పోరాడలేనప్పుడు ప్రశ్నించడం దేనికో?
posted on Aug 14, 2015 @ 10:37AM
అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందే చెప్పుకొన్నారు. కానీ ఆయననే ప్రజలు, ప్రతిపక్షాలు కూడా నిలాదీసేవరకు కూడా ఆయన ప్రశ్నించలేదు. అది కూడా ఎప్పుడో ట్వీటర్లోనో మరీ తప్పనిసరయితే ప్రెస్ మీట్ పెట్టో అందరినీ కడిగిపారేసి మళ్ళీ మాయమయిపోతుంటారు. ఆయన తనంతట తాను ప్రత్యక్షమవ్వాలే తప్ప ఎవరూ ఆయనను కలవలేరు, పట్టుకోలేరనే నిశ్చితాభిప్రాయం ప్రజలలో, రాజకీయ వర్గాలలో ఏర్పడిపోయింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేనప్పుడు, నేరుగా ప్రజా సమస్యలపై పోరాడలేనప్పుడు, వాటి గురించి పనిచేస్తున్న రాజకీయ నేతలని, ప్రభుత్వాలని విమర్శించడం కూడా అనవసరం. ఒక పౌరుడుగా ఆయన తన అభిప్రాయలు నిర్మొహమాటంగా వ్యక్తం చేయవచ్చును కానీ ఒక రాజకీయ పార్టీకి నేతగా ఉన్నప్పుడు అభిప్రాయలు, సూచనలు, సలహాలు, విమర్శలు చేసేముందు తను కూడా వాటి పరిష్కారానికి ఎంతో కొంత కృషి చేసి ఉంటే, ఆయన ఈవిధంగా సలహాలు చెప్పినా విమర్శలు చేసినా అర్ధం ఉంటుంది.కానీ తను ఎటువంటి చొరవ చూపకుండా సినిమాలు చేసుకొంటూ తీరికున్నప్పుడు ట్వీట్ మెసేజులు, ప్రెస్ మీటలు పెట్టి పని చేతున్న వారిని విమర్శించడం సబబు కాదు.
ఆయన తెదేపా-బీజేపీలకి మద్దతు ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదా వస్తుందా...రాదా? రాకపోతే ఎందుకు రాదు? వంటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చును. అవసరమనుకొంటే ఆయనే స్వయంగా ప్రధాని మోడీతో నేరుగా దీని గురించి మాట్లాడి ఉండవచ్చును. ఆవిధంగా చేసి ఉండి ఉంటే ఆయన అభిమానులే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ హర్షించేవారు. కానీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఆయన దాని కోసం పోరాడుతున్న ఎంపీలపై తీవ్ర విమర్శలు గుప్పించినందుకు తిరిగి విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది.
రాజధాని కోసం భూసేకరణ విషయంలో కూడా ఆయన మళ్ళీ అలాగే వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కొందరు రైతులు తమ భూములను ఇవ్వడానికి సముఖంగా లేరని తెలుసుకొని ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి వారి తరపున పోరాడుతానని హామీ ఇచ్చివచ్చారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ దాని ఊసే ఎత్తలేదు!
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకొంటోంది. ఈ సమయంలో కొందరు రైతులు తమ భూములు ఇవ్వడానికి అభ్యంతరం చెపుతున్నారు కనుక రాజధానిని వేరే చోటికి మార్చలేదు. అందుకే వేరే గత్యంతరం లేకనే ఈ సమస్యను అధిగమించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవలసి వస్తోంది. కానీ చివరి నిమిషం వరకు కూడా ప్రభుత్వం రైతులను ఒప్పించి వారి దగ్గర నుండి కూడా ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారానే సేకరించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఈవిధంగా హెచ్చరికలు చేయడం సమంజసం కాదు.
ఇప్పటికే కాంగ్రెస్, వైకాపాలు రాజధాని నిర్మాణానికి చాలా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. తెదేపా ప్రభుత్వం వచ్చే ఎన్నికలలోగా రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తి చేసినా వాటి అడ్డ్రస్సులు గల్లంతవుతాయనే భయంతోనే అడ్డు పడుతున్నాయి తప్ప రైతుల మీద ప్రేమతో కాదనే చెప్పవచ్చును. లేకుంటే అవి మధ్యలో తమ పోరాటాన్ని పక్కనపడేసి, ప్రత్యేక హోదా వంటి ఇతర అంశాల మీదకు మల్లిపోఎవే కావు. ఈ సమస్యలన్నిటినీ ఒకతోటిగా అధిగమించుకొంటూ ప్రభుత్వం పట్టుదలగా ముందుకు సాగుతోంది. ఎందుకంటే ఇంత అనుకూలమయిన పరిస్థితులున్నప్పుడు కూడా రాజధాని నిర్మించుకోలేకపోతే మరెప్పుడూ నిర్మించుకోలేమనే తపనతోనే.
కానీ, తెదేపా,బీజేపీలకు మిత్రుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వానికి ఉచిత సలహాలు, హెచ్చరికలు చేయడం సబబు కాదు. ఆయన ప్రభుత్వానికి ఈవిధంగా ట్వీట్ మెసేజులు పెట్టే బదులు, తన సినిమాలలో ఇటువంటి క్లిష్టమయిన సమస్యలను ఆయన ఏవిధంగా అవలీలగా పరిష్కరించి చూపుతారో అదేవిధంగా ఈ సమస్యలన్నిటినీ కూడా ఆయనే స్వయంగా చొరవ తీసుకొని పరిష్కరించి చూపినట్లయితే అప్పుడు ఆయన సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోగానే ప్రజలు గుర్తిస్తారు. లేకుంటే విమర్శలు మూటగట్టుకొంటూనే ఉండవలసి వస్తుంది.