బెయిల్ పై ఉన్నవాళ్లకి త్వరలో జైలు! కేంద్ర మాజీ మంత్రి కామెంట్లతో జగన్ పార్టీ షేక్..
posted on Dec 28, 2021 @ 5:06PM
ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా? సీఎం జగన్ త్వరలో జైలుకు పోవడం ఖాయమా? ఈ ప్రచారం ఏపీలో చాలా రోజులుగా సాగుతోంది. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. త్వరలోనే జైలుకు వెళతారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, త్వరలోనే కేంద్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రెండు ప్రచారాలకు బలం చేకూరేలా బీజేపీ జాతీయ నేతలు కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో సంచలనం జరగబోతుందన్న చర్చకు తావిచ్చింది.
విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్, వైసీపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ జవదేకర్. ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని, మద్య నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలని చెప్పారు. ఏపీలో నాయకత్వ మార్పు జరిగి తీరుతుందన్నారు జవదేకర్.
వైసీపీ అంటే ఏమీ చేతకాని ప్రభుత్వమని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిదులు ఏమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలన వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని విమర్శించారు. అవినీతిమయం కాని రంగం రాష్ట్రంలో ఏదీ లేదన్నారు జీవీఎల్. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడితే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖాయమన్నారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందన్నారు సుజనా చౌదరి.
సీఎం జగన్, వైసీపీ పాలనపై విజయవాడ సభలో ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్నాయి. బెయిల్ పై ఉన్న నేతలంతా త్వరలో జైలుకు వెళతారంటూ సీఎం జగన్ ను ఉద్దేశించే కేంద్ర మంత్రి మాట్లాడారని అంటున్నారు. బీజేపీ సీనియర్ నేత మాటలను బట్టి జగన్ ను కేంద్రం టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోందని, త్వరలోనే ఏపీలో సంచనాలు జరగబోతున్నాయనే చర్చ మొదలైంది. ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడతారన్న సుజనా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అదే జరిగితే ఏపీలో రాష్ట్రపాతన పాలన రావడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా విజయవాడ సభలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చేసిన కామెంట్లు వైసీపీలో కలవరం రేపుతున్నాయని తెలుస్తోంది. బెయిల్, జైలు వ్యాఖ్యలపై సీఎం జగన్ శిబిరం ఆరా తీస్తుందని సమాచారం.