పులివెందులలోనూ రాజధాని, సెక్రటేరియెట్.. వైదిస్ నాన్‌సెన్స్?
posted on Aug 31, 2021 @ 10:50PM
నోటికొచ్చినట్టూ కూస్తున్నారు. నోటికొచ్చినంత వాగుతున్నారు. ఎంత అన్యాయం చేయాలో అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని కుప్పకూల్చేశారు. సన్‌రైజ్ స్టేట్‌ని సర్వనాశనం చేశారు. ఏమి సాధించినట్టు? ఎవరు బాగుపడినట్టు? ఏపీకి రాజధాని ఏదంటే.. ఇది అని టక్కున చెప్పలేని దుస్థితి. అమరావతిని స్మశానంతో పోల్చారు. అమరావతి ముంపు ప్రాంతం అన్నారు. ఆకాశ హర్మాలను అర్థాంతరంగా వదిలేశారు. రోడ్లను తవ్వుకుపోతున్నారు. అమరావతిని ఎంతగా ఆగం చేయాలో అంతకంటే ఎక్కువే చేశారు. స్వయంగా ప్రధాని మోదీనే తరలివచ్చి శంకుస్థాపన చేసిన రాజధానిపై ఆ కేంద్రమే క్లారిటీ లేకుండా కుప్పిగంతులు వేస్తోంది. పలుమార్లు ఏపీ కేపిటల్‌గా విశాఖను పేర్కొంటూ.. వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. విమర్శలు వెల్లువెత్తగానే.. ఎప్పటికప్పుడు తప్పులు సరిచేసుకుంటూ లెంపలేసుకుంటోంది. ఏపీ హైకోర్టు సుస్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. కేపిటల్‌ను ఎక్కడికీ తరలించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా, ఈ వైసీపీ మంత్రులు ఉన్నారే... రాజధాని తరలింపును ఎవరూ ఆపలేరంటూ రచ్చ రాజేస్తున్నారు. తాజాగా, మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరింత సిల్లీ కామెంట్లు చేసి కలకలం రేపారు. అసలు వీరు మంత్రులేనా? అనే అనుమానం..ఆగ్రహం వచ్చేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంపై అమరావతి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మంత్రి మేకపాటి అంటారూ... సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాలట. అబ్బ ఛా.. అలానా.. అయితే, సీఎం జగన్‌రెడ్డి తాడేపల్లిలో పే..ద్ద ప్యాలెస్ కట్టుకుని ఉంటున్నారుగా. మరి, అమరావతినే వన్ అండ్ ఓన్లీ పర్మినెంట్ కేపిటల్‌గా ఫిక్స్ చేయొచ్చుగా.. అని ప్రజలు నిలదీస్తున్నారు.
మంత్రి మేకపాటి మరింత కామెడీ డైలాగ్స్ కూడా పేల్చారు. సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు.. విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు.. వైజాగ్ కూడా అవొచ్చు.. అంటూ అదో టైపు సుద్దులు చెప్పారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రాజధాని విషయంలో గబ్బు గబ్బు రేపారు.
కామెడీ కాకపోతే మరేంటి? సీఎం పులివెందులలో ఉంటే.. అదే రాజధాని కావచ్చట. ఇడుపాయలో ఒకటి, బెంగళూరులో ఇంకోటి, లోటస్‌పాండ్‌లో మరొకటి.. మీ జగన్‌రెడ్డి గారికి మరో మూడు ప్యాలెస్‌లు ఉన్నాయిగా.. మరి, అవన్నీ కూడా ఏపీ రాజధానులేనా? భవిష్యత్‌లో జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటే.. ఏపీ రాజధాని కర్ణాటకలోని బెంగళూరు అయిపోతుందా? జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు షిఫ్ట్ అయితే.. ఏపీ కేపిటల్ హైదరాబాద్ అవుతుందా? అలానే ఇడుపులపాయ కూడా రాజధానేనా? అంటూ నిలదీస్తున్నారు ప్రజలు.
ఇక మంత్రిగారి నోటి నుంచి మరో అద్భుతమైన చరిత్రపురాణం కూడా బయటకు వచ్చింది. మరి ఆయన చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లారో లేదో.. వెళ్లినా సోషల్ సబ్జెక్ట్‌లో పాస్ అయ్యారో లేదో అనే డౌట్ వస్తోంది జనాలకు. మంత్రి మేకపాటి ఏమన్నారంటే.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారట. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆయన మాటలు విన్నవారంతా మంత్రి గౌతంరెడ్డికి అసలు శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏంటో తెలీదని తెలిసిపోయిందంటూ నవ్వుకుంటున్నారు. అయ్యా.. మంత్రివర్యా.. 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో అసలు మూడు రాజధానులనే ప్రస్తావనే లేదు. అప్పుడెప్పుడో జరిగిన దాన్ని సాకుగా చూపించి.. ఇప్పుడు పబ్బం గడుపుకోవాలనే రాజకీయ డ్రామానే కానీ మరొకటి కాదని చరిత్రకారులే మండిపడుతున్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ, కోస్తాంధ్రలో.. రాజధాని, హైకోర్టు చెరోచోట ఉండాలని మాత్రమే అన్నారు. అంతే కానీ ఎక్కడా మూడు రాజధానులు అనే అర్థం వచ్చేలా చెప్పలేదు. రాజధాని ఒక్కటే.. అది ఆంధ్రాలో ఉంటే, సీమలో హైకోర్టు.. ఒకవేళ రాజధాని సీమలో ఉంటే ఆంధ్రాలో హైకోర్టు.. ఉండాలనేది శ్రీబాగ్ ఒప్పందం సారాంశం. దాన్ని.. ఇలా తమకు ఇష్టం వచ్చినట్టు అన్వహించుకోవడం వైసీపీ మంత్రికే చెల్లింది. అయినా, శ్రీబాగ్ ఒప్పందం అనేది జస్ట్ కొంత మంది పెద్దమనుషులు కూర్చొని చేసుకున్న అగ్రిమెంట్ మాత్రమే. అప్పటికింకా మన దేశానికి స్వాతంత్య్రమే రాలేదు. ఆ ఒప్పందంకు ఎలాంటి చట్టబద్దతా లేదు. అప్పుడెప్పుడో పాచి పోయిన ఆ లడ్డూను ఇప్పుడు ప్రస్తావించడం సిగ్గుచేటు..అంటున్నారు సీమాంధ్ర ప్రజలు.
అయినా, ఈ జగన్‌రెడ్డి సర్కారుకు ఏమైంది? ఏంటి ఈ అర్థంపర్థం లేని మాటలు? స్కూల్ పిల్లల మాదిరి చేష్టలు? మంత్రులే ఇలా మాట్లాడితే ఎలా? ఏపీ రాజధాని అంటే అంత కామెడీ పీసా? ఈ వెటకారం.. ఈ సెటైర్లు.. రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును మరింత అంథకారం చేస్తాయే కానీ మరేమీ ప్రయోజనం ఉండదు. ఇలాంటి తలాతోక లేని డైలాగులు ఏపీకి అసలేమాత్రం మంచివి కావని అమరావతి ప్రజలు వైసీపీ మంత్రులపై మండిపడుతున్నారు. ఏపీకి హైకోర్టు ఉన్నంత కాలం.. న్యాయం అనేది బతికున్నంత కాలం.. రాజధానిని అమరావతి నుంచి తరలించడం జగన్ వల్ల కాదు కదా.. ఆ జేజమ్మ వల్ల కూడా కాదంటూ అమరావతి రైతులు ఆవేశంతో హెచ్చరిస్తున్నారు.