అశోక్ గజపతిరాజు అరెస్ట్? రామతీర్థం ఘటనలో కేసు...
posted on Dec 23, 2021 @ 9:40AM
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు అరెస్టుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు పై ఇప్పటికే కేస్ నమోదు చేశారు పోలీసులు. బుధవారం జరిగిన రామతీర్థం ఘటన పై రెండు సెక్షన్ల కింద అశోక్ పై నాన్ బెయిల్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ విధులకు భంగం కల్గించడం, గందరగోళం సృష్టించడం, డ్యామేజ్ చేయడం లాంటి అంశాలపై కేసు పెట్టారు. ఆయనతో పాటు మరికొందరి పైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే కేసులు విషయం లో గోప్యత పాటిస్తున్నారు విజయనగరం జిల్లా పోలీసులు.
బుధవారం జరిగిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన పూజలను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, వెల్లంపల్లి నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు పూర్వం నుంచి రాజవంశీయులే చేసేవారని.. దీనికి విరుద్ధంగా మంత్రులు నిర్వహించడంపై అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.
పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడాన్ని అశోక్ గజపతిరాజు వ్యతిరేకించారు. ఆగ్రహంతో ఆయన ఆ ఫలకాలను తోసేశారు. ఈ క్రమంలో అధికారులు, అశోక్ మధ్య స్వల్ప తోపుతాట జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకుని రామతీర్థం నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం, మంత్రులు, అధికారుల తీరుపై భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించే అశోక్ గజపతిరాజుపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
కోదండరాముని ఆలయం వ్యవహారం పూర్తిగా మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన అంశమని, ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదని ట్రస్టు చైర్మన్ అశోక్‌గజపతిరాజు చెబుతున్నారు. ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తిచేసిన తరువాత తనకు చెప్పడం బాధాకరమన్నారు. అది తమ పూర్వీకులు 400 సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయమని గుర్తు చేశారు. గతంలో తాను విరాళం ఇచ్చిన చెక్కును కూడా ఈవో స్వీకరించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.