చెల్లెలి కన్నీరు అన్నకు కనిపించడం లేదా!
posted on Apr 3, 2021 @ 5:40PM
తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీలో మొత్తుకుంటే. ఆమె ఆర్తనాదాలు సీఎం జగన్ కు వినిపించడం లేదంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. తన తండ్రిని చంపింది ఎవరో కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతోందని, ఆమె దీన పరిస్థితి జగన్ కు అర్థం కావడంలేదా? ఆమె హిందీలో మాట్లాడింది, తెలుగులో మాట్లాడింది ఇంగ్లీషులో మాట్లాడింది. మా నాన్నను చంపింది ఎవరు అంటూ దీనంగా మాట్లాడిన తీరు చూస్తే కరడుగట్టిన కర్కశ హృదయాలు సైతం కరిగి నీరవ్వాల్సిందే. ఏం మీ హృదయాలు కరగడంలేదా జగన్ గారూ?
నాకు తెలిసి సీఎం జగన్ కు కార్యక్రమాలు ఏవీ లేవు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఆయన మీడియా సమావేశాన్ని చూడాలి. తెలంగాణలో రాజకీయ పార్టీ అంటూ తిరుగుతున్న మీ సొంత చెల్లెలు షర్మిలతో మీకు సఖ్యత చెడిందని విన్నాను. మీ తల్లి గారితోనూ మీకు సరైన సంబంధాలు లేవని వింటున్నాను. కానీ నిన్న మీ మరో చెల్లెలు సునీతారెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కదిలిపోయాను.
రెండేళ్ల క్రితం పులివెందులలో జరిగిన రహస్యం అది. ఆ రహస్యం ఏంటి..? 2019 మార్చి 15న ఉదయం ఏం జరిగింది? అందరివాడు అనిపించుకున్నారు మీ బాబాయి. ఆయన్ను చంపింది ఎవరో ఆ రహస్యాన్ని బయటికి తీయండి సార్. ఆ రహస్యం మీకు తెలుసని స్వయానా మీ చెల్లే అంటోంది. ఆ రహస్యం మీకు తెలుసని నాకూ కూడా తెలుసు. అందుకే మీరు సీబీఐ ఎంక్వైరీ కావాలన్నారు. పైగా మీరు ఆ రోజు దుర్మార్గమైన పని కూడా చేశారు. నాడు చంద్రబాబుపైనా ఈ వ్యవహారంలో ఆరోపణలు చేసే ప్రయత్నం చేయడం నిజం కాదా? ఆపై వెనక్కి తగ్గింది నిజం కాదా?
సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో రిట్ వేసింది మీరే ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్దన్నది కూడా మీరే. ఎందుకంటే ఆ చంపింది మీ బాబాయి ని చంపినా రహస్యం సీబీఐకి తెలియొదనే మీరు సీబీఐ విచారణ వద్దన్నారు. ఇప్పుడు ఈ రాజకోట రహస్యాన్ని బహిర్గతం చేయాల్సింది మీరే. అందరి చూపులు ఇప్పుడు మీపైనే ఉన్నాయి.
అసలు, నిన్న సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము మీకు ఉందా? ఈ కేసులో సాక్షులను చంపేస్తున్నారు సార్... గతంలో పరిటాల రవి ఉదంతంలో సాక్షులను, ముద్దాయిలను ఎలా అంతమొందించారో ఇప్పుడూ అలాగే జరుగుతోంది సార్. ఈ కేసులో రహస్యం వెల్లడైతే ప్రభుత్వమే ఛిన్నాభిన్నమవుతుంది" అని వ్యాఖ్యానించారు.