మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్! రాజకీయ వర్గాల్లో ఆసక్తి
posted on Oct 12, 2020 @ 6:52PM
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తినకు వెళ్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అపాయిట్మెంట్ ఖరారైందని ఇంకా పీఎంవో ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ రెండో సారి కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వారం రోజుల్లోనే రెండోసారి జగన్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రపతి, ప్రధానిని కలిసి జగన్ ఏం చర్చించబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలు, రాజకీయ విషయాలపై ప్రధాని, రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని, రాష్ట్రపతితో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను రాష్ట్రపతి, ప్రధానికి జగన్ ఇస్తారని చెబుతున్నారు. వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపై మోడీతో చర్చించనున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ రావాలని కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే జగనే ఢిల్లీ వెళ్తున్నారా..? అనేదానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఏపీ సర్కార్ నేరుగా తీవ్రమైన ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ విషయంపై జగన్ తో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పిలిచి ఉండవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.