజేపీతోను ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఎన్డీయే ప్రభుత్వంతో కూడా మాట్లాడలేదు,” మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
అయితే కేసీఆర్ కుమార్తె కవిత మాత్రం ఆ వార్తలను ఖండించలేదు. అలాగని సమర్ధించనూ లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాస పార్టీకి అనధికార మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ‘సాక్షి మీడియా’ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె ఒక ప్రశ్నకు బదులిస్తూ, “మీడియాలో ఇటువంటి వార్తలు ఊహాగానాలు నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిని నేను పట్టించుకోను. మా పార్టీకి, రాష్ట్రానికి, ప్రజలకు ఏది మంచిదో ఏమి చేస్తే మేలు జరుగుతుందో మా నాన్నగారికి తెలిసినట్లు పార్టీలో మరెవరికీ తెలియదు. కనుక మేమందరం ఆయన ఏమి చెపితే అదే చేస్తుంటాము,” అని జావాబిచ్చారు.
అంతే గానీ ‘నేను మోడీ క్యాబినెట్ లో చేరడం లేదు... మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లే” అని ఆమె ఖండించలేదు. తన పార్టీకి ఏది మంచిదో అదే తన తండ్రి చేస్తారని చెప్పడం గమనిస్తే తన పార్టీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అంటే భవిష్యత్తులో బీజేపీ, తెరాసలు జత కట్టే అవకాశం ఉందని చెపుతున్నట్లే భావించవచ్చును. అందుకే బీజేపీ-తెరాసల మధ్య ఎటువంటి పొత్తులు లేకపోయినప్పటికీ మంత్రిపదవి గురించి చర్చ మొదలయిందని ఆమె దృవీకరిస్తునట్లే ఉంది.
రాష్ట్ర విభజన తరువాత తెరాసను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం చాల ప్రయత్నాలు చేసింది. అది వీలుకకపోవడంతో కనీసం ఆ పార్టీతో ఎన్నికల పొత్తులయినా పెట్టుకొనేందుకు ప్రయత్నించింది. కానీ తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చేసి విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న బీజేపీతో చేతులు కలుపుదామని చాలా ఆశపడ్డారు. తెలంగాణా బీజేపీ నేతలు కూడా తెరాసతో కలిసి హాయిగా కారులో షికారు చేద్దామనుకొన్నారు. కానీ అప్పటికే బీజేపీ అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు తన సైకిల్ ఎక్కించేసుకోవడంతో వారందరూ కొంచెం నిరాశ చెందారు.
ఇప్పుడు అందరూ సర్దుకొన్నారు కనుక తెరాస, బీజేపీలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయేమో? అదే జరిగితే తెదేపాకి బీజేపీ ‘రామ్ రామ్’ చెప్పేస్తుందా? కవితమ్మ కేంద్రమంత్రి అయితే అదే ఖరారు చేసేసుకోవచ్చును.