కేసీఆర్-బండి గడబిడ అందుకేనా? రేవంత్‌రెడ్డినే టార్గెటా?
posted on Nov 16, 2021 @ 3:16PM
ఆయన తిడతారు. వీళ్లు రివర్స్ తిడతారు. అధికార పార్టీ ధర్నాలు చేస్తుంది. కేంద్రంలోని పార్టీ లొల్లిలొల్లి చేస్తుంది. బండి సంజయ్ జిల్లాల బాట పడతారు. రైతుల రూపంలో గులాబీ నాయకులు బండికి బ్రేకులు వేస్తారు. అక్కడక్కడా గుడ్లు కూడా విసురుతారు. ఇలా టీఆర్ఎస్-బీజేపీ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. అనేక విషయాలు డైవర్ట్ చేసేందుకే.. ఆ రెండు పార్టీలు ఇలా పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రైతుల పేరు చెప్పి.. కారు-కమలం తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడుతున్నారు.
వరి పంట కొనమని కేంద్రం అంటోందట. యాసంగిలో పండిన పంట అంతా కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అంతా మేమే చేస్తే మీరెందుకు దండగా.. ముందు వానాకాలం వరి మొత్తం కొనేదాకా వదలబోమంటూ బీజేపీ పంతం పడుతోంది. కేంద్రం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని చెప్పిందని.. వరి కొనబోమని ఎక్కడ చెప్పిందో చూపించాలంటూ కమలనాథులు నిలదీస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకంటూ బండి సంజయ్ జిల్లాల బాట పట్టారు. రైతులమంటూ టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపుతూ.. గోబ్యాక్ అంటూ కోడిగుడ్లు విసిరి బండిని నిలదీస్తున్నారు. దీంతో.. స్టేట్‌వైడ్‌గా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. ప్రజల అటెన్షన్ అంతా వారి మీదనే ఉంది.
ఆ రెండు పార్టీలు కూడబలుక్కొనే ఇలా ఉద్రిక్తతలు రాజేస్తున్నారనే అనుమానం ఉంది. వారి మెయిన్ టార్గెట్ రేవంత్‌రెడ్డి దూకుడును డైల్యూట్ చేయడమే అంటున్నారు. వరిపై టీఆర్ఎస్-బీజేపీ ఇలా కొట్టుకుంటుంటే.. రైతుల కోసం, రైతుల పక్షాన ఎంత బాగా ఫైట్ చేస్తున్నారో అని ప్రజలను భ్రమపెట్టడమే వారి స్కెచ్ అంటున్నారు. అసలైన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే ఉందనేలా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అలా చేస్తూ మూడో పార్టీ కాంగ్రెస్‌కు స్పేష్ లేకుండా చేయాలనేది వారి ఎత్తుగడలా ఉంది. దుబ్బాక, హుజురాబాద్‌లో ఇలానే ఉద్రిక్తతలు సృష్టించి.. కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా, రేవంత్‌రెడ్డి దూకుడును అడ్డుకొనేందుకు.. ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయని అంటున్నారు.
వరి కొనుగోలు కేంద్రాల సందర్శనకు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్లారు. ఆ ప్రాంతంలో బీజేపీకి అసలేమాత్రం పట్టు లేదు. అదంతా కాంగ్రెస్ కంచుకోట. అందుకే, కావాలనే కాంగ్రెస్ కోటలో అడుగుపెట్టాలనే.. బండి అటువైపు వెళ్లడం.. టీఆర్ఎస్ అడ్డుకోవడం.. ఇలా ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నాయని చెబుతున్నారు. ఇటు కేసీఆర్, అటు బండి సంజయ్‌లు వరి ఇష్యూను ఎత్తుకోవడంతో.. ఇక ఆ టాపిక్‌పై రేవంత్‌రెడ్డి పోరాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. వారిద్దరి జగడాన్ని కాంగ్రెస్ శ్రేణులు కళ్లప్పగించి చూడాల్సి వస్తుందే కానీ.. వారు నేరుగా రైతుల తరఫున బరిలో దిగలేకపోతున్నారు. వరి మైలేజ్ అంతా కేసీఆర్, బండి సంజయ్‌లే కొట్టేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిని ఎదగకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీకి సాయం చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ తీరు ఉందన్న అభిప్రాయం ఉంది.
ఇలా తెలంగాణ వార్.. టీఆర్ఎస్- బీజేపీ మధ్యనే అనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ.. కాంగ్రెస్-రేవంత్‌రెడ్డిని సైడ్‌వేస్‌లో ఉంచేందుకు.. హుజురాబాద్ ఓటమి, దళితబంధు అమలు చేయకపోవడం తదితర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే.. కేంద్రంలోని అధికార పార్టీ.. రాష్ట్ర అధికార పార్టీ.. కలిసి ఆడుతున్న రాజకీయ డ్రామా అంటున్నారు.