జడ్జీలను దూషించిన కేసు సీబీఐకి.. ఇకనైనా సైలెంట్ అవుతారా.. మరింత రెచ్చిపోతారా..
posted on Oct 12, 2020 @ 6:12PM
ఏపీలో న్యాయవ్యవస్థ పై, అలాగే న్యాయమూర్తుల పై అటు సోషల్ మీడియాలోను ఇటు మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దీని పై విచారణను ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విషయంలో సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయన్న కారణంతో వైసీపీకి చెందిన కొంత మంది నేతలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తుల పైన దాడికి దిగిన సంగతి తెల్సిందే. మరో పక్క ఆ పార్టీకి చెందిన మంత్రులు… ఎంపీలతో పాటు, స్పీకర్ కూడా మీడియా ముందు న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు మరింత బరి తెగించి.. న్యాయమూర్తుల్ని చంపుతాం.. నరుకుతాం అని సోషల్ మీడియాలో బెదిరింపులతో కూడిన పోస్టింగ్‌లు పెట్టారు. అయితే వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ అప్పట్లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే తాము అలాంటి పోస్టింగ్‌లు పెట్టిన వారందరికీ అండగా ఉంటామని ఎంపీ విజయసాయిరెడ్డి అదే సమయంలో బహిరంగంగా ప్రకటించారు.
కారణమేదైనా కానీ.. సీఐడీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇంత వరకూ ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు సరికదా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. దీంతో సీఐడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి అర్థరాత్రిళ్లు వెళ్లి మరీ అరెస్ట్ చేస్తున్నారు. అదే న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం సీఐడీ పట్టించుకోలేదు. అసలు హైకోర్టు ఆదేశాలను సైతం పక్కన పడేశారంటే.. ఏపీ పోలీస్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ నందిగం సురేష్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.
అంతేకాకుండా సామాజిక మాధ్యమాలలో తాజాగా జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆదేశింది. ఇప్పటికే రెండు విడతలుగా 93 మందికి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు తాజా ఆదేశాలతో ఇపుడు మరి కొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే న్యాయవ్యవస్ధపై సీఎం జగన్ యుద్ధం ప్రకటించారు. న్యాయమూర్తుల పేర్లు తీసుకుని మరీ రచ్చ చేస్తున్నారు. పార్టీ నాయకులే ఆ రేంజ్ లో రెచ్చిపోతుంటే.. ఇంకా కింద స్థాయి కార్యకర్తలు ఇంకా చెలరేగిపోఏ అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి వారికి బహిరంగంగానే భరోసా ఇవ్వడంతో పాటు మరోపక్క సీఎం జగన్, మోదీల మధ్య స్నేహం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ఈ కేసు ఎంతవరకు తేలుతుందో వేచి చూడాలి.