రెండేళ్లయినా తేలని వివేకా కేసు! పెద్దల హస్తం ఉన్నట్టేనా?
posted on Apr 3, 2021 @ 5:43PM
వైఎస్ వివేకానంద రెడ్డి... ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. వివేకా హత్య జరిగి రెండేళ్లు గడిచింది. అయినా ఇంతవరకు హత్య చేసిందెవరో తెలియలేదు. సీబీఐ విచారణ సాగుతున్నా కేసు కొలిక్కి రావడం లేదు. కీలకమైన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడు.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్.. అయినా న్యాయం జరగకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
వైఎస్ వివేకానంద రెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న పులివెందులలోని తన సొంతింట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల ముందు హత్య జరగడంతో.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే నాటి టీడీపీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చాక మాత్రం సీబీఐ అవసరం లేదన్నారు. కొత్త సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది.
ఈ కేసుపై జగన్ ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. మొత్తం 1,300 మంది అనుమానితులను గుర్తించినా, అసలైన నిందితులు ఎవరేది మాత్రం తేల్చలేదు. గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ మాట మార్చడం.. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు 2020 సెప్టెంబర్ లో పులివెందులలో ఉండి కీలక ఆధారాలను సేకరించారు.చెప్పుల వ్యాపారి మున్నాను విచారించారు. ఆయన బ్యాంకు లాకర్ల భారీగా నగదును స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. తర్వాత ఏమైందో ఏమో కేసు విచారణ పడకేసింది. వివేకా హత్య జరిగిన రెండేళ్లు అయినా కేసులో నిందితులెవరో తేలలేదు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మొదటి నుంచి అనుమానాలే ఉన్నాయి. బాత్రూమ్‌లో ఉన్న డెడ్‌బాడీని పోలీసులు వచ్చే లోపే బెడ్‌రూమ్‌కి తరలించడం అనుమానాస్పదంగా మారింది. వివేకా గుండెపోటుతో చనిపోయారని మొదట చెప్పారు. తర్వాత హత్యగా తేలింది. అయితే వివేకా మృతదేహాన్ని చూస్తే అది హత్య అని ఇట్టే తెలిసిపోతోంది... అయినా హార్ట్ ఎటాక్‌గా అందరినీ ఎందుకు నమ్మించారన్నది మిస్టరీగా మారింది. పోలీసులు వచ్చి సాక్ష్యాలు సేకరించే వరకు మృతదేహాన్ని కదలించకూడదు. మరి బాత్రూమ్‌లో పడిఉన్న మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లోకి ఎందుకు తీసుకెళ్లారు అన్నది అంతు చిక్కని ప్రశ్నే. బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలను తుడిచివేయడం, అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడం అన్ని అనుమానాలకు తావిచ్చేవే.
హత్య జరిగిన రోజు ఉదయం 05.30కి పీఏ కృష్ణారెడ్డి వివేకానంద ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత 06.40కి అవినాశ్ పోలీసులకు ఫోన్ చేశాడు? వివేకానంద మరణవార్తను అవినాశ్‌కి ఎవరు చెప్పారు? పోలీసులు వచ్చే లోపే సాక్ష్యాలను ఎందుకు చెరిపివేశారు.? అన్నది అసలు ప్రశ్న. 'డ్రైవర్‌ని తొందరగా రమ్మన్నాను. కాబట్టి నన్ను చంపుతున్నాడు' అని రాసి ఉన్న లేఖ అక్కడ ఉందన్నారు. ఈ లేఖ కూడా సాయంత్రం తెరపైకి వచ్చింది. ఉదయం నుంచి లేని లేఖ..సాయంత్రానికి ఎక్కడి నుంచి వచ్చిందన్నది తేలడం లేదు.
వివేకా హత్యకేసులో కొంత మంది అనుమానితుల పేర్లను సునీతా రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి తో పాటు అతడి కుటుంబ సభ్యులను అనుమానిస్తోంది వివేకా కుటుంబం. సీబీఐ మాత్రం వారిని పూర్తిస్థాయిలో విచారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైఎస్ వివేకా రెండో వర్ధంతి కార్యక్రమానికి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కొందరు చేస్తున్నారు. తాజాగా 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు సునీతా రెడ్డి వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న. ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి. వివేకా హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది గంగిరెడ్డేననే ఆరోపణలు ఉన్నాయి. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని వైఎస్ వివేకా కూతురు చెబుతున్నారు.
తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని వివేకా కూతుకు సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని సునీత అంటున్నారు. హత్య కేసులో సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయమేస్తోంది. నాన్న హత్య గురించి మాట్లాడేందుకు..వాస్తవం చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. నాన్న అందరితో ప్రేమగా మెలిగేవారు.. ఆయనకు శత్రువులెవరూ లేరు. ఆర్థిక పరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది రాజకీయ హత్యే అని సునీతారెడ్డి అన్నారు. అంటే వివేకా హత్య వెనక సంచలన విషయాలే ఉన్నాయని తెలుస్తోంది.
వివేకా హత్య జరిగి రెండేళ్లు అయినా కేసు ఇంకా ఎందుకు కొలిక్కి రావడం లేదు? కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎవరైనా ఒత్తిడి తెస్తున్నారా? బాబాయ్ హత్య కేసును సీఎం జగన్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, అనుచరుల నుంచి వస్తున్నాయి. నిందితులను తేల్చకపోతే వైసీపీ సర్కార్ ను అనుమానించాల్సి వస్తుందని చెబుతున్నారు. వివేకా కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. సునీతా రెడ్డి చెబుతున్నట్లు ఆయనది రాజకీయ హత్యేనని భావించాల్సి వస్తుందని అంటున్నారు. హత్య వెనక కొందరు పెద్ద తలకాయల హస్తం ఉండటం వల్లే కేసు దర్యాప్తును నీరుగార్చుతున్నారని ఆరోపిస్తున్నారు.