హైకోర్ట్ అక్షింతలు.. ఆయనకు అలవాటుగా మారిపోయాయా?
posted on Dec 23, 2021 9:10AM
కొత్త విషయం కాదు. పాత కబురే. న్యాయస్థానాలు అక్షింతలు వేయడం. ప్రభుత్వాలు తుడిచేసుకు పోవడం, అంతటా ఉన్నదే అయినా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అది ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అయితే చెప్పనే అక్కర లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజేపీలు కోర్టు బోనులో నిలబడి క్షమాపణలు వేడుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వివాదం మొదలు ఇటీవల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరిట విధించే చలానాలకు సంబంధించి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను న్యాయస్థానాల జోక్యంతో ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సందర్భాలున్నాయి. అలాగే, తెలంగాణ ప్రభుత్వం పై ఆర్టీసీ సమ్మె టైంలో, ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినప్పుడు.. కరోనా విషయంగా, జీవో 111 విషయంలో, దళిత బంధు జీవో విషయంలో .. ఇంకా ఎన్నో సందర్భాలలో హైకోర్టు అక్షింతలు వేసింది.అయినా అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ సర్కార్, న్యాయస్థానాల అక్షింతలకు అలవాటు పది పోయాయా అన్న విధంగా వ్యవహరిస్తున్నాయే కానీ, పద్దతి మార్చుకోవడం లేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిర్లక్ష్య ధోరణిని రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం మరోమారు తీవ్రంగా తప్పుపట్టింది. అంతే కాకుండా, రూ.10 వేల జరిమానాను విధించింది.
విషయంలోకి వెళితే, 2016లో రెవెన్యూ కార్యదర్శిగా సోమేశ్ కుమార్, సాగు నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు జారీ చేసిన ఓ జీవోకు వ్యతిరేకంగా హై కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై అప్పటినుంచి హైకోర్టులో విచారణ జరుగుతూనేవుంది. ప్రభుత్వ వివరణ కోరుతూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా కోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు సరికదా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ వచ్చింది.
కాగా, ఈ కేసును బుధవారం విచారించిన సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం నాలుగేళ్లుగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం మాత్రమే కాక వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినా హాజరవ్వనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ను కూడా వేయలేదని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి కరోనా సహాయ నిధికి జమ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా కూడా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని స్పష్టం చేశామని.. లేనట్లయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో వ్యక్తిగతంగా హాజరుకావాలని వివరించామని కోర్టు తెలిపింది.. అయినా ఆ రెండూ జరగలేదని పేర్కొంది. వీటన్నింటినీ గుర్తు చేసిన ధర్మాసనం.. రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే నెల 24న సీఎస్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.అయితే నలుగు సమ్వత్సరాల నుంచి స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. కాగా, ఓ ప్రముఖ న్యాయవాది పేర్కొన్నట్లుగా కేసు మెరిట్స్, డీ మెరిట్స్ విషయం ఎలా ఉన్నా, కోర్టు ఆదేశాలను ఉల్లంగించడం ద్వారా ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి సంకేతాలు ఇస్తోందనేది ఆలోచించవలసిన విషయం.