వైకాపా పోరాటం ప్రత్యేక హోదాకోసమా దాని క్రెడిట్ కోసమా?
posted on Aug 13, 2015 @ 9:35AM
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 11వ తేదీన సీపీఐ పార్టీ పిలుపు మేరకు ఏపీ బంద్ జరిగింది. అంతకు ముందు రోజే మునికోటి మృతికి సంతాపంగా తిరుపతి బంద్ జరిగింది. మళ్ళీ ఈనెల 29న ప్రత్యేక హోదా కోసం ఏపీ బంద్ నిర్వహించాలని వైకాపా సిద్దం అవుతోంది. సీపీఐ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్, వైకాపాలు కూడా మద్దతు పలికాయి. అటువంటప్పుడు వైకాపా మళ్ళీ తను కూడా మరొకమారు రాష్ట్ర బంద్ నిర్వహించాలనుకోవడం చూస్తే ఆ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకే పోరాడుతోందా లేకపోతే ఈ ప్రత్యేక హోదా క్రెడిట్ దక్కించుకొనేందుకే పోరాడుతోందా? అనే అనుమానం కలుగుతోంది.
ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అద్వర్యంలో డిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేవలం 5గంటల దీక్ష కోసం ఆ పార్టీ చేసుకొన్న ప్రచారం, హడావుడి చూస్తే ఆ అనుమానం నిజమేననిపిస్తుంది. ఆ సమయంలో పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి ఎవరినీ అనుమతించరనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, ధర్నా ముగిసిన తరువాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను, కార్యకర్తలను వెంటబెట్టుకొని పార్లమెంటు వద్దకు పాదయాత్ర చేయడం, అక్కడ పోలీసులతో ఘర్షణ పడటం, ఆ కారణంగా అరెస్ట్ అవడం వంటివన్నీ కూడా జాతీయ మీడియాను, రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవాలనే తాపత్రయంతో చేసినట్లుగానే కనిపిస్తుంది తప్ప ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు అనిపించడం లేదు.
ఇదివరకు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన చేసిన సమైక్యాంధ్ర పోరాటాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొన్నట్లయితే ఇప్పుడు కూడా ఆయన ఈ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వ్యక్తిగా దాని పూర్తి క్రెడిట్ సంపాదించుకొనేందుకే రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తున్నారనే అనుమానం కలగడం సహజం. రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే దాని కోసం తాము పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా మరి ఇంత కాలం ఎందుకు దాని గురించి ఈవిధంగా పోరాటాలు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పదు. గత ఏడాది కాలంగా వైకాపా స్థానిక అంశాల మీద అంటే పంట రుణాల మాఫీ, రాజధాని భూములు, హూద్ హూద్ పరిహారం, పట్టిసీమ వంటి అంశాల మీద మాత్రమే పోరాటాలు చేసింది తప్ప ఏనాడు పోలవరం, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటి కేంద్రం పరిధిలో ఉన్న అంశాల గురించి గట్టిగా పోరాడింది లేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు.
పోనీ రాష్ట్రంలో ప్రజాసమస్యలపైనయినా నిలకడగా పోరాడిందా? అంటే అదీ లేదు. కొన్ని రోజులు పంట రుణాల మాఫీ గురించి దీక్షలు ధర్నాలు అంటూ హడావుడి చేసి, దానిని పక్కనబెట్టి రాజధాని భూములు అంటూ మంగళగిరిలో ధర్నాలు చేసారు. ఆ తరువాత దానిని కూడా పక్కనబెట్టి ఓటుకి నోటు కేసు పట్టుకొంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. దీని తరువాత దేని గురించి పోరాడుతుందో ఆ పార్టీకే తెలియాలి. కానీ తను చేస్తున్న ఈ పోరాటాలను మధ్యలోనే అటకెక్కిస్తున్నప్పుడు మరి వాటి గురించి ఎందుకు అంతగా పోరాడుతోంది? అని ప్రశ్నించుకొంటే తన పోరాటాలతో ప్రజల దృష్టిని ఆకర్షించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి, తన పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూడకుండా ఉంచేందుకేనని చెప్పవచ్చును.
ఇప్పటికే సుమారు నాలుగేళ్ళుగా వైకాపా ప్రతిపక్షంలో ఉంది. మరో నాలుగేళ్ళు ప్రతిపక్షంలోనే ఉండకతప్పదు. అప్పటివరకు పార్టీ క్యాడర్, నేతలు చెదిరిపోకుండా పట్టి ఉంచాలంటే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేయక తప్పదు. అందుకే ఈ ధర్నాలు, బంద్ లు హడావుడి. ధర్నా చేస్తే ప్రజల మీద, ప్రభుత్వం మీద దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. అదే రాష్ట్ర బంద్ చేస్తే తమ పార్టీ బలం ఏమిటో నిరూపించుకొనే అవకాశం ఉంటుంది. దాని వలన పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కూడా చైతన్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జాతీయ మీడియా, రాష్ట్ర ప్రజల దృష్టిని కూడా ఆకర్షించవచ్చును. బహుశః అందుకే వైకాపా తను కూడా మళ్ళీ మరొకమారు రాష్ట్ర బంద్ నిర్వహించడానికి సిద్దం అవుతున్నట్లుంది. ప్రతిపక్షంలో ఉన్నాము గనుక ప్రజా సమస్యల పోరాడవలసిన బాధ్యత తమకు ఉందని చెప్పుకొనే వెసులుబాటు ఎలాగు ఉంది కనుక ఎవరూ దానిని తప్పు పట్టడానికి సాహసించలేరు.