ఇప్పటికయినా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?
posted on Aug 11, 2015 @ 10:00AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా సీపీఐ నేడు ఏపీ బంద్ నిర్వహిస్తోంది. దానికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కూడా బంద్ కు మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు కూడా ప్రత్యేక హోదా కోరుకొంటునప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్నందున వారు ఈ బంద్ లో పాల్గొనడం లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేప్పట్టినప్పటి నుండి తెదేపా ప్రభుత్వం ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీల అమలుకోసం కేంద్రం మీద నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఆ కారణంగానే రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యాసంస్థలు, నిధులు మంజూరు అవుతున్నాయి.
కానీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇవ్వబడింది కనుక తప్పనిసరిగా ఆ హామీని అమలు చేయవలసి ఉంటుంది. దానికి ఎదురవుతున్న ఇటువంటి ఇబ్బందులను ఏవిధంగా అధిగమించాలనేది కేంద్ర ప్రభుత్వ సమస్య. కేంద్రం అధీనంలో ఉన్న ఆర్ధిక సంఘం తదితర రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ ఒప్పించడం కేంద్రానికి పెద్ద కష్టం కాకపోవచ్చును కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం చెపుతున్న తమిళనాడు, ఓడిశా వంటి రాష్ట్రాలను ఒప్పించడమే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం చొరవ తీసుకొంటే అదీ పెద్ద కష్టం కాకపోవచ్చును. కానీ వాటిని ఒప్పించేందుకు కేంద్రం మళ్ళీ వాటికి కూడా కొత్తగా హామీలు ఇవ్వవలసి ఉంటుంది. వాటికిస్తే మిగిలిన రాష్ట్రాలు డిమాండ్ చేయవచ్చును. బహుశః అందుకే మోడీ ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లుంది.
‘ప్రత్యేక హోదా ఆంద్రప్రదేశ్ హక్కు’ రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని రాహుల్ గాంధీ గట్టిగా చెపుతున్నారు. అయితే దేశంలో ఏడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరిస్తాయా లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయా? అనే విషయాన్ని ఆయనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే పొరుగునే ఉన్న కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ కారణంగానే తమిళనాడు, ఓడిశా ప్రభుత్వాలు చాలా ముందు నుండే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయి. కనుక ముందుగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తుందా లేదా అనే విషయం రాహుల్ గాంధీయే తేల్చి చెపితే బాగుంటుంది.
రాష్ట్ర ప్రజల అభ్యంతరాలను ఏ మాత్రం లెక్క చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కొరకు రాష్ట్ర విభజన చేసి, రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి కల్పించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని చూసి మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ఇంకా నష్టపోవలసి వస్తుందని వాదిస్తూ ఉద్యమాలు మొదలుపెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అది ఎందుకు ఉద్యమిస్తోందో ప్రజలందరికీ తెలుసు. కానీ అది చేస్తున్న పోరాటం వలన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే ఆశతోనే ప్రజలు దాని పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి, సీపీఐ కూడా నడుం బిగించడంతో రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు ఊపందుకొన్నాయి.
బహుశః అది గమనించిన తరువాతనే వైకాపా కూడా ఇప్పుడు హటాత్తుగా బరిలోకి దిగిపోయినట్లుంది. ఈ ఉద్యమం చేయడంలో రాజకీయ పార్టీల ఉద్దేశ్యాలు, ప్రయోజనాలు ఏవయినప్పటికీ అవి చేస్తున్న ఈ పోరాటాల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది గనుక ప్రజలు కూడా వాటి ఉద్యమాలకి మద్దతు ఇస్తున్నారు. మరి ఈ ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో లేక ప్రత్యమ్నాయ పరిష్కార మార్గం కనుగొని ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేస్తుందో వేచి చూడాలి.