సీబీఐ అధికారులపైనే కోర్టుకు కంప్లైంట్.. వివేకా కేసులో అసలేం జరుగుతోంది?
posted on Dec 28, 2021 @ 4:28PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా వైఎస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి మరో సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులు కొందరి పేర్లు చెప్పాలని తనను బెదిరించారని పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందుల నుంచి ఢిల్లీకి పిలిచి విచారణ చేసి తనను ఇబ్బందులకు గురి చేశారని, కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ పేర్కొన్నారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పులివెందుల పోలీస్ స్టేషన్ లో, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశామని కృష్ణారెడ్డి తరపు లాయర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు
వివేకా హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిని నవంబర్ 17న అరెస్ట్ చేసింది సీబీఐ. వివేకా హత్య కేసులో మొదటి నుంచి అనుమానితుడిగా ఉన్నారు శివశంకర్ రెడ్డి. వివేకా కూతురు సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల లిస్టులో ఇతని పేరు ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే శివశంకర్ రెడ్డిని పలు మార్లు విచారించారు సీబీఐ అధికారులు. నవంబర్ 17న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
నవంబర్ లోనే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి సీబీఐపై ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సాక్షులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో దర్యాప్తును పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే చర్చ సాగుతోంది. హత్య కుట్రకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం చాలా కీలక దశలో ఉందని, ఈ సమయంలో వెలుగు చూస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయాలన్న పిటిషన్‌ను ఏపీలోని పులివెందుల కోర్టు కొట్టివేసింది. ఇటీవలే శివశంకర్ రెడ్డిపై అభియోగాలు మోపుతూ న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది సీబీఐ. అందులో సంచలన నిషయాలు వెల్లడించింది. వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని సీబీఐ తేల్చింది. వివేకా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నప్పటికీ ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టింది శివశంకర్‌రెడ్డేనని స్పష్టం చేసింది. అదే విషయాన్ని ఆయనే ‘సాక్షి’ టీవీకి కూడా చెప్పారని వెల్లడించింది. వివేకా గుండెపోటుతోనే మరణించినట్లు నమ్మించేందుకు వీలుగా పడక గది, స్నానపు గదిలోని రక్తపు మరకలన్నింటినీ తుడిపించేశారని, ఘటనా స్థలంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని వివరించింది. ఆ క్రమంలోనే వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్లు కట్టించారని తెలిపింది.