మంచి రోజులు వస్తాయి అధైర్య పడకండి : జగన్
posted on Sep 1, 2025 @ 9:45PM
మంచి రోజులు వస్తాయని ఎవరు అధైర్య పడకుండా ఉండాలని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రజా దర్బార్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందుల చేరుకొని వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, ప్రభుత్వం వినకపోతే పోరాటాలు చేసే దానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు.
కూటమి నాయకులు దాడులకు ఎవరు భయపడకూడదని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని వారికి సూచించారు. మంగళవారం ఉదయం తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
*ఘన స్వాగతం
పులివెందుల కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భాకరాపురంలోని హెలిప్యాడ్ దగ్గర మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషా , కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి , కడప నగర మేయర్ కే సురేష్ బాబు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్ మనోహర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు పుష్పగుచ్చం, శాలువాలు లతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది.