హుజూరాబాద్ లో కారుకు కొత్త కష్టాలు! హరీష్ రావును బుక్ చేస్తున్నారా?
posted on Aug 31, 2021 @ 7:45PM
కొంచెం ఆలస్యంగానే అయినా మంత్రి కేటీఆర్ అన్నట్లుగా హుజూరాబాద్ ఉపఎన్నికను అది ఇంకొక ఉపఎన్నిక అని వదిలేసి ఉంటే, ఎలా ఉండేదో ఏమో కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ‘ఇజ్జత్ కా సవాల్ ‘గా తీసుకున్నారు. అంతే కాదు వరాల ఊబిలోకి కూరుకు పోయారు. అందుకే అధికార పార్టీకి ముందు నుయ్యి వెంక గొయ్యి కనిపిస్తోంది. ఉపఎన్నిక గెలుపు ఓటమలను పక్కన పెడితే, అసలుకే మోసం తెచ్చే కొత్త సమస్యలు, వచ్చిపడుతున్నయి. కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా హుజూరాబాద్ విజయం కోసం ముఖ్యమంత్రి బ్రహ్మాస్త్రంగా బావించి ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం అసలుకే మోసం తెచ్చేలా ఉందని, అధికార పార్టీలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దళిత బందు తరహాలో తమకూ ఫ్యామిలీకి పది లక్షల రూపాయల వంతున ఆర్ధిక సహాయం చేయాలని బీసీల మొదలు అన్ని కులాలు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వంక, ఉప ఎన్నిక వస్తేనే నిధులోస్తయై, పనులవుతాయి, ప్రజలకు మేళ్ళు జరుగుతాయి అన్న భ్రమలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యెల మీద వత్తిడి పెరుగుతోంది.
అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, గల్ఫ్ బాధితులు గళం విప్పారు. జస్ట్ గళం విప్పడమే కాదు, ఏకంగా రాజకీయ జెండానే ఎగరేశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి, హుజూరాబాద్ బరిలో దిగుతామని, గల్ఫ్ బాధిత కుటుంబాల ప్రతినిధులు, గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కుటుంబాల ప్రతినిధులు చెపుతున్నారు. “ఎన్నో దశాబ్దాలుగా, ఏ ప్రభుత్వాలు వచ్చినా.. రాష్ట్రమే విడిపోయి, తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడినా, మా ఓటు బలం తక్కువ కాబట్టి మా సమస్యలు ఎవరూ పట్టించుకోలేదు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మా అభ్యర్ధిని పోటికి దించి మా సత్తా ఏమిటో చూపించాలని అనుకుంటున్నాం” అని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ కన్వీనర్ గుగ్గిలాల రవి గౌడ్ స్పష్టం చేశారు. గల్ఫ్ వర్కర్స్ జేఏసీ చాలాకాలంగా చాలా డిమాండ్లను ప్రభుత్వాల ముందుంచింది. అవేవీ నెరేరలేదు. ఇక ఇప్పడు ఆఖరి అస్త్రంగా ఇతర డిమాండ్లతో పాటుగా, అన్నిటి కంటే ముఖ్యంగా ఫ్యామిలీకి పదిలక్షలు ఇచ్చే గల్ఫ్ బంధు కావాలని గల్ఫ్ వర్కర్స్ జేఏసీ పట్టుపడుతోంది.
గడచిన రెండు దశాబ్దాల కాలంలో 25 లక్షల మంది వరకు గుల్గ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. ప్రస్తుతం మరో 15 లక్షల గుల్ద్ దేశాల్లో ఉన్నారు. ఈ 40 లక్షల కుటుంబాలు, వారి బాధలు తెలిసిన బందువులు ఇతరులు అంటా కలుపుకుంటే రాష్ట్రం మొత్తంలో ఒక కోటీ ఓట్లు తమ చేతులలో ఉన్నాయని జేఏసీ నేతలు లెక్కలు చెపుతున్నారు. అంతే కాదు, ఏ నియోజక వర్గంలోనూ తమ అభ్యర్ధులు గెలవక పోయినా, ఓ 30 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్ సభ స్థానాల్లో అభ్యర్ధులు, పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో తమకు బలముందని అంటున్నారు.
ఇక హుజూరాబాద్ విషయానికి వస్తే, ఇప్పటికీ పోటీకి సిద్దమవుతున గల్ఫ్ వర్కర్స్ జేఏసీ నియోజకవర్గం పరిధిలో ఐదు వేల వరకు గల్ఫ్ నుంచి త్తిరిగోచ్చిన బాధిత కుటుంబాలను గుర్తించిందని, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశి పరికపండల తెలిపారు. నియోజక వర్గంలో మరో పది వేల కుటుంబాల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితుల నుంచే తమ అబ్యర్ది ఉంటారని, సెప్టెంబర్ 2న జమ్మికుంటలో ఎన్నికల సభ నిర్వవహిస్తున్నామని ఆయన చెప్పారు. సరే, ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక చివరాఖరుకు ఏమి జరుగుతుంది అనేది ఎలా ఉన్నా, కేసీఆర్ లెక్క మాత్రం తప్పినట్లే కనిపిస్తోంది. కొత్త చిక్కులు తప్పేలా లేవు. చివరకు, తమ పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.