దీదీ సారధ్యంలో జాతీయ కూటమి ?
posted on Jun 1, 2021 @ 10:43AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఎఅతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులకు ఒక లేఖ రాశారు. కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి పిలుపు నిచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్’లో ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ యేతర పార్టీలు అన్నీ ఏకం కావాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న సమయంలో ఆమె సమయం చేసుకుని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను ఎండకడుతూ మూడు పీజీల లేకః రాయడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.
అంతే కాదు, ఆమె ఎవరినీ వదల కుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్,ఢిల్లీ సీఎం కేజ్రివాల్, ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నాయకుడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్, మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా,సిపిఐ (ఎం ఎల్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య ఇలా తరమ బేధాలు , సిద్ధాంత విబేధాలు లేకుండా అందరికీ లేఖ రాశారు. అలాగే, ఆలేఖలో ఆమె ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఉమ్మడి పోరుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించవలసిన అవసరం ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు.
బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇంచుమించుగా నెలరోజుల పైనే అయింది. మే 5 తేదీన ఆమె ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ఈ నెల రోజుల్లో ఆమె అయినదానికీ కానిదానికి కేంద్రం మీద కత్తులు దూస్తూనే ఉన్నారు. ఇందులో కొన్ని సహేతుకంగా ఉంటే , మరి కొన్ని కేవలం కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా ఉన్నాయనిపిస్తోంది.
అదలా ఉంటే, ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అల్ఫన్ బందోపాద్యాయ విషయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగుతున్న వివాదంలో భాగంగా ఆమె మరోమారు కేంద్ర్రం పై పోరాటానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులకుపిలుపు నిచ్చారు.భయం వద్దు, ‘భయపడితే మరణం తధ్యం’ అంటూ 1970 లనాటి ‘షోలే’ చిత్రం లోని డైలాగ్ (జో డరేగా, ఓ మరతే హై) ను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటానికి కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, ప్రయత్నిస్తోందని, అయితే, తమ తప్పులకు కేంద్రం పశ్చాతాపపడే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో మమతా బెనర్జీ, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యాన్మాయంగా ఫ్రంట్’ను ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన నేపధ్యంలో, కాంగ్రెస్’తో సహా ఇతర ప్రాతీయ పార్టీలను కలుపుకుని ప్రత్యాన్మాయ ఫ్రంట్’ ను ఏర్పాటుకు పావులు కడుపుతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం వలన కూటమికి జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో పాటుగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అదనపు బలం చేకురుస్తుందనీ, దీదీ బావిస్తున్నారు.అందుకే ఆమె, థర్డ్ ఫ్రంట్, తృతీయ కూటమి కాకుండా ప్రత్యాన్మాయ కూటమి అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ ను కలుపుకుపోయే ఉద్దేశంతోనేనే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్’కు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న తెరాస వంటి పార్టీలను ఈ పథకంలో చేర్చలేదు. కాంగ్రెస్’ను కులుకుపోకుండా చేసే ప్రయత్నాలు ఫలించడం కష్టమని ఆమె గుర్తించారని, మమతా బెనర్జీ అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇది ఒక్క మమతా దీదీ ఆలోచన కాదని, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇంకొదరు జాతీయ, అంతర్జాతీయ మేధావులు, కూడాఈ వ్యూహ రచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే, 2024 ఎన్నికలలో మోడీకి సవాలు విసిరేది మాత్రం దీదీనే అనే విషయంలో మాత్రం అందరిలో ఏకాభిప్రాయం ఏర్పడింది. బీజేపీ ముఖ్యంగా మోడీ వ్యతిరేక శక్తులు అన్నీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇదలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య ప్రస్తుతం సాగుతున్న వివాదంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మమతకు పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే, అరవింద్ కేజ్రివాల్ వంటి కొందరు నాయకులు, మమతకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సో.. ఇక ఢిల్లీ రాజకీయం మోడీ వెర్సెస్ దీదీ గానే సాగుతుందని అనుకోవచ్చును.