పాత స్కూటర్‌పై షికార్లు.. ఇంట్లో 257 కోట్ల నగదు..
posted on Dec 28, 2021 @ 4:12PM
ఈ ఫోటో చూసే ఉంటారుగా. యూపీలో జరిగిన ఐటీ రైడ్స్‌లో దొరికిన నగదు. బ్యాంక్ అధికారులు 20 క్యాష్ కౌంటింగ్ మిషన్లతో నాలుగు రోజులు కష్టపడి లెక్కపెడితే.. ఆ మొత్తం 257 కోట్లుగా తేలింది. ఇంతటి సొమ్ము.. అదికూడా నోట్ల కట్టల రూపంలో ఇంట్లో పెట్టుకోవడంతో ఐటీ సిబ్బందే అవాక్కయ్యారు. అంతేనా.. నోట్ల కట్టలతో పాటు 23 కిలోల బంగారం.. 250 కిలోల వెండి.. 600 కిలోల గంధపు చెక్కల నూనె.. స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా పర్‌ఫ్యూమ్ తయారీ కంపెనీ యజమాని, సమాజ్‌వాదీ పార్టీ నేత పియూష్ జైన్ నల్ల దందా అని తేల్చారు.
కాన్పుర్‌కు చెందిన పీయూష్ జైన్ 20 ఏళ్లుగా పర్‌ఫ్యూమ్ బిజినెస్ చేస్తున్నాడు. యూపీతో పాటు ముంబై, గుజరాత్‌లోనూ వ్యాపారాలు ఉన్నాయి. కోట్ల సంపాదన ఉన్నా.. పైకి మాత్రం సింపుల్‌గానే ఉంటారు. ఆయన టయోటా క్వాలిస్, మారుతి కారులోనే తిరుగుతుంటారు. తన పూర్వీకుల ఊరు కన్నౌజ్‌కు వెళ్లినప్పుడు.. పాత బజాజ్ ప్రియ స్కూటర్‌పైనే తిరిగేవాడు. అలాంటి పీయూష్ జైన్ ఇంట్లో 257 కోట్ల నగదు పట్టుబడిందని తెలిసి.. ఆయన సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారు. అంత సాదాసీదాగా ఉండేవాడు పీయూష్ జైన్.
ఇక, ఇంతటి ఘరానా మోసం ఎలా బయటపడింది? తప్పుడు బిల్లులతో పన్ను ఎగవేతకు పాల్పడిన పీయూష్ జైన్ బండారం ఎలా బట్టబయలైంది? అసలు ఐటీ దృష్టి పర్‌ఫ్యూమ్ కంపెనీపై ఎందుకు పడింది? అనే విషయాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
కాన్పుర్‌లో జీఎస్‌టీ చెల్లించకుండా సరఫరా చేస్తోన్న, నాలుగు పొగాకు, పాన్ మసాలా ట్రక్కులను డీజీజీఐ అధికారులు పట్టుకున్నారు. ఆ ట్రక్కులు గణపతి రోడ్ క్యారియర్‌కు చెందినవని గుర్తించారు. విచారణలో భాగంగా అధికారులు శిఖర్ పాన్ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ గణపతి రోడ్ క్యారియర్ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్నాయి. దీనిపై శిఖర్ పాన్ మసాలా కంపెనీ యాజమాన్యాన్ని విచారించగా.. పన్ను చెల్లించలేదని వారు అంగీకరించారు. అప్పటికప్పుడు రూ.3.09కోట్లను కూడా డిపాజిట్ చేశారు. అయితే, శిఖర్ పాన్ మసాలాలో ఒడోకామ్ ఇండస్ట్రీస్ వాటాలు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఒడోకామ్ సంస్థ యజమానే.. ఈ పీయూష్ జైన్.
ఒడోకామ్ ఇండస్ట్రీస్.. నకలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులతో ఆ రెండు కంపెనీల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్టు తేలింది. అలర్ట్ అయిన ఐటీ అధికారులు ఓడోకామ్ కంపెనీ రిజిస్ట్రర్డ్ అడ్రస్ అయిన పీయూష్ జైన్ ఇంటికి వెళ్లారు. తనిఖీలు చేయగా.. రెండు అల్మారాలను తెరిచి చూడగా.. అందులో నీట్‌గా ప్యాక్ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. లెక్కిస్తే.. రూ.257 కోట్లుగా తేలింది. అలా పాన్ మసాలా ట్రక్కుల తీగ లాగితే.. ఎస్పీ నేత, ఒడోకామ్ యజమాని పీయూస్ జైన్ ఇంట్లో డొంక కదిలింది. వందల కోట్ల నల్ల ధనం వెలుగుచూసింది.