545 సిమ్ కార్డులతో పనేంటి?
posted on Jan 20, 2015 @ 9:01PM
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని ఒక ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అన్ని ఇళ్ళలో చెక్ చేసినట్టుగానే ఒక ఇంటి తలుపు కొట్టారు. ఆ ఇంటి తలుపును ఓ పెద్దమనిషి తీశాడు. పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఒక్కసారి అంతా పరికించి చూశారు. అక్కడ అనుమానించదగ్గ వస్తువులేవీ కనిపించలేదు. ఏదో మధ్యతరగతి మానవుల ఇల్లు అనుకున్న పోలీసులు ఆ ఇంట్లోంచి బయటకి నడుస్తుండగా, ఆ ఇంట్లో ఒక మూల కంప్యూటర్ ఆపరేట్ చేస్తు్న్న ఓ కుర్రాడు కనిపించాడు. ఎవరా కుర్రాడు అని ఆ ఇంటి తలుపు తీసిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. మా అబ్బాయే అని అతను చెప్పాడు. పోలీసులు ఆ కుర్రాడి దగ్గరకి వెళ్ళి కంప్యూటర్ టేబుల్ దగ్గర యథాలాపంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన వస్తువులు చూసి బిత్తరపోయారు. అక్కడ ఒకటి కాదు రెండు కాదు.. పోనీ వంద కాదు... ఏకంగా 545 సిమ్ కార్డులు వున్నాయి. ఇన్ని సిమ్ కార్డులు మీకెందుకని ప్రశ్నిస్తే ఆ తండ్రీ కొడుకుల నుంచి సమాధానం రాలేదు. ఇన్ని సిమ్ కార్డులతో ఏదో తేడా వ్యవహారమే చేస్తున్నారని అర్థం చేసుకున్న పోలీసులు ఆ సిమ్ కార్డులతోపాటు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది.