బిగ్ బ్రేకింగ్.. వైసీపీకి విజయమ్మ రాజీనామా?
posted on Aug 31, 2021 @ 7:56PM
వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయా? వైఎస్సార్ వర్ధంతి రోజున సంచలనం జరగబోతోందా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగలబోతున్నారా? అంటే.. వైఎస్ ఫ్యామిలీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నిజమే అనిపిస్తోంది. వైఎస్సార్ కుటుంబంలో ఏదో జరగబోతుందనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జూలైలో వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయకు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్లి నివాళులు అర్పించడం చర్చనీయాంశమైంది. గతంలో కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి నివాళి అర్పించేవారు.అందుకు భిన్నంగా ఉదయం విజయమ్మ, షర్మిల వెళ్లగా.. ఎప్పుడు లేనట్టుగా సాయంత్రం వెళ్లి నివాళి అర్పించారు జగన్.
తాజాగా సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి రోజున కూడా ఇడుపుల పాయలో అలాంటే సీనే కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇడుపులపాయకు కుటుంబ సభ్యులందరితో కాకుండా సీఎం జగన్ ప్రత్యేకంగా వెళుతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ సీఎం జగన్ తల్లి అయిన విజయమ్మ హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం పెడుతుండటం మరింత ఆసక్తి రేపుతోంది. గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన నేతలు, ఆయన సన్నిహితులు, అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలను సమావేశానికి ఆహ్వానించారట విజయమ్మ. అయితే ఆ సమావేశానికి జగన్ కు మాత్రం ఆహ్వానం లేదట. దీంతో కొడుకు జగన్ తో సంబంధం లేకుండా వైఎస్సార్ వర్థంతి రోజున విజయమ్మ సమావేశం నిర్వహిస్తుండటంతో .. ఆ రోజున ఏదో జరగబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో వైఎస్ విజయమ్మ ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన కూతురు షర్మిలకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు విజయమ్మ. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన రోజు, ఖమ్మంలో జరిగిన తొలి సభలోనూ, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన సభలోనూ షర్మిల పక్కనే ఉన్నారు విజయమ్మ. కూతరు షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సమావేశం పెట్టారని.. అక్కడే విజయమ్మ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైసీపీకి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. వైస్సాఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నానని విజయమ్మ ప్రకటించవచ్చని అంటున్నారు.
నిజానికి వైఎస్ షర్మిల పార్టీ సభకు విజయమ్మ హాజరైనప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ.. మరో పార్టీ సభలో ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు.. విజయమ్మ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఎంపీ రఘురామ రాజు కూడా తీవ్రంగానే స్పందించారు. వైసీపీలో రెండు రకాల సిద్ధాంతాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వివాదానికి తెర దించాలంటే ఏదో ఒక పార్టీలో కొనసాగాలని విజయమ్మ భావించారట. సీఎం జగన్ తో విభేదాలు ఉండటంతో ఆమె కూతురు వైపే ఉండాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
వైఎస్ విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తే అది ఏపీ రాజకీయాల్లో సంచనంగా మారడం ఖాయం. విజయమ్మ నిర్ణయం సీఎం జగన్ కు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ నిరంకుశ పాలన చేస్తున్నారని, ఎవరిని లెక్క చేయకుండా మోనార్క్ లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తే.. కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోవడం లేదని, జగన్ పై జరుగుతున్న ప్రచారం నిజమేనని జనాలు నమ్మే అవకాశం ఉంటుంది. విపక్షాలకు కూడా బ్రహ్మండమైన అస్త్రం దొరికినట్లే. చూడాలి మరీ ఏం జరగబోతుందో..