డ్రగ్స్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు వీళ్లే !
posted on Apr 3, 2021 @ 8:34PM
కర్ణాటక రాజధాని బెంగళూరులో బయటపడిన డ్రగ్ రాకెట్ తెలంగాణలో ప్రకంపణలు రేపుతోంది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక తెలుగు నటుడు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం రాజకీయ రచ్చగా మారింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రియల్టర్ నుంచి బెంగళూరు ఎక్సైజ్ శాఖ అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కకున్న ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు పరిధిలోని ఓ ఎమ్మెల్యేతో పాటు ఒక దక్షిణ తెలంగాణ, మరో ఇద్దరు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు.
బెంగళూరు ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించిన సమాచారం మేరకు సినీ ప్రముఖులు ఇచ్చిన వింధులో వారు పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. ఒక తెలంగాణ ఎమ్మెల్యే ఏకంగా నేరుగా కొకైన్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోనున్నారు. ఇప్పటికే పలువురు కన్నడ సినీ నిర్మాతలు, వ్యాపార వేత్తలకు విచారణకు రావాలని ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. తదుపరి విచారణకు హాజరు కావాలని నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశముంది. డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురితో పాటు నైజీరియన్లు ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్‌లో ప్రధానంగా ఉన్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఓ నటుడిని బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. అతని విచారణలో ఎమ్మెల్యేల పేర్లు బయటికి వచ్చాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రధానంగా లింకులు కనిపిస్తుండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా పెను సంచలనం కానుంది.