నేతాజీ నుంచి వివేకా దాకా.. ఎన్నో మిస్టరీ మరణాలు!
posted on Nov 16, 2021 @ 3:40PM
చరిత్రలోనే కాదు వ్యక్తుల జేవితాలలోనూ చీకటి కోణాలుంటాయి. అలాగే, కొన్ని చావులు మిస్టరీగా మిగిలి పోతుంటాయి. చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎప్పుడు ఎక్కడ ఎలా చని-పోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలి పోయింది. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.
దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఉన్నత కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ మెట్టినింట కాలు పెట్టిన తర్వాత కొంత కాలానికి ... ఆ కుటుంబంలో వరసగా అనుమానస్పద మరణాలు సంభవిచాయని అక్కడా, ఇక్కడా వార్తలు వచ్చాయి. అయితే, దశాబ్దాలు గడుస్తున్నా ఈ అనుమానాస్పద మరణాలకు సంబందించిన నిజానిజాలు ఏమిటన్నది మటుకు ఇంతవరకు ప్రపంచానికి తేలియదు.
ప్రముఖ రాజకీయ కుటుంబానికి అల్లునిగా వచ్చిన వ్యాపారవేత్త (అప్పుడు ఆయన ఓ మాములు వ్యాపారవేత్త, ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి) సోదరి, 2001లో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు ప్రమాదంలో చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు, హత్య అన్న ఆరోపణలు వచ్చినా, ఆ తర్వాత కథ ఏ కంచికి చేరిందో, ఏమైందో ప్రపంచానికి తెలియదు.
ఆతర్వాత రెండేళ్లకు పెద్దింటి అల్లుని సోదరుడు 2003 అనుమానస్పద స్థితిలో హోటల్ గదిలో చనిపోయారు. చివరకు అల్లుదు గారి తండ్రి 2009లో అదే రీతిలో హోటల్ గదిలో అలాగే, అనుమానస్పద స్థితిలోనే చనిపోయారు. అయితే ఇవి .. హత్యలా.. ఆత్మ హత్యలా .. సహజ మరణాలా అన్నది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు, ఇక ముందు తెలిసే అవకాశం కూడా లేక పోవచ్చును.
అక్కడి నుంచి, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ కు వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయి. ఎవరో కాదు వైఎస్ కుటుంబ సభ్యులే పలు సందర్భాలలో, వైఎస్ మంరణం పట్ల అనుమానాలు వ్యక్త పరిచారు. వైఎస్’ను హత్యచేశారని ఆరోపించారు. ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త వైపు వేలెత్తి కూడా చూపారు. అయితే, ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, దివంగత నేత పేరు చెప్పుకుని, అధికారంలోకి వచ్చిన ఆయన కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే వ్యాపారవేత్తతో రాజకీయ వియ్యం కలుపుకున్నారు. సో .. వైఎస్ మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. నిజానిజాలు ఎలా ఉన్నా, పరిటాల హత్య, కోడెల శివప్రసాద రావు ‘అత్మహత్యల’ విషయంలోనూ ఇప్పటికీ ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.
అవన్నీ ఒకెత్తు అయితే, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ మర్డర్స్ అన్నిటిలోకీ మరింత మిస్టరీగా మలుపులు తిరుగుతోంది. వైఎస్ మరణం విషయంలో ఆయన సతీమణి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఎలాగైతే అనుమానాలు వ్యక్త పరిచారో .. వివేకా కుటుంబ సభ్యులు కూడా ఆయన మరణం విషయంలో అనుమానాలు వ్యక్త పరిచారు. వివేకా చనిపోయిన రోజున ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తమ పదనాన్న మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని, విచారణ జరపాలని మీడియా ముందు డిమాండ్ చేశారు.
ఆ రోజున పులివెందుల ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి ‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయి. మాకున్న అనుమానాలను నివృత్తి చేయాల’ని కోరారు. చిత్రం ఏమిటంటే, ఇప్పడు ఆ అవినాష్ రెడ్డి పైనే, అనుమానాలు వ్యక్త మావుతున్నాయి. ఆ రోజున ఆయన ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో ధాంటే’ అన్నట్లుగా అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిల ప్రస్తావన ఉందని పట్టాభి చెప్పారు.
వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలే అని ఆరోపించారు. సిట్‌ను రెండుసార్లు మార్చి సీఎం జగన్ నీరుగార్చే ప్రయత్నం చేశారని పట్టాభి ఆరోపణలు చేశారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో పాటు జగన్ కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, వివేకా మర్డర్ మిస్టరీ ఎప్పటికైనా విడి పోతుందా .. దోషులకు శిక్ష పడుతుందా ... ఈ బేతాళ ప్రశ్నకు బదులేది ..