అమరావతి కోసం మేముసైతం.. అమిత్‌షా దెబ్బకు దిగొస్తున్న ఏపీ బీజేపీ..
posted on Nov 16, 2021 @ 4:14PM
వై.సత్యకుమార్. బీజేపీలో బడా నేత. పార్టీ జాతీయ కార్యదర్శి. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది. బీజేపీలో చాలా పవర్‌ఫుల్. మన తెలుగువారే. ఆయన ఈ నెల 28న అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. జై అమరావతి నినాదం చేయనున్నారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ బీజేపీ పక్షాన డిమాండ్ చేయనున్నారు సత్యకుమార్. జాతీయ నేతనే తరలిరానుండటంతో ఇక రాష్ట్ర నాయకులూ ఆయన వెంట నడవక తప్పదు. పార్టీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ ధియోధర్, స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజుతో పాటు మిగతా నేతలూ రాజధాని రైతులతో కదం కదం కలిపి పాదయాత్ర చేయక తప్పనిసరి పరిస్థితి. ఇలా అమరావతి ఉద్యమంలో మొదటిసారి ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయనుంది భారతీయ జనతా పార్టీ.
రెండేళ్లుగా ఉద్యమం జరుగుతుండగా.. 700 రోజుల తర్వాత ఇప్పుడు బీజేపీకి అమరావతి గుర్తొచ్చింది. అది కూడా అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి మరీ మొట్టికాయలు వేయడంతో ఇక్కడి నేతలకు తలబొప్పికట్టింది. అయినా రాష్ట్ర నేతల తలతిక్క కుదిరినట్టు లేదు. సోమవారం అమిత్‌షా పిచ్చి క్లాస్ పీకినా.. మంగళవారం పాదయాత్రలో బీజేపీ నేతల జాడ లేదు. అమిత్‌షా ఆదేశాలతోనైనా కమలనాథులు పరుగున వచ్చి.. మహా పాదయాత్రలో పాల్గొంటారని అనుకున్నారు. కానీ, తోలుమందం కాషాయదళం అంత ఈజీగా దారికొస్తుందా? అధికార పార్టీతో ఏళ్లుగా అంటకాగుతున్న రాష్ట్ర నాయకులు వెంటనే ధర్మం వైపు నిలబడటం సాధ్యమవుతుందా? అందుకే, వీళ్లను ఇలానే వదిలేస్తే.. వారంతట వారు అమరావతి వైపు నిలబడరనే విషయం జాతీయ నాయకత్వానికి అర్థమైపోయింది. అందుకే, స్వయంగా అమిత్‌షా, సత్యకుమార్ లాంటి బడా నేతలే రంగంలోకి దిగారు. అమిత్‌షా ఓ రేంజ్‌లో లెక్చర్ ఇస్తే.. ఇక బీజేపీ నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ తానే స్వయంగా అమరావతి పాదయాత్రలో పాల్గొంటానంటూ ప్రకటించి.. రాష్ట్ర నాయకులను దారిన పెడుతున్నారు.
సునీల్ ధియోధర్, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి.. ఈ ముగ్గురే పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్టు గుర్తించి అధిష్టానం వారిపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. బీజేపీ వేదికగా వైసీపీ ఎజెండా అమలు చేస్తున్నారనే విమర్శ ఉంది. టీడీపీపై పోరాడుతూ అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా మారారనేది ఆరోపణ. జగన్ భక్తులుగా మారి ఏపీలో బీజేపీని నాశనం చేస్తున్నారని సొంతపార్టీ నేతలే అంటున్నారు. వీళ్ల తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అందుకే అమిత్ షా తిరుపతి మీటింగ్‌లో ఆ ముగ్గురికి క్లాస్ పీకారని అంటున్నారు. వారికి చివరి ఛాన్స్ ఇస్తూ.. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని తప్పు సరి చేసుకోవాలని ఆదేశించారు. ఓ మీడియాను బీజేపీ నిషేధించడంపైనా మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలను చిన్నచూపు చూడటంపైనా అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కట్‌చేస్తే.. అమిత్‌షా మీటింగ్ ముగిసిన వెంటనే ఎంపీ సీఎం రమేశ్ ఆ మీడియా ఛానెల్‌లో లైవ్‌కు వచ్చి.. అమిత్‌షా ఆదేశాలను వెంటనే అమలు పరిచారు. కానీ, సో కాల్డ్ సీనియర్స్ మాత్రం ఇంకా దారికి వచ్చినట్టు లేరు. వాళ్లెవరూ పాదయాత్ర వైపు అడుగులు వేయడం లేదు. ఆ మీడియాలోనూ ఇంకా కనిపించనే లేదు. ఈ విషయం తెలిసి అమిత్‌షా.. ఏపీకి చెందిన జాతీయ నేత వై.సత్యకుమార్‌ను పరిస్థితి సెట్ చేయమని పురమాయించారని అంటున్నారు. దీంతో.. తాను నవంబర్ 28న అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొనబోతున్నట్టు సత్యకుమార్ తెలిపారు. ఆయనంతటి వారే వస్తే.. ఇక రాష్ట్ర నేతలు జీహుజూర్ అంటూ వెంట నడవక తప్పదుగా? జై అమరావతి.. జైజై అమరావతి అంటూ పిడికిలి బిగించాల్సిందేగా? 700 రోజులుగా ఉవ్వెత్తున ఎగుస్తున్న అమరావతి ఉద్యమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీ బీజేపీ కూడా జతకలిస్తే.. ఇక రాజధానితో జగన్‌రెడ్డి ఆడుతున్న మూడు ముక్కలాట ఆగాల్సిందేగా? అంటున్నారు.