సామాన్యుని గుండెల్లో వైయస్
posted on Mar 29, 2011 @ 12:06PM
విజయనగరం: ప్రతి పేదవాడు పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ప్రవేశ పెట్టారని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం లంకపట్నంలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. విజయనగరం జిల్లాలో జగన్ చేపట్టిన ఓదార్పులో భాగంగా రెండోరోజు ఆయన తన యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయన యాత్ర లంకపట్నం చేరుకుంది. లంకపట్నంలో మొదట జగన్ దివంగత వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుని గుండెల్లో వైయస్ ఉన్నారన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశ్యంతో పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కరన్నా చదువాలనే ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్సుమెంట్సు ప్రవేశ పెట్టారన్నారు. 108, ఆరోగ్యశ్రీలను వైయస్ ప్రవేశ పెట్టి పేదవారికి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.