విజయవాడలో దారుణం.. ప్రేమించలేదని యువతిని సజీవ దహనం
posted on Oct 13, 2020 @ 10:15AM
విజయవాడ నగరంలో నిన్న రాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. విజయవాడలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను ప్రేమించడం లేదని, అంతేకాకుండా తనపై పోలీసులకు కంప్లెయింట్ చేసిందని.. నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై ఆ ఉన్మాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే నిందితుడికి సైతం మంటలు అంటుకోవడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ యువతి (24) విజయవాడలోని ఓ కరోనా కేర్ సెంటర్ లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తనతో పాటు కలిసి పనిచేసే యువతులతో కలిసి ఆస్పత్రికి దగ్గరలోనే ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే గత కొద్ది రోజులుగా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆ యువతి చుట్టూ తిరుగుతూ తనను ప్రేమించాలని తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.
అయితే కొద్ది రోజులుగా అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడిని పిలిసి వార్నింగ్ ఇవ్వడంతో.. ఆమె జోలికి వెళ్లనని అతను లిఖితపూర్వకంగా తెలిపినట్లు సమాచారం. దీంతో ఆ యువతి కూడా తన కంప్లైంట్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని నాగభూషణం.. నిన్న రాత్రి డ్యూటీ అనంతరం యువతి ఒంటరిగా నడుచుకుంటూ రూముకు వెళ్తుండగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిద్దరి నడుమ వాగ్వాదం జరిగింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నాగభూషణం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆ యువతిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆ యువతి మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో నిందితుడికి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే తీవ్రగాయాలైన అతడిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అతడిని అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న గవర్నర్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.