వివేకా హత్య కేసులో సంచలనం.. అతనే కీలకమని సీబీఐ రిపోర్ట్!
posted on Dec 23, 2021 9:27AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్.. వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో వెలుగుచూసిన కీలక విషయాన్ని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలకు సంబంధించిన వివరాలను న్యాయస్థానం ముందు ఉంచింది. వివేకా హత్య కేసులో సీబీఐ తాజాగా వెల్లడించిన వివరాలు కీలకంగా మారనున్నాయి.
కోర్టుకు సీబీఐ సమర్పించిన వివరాల ప్రకారం.. వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం చేయాలన్న సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో వైసీపీ సీనియర్ నాయకుడు, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధాన భాగస్వామి. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు తొలుత శివశంకర్‌రెడ్డే చెప్పారని తన నివేదికలో సీబీఐ వెల్లడించింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు ఆయనే మీడియాకు కూడా చెప్పారని తెలిపింది.
ఘటనా స్థలంలో ఆధారాలను శివశంకర్ రెడ్డి ధ్వంసం చేశారని, వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్టుకట్టించారని సీబీఐ తన రిపోర్టులో వివరించింది. కొందరు సాక్షులు ఇటీవల సోషల్ మీడియాలో కొత్తకొత్త పేర్లను తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శివశంకర్‌రెడ్డికి బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసి పరారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వివేకాను చంపితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి చెప్పారని కోర్టుకు సమర్పించిన తన నివేదికలో సీబీఐ పేర్కొంది. వివేకా హత్యకేసు విషయంలో సీఐ శంకరయ్యను బెదిరించారంటూ సంచలన విషయాలు పొందు పరిచింది. వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని తాము చెబుతున్నామని, కాబట్టి ఈ వ్యవహారంలో నోరుమూసుకుని ఉండాలని శంకరయ్యను హెచ్చరించారని, సాక్షులను బెదిరించారని సీబీఐ తన రిపోర్టులో వెల్లడించింది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇచ్చిన తాజా నివేదిక సంచలనంగా మారింది. ఈ కేసులో పెద్దల హస్తం ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు.